తగ్గిన ధాన్యం సేకరణ.. 5 టన్నులలోపు సామర్థ్యం గల మిల్లులకు తగ్గిన కేటాయింపులు
సాక్షి, భీమవరం: చిన్న మిల్లుకు పెద్ద కష్టమొచ్చిoది. ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గిపోగా.. మిల్లింగ్ సామర్థ్యం మేరకు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కేటాయింపులు చేస్తుండటం చిన్నమిల్లుల మనుగడపై ప్రభావం చూపనుంది. 5 టన్నులలోపు సామర్థ్యం గల చిన్న మిల్లులకు కొద్దిరోజులకు సరిపడా ధాన్యం మాత్రమే వస్తుండటంతో వాటిని మర ఆడిన తర్వాత మిల్లులు మూసుకోవాల్సిందేనన్న ఆందోళనలో చిన్న మిల్లర్లు ఉన్నారు.
ఉదాహరణకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడి సమీపంలోని చిన్న రైస్‌మిల్లుకు పాత అచీవ్‌మెంట్ ఆధారంగా గతంలో 45 నుంచి 50 ఏసీకే (ఎక్‌నాలెడ్జ్‌మెంట్)ల ధాన్యం వచ్చేది. ఇది దాదాపు మూడు నెలల పాటు మిల్లు తిరిగేందుకు సరిపోయేది. ఇప్పుడు ధాన్యం సేకరణ లక్ష్యం తగ్గడంతో సుమారు 35 ఏసీకేల వరకు రావాలి. కానీ.. సామర్థ్యం ఆధారంగా ఇవ్వడంతో కేవలం 12 ఏసీకే ధాన్యం మాత్రమే వచ్చింది.
ఇది నెల రోజుల మిల్లింగ్‌కు మాత్రమే సరిపోతుంది. తర్వాత రబీ ధాన్యం వచ్చే వరకు మిల్లును మూసుకోవాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక రైస్‌మిల్లుకు గత ర్యాండమైజ్ పద్ధతిలో 40 ఏసీకే (ఒక ఏసీకే దాదాపు 290 క్వింటాళ్లకు సమానం)లకు పైగా ధాన్యం వచ్చేది.
ఈసారి ప్రైవేట్ వ్యాపారం చేసే మిల్లులకు సీఎంఆర్ ఇవ్వడం, ప్రస్తుత ధాన్యం సేకరణలో దళారుల జోక్యానికి అవకాశం కలగడంతో తమకు నచి్చన మిల్లులకు వారు ధాన్యాన్ని చేరవేస్తున్నారు. ఈ జిల్లాలో 10 ఏసీకేల ధాన్యం సేకరణ కష్టంగా మారి మిల్లు ఎంతకాలం నడుస్తుందో చెప్పలేని పరిస్థితి.
గోదావరి జిల్లాల్లో 780 వరకు రైస్‌మిల్లులు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రైస్‌మిల్లింగ్ పరిశ్రమ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల్లో 780 వరకు రైస్‌మిల్లులు ఉండగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆకివీడు తదితర చోట్ల 360 వరకు రైస్‌మిల్లులు ఉన్నాయి. రెండు జిల్లాల్లో గంటకు 5 టన్నుల నుంచి 10 టన్నులకు పైగా మిల్లింగ్ సామర్థ్యం కలిగిన పెద్ద మిల్లులు 40 శాతం ఉండగా, మిగిలినవన్నీ 5 టన్నులలోపు సామర్థ్యం గల చిన్న మిల్లులే.
సాధారణంగా పెద్ద మిల్లులు ప్రైవేట్ మార్కెట్‌కి, ఎగుమతులకు ప్రాధాన్యమిస్తే.. చిన్న మిల్లులు ఎక్కువగా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై ఆధారపడతాయి. రైతుల నుంచి సివిల్ సప్లైస్ శాఖ సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లులకు అప్పగిస్తుంది. క్వింటాల్ ధాన్యానికి 67 కేజీల బియ్యాన్ని తిరిగి అప్పగించాలి.
అందుకోసం కమీషన్ రూపంలో వారికి వచ్చేది కేవలం రూ.10 మాత్రమే. మిల్లింగ్ చేసేటప్పుడు వచ్చే తవుడు, నూకలు, చిట్టు తదితర ఉప ఉత్పత్తులకు రైస్ బ్రాన్ ఆయిల్, ఆల్కహాల్, ఇథనాల్ తయారీలో డిమాండ్ ఉండటంతో సీఎంఆర్ చేస్తుంటాయి.
గతంలో పాత అచీవ్‌మెంట్ల ఆధారంగా...
తూర్పుగోదావరిలో మిల్లింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఎక్స్‌పోర్ట్, ప్రైవేట్ మార్కెట్ చేస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మిల్లులు ప్రైవేట్ వ్యాపారం తక్కువగా చేస్తుంటాయి. సీఎంఆర్ చేయడంలో ఈ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది.
ప్రైవేట్ వ్యాపారం చేసే, డ్రయర్లు, లేటెస్ట్ టెక్నాలజీ లేని మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ వాటి మనుగడ దృష్ట్యా గతంలో కొన్ని సడలింపులు ఇచ్చేవారు. సీజన్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని బట్టి పాత అచీవ్‌మెంట్ల మేరకు సీఎంఆర్ కేటాయింపులు జరిగేవి. దీనివల్ల సక్రమంగా సీఎంఆర్ చేసే చిన్న మిల్లులకు కేటాయింపులకు ఇబ్బంది ఉండేది కాదు.
సేకరణ లక్ష్యాన్ని తగ్గించడంతో చిన్న మిల్లులకు చిక్కులు
గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ సీజన్‌లో ధాన్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించేశారు. దీనికితోడు మిల్లింగ్ కెపాసిటీ మేరకు సీఎంఆర్ కేటాయింపులు చేయడం చిన్న మిల్లులకు చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రైవేట్ వ్యాపారం చేసే మిల్లులకు సీఎంఆర్‌కు అవకాశం ఇవ్వడంతో చిన్న మిల్లులకు కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ధాన్యం సేకరణలో దళారుల జోక్యం మరింత సమస్యగా తయారైంది.
గత ప్రభుత్వం ధాన్యం సేకరణలో ఏ దశలోనూ దళారుల జోక్యానికి ఆస్కారం లేకుండా రైతుకు పూర్తి మద్దతు ధర అందేలా కట్టుదిట్టం చేసింది. రైతు ఆర్‌బీకే/సొసైటీకి ధాన్యం శాంపిల్ తీసుకువెళితే.. మిగిలిన పనంతా అక్కడి సిబ్బంది చూసుకునేవారు. ధాన్యం ఆన్‌లైన్ చేయగానే ఏ మిల్లుకు వెళ్లాలో కంప్యూటర్ సూచించేది.
నూతన విధానంలో అడుగడుగునా దళారుల జోక్యం పెచ్చుమీరింది. కమీషన్ ఏజెంట్లు తమకు నచ్చిన పెద్ద మిల్లర్లతో మాట్లాడుకుని ధాన్యాన్ని అక్కడికే తరలిస్తున్నారు. దీంతో చిన్న మిల్లులకు ధాన్యం సేకరణ కష్టంగా తయారైంది.
నెల రోజులు తిరిగితే గొప్ప
ఏటా సీజన్‌లో చిన్న మిల్లులకు 40 నుంచి 50 ఏసీకేల వరకు ధాన్యం సేకరణ జరిగితే ఇప్పుడు అధిక శాతం 10 నుంచి 15 ఏసీకేలలోపే ఉన్నాయి. దీంతో వాటి సామర్థ్యం మేరకు నెల నుంచి నెలన్నర రోజులు మాత్రమే మర ఆడేందుకు వస్తాయని, తర్వాత రబీ ధాన్యం మార్కెట్‌లోకి వచ్చే వరకు మిల్లులు మూసేయాల్సిందేనని చిన్న మిల్లర్లు అంటున్నారు.
మిల్లు తిరిగినా తిరగకపోయినా వాటి చిన్న, పెద్ద మిల్లుల కెపాసిటీని బట్టి సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు, అద్దెలు, నిర్వహణ రూపంలో నెలకు రూ.2.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మేరకు నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఒక్కో చిన్నమిల్లులో గుమాస్తా, డ్రైవర్, జట్టు కార్మికులు 10 నుంచి 12 మంది వరకు పనిచేస్తుంటారు. మిల్లు మూతపడితే వారంతా ఉపాధి కోల్పోవాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment