ప్రచండ భానుడు
ఎండ ధాటికి తల్లడిల్లిన తెలంగాణ
కొత్తగూడెంలో 48.5 డిగ్రీలు
వడగాడ్పులు, ఉక్కపోతతో జనం బేజారు
వడదెబ్బకు ఏకంగా 49 మంది బలి
వచ్చే మూడు రోజులు మరిన్ని మంటలు
తీవ్ర వడగాడ్పులు కూడా: వాతావరణ శాఖ
హైదరాబాద్/నెట్‌వర్క్: భానుడి భగభగలు నానాటికీ ప్రచండంగా మారుతున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు అల్లాడిపోయారు. అన్ని ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత 42 డిగ్రీల సెల్సియస్ దాటిపోయింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనైతే ఏకంగా 48.5 డిగ్రీలు నమోదైంది! దాంతో ఆ ప్రాంతం అగ్నిగుండంగా మారింది. మూడు రోజులుగా క్రమంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్న కరీంనగర్ జిల్లా రామగుండంలోనూ శనివారం 45 డిగ్రీలు రికార్డయింది. నిజామాబాద్ కూడా భగభగలాడుతోంది.
పట్టణంలో 44.9 డిగ్రీలు నమోదైంది. రెండు రోజులపాటు కాస్త నెమ్మదించిన హైదరాబాద్ కూడా శనివారం నిప్పుల కుంపటే అయింది. 42.4 డిగ్రీల ఎండ మంటెక్కించింది. ఎండతీవ్రతకు వడగాడ్పులు, ఉక్కపోత తోడవడంతో తెలంగాణ ఉడికిపోయింది. వడదెబ్బకు తట్టుకోలేక శనివారం రాష్ట్రవ్యాప్తంగా 49 మంది మృతి చెందారు. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 9 మంది, ఖమ్మంలో 8, కరీంనగర్‌లో 7, మహబూబ్‌నగర్‌లో 6, మెదక్‌లో 4, హైదరాబాద్ 3, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు వడదెబ్బకు బలయ్యారు. చెట్ల నీడన కూర్చున్నా వేడిగాలులు వణికిస్తుండటంతో జనం రోడ్లెక్కడానికే జంకారు.
బస్సు ప్రయాణికులు వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పగటి వేళ రెండుమూడు గంటల పాటు బస్సుల్లో ప్రయాణించే వారిలో అధికులు వడదెబ్బకు గురవుతున్నారు. నేరుగా ఎండలో లేకున్నా ఎక్కువ సేపు వేడిగాలుల బారినపడ్డా ప్రమాదమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు రక్షణ ఏర్పాట్లు లేకుండా ద్విచక్రవాహనాలపై ప్రయాణించొద్దని సూచిస్తున్నారు. వచ్చే రెండుమూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, వడగాడ్పుల ప్రభావమూ తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ప్రధాన ప్రాంతాల్లో శనివారం నమోదైన ఉష్ణోగ్రతలు
కొత్తగూడెం 48.5
రామగుండం 45.0
నిజామాబాద్ 44.9
ఆదిలాబాద్ 44.6
మెదక్ 44.0
నల్గొండ 43.2
హన్మకొండ 42.5
హైదరాబాద్ 42.4
మహబూబ్‌నగర్ 42.3