
దేశంలోనే మిర్చిసాగులో తెలంగాణకు రెండోస్థానం
రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మంలోనేఅత్యధిక సాగు
ఖమ్మంలో బోర్డు ఏర్పాటుకు రైతుల సంఘాల ఆందోళన
నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చికి ధర గిట్టుబాటు కాక ఏటేటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయా మార్కెట్‌లలో వ్యాపారులు నిర్ణయించిందే ధర అవుతోంది.టపైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ప్రోత్సాహకాలు లేవు. దీంతో మద్దతు ధర, ప్రభుత్వ చేయూత కోసం మిర్చి బోర్డును ఖమ్మంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చిoది. దేశవ్యాప్తంగా మిర్చిసాగులో ఏపీ మొదటిస్థానంలో ఉండగా, తెలంగాణ రెండోస్థానంలో ఉంది.
ఏటా సగటున రాష్ట్రంలో 7 లక్షల టన్నుల మిర్చి దిగుబడి వస్తుండగా.. సాగు విస్తీర్ణంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటిస్థానంలో ఉండగా, మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల, సూర్యాపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాగు ఎక్కువగా ఉంది. 2024– 25 వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,31,812 ఎకరాల్లో మిర్చి సాగైతే నల్లి తెగులు, ఎర్ర తెగులుతో దిగుబడి తగ్గడమే కాక క్వింటాల్‌కు రూ.13 వేల నుంచి రూ.16వేల వరకే ధర పలికింది.
బోర్డు ఏర్పాటుతో ఎన్నో లాభాలు
ఏపీలోని గుంటూరులో 2021 సెప్టెంబర్‌లో మిర్చి ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేశారు. తెలంగాణలో మిర్చి బోర్డు ఏర్పాటైతే నిర్ణయించే ధర కన్నా తక్కువకు వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశముండదు. కేంద్రం నుంచి రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్, ఇతర పనిముట్లకు సాయం అందుతుంది.
శాస్త్రీయ, సాంకేతిక, ఆర్థిక పరిశోధనల ద్వారా మెరుగైన ఉత్పత్తి పద్ధతుల అభివృద్ధి, అమలుకు అవకాశం ఏర్పడడంతోపాటు అధిక, మెరుగైన, నాణ్యమైన దిగుబడి పొందేలా రైతులకు సూచనలు అందుతాయి. ఖమ్మం జిల్లాలోనే మిర్చి ఎక్కువగా పండుతున్నందున ఇక్కడే బోర్డు ఏర్పాటు చేయాలని ఇటీవల రైతు సంఘాలు ఆందోళన చేశాయి.
కొబ్బరి తోటల సాగు విస్తీర్ణం ఏటేటా రాష్ట్రంలో పెరుగుతోంది.కొబ్బరి అభివృద్ధి జాతీయ బోర్డు కొచి్చలో, రీజినల్ కార్యాలయం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడులో ఉంది. తెలంగాణలోని అశ్వారావుపేటలోనూ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని 2023–24లో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ద్వారా ఉద్యానశాఖ ప్రతిపాదించినా కార్యరూపం దాల్చలేదు. అశ్వారావుపేటలో 1991లోనే 48ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి విత్తనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ కేరళ, ఆంధ్రా ప్రాంతానికి చెందిన 9 రకాల నాటు, హైబ్రిడ్ వంగడాలను ఉత్పత్తి చేస్తారు.
ఆయా జిల్లాలో సాగు ఇలా...
2022 వరకు 2వేల ఎకరాల్లో సాగు ఉండగా, ప్రస్తుతం 3,341 ఎకరాలకు చేరింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,769 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 765, రంగారెడ్డి జిల్లాలో 123 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 79 ఎకరాలు, వికారాబాద్ జిల్లాలో 76 ఎకరాలు, మెదక్ జిల్లాలో 66 ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 42 ఎకరాల్లో పంట సాగు చేశారు. ఏపీ నుంచి వచ్చే దళారులకు కొబ్బరి రైతులు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోంది. దీంతో కొబ్బరి బొండాం, కాయకు రూ.15కు మించి ధర రావడం లేదు.
బోర్డు వస్తే ధరలు తగ్గవు
మిర్చి ధర ఓసారి బాగా, ఇంకోసారి పతనం కావడం ఆనవాయితీగా మారింది. ధరలు తగ్గకుండా ఉండాలంటే మిర్చి బోర్డు ఏర్పాటు అవశ్యం. బోర్డు ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వానికి ధరను సిఫారసు చేసి రైతులు నష్టపోకుండా చూస్తుంది. – కాంపాటి శ్రీనివాసరావు, ఎదుళ్లచెరువు
బోర్డు ఏర్పాటుతోనే మద్దతు ధర
కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుంది. కాయకు రూ.10–రూ.15, బోండాకు రూ.15 వరకు ధర వస్తోంది. అదే కొబ్బరిబోర్డు ఏర్పాటైతే వారే మద్దతు ధర నిర్ణయించి ఎగుమతి చేస్తారు. తద్వారా మంచి ధర వస్తుంది. – కొక్కెరపాటి పుల్లయ్య, కొబ్బరి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి