సాక్షి, విజయవాడ : పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. బీజేపీ పార్టీలో చేరే ఉద్దేశంతోనే నాని విప్ పదవిని తిరస్కరించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను నాని వద్దకు పంపించారు. విజయవాడలోని కేశినేని నాని కార్యాలయానికి వచ్చిన గల్లా.. విప్ పదవి తిరస్కరించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విప్ పదవి తిరస్కరించడం వెనుక రాజకీయ దురుద్దేశం లేదని, ఈ విషయాన్ని పెద్దది చేసి చూడవద్దని ఈ సందర్భంగా నాని తెలిపారు. తనకు విజయవాడ ఎంపీ పదవి కన్నా పెద్ద పదవి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీగానే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టానని, విభజన హామీలపై పోరాడానని గుర్తు చేశారు.
లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా తనను నియమించడంపై కేశినేని నాని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ...తనకు బదులు సమర్థులైనవారిని నియమిస్తే బాగుంటుందన్నారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి అన్న కేశినేని నాని... పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గెలుపొందిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment