ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఉష్ణోగ్రతలు
హోమియో కౌన్సెలింగ్
ఎండలు నానాటికీ ముదిరిపోతున్నాయి కదా, ఈ అధిక భానుడి తాపాన్ని తట్టుకుని, వడదెబ్బకు గురికాకుండా ఉండాలంటే ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వడదెబ్బకు గురయితే హోమియో చికిత్స ఏమి తీసుకోవాలి? దయచేసి వివరించగలరు.
- ప్రవీణ్‌కుమార్, ఆదోని
వడడెబ్బ ఒక ప్రాణాంతకమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేసే ఈ వడదెబ్బ ఎక్కువగా చిన్న పిల్లలను, వృద్ధులలో ఎక్కువ. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని బారిన పడకుండా కాపాడుకోవచ్చు.
సాధారణంగా వాతావరణ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరం సాధారణ ఉష్ణోగ్రతను కలిగి ఉండేలా చేస్తుంది. ఇలా ఎక్కువ సమయం ఎండని ఎదుర్కొన్నప్పుడు చెమట ద్వారా అధికమొత్తంలో నీరు, లవణాలను కోల్పోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ సమయంలో శరీరంలోని కణాలు రక్తంలోని నీటిని ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల రక్తం పరిమాణం తగ్గి, గుండె, చర్మానికి, ఇత ర అవయవాలకు తగినంత రక్తప్రసరణ చేయలేకపోవడం వల్ల చర్మం యొక్క సహజమైన శీతలీకరణ వ్యవస్థ మందగించి శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల వడదెబ్బ లక్షణాలు కనిపిస్తాయి.
లక్షణాలు: ఎండదెబ్బ లక్షణాలు అకస్మాత్తుగా కనిపిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడం, చర్మం పొడిబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, వాంతులు, వికారం, విరేచనాలు, కండరాల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
జాగ్రత్తలు: నీరు, ఇతర ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎండలో వెళ్లాల్సి వస్తే వదులుగా ఉండే పల్చని, లేతరంగు దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులయితే మంచిది. తలపై ఎండ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. మద్యపానం, కెఫీన్ కలిగిన పానీయాలు తీసుకోరాదు. అవి అధిక మూత్రవిసర్జన కలిగించడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురిచేస్తాయి. కాబట్టి తీసుకోకపోవడం మంచిది. గాలి ప్రసరణ బాగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎండదెబ్బకు గురయితే హోమియోలో తగిన మందులు వాడటం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్,హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్