
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వడదెబ్బ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులు (ఫైల్)
వైఎస్ హయాంలోనే సాయందివంగగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి 2009లో ముఖ్యమంత్రి అయ్యాక వడదెబ్బ మృతుల కుటుం బాలకు మానవతా దృక్పథంలో ప్రకృతి వైపరీత్యాల కింద ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు. వడదెబ్బ మృతులకు రూ.లక్ష సాయాన్ని ఆరునెలలలోపు అందేలా చర్యలు తీసుకున్నారు.
బాబు పాలనలో..
2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబునాయుడు వడదెబ్బ మృతులకు పరిహారాన్ని రూ.3 లక్షలకు పెంచారు. అప్పటి వరకు ఉన్న రూ.లక్ష ఆరునెలల్లోపు అందుతుంటే.. కొత్తగా పెంచిన పరిహారాన్ని మూడు నెలల్లో ఇచ్చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి జీఓ కూడా ఇచ్చారు. కానీ ఐదేళ్లల్లో జిల్లా ఒక్కరంటే ఒక్కరికి కూడా వడదెబ్బ పరిహారం ఇచ్చిన పాపానపోలేదు.
చిత్తూరు అర్బన్: జిల్లాలో గత ఐదేళ్లలో వడదెబ్బ తగిలి మృతి చెందినవారు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ ఏ ఒక్క కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. వరదలు, కరవు కాటకాలు, వడదెబ్బ లాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న వాళ్లకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాలలో సామాన్యులు మృత్యువాత పడితే వాళ్ల కుటుంబాలకు కొంత మొత్తంలో పరిహారంగా ఇవ్వడం ప్రభుత్వం చేయాల్సిన కనీస ధర్మం. 2014కు ముందు వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో మృతి చెందిన వాళ్లకు పరిహారంగా రూ.లక్ష ఇస్తూ వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక పరిహారాన్ని రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షలకు పెంచారు. ఎవరైనా ప్రకృతి వైపరీత్యాలతో చనిపోతే అందుకుగల కారణాలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ప్రభుత్వం మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో స్థానిక తహసీల్దార్, పోలీసులు, వైద్యాధికారులు ఉంటారు. ఈ ముగ్గురు సమన్వయంగా ఏర్పడి ప్రకృతి వైపరీత్యాల్లో మృతుల వివరాలను ఆర్డీవోకు ఇవ్వడం..అక్కడి నుంచి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వెళ్లడం నిబంధన. నివేదిక ఇచ్చిన నెల తరువాత.. మూడు నెలల్లోపు మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. కానీ వాస్తవంగా వడదెబ్బకు చనిపోయినన వాళ్లను సైతం నిబంధనల పేరిట అధికారులు లెక్కల్లోకి తీసుకోవడంలేదు.
ఒక్కరికి కూడా ఇవ్వలేదు!
వేసవి వస్తోందంటే జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాలు సైతం అంతంతమాత్రంగా ఉండటంతో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోతోంది. గత ఐదేళ్ల కాలంలో వడదెబ్బ కారణంగా జిల్లాలో 700 మందికి పైగా చనిపోయారు. మృతులను గుర్తించడంలో పత్రికల్లో వచ్చే వార్తలే ప్రామాణికంగా వైద్యశాఖ ఓ సంఖ్యను, రెవెన్యూ మరో సంఖ్యను, పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ గత ఐదేళ్లలో మృతుల సంఖ్య 419గా గుర్తించింది. నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు పంపడం.. అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరడం కూడా పూర్తయ్యింది. కానీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి పరిహారం అందలేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం పరిహాసంగా మారిపోయింది.
చంద్రన్న భీమా పేరిట..
అయితే మృతుల కుటుంబాలకు వడదెబ్బ పరిహారం ఇవ్వకుండా గతేడాది నుంచి చంద్రన్న భీమా కింద భీమా సొమ్ము ఇస్తున్నారు అది కూడా 50 ఏళ్లు దాటిన వారికి రూ.30 వేలు చొప్పున 32 మందికి పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దుపులుకుంది. అంటే వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాగితాలకే పరిమితం అన్నమాట.