నరసాపురం రూరల్: వేసవిలో పాడిపశువుల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. వేసవిలో పశువులకు వడదెబ్బ తగిలితే పాల దిగుబడి తగ్గడమే కాక పశువులు ఎదకు వచ్చే పరిస్థితులు కనిపించవని, అంతేకాక పశువు చూడుకట్టే అవకాశం ఉండదని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వై.సుధాకర్ చెబుతున్నారు. వేసవిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పశువుల్లో సోకే వ్యాధులను ఆయన వివరించారు. వేసవిలో గేదెలు, ఆవులపై సరైన శ్రద్ధ తీసుకోనట్లయితే వడదెబ్బకు గురై ఒక్కొక్కసారి పశువు ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు ఇవే
వేసవిలో పశువులు తాగే నీరు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచాలి. వేసవిలో సహజంగానే నీటి వనరులు తగ్గి నిల్వ ఉండే నీరు మురికిగా, ఆకుపచ్చగా మారతాయి. పశువులు ఈ కలుషితమైన నీరు తాగితే వ్యాధికారక క్రిములు శరీరంలోకి చేరి పారుడు వ్యాధులు కలుగుతాయి. కాబట్టి పశువులు తాగేందుకు స్వచ్ఛమైన నీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. లేదంటే రోజులో కనీసం మూడుసార్లు నీటిని అందించడం అవసరం, ఆరుబయట తొట్టెల్లో పగలు నిల్వ ఉన్న నీరు వెచ్చగా మారతాయి. నీడ ప్రాంతంలో నిల్వ ఉంచిన చల్లటి నీటినే పశువులకు తాగించాలి. ఆవులతో పోలిస్తే గేదెలు ఎక్కువ నీటిని తాగుతాయి. వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ, పశువు వయస్సు తదితరాలనుబట్టి రోజుకు సుమారుగా 28 లీటర్ల నీరు అవసరమవుతాయి. పాలిచ్చే పశువులు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి నాలుగు లీటర్ల చొప్పున నీటిని తాగుతాయి. ఇది కాకుండా పశువులను శుభ్రపరిచేందుకు, షెడ్లలో నేలను శుభ్రపరిచేందుకు ప్రతి పశువుకు 110 లీటర్ల నీరు అవసరం పడుతుంది.
వడదెబ్బ తగలకుండా..
పశువులకు వడదెబ్బ తగలకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల పాక చుట్టూ పాత గోనెలు కట్టి వాటిని అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. పైకప్పును కొబ్బరి ఆకులతో గానీ, ఎండి వరిగడ్డితో గాని కప్పాలి. మంచినీరు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేట్లు చూడాలి. పశువులను ఉదయం, సాయంత్రం మాత్రమే అంటే చల్లని వాతావరణంలోనే మేత మేసేందుకు విప్పాలి. పశువులు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూడాలి. వీలైనంత పచ్చని మేతను ఇవ్వాలి. సంకర జాతి ఆవులైతే పంకాలు ఏర్పాటు చేయాలి.
వడదెబ్బకు గురైతే లక్షణాలు ఇలా..
వడదెబ్బకు గురైన పశువు లక్షణాలను పరిశీలిస్తే శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల నుంచి 108 డిగ్రీల వరకు పెరుగుతుంది. పశువులు నడిచేటప్పుడు తూలుతాయి. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. పశువు చాలా నీరసంగా కనబడుతుంది. ఒక్కొక్కసారి కింద పడి కొట్టుకుని స్పృహకోల్పోతాయి. పశువు నీటి కొరకు చూస్తుంటుంది. పశువు చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది. పశువులో పాల ఉత్పత్తి కొల్పోతుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ తగిలిందని రైతు గ్రహించాలి.
చేయాల్సిన చికిత్స ఇదే
వడదెబ్బ తగిలిన పశువును రైతులు గుర్తించిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. గుడ్డతో ఐస్ చుట్టి పశువు నుదుటిపై నొత్తాలి. కొద్ది ఊరట కలిగిన తరువాత దగ్గరలోని పశు వైద్యుడిని సంప్రదించి సైలెన్‌లు పెట్టాలి. ఒక్క సారి వడదెబ్బ తగిలిన పశువుకు బతికినంత కా లం పాలదిగుబడి గతంలో మాదిరిగా ఉండదు. జాగ్రత్తలు తీసుకోవాలి.
డాక్టర్ వై సుధాకర్, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment