మండుతున్న ఎండలకు పలువురు బలైపోతున్నారు.
కరీంనగర్ : మండుతున్న ఎండలకు పలువురు బలైపోతున్నారు. గురువారం కరీంనగర్ జిల్లాలో వడదెబ్బ తగిలి ఇద్దరు మృతి చెందారు. ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామానికి చెందిన గొర్రె లింగయ్య(55) అనే వ్యక్తి రెండు రోజులు ఎండలో పనిచేయడంతో వడదెబ్బకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అదేవిధంగా రాయికల్ మండల కేంద్రానికి చెందిన కామోజు గణేశ్(10) అనే బాలుడు వడదెబ్బతో గురువారం మృతిచెందాడు. మూడు రోజుల నుంచి ఎండలు తీవ్రతరం కావడంతో అస్వస్థతకు గురైన గణేశ్ గురువారం ఉదయం మృతిచెందాడు. అలాగే బుధవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో ల్యాగల వజ్రవ్వ(45) అనే మహిళ వడదెబ్బతో మృతి చెందింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.