నిప్పుల కొలిమి
నిప్పుల కొలిమి
Published Mon, Apr 3 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
- ఉపశమన చర్యలు నామమాత్రమే
కర్నూలు(అగ్రికల్చర్): భానుడు భయపెడుతున్నాడు..రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నారు. తీవ్రమైన వడగాల్పులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. జిల్లాలో ఒక్క వడదెబ్బ మరణం కూడా ఉండరాదని 20 రోజులుగా జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికే జిల్లాలో 10 మందికి పైగా వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతులు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. సాయంత్రం 5గంటల వరకు వడగాల్పులు కొనసాగుతున్నాయి.
ఎండల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు ప్రధాన పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు ఉండేవి. ఈ సారి మార్చినెల చివరిలోనే ఉష్ణోగ్రత 42.4 డిగ్రీలకు చేరింది. ఏప్రిల్, మేనెలల్లో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని ప్రజలు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతులు సైతం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడతో ప్రజలు ఉక్కపోత భరించలేకపోతున్నారు. గత ఏడాది వేసవి 45 డిగ్రీల గరష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సారి అది 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వర్షాలు తగ్గడం వల్లే..
వర్షాలు పూర్తిగా తగ్గిపోవడం, చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడం, అడవులు అంతరిస్తుండటం, చల్లదనాన్ని ఇచ్చే వృక్షాలు తగ్గిపోవడం తదితర కారణాల వల్ల ఉష్ణోగ్రతలు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. నోరులేని మూగజీవులకు తాగడానికి చుక్కనీరు కరువు అయింది.
చర్యలు శూన్యం..
వడదెబ్బ మరణాలు పెరుగుతున్నా కర్నూలు సహా ఎక్కడ చలువ పందిళ్లు లేవు. అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థలు.. చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో చలివేంద్రాలు, చలువ పందిళ్లు ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. లక్ష కరపత్రాలు ముద్రించడం, వేసవి జాగ్రత్తలపై ప్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయడం మినహా ప్రభుత్వ చర్యలు కానరావడం లేదు. బతుకుదెరువు కోసం పనులకు వెళ్లి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురు మృత్యవాత పడ్డారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది.
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి...
–––––––––––––––––––––––––
తేదీ పగలు రాత్రి
మార్చి 27 40.7 24.7
మార్చి 28 41.1 25.8
మార్చి 29 41.0 27.0
మార్చి 30 41.7 27.7
మార్చి 31 42.4 26.4
ఏప్రిల్ 1 42.0 27.6
ఏప్రిల్ 2 42.0 29.2
––––––––––––––––––––––––
Advertisement
Advertisement