హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో మే నెల ఎండ తాకిడి మరింత ముదిరింది. తీవ్రమైన ఎండ, వేడిగాలులకు తాళలేక ఆదివారం పన్నెండు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చొప్పున ఉన్నారు. వివరాలివీ...మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన బోయజల్లి భాస్కర్(40), తలకొండపల్లికి చెందిన బుడ్డ రామయ్య(75), ఇదే మండలం చంద్రధనకు చెందిన ముంతగల్ల కృష్ణయ్య(37) వడదెబ్బతో చనిపోయారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూర్ గ్రామానికి చెందిన అల్లం రాజయ్య, చిట్యాల మండలం గర్మిళ్లపల్లికి చెందిన గీత జనార్దన్‌రెడ్డి(62), ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామానికి చెందిన దండే లసుంబాయి(50), దండేపల్లి మండలం కొర్విచెల్మకు చెందిన దండవేని మల్లేశ్ వడదెబ్బతో చనిపోయారు.
అదేవిధంగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తులిస్యాతండాకు చెందిన సఫావట్ మీట్యా (62), తొడితలగూడెం గ్రామానికి చెందిన బండారి సర్వయ్య (60), జూలూరుపాడు మండలం పడమట నర్సాపురానికి చెందిన చెందిన కాంపాటి సువార్త(55) వడదెబ్బతో మృత్యువాతపడ్డారు. రంగారెడ్డి జిల్లా తాండూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వడదెబ్బతో చనిపోయారు.