ఉగాది పర్వదినాన్ని స్వగ్రామంలో బంధువులు, గ్రామస్తుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చిన ఓ కూలీని వడదెబ్బ రూపంలో మృత్యువు అతని ఉసురు తీసింది.
నల్లమాడ : ఉగాది పర్వదినాన్ని స్వగ్రామంలో బంధువులు, గ్రామస్తుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చిన ఓ కూలీని వడదెబ్బ రూపంలో మృత్యువు అతని ఉసురు తీసింది. ఈ విషాద సంఘటన నల్లమాడ మండలం పోలంవాండ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన ఎం.బయపరెడ్డి(55) అనే రైతు కూలీ వడదెబ్బ బారిన పడి శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. వారి సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన నీలమ్మ, బయపరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తె భారతికి వివాహమైంది. బయపరెడ్డికి నాలుగెకరాల సాగు భూమి ఉంది. మూడు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో భూమిని బీడుగా వదిలేసి కుటుంబమంతా వలస వెళ్లారు.
పెద్ద కుమారుడు నరేంద్రరెడ్డి గోరంట్లలో చేనేత కార్మికుడిగా పని చేస్తుండగా, చిన్న కుమారుడు వేణుగోపాల్‌రెడ్డితో కలసి తల్లిదండ్రులు బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ బయపరెడ్డి చిన్నచితకా పనులకు వెళ్లేవాడు. ఉగాది పండుగకు ఇల్లు పూయాలంటూ నీలమ్మ భర్త బయపరెడ్డితో కలసి శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి వచ్చిన బయపరెడ్డి గ్రామంతో పాటు సి.బడవాండ్లపల్లి, సి.రెడ్డివారిపల్లి, చారుపల్లిలోని బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలుకరించి రాత్రి 7.30 గంటలకు ఇల్లు చేరుకున్నాడు. అంతలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల నొప్పి ఎక్కువగా వస్తోందంటూనే వెంటనే వాంతి చేసుకొని కుప్పకూలిపోయి ప్రాణాలొదిలాడు.
అధికారుల ఆరా
ఈ విషయం తెలియగానే నల్లమాడ తహసీల్దార్ ఏఎస్ అబ్దుల్‌హమీద్ బాషా, ఆర్‌ఐ నాగరాజు తమ సిబ్బందితో కలసి పోలంవాండ్లపల్లికి శుక్రవారం చేరుకొన్నారు. బయపరెడ్డి మృతదేహాన్ని సందర్శించారు. మృతుని కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ పంచాయతీ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బయపరెడ్డి అధికారులను కోరారు.