బైక్ దగ్ధం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో తీవ్రమైన ఎండ ధాటికి ఆదివారం ఉదయం 11.10 గంటల ప్రాంతంలో ఓ బైక్ కాలిపోయింది. శ్రీకాకుళం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్‌మెన్ బి.శృంగార నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గుర్ల వాసి బెవర శ్రీనివాసరావు తన భార్యతో కలిసి అరసవల్లి, శ్రీకూర్మం, రాజులమ్మ తల్లి దర్శనానికి ఆదివారం వచ్చారు.
తిరిగి వెళ్తున్న క్రమంలో బండి నుంచి కాలిన వాసన రావడంతో అప్రమత్తమై బండి దిగి చూసేసరికి బ్యాటరీ వద్ద నిప్పు కనిపించింది. కొన్ని క్షణాల్లోనే ఆయిల్ ట్యాంక్ పైన మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనే ఉన్న దుకాణాల సముదాయాల వారు నీళ్లు చల్లి, గోనెసంచితో మంటలను ఆర్పారు. ఈలోగా అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద తీరును, ద్విచక్రవాహనాన్ని పరిశీలించి మంటలను పూర్తిగా అదుపు చేశారు. వాహనంలో తక్కువ ఇంధనం ఉండటంతో ప్రమాదం తప్పిందని అంతా భావించారు.
వానల కోసం వరుణ యాగం
కాశీబుగ్గ: మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలగడానికి వానలు కురవాలని కోరుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 10వ వార్డు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్డు కౌన్సిలర్ శర్వాన గీతారవి ఆధ్వర్యంలో వరుణ యాగం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున బిందెలతో నీళ్లు తీసుకువచ్చి శివుడిని అభిషేకించారు.
Comments
Please login to add a commentAdd a comment