సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు. పార్లమెంటరీ విప్ పదవిని ఆయన తిరస్కరిస్తూ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో చేసిన పోస్ట్ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సీఎం రమేష్‌ను నియమించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే ఆ పదవిని తాను తీసుకోనంటూ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం గమనార్హం.
లోక్‌సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా తనను నియమించడంపై ఆయన ఈ సందర్భంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కాదంటూ...తనకు బదులు సమర్థులైనవారిని నియమిస్తే బాగుంటుందన్నారు. పార్టీ ఇచ్చే విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి అన్న కేశినేని నాని... పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గెలుపొందిన విషయం విదితమే.
కాగా కేశినేని నాని టీడీపీని వీడతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా ఆయన... కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ టీడీపీలో చర్చకు తెరతీసింది. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో... ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కమలం చెంతకు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తమ పార్టీతో చాలామంది టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలపడేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment