ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సునామీ సృష్టించిన ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ‘‘మనం ప్రజలను ఇంత వేధించామా’’ అని వాపోయారట. సీఎం ఆఫీసు నుంచి గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల దాకా గత ఐదేళ్ళు తెలుగుదేశం వారు ప్రజలను ఎంత వేధించారో ఇప్పటికయినా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా సాక్షి మీడియా గ్రూప్ గత అయిదేళ్ళలో ఏపీలో విలయ తాండవం చేసిన అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై ఉద్యమమే నడపాల్సి వచ్చింది. బాబుకు అది రుచించలేదు. సాక్షి దినపత్రికనూ, న్యూస్ చానల్‌ను మూసివేయించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. యూపీఏ రెండుసార్లు అధికారంలోకి రావడానికి పూర్తి కారకుడయిన డాక్టర్ వైఎస్సార్ కుమారుడిని పార్టీ నుంచి బయటికి తరిమేసి ఆయన మరణానంతరం వైఎస్సార్ పేరు నిందితుల జాబితాలో చేర్చిన ఫలితం ఇవ్వాళ కాంగ్రెస్‌కి దక్కిందనాలి.
భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో తన సంఖ్యా బలాన్ని మరింత పెంచుకుని రెండవ సారి తిరిగి కేంద్రంలో అధికారం చేపడుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, నూతనంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలయిన ప్రియాంక గాంధీలకు ఆత్మవిమర్శ చేసుకోడానికీ, ఓటమి కారణాలను వెతుక్కోడానికి బోలెడంత తీరిక చిక్కింది. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టండి అని లేఖలు ఇచ్చి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఏం కావాలో చెప్పకుండానే ఇంకా ఎప్పుడు విడగొడతారు అని పదే పదే కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్ర బాబు నాయుడు అనీ, మీరు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మేం అధి కారంలోకి వచ్చి ఆ పని చేస్తాం అని పొద్దున్న లేచింది మొదలు తమ వెంటపడి సతాయించింది, ఒత్తిడి తెచ్చింది భారతీయ జనతా పార్టీ అనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పుకుని వారి మద్దతు పొందలేని దీనస్థితిలో, 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మట్టి కొట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో సోదిలోకి లేకుండా పోయిన విషయంలో కూడా తల్లీ పిల్లలు కూర్చుని సమీక్షించుకుంటా రనే ఆశిద్దాం.
2014లో రాష్ట్ర విభజనకు బాధ్యులూ, భాగస్వాములూ అయిన తెలుగుదేశం, బీజేపీల కూటమినే ప్రజలు గెలిపించారు, రాష్ట్రాన్ని సమై క్యంగా ఉంచాల్సిందేనని పట్టుబట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట్రుక వాసి దూరంలో అధికారంలోకి రాకుండా పోయింది. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర విభజనకు బాధ్యులయిన మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల అడ్రెస్ గల్లంతు చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 175 శాసనసభ స్థానాల్లో 151, 25 లోక్‌సభ స్థానాల్లో 22 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ఇచ్చి ప్రజలు ఒక చరిత్రాత్మక విజయాన్ని అందించారు.
ఈ విజయం అనితర సాధ్యం. సమకాలీన రాజకీయ నాయకులలో దేశంలోనే అందరికంటే వయసులో బహుశా జగన్‌మోహన్ రెడ్డి చిన్నవాడు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే కూడా. పదేళ్ళ కఠోర శ్రమ, పట్టుదల, ప్రజా సమస్యల మీద అనునిత్యం ప్రజల్లోనే ఉండి చేసిన పోరాటం, పదహారు మాసాలు అన్యాయంగా జైలులో పెడితే కూడా కుంగిపోకుండా, పార్టీ నాయకులూ శ్రేణులూ ఎటూ వలస పోకుండా మార్గ నిర్దేశనం చేస్తూ, మొక్కవోని ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కోవడం, చివరగా 14 మాసాల పాదయాత్ర ఇవన్నీ కలిసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి ఆయన సిద్ధం అవుతున్న సమయంలో గత అయి దేళ్ళూ చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం దివాలా తీసిన తీరే ఆయన కళ్ళలో మెదులుతూ ఉంటుంది. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక తరగతి హోదాతో బాటు ఇచ్చిన హామీలన్నిటినీ కేంద్రం నుండి సాధించుకోవడం, తాను ప్రకటించిన నవరత్నాలతో బాటు పాదయాత్ర మార్గంలో వివిధ వర్గాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడంతో బాటు గత అయిదేళ్ళూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన దుబారా ఖర్చుల వల్ల ఏర్పడిన నష్టాల నుండి రాష్ట్రాన్ని బయటికి తేవడం కోసం విరామం లేని శ్రమ జగన్‌మోహన్ రెడ్డికి తప్పదు.
జగన్ ఎప్పుడూ దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలూ ఉంటే అధికా రంలోకి వస్తాం అంటుంటారు, నిజమే వాటితో బాటు ఈ ఫలితాల సునామీ మాత్రం చంద్రబాబు నాయుడు దుష్పరిపాలన కారణంగానే. ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ‘‘మనం ప్రజలను ఇంత వేధించామా’’ అని వాపోయారట. అమరావతి సాక్షిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల దాకా గత అయిదేళ్ళు తెలుగుదేశం వారు ప్రజలను ఎంత వేధించారో ఇప్పటి కయినా ఆయన అర్థం చేసుకుంటే మంచిది. ఇవ్వాళ ఫలితం వెలువడ్డాక ఆయనకు ఇవన్నీ అర్థం అవుతున్నాయంటే పొరపాటు. ఆయనకు ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. ఒక వర్గం మీడియా ఈ అయిదేళ్ళూ రోజూ చెపుతూనే ఉంది, ముఖ్యంగా సాక్షి మీడియా గ్రూప్ గత అయిదేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌లో విలయ తాండవం చేసిన అవినీతి, ఆశ్రితపక్షపాతానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే నడపాల్సి వచ్చింది. చంద్రబాబుకు అది రుచించలేదు. సాక్షి దినపత్రికనూ, న్యూస్ చానల్‌ను మూసి వేయించడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి అది సాధ్యం కాక ఆ మీడియా గ్రూప్‌లో పనిచేస్తున్న జర్నలిస్ట్‌లను తన పత్రికా గోష్టులలో, సమావేశాల్లో తూలనాడటం, విమర్శించడం సాగిం చారు.
తానాతందానా అన్న మీడియాను కాకుండా ఆయన సాక్షి వంటి కొన్ని మీడియా గ్రూప్‌లను సీరియస్‌గా తీసుకుని తన ప్రభుత్వ పనితీరు మీద వస్తున్న విమర్శలను పట్టించుకుని పాలనను మెరుగు పరుచుకుని ఉంటే మరీ 23 స్థానాల దగ్గర ఆగిపోకుండా కొంత గౌరవప్రదమయిన ప్రతిపక్ష స్థానం దక్కి ఉండేదేమో. ఆయన ఆ పని చెయ్యకుండా మీడియా సంస్థలను మూసేయించాలనీ, ప్రతిపక్ష నాయకుడిని శాశ్వ తంగా జైలుకు పంపించాలనీ విఫల ప్రయత్నం చేశారు. తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల్లో స్టేలు తెచ్చుకుని తానూ కాంగ్రెస్ పార్టీ కలిసి బనాయించిన కేసుల్లో జగన్‌మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని తెగ ఆరాటపడిపోయారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లి ఆయన ప్రధానమంత్రిని అడిగిన కోరికలు రెండే అని బీజేపీ నాయకులే చెపుతుంటారు. మొదటిది జగన్‌ను జైలుకు ఎప్పుడు పంపుతారు? రెండ వది నియోజకవర్గాల సంఖ్య ఎప్పుడు పెంచుతారు? అనే. మంచిపనులు చేసి ప్రజాదరణ పొందితే అధికారంలో ఉంటాం కానీ జగన్‌ను జైలులో పెట్టించి, ప్రతిపక్షమే లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తే అధికారంలోకి రాము అన్న చిన్న లాజిక్ మిస్ అయినందు వల్లనే ఇవ్వాళ చంద్రబాబుకూ ఆయన పార్టీకీ ఈ దుస్థితి ఎదురయింది. అంతేకాదు ఆయన సరఫరా చేసిన అసత్య సమాచారాన్నంతా వందిమాగధ మీడియా అందంగా రంగులద్ది పత్రికల్లో అచ్చేసి, చానళ్లలో వినిపించి అదే నిజం అని ఆయనే తిరిగి నమ్మేట్టు చేసి చంద్రబాబును 2050 సంవత్సరంలోకి తీసుకెళ్ళిపోయాయి.
వర్తమానం నుండి చాలా దూరం అంటే ఒక 30 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయి ఆ భ్రమల్లో ఉండిపోయిన కారణంగానే ఈ ఫలితం. చంద్ర బాబు నాయుడు ఇప్పుడు 70వ పడిలో ఉన్నారు. సహజంగానే మును పటి జవసత్వాలు ఉండటం కష్టం. చేతికి అందివచ్చిన కొడుకు రాజ కీయాలకు అంది వస్తాడనే ఆశ లేదు. వచ్చే అయిదేళ్ళూ ప్రతిపక్షంలో ఉండాలి. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటీ అన్నది చర్చనీయాంశంగా మారింది. మోదీ మీద వ్యక్తిగత కక్ష పెంచుకుని ఆయన్ను ఓడించాల్సిందే అని దేశమంతా తిరిగి కాంగ్రెస్‌తో దోస్తీ చేసి చతికిలబడ్డ చంద్రబాబును మోదీ అంత సులభంగా వదిలేస్తాడా? ఆయన రోజుకు పదిసార్లు చెప్పుకున్నట్టు నిప్పు వెనక దాగిన కేసుల స్టేలు ఆయన్ని వదులుతాయా? మరో నాయకుడు ఎవరినీ ఎదగనివ్వని చంద్రబాబు పార్టీలో దాన్ని ఒడ్డెక్కించే రెండో నేత ఎవరు?
దేశమంతటా 2014కు మించిన ఫలితాలు సాధించి ఉత్తర తెలంగాణలో మూడు, రాజధాని నగరంలో ఒకటి మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచిన బీజేపీ, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రెండు స్థానాలూ పోగొట్టుకోవడానికి కారణాలను విశ్లేషించుకుంటే మంచిది. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి ఆర్థిక సహకారం అందించి, పట్టు విడిచి ప్రత్యేక హోదా ఇవ్వడమొక్కటే బీజేపీ ముందున్న మార్గం.
ఇక సామంతులూ, బానిసల చేతుల్లో మాత్రమే రాష్ట్రాలు ఉండా లని కోరుకునే కాంగ్రెస్ పార్టీ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో చేసిన తప్పులన్నీ ఇవ్వాల్టి తమ దుస్థితికి కారణం అని ఇప్పటికయినా సోనియా గాంధీకి అర్థం అవుతుందా, ఈ ఫలితాల సమీక్షలో పార్టీ కేంద్ర కార్య వర్గంలోనో, వార్ రూమ్‌లోనో బహిరంగంగా కాక పోయినా సోనియా తన మనసులోనయినా జగన్‌మోహన్‌రెడ్డిని ఓదార్పు యాత్రకు అనుమ తించకపోవడం, ఆయనను జైలు పాలు చెయ్యడం వంటి పిచ్చి పను లన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఈ గతి పట్టించాయని ఒప్పుకుంటారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ రెండుసార్లు అధికారం లోకి రావడానికి పూర్తి కారకుడయిన డాక్టర్ రాజశేఖర రెడ్డి కుమారుడిని పార్టీ నుండి బయటికి తరిమేసి ఆయన మరణానంతరం వైఎస్‌ఆర్ పేరు నిందితుల జాబితాలో చేర్చిన ఫలితం ఇవ్వాళ కాంగ్రెస్‌కు దక్కిందనే అనుకోవాలి.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
బాబూ... ఇది స్వయంకృతం!
Published Wed, May 29 2019 12:27 AM | Last Updated on Wed, May 29 2019 12:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment