ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడదెబ్బకు మూడోరోజు శనివారం 84 మంది మృతిచెందారు. గత రెండు రోజుల్లో వడగాలులకు 222 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కొంచెం శాంతించిన ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడదెబ్బకు మూడోరోజు శనివారం 84 మంది మృతిచెందారు. గత రెండు రోజుల్లో వడగాలులకు 222 మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్నమొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉగ్రరూపం ధరించిన ఉష్ణోగ్రతలు కొంచెం శాంతించినా రెండు రోజుల నుంచి అస్వస్థతగా ఉన్న వారు కూడా శనివారం గాలులకు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో 25 మంది, విశాఖపట్నం జిల్లాలో 20 మంది, విజయనగరం జిల్లాలో 17 మంది, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది మంది వంతున, కృష్ణాజిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి కొన్ని రోజులుగా బలమైన వేడిగాలులు వీయడంతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిగా మారగా, శనివారం ఉదయం నుంచి అక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో వేడిగాలుల ప్రభావం దాదాపుగా తగ్గిపోయినట్లు విశాఖపట్నంలోని వాతావరణశాఖ నిపుణులు విశ్లేషించారు.