ధాన్యం కుప్పపై మృతి చెందిన రైతు గోపాల్
ఎల్లారెడ్డి: ఎండ దెబ్బ తగిలి ఓ రైతు ధాన్యం కుప్పపైనే తనువు చాలించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చోటు చేసుకుంది. మండలంలోని కొట్టాల్ గ్రామానికి చెందిన బోదాస్ గోపాల్ (49) వారం క్రితం తన రెండెకరాలలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. రోజూ ధాన్యం కుప్ప వద్ద ఎండలో కాపలాగా ఉన్నాడు. మంగళవారం ధాన్యం తూకం వేయగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉన్నాడు.
రాత్రి యథావిధిగా ధాన్యం కుప్ప వద్ద నిద్రించాడు. బుధవారం ఉదయం తోటి రైతులు గోపాల్‌ను నిద్ర లేపగా, లేవకపోవడంతో కుటుంబీకులకు సమాచారమిచ్చారు. అధికారుల నిర్లక్ష్యంతోనే గోపాల్ మృతి చెందాడని, మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని రైతులు ధర్నా నిర్వహించారు. అధికారులు ధాన్యం తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయలేదని, తూకం వేయడంలో ఆలస్యం వల్లే ఎండలో కాపలా ఉన్న రైతు ఎండదెబ్బ తగలి మృతిచెందినట్లు ఆరోపించారు. పోలీ సులు రైతులను సముదాయించారు. జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డితో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామనడంతో ధర్నా విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment