CMR
-
ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు
సాక్షి, హైదరాబాద్, : మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా దారి మళ్లించడం, నాణ్యమైన బియ్యం విక్రయించి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడకుండా మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమవారం మంత్రి ఉత్తమ్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో ఈ నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు తెలిసింది. కెపాసిటీకి అనుగుణంగా కేటాయింపులు రైస్‌మిల్లులు తమకు కేటాయించిన ధాన్యాన్ని ఏడాదిన్నర వరకు కూడా మిల్లింగ్ పూర్తి చేయకుండా తమ వద్దే నిల్వ ఉంచుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. తద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, ఎఫ్‌సీఐ రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిల్లులు సీఎంఆర్ కోసం ప్రతిరోజు రెండు షిఫ్టుల్లో 16 గంటలు పనిచేయాలని మార్గదర్శకాల్లో పొందుపరిచారు. ముడి బియ్యం ఇచ్చే రా రైస్ మిల్లులకు వడ్లు కేటాయిస్తే 8 గంటల చొప్పున రెండు షిఫ్టుల్లో రోజుకు 16 గంటలు మిల్లింగ్ చేసి 75 రోజుల్లో కేటాయించిన ధాన్యంలో 67శాతం రా రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల కెపాసిటీకి అనుగు ణంగా ధాన్యం కేటాయించనున్నారు. 25 శాతం బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరిమిల్లింగ్ కోసం ధాన్యం తీసుకునే మిల్లర్లు ధాన్యం విలువకు అనుగుణంగా బ్యాంక్ గ్యారంటీ తప్ప నిసరి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అను గుణంగా నిబంధనలు సవరించారు. కేటాయించిన ధాన్యం మిల్లింగ్ కెపాసిటీని బట్టి మిల్లింగ్‌కు వచ్చే 15 రోజుల ముందే 25 శాతం బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుంది. లీజు మిల్లుదారుడైతే కేటాయించిన ధాన్యంలో 50 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. లీజు తీసుకున్న మిల్లులో గతంలో ఓనర్ సీఎంఆర్ డెలివరీ పెండింగ్ లేనట్టు డీఎంల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతే మిల్లులకు కేటాయింపులు ఉంటాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలులో ఉన్న మిల్లర్లకు సైతం ధాన్యం కేటాయింపులు ఉండవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.డిఫాల్టర్లపై ఉక్కుపాదంగతంలో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన మిల్లర్లకు, ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి కేసుల్లో ఇరుకున్న వారికి, 6 ఏ ఈసీ యాక్ట్, క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న వారికి ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ధాన్యం కేటాయించకూడదని, వీరికి ఈ సీజన్‌తోపాటు వచ్చే రెండు సీజన్ల వరకు వడ్లు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లు బకాయి పడ్డ సీఎంఆర్‌ను అప్పగించి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటేనే కొత్తగా ధాన్యం కేటాయించనున్నారు. మిల్లర్లు లీజు డీడ్ ఇవ్వడంతోపాటు కేటాయించిన ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ తప్పనిసరి కానుంది. కలెక్టర్ల పర్యవేక్షణ...జిల్లాల వారీగా రైస్‌మిల్లుల్లో సాగే సీఎంఆర్‌పై కలెక్టర్లకే బాధ్యతలు అప్పగించనున్నా రు. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లింగ్ వరకు వారే కీలకం. బాయిల్డ్ రైస్‌మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు డిసెంబర్ 31లోగా ఎఫ్ఆర్కే బ్లెండింగ్, సోర్టెక్స్ మెషీన్లు ఇన్స్టాల్ చేసుకు నేలా ఆయా జిల్లాల కలెక్టర్ చర్యలు తీసు కొని, వారికే ధాన్యం కేటాయించాల్సి ఉంటుంది. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అర్హత ఉన్న మేరకే ధాన్యం కేటాయించాలి. మిల్లు లను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేటాయించిన ధాన్యం దారిమళ్లినా, ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రైవేట్‌గా విక్రయించినా క్రిమినల్ చర్యలు తప్పనిసరి. -
నేటితో ముగియనున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఖరీఫ్‌నకు సంబంధించిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ బుధవారంతో ముగియనుంది. ఆ సీజన్లో మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన బియ్యం బకాయిలు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో కేంద్రాన్ని గడువు కోరవద్దని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి 50 రోజుల్లో 20 ఎల్ఎంటీ మేర బియ్యం సేకరించింది. ఇంకా 2022–23 సీజన్‌కు సంబంధించి మరో 4.80 ఎల్ఎంటీ ఎఫ్‌సీఐకి రావాల్సి ఉన్నా, రైస్‌మిల్లర్లు డెలివరీ చేయడంలో విఫలమయ్యారు. కాగా సీఎంఆర్ డెలివరీ గాడిన పడుతున్న నేపథ్యంలో మరో నెలరోజుల గడువు పొడిగించాలని మిల్లర్లు కోరుతున్నారు. నెల రోజుల్లో పూర్తిస్థాయిలో బియ్యం ఎఫ్‌సీఐకి ఇస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజులుగా అక్కడే ఉన్న సీఎంఆర్ గడువు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. కనీసం నెల రోజుల టైమ్ ఇస్తే.. గతేడాది ఖరీఫ్ సీఎంఆర్ బకాయిలు పూర్తిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్దనే ఉండిపోతుంది. దీని విలువ కనీసం రూ.1,872 కోట్లు ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత రికవరీ చేయటం కూడా కష్టంగా ఉంటుంది. ఎఫ్‌సీఐకి బదులుగా సివిల్ సప్లయీస్ కోటా కింద తీసుకోవాల్సి వస్తుంది. కానీ సివిల్ సప్లయ్ తీసుకునేది లేదని చెప్పిన నేపథ్యంలో నెల రోజుల గడువు పెంచాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. గత ఏడాది రబీ ధాన్యం వేలానికి... కాగా నిరుడు యాసంగి సీజన్‌కు సంబంధించిన బియ్యం బకాయిలు 32.74 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. అంటే 50 ఎల్ఎంటీ ధాన్యం గోడౌన్లలో ఉంది. ఇందులో 35 ఎల్ఎంటీ ధాన్యాన్ని వేలం వేయాలని ప్రభు త్వం నియమించిన కమిటీ నిర్ణయించింది టెండర్లు కూడా ఆహ్వానించింది. కాగా ధాన్యం టెండర్లకు సంబంధించిన ప్రీ బిడ్డింగ్ సమావేశం బుధవారం పౌరసరఫరాలభవన్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కమిషనర్ డీఎస్.చౌహాన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. -
ఎల్ఈడీ లైట్లే కొంప ముంచాయా?
ఉప్పల్: ఉప్పల్ సీఎంఆర్ వస్త్ర దుకాణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి ఎల్ఈడీ లైట్లే కారణమని భావిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఎలివేషన్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కారణంగా షార్ట్ సర్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై సీఎంఆర్ మేనేజర్ గౌతమ్ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమతులపై అన్నీ అనుమానాలే..? సీఎంఆర్ దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అయినా వస్త్ర దుకాణం నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పని చేసే చోట భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు వాటిని పట్టించుకోకుండా, ఆక్యుపెన్సీ(ఓసి) లేకుండా అనుమతులు ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రమాదం నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల మేరకే వ్యాపార సంస్థకు అనుమతులు ఇచ్చారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. వీటితో పాటు ట్రాఫిక్ విషయంలో సంబంధిత అధికారులు అనుమతి ఉందా? ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. జీహెచ్ఎంసీ నుంచి పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు బుధవారం ఉదయం అనుమతులపై ఆరా తీశారు. నిర్వాహకులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మాట వాస్తమే కానీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని టౌన్‌ప్లానింగ్ అధికారి స్వయంగా పేర్కొనడం గమనార్హం. -
క్వింటాల్ ధాన్యం సగటున రూ.1,685
సాక్షి, హైదరాబాద్: మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం విక్రయానికి మరో అడుగు ముందుకుపడింది. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతగా మిల్లుల్లోని 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు ఆన్లైన్లో గత నెలలో గ్లోబల్ టెండర్లు ఆహ్వానించగా, 11 సంస్థలు 54 బిడ్స్ దాఖలు చేశాయి. ఈనెల 14న టెక్నికల్ బిడ్స్ తెరిచిన పౌరసరఫరాల సంస్థ ఈ 11 సంస్థల్లో హరియాణాకు చెందిన గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీ బిడ్‌ను తిరస్కరించింది. మిగతా అర్హత పొందిన 10 సంస్థలకు సంబంధించి శనివారం ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచారు. ఇందులో క్వింటాల్ ధాన్యానికి కనిష్టంగా రూ.1,618, గరిష్టంగా రూ.1,732 కింద బిడ్స్ వేసిన 10 సంస్థలకు 25 లాట్లు అప్పగించారు. మొత్తం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున రూ.1,685 లెక్కన విక్రయించారు. నష్టం క్వింటాల్‌కు రూ. 375 రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో క్వింటాల్ ధాన్యాన్ని గరిష్ట మద్దతు ధర (ఎంఎస్పీ) రూ.2,060 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసింది. యాసంగిలో మొత్తంగా 66.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ ఉంచింది. యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల నూకల శాతం ఎక్కువగా వస్తుందని మిల్లర్లు సీఎంఆర్‌కు నిరాకరించారు. దీంతో ఈ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్లు ఆహ్వానించింది. ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే వచ్చే నూకలకు నష్టపరిహారంగా క్వింటాల్ ధాన్యానికి రూ. 280 వరకు కేంద్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినా, మిల్లర్లు ససేమిరా అనడంతో తప్పక విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సగటున ధాన్యం క్వింటాల్‌కు రూ.1,800 వరకు విక్రయించేందుకు బిడ్స్ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తర్వాత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సగటున క్వింటాల్‌కు రూ. 1,685 మాత్రమే బిడ్స్ ఫైనల్ అయ్యాయి. అంటే ఎంఎస్పీ రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 375 ప్రభుత్వానికి నష్టం. అంటే ఒక మెట్రిక్ టన్నుకు రూ. 37 కోట్ల చొప్పున 25 ఎల్ఎంటీకి రూ. 925 కోట్ల నష్టం. కాగా ఈ ఫైనాన్షియల్ బిడ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ ఆమోదించాల్సి ఉంది. 25 లాట్లు దక్కించుకున్న 10 సంస్థలు ఇవే కేంద్రీయబండార్, సామ్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, పట్టాబి ఆగ్రోఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్‌ఫుడ్ ఇండస్ట్రీ లిమిటెడ్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ అండ్ రిటేనింగ్ కోఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నోచా ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, బగదీయ బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిద్దరామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీలలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శంభుదయాల్ జైన్ అండ్ కంపెనీ. -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
ఎఫ్‌సీఐ వల్లే సీఎంఆర్ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: ఎఫ్‌సీఐ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటోందని రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లను వేధించడ మే లక్ష్యంగా ఎఫ్‌సీఐ అధికారులు నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంప నాగేందర్ గుప్తా ఆరోపించారు. మంగళవారం నగరంలోని టూరిస్ట్ ప్లాజాలో మిల్లర్ల సంఘం సమావే శం జరిగింది. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. మిల్లర్లు మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్ల నుంచి తరలించాల్సిన ఎఫ్‌సీఐ నాలుగైదు నెలలైనా రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపడం లేదని, తద్వారా గోడౌన్లు నిండి పోయి మిల్లింగ్ జరగని పరిస్థితి నెలకొందని వివరించారు. ఒక్కో ఎఫ్‌సీఐ గోడౌన్‌కు వందలాది మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని కేటాయిస్తుండడంతో వారం రోజులైనా బియ్యం లారీలు అన్లోడింగ్ కావడం లేదన్నారు. దీంతో సమయానికి సీఎంఆర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాగైతే మిల్లింగ్ ఎలా? ప్రస్తుతం రాష్ట్రంలోని మిల్లర్ల వద్ద కోటి మె ట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని, ఎఫ్‌సీఐ ఇలాగే వ్యవహరిస్తే ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం అసాధ్యమని గుప్త స్పష్టం చేశారు. ఎఫ్‌సీఐ కారణంగా 70 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయడానికి 24 నెలల కాలం పడుతుందన్నారు. మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లు, ఎఫ్‌సీఐ నుంచి రవాణా చార్జీలు రూ.700 కోట్లు రావలసి ఉందని, వాటిని వెంటనే చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం పంపించే బలవర్ధక బియ్యం కెర్నల్స్ (ఎఫ్ ఆర్కే)లో నాణ్యత లేదని మిల్లులను ఎఫ్‌సీఐ డిఫాల్టర్లుగా ప్రకటించడం శోచనీయమన్నారు. సమావేశంలో సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. -
మిల్లర్ల బకాయిలు రూ. 2,072 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి రూ. వేల కోట్లలో బకాయి పడ్డారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ఇచ్చిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు. దీంతో 2019 యాసంగి నుంచి 2022 యాసంగి వరకు పౌరసరఫరాల సంస్థకు రూ. 2,072 కోట్ల విలువైన 5.83 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బకాయిపడ్డారు. ఈ మొత్తం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన నగదును 25 శాతం జరిమానాతో డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హోదాలో కమిషనర్ అనిల్ కుమార్ ఇప్పటివరకు నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఆయా మిల్లులకు రికవరీ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ బియ్యం విలువే రూ. 1,630 కోట్లు 2021–22 యాసంగికి సంబంధించి 2,37,310 మెట్రిక్ టన్నుల బియాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా ఈ గడువు గత మే నెలాఖరుతో ముగిసింది. దీంతో ఈ బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో రికవరీ చేయాలని లేదంటే బియ్యం విలువ రూ. 842.09 కోట్లను 25 శాతం పెనాల్టితో వసూలు చేయాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గత నెల 23న 2021–22 వానాకాలానికి సంబంధించిన 2.22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 25 శాతం పెనాల్టితో 494 మిల్లుల నుంచి రికవరీ చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బియ్యం విలువ రూ. 787.67 కోట్లు. ఈ రెండు సీజన్లలోనే రూ. 1,630 కోట్ల వరకు రావాల్సి ఉంది. 2019 యాసంగి బకాయి 48,762 మెట్రిక్ టన్నులు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 2019 యాసంగి సీజన్‌కు సంబంధించి 118 మిల్లుల నుంచి సీఎంఆర్ కింద లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే పెనాల్టీతో 125 శాతం రికవరీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ మిల్లులు గడువులోగా బియ్యం ఇవ్వకపోవడంతో నెలకోసారి గడువును పెంచుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నెలలో 14 మిల్లులు 125 శాతం బియ్యం రికవరీ చేశాయి. మరో 89 మిల్లులు 100 శాతం రికవరీ కింద సర్కారుకు సీఎంఆర్ అప్పగించాయి. ఇంకా 15 మిల్లులు ఎలాంటి రికవరీ చేయలేదు. దీంతో ఇంకా 48,762 మెట్రిక్ టన్నుల బియ్యం ఆయా మిల్లుల నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికీ ఈ మిల్లులకు పెండింగ్ సీఎంఆర్ రికవరీ చేసుకొనే అవకాశం ఇస్తూ ఈ నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 2020–21 సంవత్సరం యాసంగికి సంబంధించి మరో 73 మిల్లుల నుంచి 75,878 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ఈ మొత్తాన్ని కూడా పెనాల్టితో 125 శాతం రికవరీ చేయాలని సైతం ఈ నెల 19నే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన బియ్యం 1.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ బియ్యం విలువనే రూ. 442 కోట్లు. 25 శాతం నగదు... 100 శాతం బియ్యం రికవరీ డిఫాల్ట్ మిల్లర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేసే ప్రక్రియలో ముందుగా 25 శాతం బియ్యాన్ని లేదా అందుకు సమానమైన మొత్తాన్ని పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తరువాత సీజన్‌కు మళ్లీ సీఎంఆర్ ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే 25 శాతం పెనాల్టిలో ఐదు శాతమే ఇప్పటికిప్పుడు ఇవ్వడం, మిగతా పెనాల్టీ మొత్తాన్ని 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉండటంతో మిల్లర్లు ఇదే అదనుగా వ్యాపారాన్ని య«థేచ్ఛగా సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. -
‘సీఎమ్మార్’పై నిర్లక్ష్యం
జగిత్యాల రూరల్: జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వాటి సామర్థ్యాన్ని బట్టి రైస్‌మిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చి స ర్కారు ఇచ్చిన గడువులోగా సీఎమ్మార్ అప్పగించాలి. కానీ, రైస్‌మిల్లర్లు బియ్యం అప్పగింతలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా బియ్యం సేకరణలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడంతోపాటు ఆంక్షలు విధిస్తోంది. అంతేకాదు.. నిర్దేశిత గడువులోగా బియ్యం అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి పెంచుతోంది. మిల్లుల్లో అధికారులను నియమించి మర ఆడించే పనులనూ పర్యవేక్షిస్తోంది. సెప్టెంబర్ వరకు గడువు 2022–23 వానాకాలం సీజన్లో ప్రభుత్వం సేక రించిన 3,38,187 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 132 రైస్‌మిల్లులకు అప్పగించింది. ఆ ధాన్యం స్వీకరించిన మిల్లర్లు.. 2,26,585 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్)ను ప్రభుత్వాని(ఎఫ్‌సీఐ)కి అప్పగించాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు కేవలం 28,780 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు సర్కారుకు అప్పగించారు. రంగంలోకి దిగిన అధికారులు.. మిగతా బియ్యాన్ని సెప్టెంబర్ చివరి నాటికి అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. బియ్యం అప్పగింతలో జాప్యం.. జిల్లాలో 2021–22 వానాకాలం సీజన్లోనూ 3,25,444 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 135 మంది రైస్‌మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 2,06,171 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్ప గించారు. ఇంకా 38 మంది రైస్‌మిల్లర్లు 11,875 మె ట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2021– 22 యాసంగి సీజన్లో 2,70,776 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 125 మంది రైస్‌మిల్లర్లకు అధికారులు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 1,77,018 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎమ్మార్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు. మిగతా ఏడుగురు రైస్‌మిల్లర్లు.. 6,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. నిర్లక్ష్యంపై ఆగ్రహం.. జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్‌మిల్లర్లు. సకాలంలో సీఎమ్మార్ అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మిల్లర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతోపాటు, ఆయా రైస్‌మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు తరచూ తనిఖీ చేయిస్తోంది. నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకుంటోంది. ప్రతినెలా సమీక్ష.. సీఎమ్మార్ అప్పగింతలో రైస్‌మిల్లర్లు చేస్తున్న జాప్యంపై చర్యలు చేపట్టడంతో పాటు, ప్రతినెలా రైస్‌మిల్లర్లతో కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమీక్షిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా బియ్యం అప్పగించాలని రైస్‌మిల్లర్లను ఆదేశిస్తున్నారు. బియ్యం అప్పగించిన మిల్లర్లు మినహా అప్పగించని వారిని గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. -
డిఫాల్టర్లకు పెనాల్టీ
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువులోగా ఎఫ్‌సీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి చేరాల్సి ఉంది. ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్‌సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్‌సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్ పూల్) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. 494 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్‌ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం నగదు.. 100 శాతం బియ్యం.. డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది. మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి స్టేట్‌పూల్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్‌ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఓ వైపు సీఎంఆర్.. మరోవైపు ధాన్యం అన్లోడింగ్.. ఇప్పుడు డిఫాల్ట్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
సీఎంఆర్ ధాన్యం మాయం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మిల్లులకు ఇచ్చిన వడ్లను సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మరాడించి ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఆరెపల్లెలో ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.27.76కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 2021–22 యాసంగిలో 5,989 మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలంలో 5,437 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 11,426 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇప్పటివరకు 1,400 ఎంటీల ధాన్యం మరాడించి ఇవ్వగా ఇంకా 10,026 ఎంటీల ధాన్యం నిల్వ ఉండాలి. ఈ నెల 1న మిల్లులో విజిలెన్స్ దాడులు చేయగా 504 ఎంటీల ధాన్యం మాత్రమే ఉంది. యాసంగి ధాన్యం 4,135 మెట్రిక్ టన్నులు, వానాకాలం 5,387 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఆనంద్‌దాస్ రాంమోహన్తోపాటు తిరుమల, అనురాధపై కేసు నమోదు చేశారు. యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అధికారులు డబ్బులను రికవరీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మిల్లు యజమానులు, కుటుంబసభ్యుల మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా దాడులు జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు విజిలెన్స్ దాడులు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. మరిన్ని మిల్లుల అక్రమాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2021–22 యాసంగిలో 3,61,437 మెట్రిక్ టన్నుల ధాన్యం 133 మిల్లులకు కేటాయించారు. 2,44,943 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, 1,88,151 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. ఇంకా 63 మిల్లుల నుంచి 56,792 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. క్వింటాల్ వడ్లకు రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ అయితే 68 కేజీలు సీఎంఆర్ చేసి అందించాలి. 2022–23 వానాకాలంలో 3,62,193 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 146 మిల్లులకు అప్పగించారు. సీఎంఆర్ కింద 2,42,669 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా మిల్లర్లు 8,903 టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,33,766 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు తనిఖీలకు రాకముందే రేషన్ బియ్యం కొనుగోలు చేసి తెప్పించేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో ధాన్యం మాయమవుతున్నా జిల్లా అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
మిల్లర్ల నిర్లక్ష్యం..సర్కార్‌పై రూ.1,257 కోట్ల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడితో రైతుల కన్నా అధికంగా లాభాలు ఆర్జిస్తున్న మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యాన్ని మాత్రం చేరుకోవడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావలసిన రూ.వేల కోట్ల బియ్యం సొమ్ము రాకుండాపోతోంది. ఇదే క్రమంలో 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించి 3.93 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఫిబ్రవరి నెలాఖరులోగా ఎఫ్‌సీఐకి అప్పగించలేదు. రాష్ట్ర ప్రభుత్వం మరోనెల గడువు కోరినా కేంద్రం ససేమిరా అనడంతో ఈ బియ్యం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడినట్లయింది. 47.04 ఎల్ఎంటీ బియ్యంలో ఇచ్చింది 43 ఎల్ఎంటీ.. 2021–22 వానకాలం సీజన్‌కు సంబంధించి 70.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 47.04 ఎల్ఎంటీ బియ్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్‌గా ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని నిర్దేశించింది. అయితే ఏడాది గడిచినా కేవలం 43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 3.93 లక్షల మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. దీని విలువ రూ.1,257 కోట్లు. మిల్లర్ల నుంచి 3.93 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐ తీసుకోకపోతే, ఆ బియ్యాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీసుకొని రాష్ట్ర అవసరాల కోసం స్టేట్ పూల్ కింద వినియోగించుకోవలసి ఉంటుంది. అయితే మిల్లర్లు రీసైక్లింగ్, ఇతర అక్రమ పద్ధతుల ద్వారా ఇచ్చే నాణ్యత లేని బియ్యాన్ని కార్పొరేషన్ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా తీసుకొని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తిరిగి రేషన్ దుకాణాలకు పంపించే అవకాశం ఉంది. 2021–22 యాసంగి సీఎంఆర్‌కు ఈనెలాఖరు వరకు గడువు గత 2021–22 యాసంగి సీజన్‌కు సంబంధించి ఈ నెల 31లోగా సీఎంఆర్ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి జై ప్రకాశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యాసంగి సీఎంఆర్ గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నామని, తరువాత గడువు పొడిగించబోమని స్పష్టం చేశారు. గత యాసంగికి సంబంధించి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. 34.06 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.45 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 12.61 ఎల్ఎంటీ బియ్యం పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇచి్చనప్పటికీ, రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేస్తే తప్ప నెలాఖరుకు లక్ష్యం చేరుకోలేమని, అందుకు అనుగుణంగా మిల్లింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ శనివారం అధికారులను ఆదేశించారు. గత యాసంగికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మొత్తం సీఎంఆర్‌లో 14 ఎల్ఎంటీ మేర బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచి్చనప్పటికీ, మిల్లర్లు ఇంకా 6.64 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ పెండింగ్‌లో ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సీఎంఆర్ పెండింగ్ అధికంగా ఉండటంపట్ల రవీందర్ సింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముంచుకొస్తున్న సీఎంఆర్ గడువు
సాక్షి, హైదరాబాద్: అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో మిల్లర్ల తీరు మారడం లేదని తెలుస్తోంది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి సకాలంలో అప్పగించాల్సిన మిల్లర్లు ఎన్నిసార్లు గడువు పెంచినా లక్ష్యాన్ని అందుకోవడం లేదు. 2020–21 యాసంగికి సంబంధించి 1.36 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగింత గడువు ముగియడంతో ఆ మొత్తాన్ని స్టేట్ పూల్ కింద రాష్ట్ర అవసరాలకు మళ్లించారు. 2021–22 వానాకాలం సీఎంఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈనెలాఖరు వరకు గడువు ఇచ్చినప్పటికీ అప్పగింత ఇంకా పూర్తికాలేదు. వానాకాలం సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే లెవీ రూపంలో ఎఫ్‌సీఐకి చేరింది. అంటే ఇంకా 11 లక్షల మెట్రిక్ టన్నులు రావలసి ఉంది. నెల రోజులలో 9 ఎల్ఎంటీ సీఎంఆర్ అప్పగింత విషయంలో జాప్యంపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 24వ తేదీ నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అప్పగించారు. లక్ష్యాన్ని పూర్తి చేయాలని అప్పట్లో మంత్రి గంగుల అధికారులతో సమావేశం అయి గట్టిగా చెప్పడంతో, కష్టంమీద నెలరోజుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌ను అప్పగించారు. ఇక మిగిలింది 11 లక్షల మెట్రిక్ టన్నులు అయినా.. ఇంత బియ్యం మిల్లింగ్ చేసి అప్పగించడం అసాధ్యమేనని అర్థమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరో నెల గడువు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయడమో.. లేక స్టేట్ పూల్ కింద సొంతానికి వాడుకోవడమో చేయాల్సి ఉంటుందని చెపుతున్నారు. ముందుకు కదలని గత యాసంగి సీఎంఆర్ 2021–22 యాసంగికి సంబంధించిన సీఎంఆర్ కూడా ముందుకు సాగడం లేదని అధికారవర్గాలు చెపుతున్నాయి. యాసంగిలో 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు పంపగా, సీఎంఆర్ కింద 33.93 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గతనెల 24వ తేదీ నాటికి కేవలం 9.18 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సీఎంఆర్ కింద ఇచ్చారు. అప్పటి నుంచి ఈ నెలరోజుల్లో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అదనంగా మిల్లింగ్ చేసి పౌరసరఫరాల సంస్థ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించారు. ఇంకా 20.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. దీనికోసం మరో మూడు నెలల వరకు గడువు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. 4,183 కొనుగోలు కేంద్రాలు మూసివేత 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 7,007 కొనుగోలు కేంద్రాలను తెరిచి రూ. 11,542 కోట్ల విలువైన 56.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన 4,183 కేంద్రాలను మూసివేశారు. రాష్ట్రంలో 9.95 లక్షల మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు. -
అంతా ముందస్తు ప్రణాళికతోనే! రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం
కోదాడ: రూ.35 కోట్ల కస్టంమిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మాయం చేసిన కేసులో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన మిల్లర్.. అంతా ముందస్తు ప్రణాళికతోనే పకడ్బందీగా పని కానిచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మూడు, నాలుగు నెలలుగా దశలవారీగా మిల్లు నుంచి ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. నాలుగు నెలలుగా అధికారులు మిల్లులో ధాన్యం తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. పౌరసరఫరాల అధికారులు మిల్లర్‌తో కుమ్మక్కు కాకుంటే అది సాధ్యపడదని, దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిల్లు సామగ్రి కూడా అమ్మకం?: మిల్లులో సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన మిల్లర్, లోపల ఉన్న విలువైన యంత్ర సామగ్రిని కూడా దా దాపు రూ.3 కోట్లకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మి ల్లంతా ఖాళీ అయిందని, ప్రస్తుతం ఉత్తి షెడ్డు మాత్ర మే ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. దానికే అధికారులు తాళం, సీలు వేసి నిఘా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఈ మిల్లర్ తన స్వగ్రా మం మేళ్లచెరువు మండలం రేవూరులో గతంలో ధాన్యం కోనుగోలు చేసి, రైతులను మోసగించి ఐపీ పెట్టి కాపుగల్లుకు వచ్చాడని గ్రామస్తులు వెల్లడించారు. బ్యాంక్ తనఖాలో మిల్లు ఆస్తులు! కాపుగల్లు రైస్ మిల్లర్ కోదాడలోని ఓ జాతీయ బ్యాంక్ నుంచి మిల్లు మీద దాదాపు 3 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మిల్లు ఆస్తులను మొత్తం బ్యాంక్‌కు తనఖా పెట్టాడు. దీంతో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల విభాగం అధికారులు ఆ మిల్లర్‌పై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించినా అక్కడ ఏమీ దొరకదని అంటున్నారు. మిల్లర్ కోసం గాలింపు.. రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన కేసులో మిల్లర్ ఆచూకీ కోసం కోదాడ రూరల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మిల్లులో పనిచేసే వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వారి నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. మిల్లర్ కారు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అతను ఇచ్చి న సమాచారంతో పోలీసులు హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు వెళ్లగా, పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని మిల్లర్ అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం. -
మిల్లులపై కొరడా! సీఎంఆర్ అక్రమాలపై సర్కారు నజర్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లాలోని 8 మిల్లుల్లో ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ కోసం కేటాయించిన ధాన్యం మాయమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. కొందరు మిల్లర్ల తీరు వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పుబట్టే పరిస్థితి తలెత్తుతున్న క్రమంలో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. సదరు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి, వాటి నుంచి మాయమైన రూ.138.50 కోట్ల విలువైన ధాన్యానికి సమానమైన బియ్యాన్ని వెంటనే రికవరీ చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో గత సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేశాక తిరిగి ఇచ్చిన బియ్యం, ఇంకా మిగిలిన ధాన్యం లెక్కలు తీయాలని అధికారులను పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై అప్రమత్తమైన అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులు.. మిల్లుల్లో ధాన్యం లెక్కలు తీసే పనిలో పడ్డారు. భారీగా బియ్యం పెండింగ్.. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తుంది. దాన్ని రైస్‌మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి వచి్చన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ప్రతి క్వింటాల్ ధాన్యానికి సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. ఇలా ఇచ్చే బియ్యాన్నే ‘కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)’ అంటారు. మిల్లింగ్ చేసి ఇచి్చనందుకు రైస్‌మిల్లర్లకు నిరీ్ణత మొత్తం చార్జీలను చెల్లిస్తారు. ప్రతి సీజన్లో పౌరసరఫరాల శాఖ మిల్లుల సామర్థ్యం, గతంలో సకాలంలో సీఎంఆర్ ఇచి్చన తీరు వంటి అంశాలను బేరీజు వేసుకుని.. ఆయా మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తుంది. కానీ గత రెండేళ్లుగా కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరుగుతుండగా.. గత సంవత్సరం (2021–22) వానకాలం సీజన్లో మిల్లులకు పంపిన ధాన్యాన్నే ఇంకా పూర్తిగా కస్టమ్ మిల్లింగ్ చేసి ఇవ్వలేదు. ఆ సీజన్‌కు సంబంధించి ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం ఎఫ్‌సీఐకి అందాల్సి ఉంది. అంటే లెక్కప్రకారం మిల్లుల్లో 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లుల్లోనే ఉన్నట్టు. కొన్ని జిల్లాల్లో సగమే సీఎంఆర్.. కామారెడ్డి, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, జగిత్యాల, వనపర్తి, సూర్యాపేట, సిరిసిల్ల, యాదాద్రి, నాగర్‌కర్నూల్, మంచిర్యాల జిల్లాల్లో మిల్లర్లు గతేడాది వానాకాలం సీఎంఆర్‌లో 50శాతం కూడా అప్పగించలేదు. వరిసాగు తక్కువగా ఉండే ఆదిలాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో మాత్రమే 100 శాతం, మిగతా జిల్లాల్లో 80శాతం వరకు సీఎంఆర్ పూర్తయింది. ఇక గత యాసంగికి సంబంధించి మిల్లులకు కేటాయించిన 50లక్షల టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చాలా జిల్లాల్లో మొదలేకాలేదు. ఈ ధాన్యం నుంచి 17 లక్షల టన్నులమేర పారాబాయిల్డ్ (ఉప్పుడు) పోషక బియ్యంగా మార్చేందుకు అనుమతి లభించినా అంతంత మాత్రంగానే మిల్లింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే 20 లక్షల టన్నులకుపైగా ధాన్యం మిల్లులకు చేరింది. మరో 80 లక్షల టన్నులు వచ్చే అవకాశముంది. నాణ్యమైనది అమ్ముకుని..! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉప్పుడు బియ్యం, రారైస్ విషయంలో తలెత్తిన వివాదాలను మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరు మిల్లర్లు సీఎంఆర్ కోసం వచి్చన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఇదే సమయంలో రేషన్ బియ్యాన్ని, పాత ముతక బియ్యాన్ని కొని రిసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడం పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట వంటి పలుజిల్లాల్లో సాధారణమేనని పౌరసరఫరాల శాఖ అధికారులే చెప్తున్నారు. ఈ ఆరోపణలపై గతంలో పెద్దపల్లి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్, నాగర్‌కర్నూల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పలుమిల్లులపై ఆంక్షలు విధించినా.. రాష్ట్రస్థాయిలో పైరవీలతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎఫ్‌సీఐ ఆగ్రహించి సీఎంఆర్ ఆపినా.. మిల్లర్లు ఎఫ్‌సీఐకి అప్పగించే సీఎంఆర్ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ కేంద్రం కొన్ని నెలల కింద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌సీఐ విధించిన నిబంధనలను తుంగలో తొక్కి రీసైక్లింగ్ బియ్యం, పాత బియ్యాన్ని సెంట్రల్‌పూల్ కింద ఎఫ్‌సీఐకి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. దీనితోపాటు సకాలంలో సీఎంఆర్ ఇవ్వకపోవడంపై ఆగ్రహిస్తూ.. జూలైలో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోబోమని తేలి్చచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కమలాకర్, అధికారులు పలుమార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపాక.. 45 రోజుల తర్వాత తిరిగి సీఎంఆర్‌కు అనుమతిచ్చింది. అయినా మిల్లర్లు సీఎంఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాగా సూర్యాపేట జిల్లాలో రూ.67 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వాల్సిన రెండు మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మేలురకం అమ్మేసుకోవడంతోనే! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం ఉత్పత్తిని కొందరు మిల్లర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ గతంలోనే గుర్తించింది. మిల్లులు సీఎంఆర్ కోసం అందిన ధాన్యంలో మేలురకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, నాణ్యమైన బియ్యాన్ని అధిక ధరకు అమ్ముకుంటున్నాయని తేల్చింది. తర్వాత నాసిరకం ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొని ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. ఇందువల్లే సీఎంఆర్ అప్పగించడంలో జాప్యం జరుగుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే తనిఖీలు, చర్యలకు ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నాయి. నాలుగు సార్లు గడువు పెంచినా.. వాస్తవానికి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు చేరిన 45 రోజుల్లోనే బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి అప్పగించాలి. గత ఏడాది వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు డిసెంబర్లోనే ముగిశాయి. అంటే ఈఏడాది ఫిబ్రవరి 15లోగా బియ్యాన్ని అప్పగించాలి. కానీ మిల్లులు ఇవ్వలేదు. దీంతో ఎఫ్‌సీఐ మార్చి నెలాఖరు వరకు గడువు ఇచి్చంది. అయినా మిల్లర్లు బియ్యాన్ని సకాలంలో ఇవ్వలేకపోవడంతో తర్వాత జూన్ వరకు, మళ్లీ సెపె్టంబర్ వరకు, చివరికి నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచి్చంది. అయినా ఇంకా 14 లక్షల టన్నులకుపైగా బియ్యం పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇదీ చదవండి: పసుపురంగు దేవతావస్త్రం! -
సీఎంఆర్ ధాన్యం మాయం
దురాజ్‌పల్లి (సూర్యాపేట): సూర్యాపేట జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని మిల్లర్లు అమ్మకొని సొమ్ముచేసుకున్నారు. బుధవారం జిల్లాలో కోదాడ మండలం కాపుగల్లులోని శ్రీ ఉషస్విని పార్బాయిల్డ్ మిల్లులో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)కు కేటాయించిన ధాన్యం మాయం చేసి మిల్లు యజమాని చేతులెత్తివేసిన విషయం వెలుగులోకి రాగా.. గురువారం మరో ఐదు మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేవన్న విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఈ ధాన్యం విలువ సుమారు 138.50 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. బ్లాక్ లిస్టులో 8 మిల్లులు 2020–21 రబీ, 2021–22 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో అధికారులు 72 మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయించారు. 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం సీజన్ సీఎంఆర్ సేకరణకు ప్రభుత్వం గడువు పెంచుతూ పలుమార్లు మిల్లులకు అవకాశం ఇచ్చింది. అయినా 2020–21 రబీలో 6 మిల్లులు 18,880 మెట్రిక్ టన్నుల సీఎంఆర్, 2021–22 వానాకాలంలో 38 మిల్లులు 93,141 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం బకాయి పడ్డాయి. అయితే 2020–21 రబీలో సీఎంఆర్ పెండింగ్ మిల్లులతో పాటు 2021–22 వానాకాలం ధాన్యం బకాయి ఉన్న మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టి సీఎంఆర్ సేకరించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో 8 మిల్లులను బ్లాక్‌లిస్టులో పెట్టారు. కోట్ల విలువైన ధాన్యం మాయం ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సీఎంఆర్ కోసం మిల్లులకు అందించిన రూ.138.50 కోట్ల విలువగల ధాన్యాన్ని కొందరు మిల్లర్లు అమ్ముకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలో సీఎంఆర్ ధాన్యం తీసుకున్న ఉషస్విని పార్బాయిల్డ్, లక్ష్మీసహస్ర, సంతోషిమాత, ఎంకేఆర్, వెంకటేశ్వర, భువనేశ్వరి, శివదుర్గ, సోమేశ్వర మిల్లులను సకాలంలో సీఎంఆర్ ధాన్యం ఇవ్వకపోవడంతో అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. అయితే ఇందులో శివదుర్గ, సోమేశ్వర మిల్లులు తమ సీఎంఆర్ ధాన్యం బకాయిలను చెల్లించేశాయి. ఇంకా ఆరు మిల్లులకు సంబంధించి సీఎంఆర్ పెండింగ్‌లో ఉండగా..ఈ మిల్లుల్లో సీఎంఆర్‌కు కేటాయించిన ధాన్యం నిల్వలు లేనట్టు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ.138.50 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నారని చెపుతున్నారు. రెండు మిల్లులపై కేసు.. ఉషస్విని పార్బాయిల్డ్ మిల్లు రూ.32.50 కోట్ల విలువ చేసే ధాన్యం, లక్ష్మీసహస్ర మిల్లు రూ.35 కోట్లు, సంతోషిమాత రూ.38 కోట్లు, ఎంకేఆర్ రూ. 25 కోట్లు, వెంకటేశ్వర రూ.18 కోట్లు, భువనేశ్వరి మిల్లులు రూ.2 కోట్ల విలువ చేసే ధాన్యం అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సీఎంఆర్ పెట్టని ఉషస్విని, లక్ష్మీసహస్ర మిల్లులపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన నాలుగు మిల్లుల లో ధాన్యం నిల్వలు లేకున్నా ప్రస్తుతం వారికి కేటాయించిన మేరకు సీఎంఆర్ ఇస్తున్నారని, అందుకే కమిషనర్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం సీఎంఆర్ బకాయి ధాన్యం అందజేస్తున్నా, వీరు కూడా ఏ క్షణంలోనైనా చేతులెత్తేసే అవకాశం లేకపోలేదని, ధాన్యం అమ్ముకున్న ఈ మిల్లులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని మిల్లుల్లో కూడా ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు చెపుతున్నారు. -
గత వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం వానాకాలం (2021–22) సీజన్‌కు సంబంధించి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) గడువును కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పెంచింది. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన ఈ గడువును పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు పలుమార్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖను అభ్యర్థించినా స్పందించలేదు. దీంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని మిల్లులనుంచి వానాకాలం సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ తీసుకోవడం లేదు. గత వానాకాలం సీజన్లో 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, సీఎంఆర్ కింద 47.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెంట్రల్ పూల్ ద్వారా ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ నెలాఖరు నాటికి 30 ఎల్ఎంటీ బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చారు. మరో 17 ఎల్ఎంటీ అప్పగించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, ఎఫ్‌సీఐ అధికారులతో మాట్లాడిన ఆయన, నవంబర్ వరకు గడువు ఇస్తే పూర్తిస్థాయిలో సీఎంఆర్ అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అశోక్‌కుమార్ వర్మ నవంబర్ ఆఖరు వరకు గడువు పెంచుతూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. యాసంగి ఫోర్టిఫైడ్ రైస్.. మరో 4 ఎల్ఎంటీకి కేంద్రం అనుమతి గత యాసంగిలో ఉత్పత్తి అయిన ధాన్యం నుంచి సీఎంఆర్ కింద అదనంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు తీసుకునేందుకు కూడా కేంద్రం ఒప్పుకున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గత జూలై నుంచి కురిసిన వర్షాలకు మిల్లుల్లోని ధాన్యం తడిసిపోగా, ముడి బియ్యంగా సీఎంఆర్ చేయడానికి పనికిరాని పరిస్థితి నెలకొందని తెలిపారు. అలాగే సాధారణ యాసంగి ధాన్యం సైతం ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువ వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల 8 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ పారాబాయిల్డ్ బియ్యంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాజా అనుమతితో కలిపి మొత్తం 12 ఎల్ఎంటీ పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్‌పూల్‌కు ఇస్తామని చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. -
వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీఎంఆర్ గడువు ముగిసి మూడు రోజులైనా పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. యాసంగి సీఎంఆర్‌కు సెప్టెంబర్ 30 వరకు ఉన్న గడువును నెలరోజులపాటు పొడిగించిన కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. వానకాలం సీఎంఆర్ గురించి ఊసెత్తలేదు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు, మిల్లర్లు అయోమయంలో పడిపోయారు. 60 శాతమే పూర్తయిన వానాకాలం సీఎంఆర్ వానాకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతమే పూర్తయింది. వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు సీఎంఆర్ కింద 47 ఎల్ఎంటీ మేర ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సుమారు 30 ఎల్ఎంటీ బియ్యాన్ని మాత్రమే ఎఫ్‌సీఐకి ఇచ్చినట్లు సమాచారం. అంటే 60 శాతం సీఎంఆర్ మాత్రమే పూర్తయింది. మిగతా సీఎంఆర్‌తో పాటు యాసంగి సీఎంఆర్ పూర్తి చేసేందుకు మరో నెల గడువు పెంచాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే కేంద్రం మాత్రం కేవలం యాసంగి సీఎంఆర్‌కు సంబంధించిన గడువును మాత్రం అక్టోబర్ 31 వరకు పెంచుతూ గతనెల 27న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖలో ముగిసిన వానకాలం సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ గురించి ప్రస్తావించలేదు. గత కొంతకాలంగా సీఎంఆర్ ఆలస్యం ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా సీఎంఆర్ అప్పగించడంలో ఆలస్యమవుతోంది. ఈ విషయంపై ఏడాదిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మిల్లింగ్‌లో అవకతకవలు, పీడీఎస్ బియ్యం పంపిణీ చేయకపోవడంపై ఆగ్రహించిన ఎఫ్‌సీఐ.. జూన్ 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు సీఎంఆర్ తీసుకోలేదు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. జూలై నెలాఖరు నుంచి మిల్లింగ్‌కు అవకాశం ఇచ్చినప్పటికీ వర్షాల కారణంగా మిల్లుల్లో ధాన్యం తడిసిపోవడం, మిల్లులు నిలిచిపోయినప్పుడు కూలీలు, హమాలీలు సొంతూర్లకు వెళ్లిపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో మిల్లింగ్ జరగలేదు. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు 60 శాతమే సీఎంఆర్ పూర్తయింది. ఈ విషయమై మంత్రి కమలాకర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ గత నెల చివరివారంలో సమావేశమై సీఎంఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే ధాన్యాన్ని మిల్లింగ్ కోసం ఇతర రాష్ట్రాలకు పంపాలని కూడా నిర్ణయించి, ఎఫ్‌సీఐ అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిల్లింగ్ వేగం పెరిగింది. కానీ సెపె్టంబర్ 30 తరువాత గడువు పొడిగించకపోవడంతో వానకాలం సీఎంఆర్‌పై నీలినీడలు కమ్ముకున్నట్లయింది. చదవండి: మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ -
మిల్లర్లకు ధాన్యం బంద్..!
సాక్షి, హైదరాబాద్: రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గత రెండు మూడు సీజన్లలో సకాలంలో సీఎంఆర్ ఇవ్వడంలో విఫలమైన 80% డిఫాల్టర్ మిల్లులకు భవిష్యత్తులో మిల్లింగ్ కోసం ధాన్యాన్ని ఇవ్వకూడదని నిర్ణయించింది. మిల్లర్లకు శ్రమ లేకుండా ఏటా లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరించి పంపుతున్నా, దాన్ని సకాలంలో కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేసి ఎఫ్‌సీఐకి అప్పగించడంలో వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వానాకాలం సీజన్ ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లులకు బదులు పొరుగు రాష్ట్రాల్లోని మిల్లులకు పంపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఆదివారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. మిల్లుల్లో 75 ఎల్ఎంటీల నిల్వలు ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 3 వేల రైస్‌మిల్లుల్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం నిల్వ ఉంది. గత వానాకాలం సీఎంఆర్ ఇప్పటివరకు 60 శాతం కూడా పూర్తి కాలేదు. 47 ఎల్ఎంటీ సీఎంఆర్‌కు గాను ఇప్పటివరకు 30 ఎల్ఎంటీ కూడా ఇవ్వలేదు. ఇంకా 25 ఎల్ఎంటీలకు పైగా ధాన్యం నిల్వలు మిల్లుల్లో ఉన్నాయి. అలాగే మొన్నటి యాసంగిలో సేకరించిన 50 ఎల్ఎంటీల ధాన్యం కూడా మిల్లుల్లోనే ఉంది. మరో రెండు నెలల్లో ఈ వానాకాలం ధాన్యం రాబోతోంది. ఈ సీజన్లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 1.30 కోట్ల టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా, ఇందులో కొనుగోలు కేంద్రాలకు సుమారు కోటి టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వచ్చే వానాకాలం ధాన్యాన్ని ప్రైవేట్ గోడౌన్లు వంటి మిడిల్ పాయింట్లలో నిల్వ ఉంచాలని నిర్ణయించింది. ఈ మిల్లుల నుంచి డిఫాల్టర్ మిల్లులకు ధాన్యం పంపకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. మిల్లర్ల తీరుకు తోడు కేంద్రం వైఖరితో.. రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ ధాన్యాన్ని మిల్లులకు అప్పగిస్తోంది. సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ నేరుగా మిల్లుల నుంచి బియ్యాన్ని (సీఎంఆర్) తీసుకుంటోంది. ఎఫ్‌సీఐకి బియ్యం వెళ్లిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించిన మద్దతు ధరను కేంద్రం రీయింబర్స్మెంట్ పద్ధతిలో తిరిగి చెల్లిస్తోంది. అయితే గత రెండేళ్లుగా పెరిగిన ధాన్యం దిగుబడి నేపథ్యంలో మిల్లర్లు సీఎంఆర్ విషయంలో మరింత ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు గడువు ముగిసిన తర్వాత సీఎంఆర్‌ను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. గత వర్షాకాలం సీజన్ సీఎంఆర్‌కు ఈ నెలాఖరు వరకు గడువు కాగా, ఇప్పటివరకు ఎఫ్‌సీఐ గడువు పెంచలేదు. మిల్లర్ల ఆలస్యం కారణంగా 2019–20, 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ. 700 కోట్ల భారం పౌరసరఫరాల శాఖపై పడింది. ఇలావుండగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ మొదలు బీజేపీ నేతలంతా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ సకాలంలో ఇవ్వడం లేదని, మిల్లర్ల ఆగడాలకు సహకరిస్తోందని విమర్శిస్తూ జాతీయ స్థాయిలో అప్రదిష్టపాలు చేస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో సీఎమ్మార్ అందించడంలో మిల్లర్లు ఆలస్యం చేయడం, కేంద్రం సీఎంఆర్ గడువు పెంచే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీరియస్ రాష్ట్రంలోని మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరు, తద్వారా ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంటున్న అంశంపై మంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని పంపించి, మిల్లింగ్ చేయించి ఎఫ్‌సీఐకి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎఫ్‌సీఐ నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. సోమవారం జరిగే పౌరసరఫరాల శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ప్రపంచంలో తొలి 22 టీబీ హార్డ్ డ్రైవ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్డ్ డిస్క్ డ్రైవ్స్ తయారీ దిగ్గజం వెస్టర్న్ డిజిటల్.. అల్ట్రాస్టార్ డీసీ హెచ్‌సీ570 పేరుతో భారత్‌లో 22 టీబీ కన్వెన్షనల్ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ (సీఎంఆర్) హార్డ్ డ్రైవ్‌ను ప్రవేశపెట్టింది. ఆప్టినండ్ టెక్నాలజీతో ఇది తయారైంది. ఈ స్థాయి సామర్థ్యం గల సీఎంఆర్ హార్డ్ డ్రైవ్‌ను ప్రపంచంలో తొలిసారిగా తయారు చేసిన ఘనత తమదేనని కంపెనీ తెలిపింది. క్లౌడ్ సేవల కంపెనీలు, పెద్ద సంస్థలకు వ్యయ భారం తగ్గుతుందని వివరించింది. -
రైస్ రాకెట్.. రైట్ రైట్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ‘రైస్ మాఫియా’మరింతగా రెచ్చిపోతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి (సీఎంఆర్) బియ్యాన్ని భారత ఆహా ర సంస్థ (ఎఫ్‌సీఐ)కి పంపాల్సిన మిల్లర్లు.. అడ్డ గోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రైతుల నుంచి వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ఆ మంచి బియ్యాన్ని అధిక ధరలకు బయట అమ్ముకుంటున్నారు. ఆ స్థానంలో బయటకొన్న నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తూ, రేషన్ బి య్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ.. ఎఫ్‌సీఐకి అంటగడుతున్నారు. సివిల్ సప్లైస్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బందికి ముడుపులు ఇస్తూ దందా నడిపిస్తున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ఇటీవల పోటెత్తిన ధాన్యం లారీలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చెక్‌పోస్టులున్నా రవాణా కొనసాగుతుండటాన్ని బట్టి ఆయా శాఖల అధికారుల సహకారమున్నట్టు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 2,200 రైస్ మిల్లులు ఉండగా.. అందులో వెయ్యి వరకు పారాబాయిల్డ్ మిల్లులు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జనవరి 24నాటికి రాష్ట్ర ప్రభుత్వం 69.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం మిల్లర్లకు అప్పగించింది. దీనికి సంబంధించి మిల్లర్లు 46.28 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలి. కానీ ఇప్పటివరకు 65శాతం మేర కూడా బియ్యాన్ని ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌తోపాటు పాలమూ రులో ఈ పరిస్థితి ఉంది. మిల్లర్లకు చేసిన కేటాయింపులకు, సీఎంఆర్ లెక్కలకు ప్రతి సీజన్లోనూ తేడాలు ఉండటం ఈ అక్రమాలకు నిదర్శనమని ఆరోపణలు వస్తున్నాయి. క్వింటాల్ రూ.1,400కే కొని.. రాష్ట్రంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్విం టాల్ ధాన్యం ఏ–గ్రేడ్ రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర పలుకుతోం ది. అదే కర్ణాటకలో క్వింటాల్‌కు రూ.1,400లే పలుకుతోంది. దీంతో కొందరు మిల్లర్లు ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ వేబిల్లులతో కర్ణాటక నుంచి నాసిరకం ధాన్యాన్ని తీసుకొచ్చి, సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. మరోవైపు రేషన్ డీలర్లు, వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కోటాకు మళ్లిస్తున్నారు. చెక్‌పోస్టులను తప్పించుకుని.. కర్ణాటక సరిహద్దుల్లో తెలంగాణ పరిధిలోని నారాయణపేట జిల్లాలో, గద్వాల జిల్లాలో ఏడు చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. పలు చెక్‌పోస్టుల వద్ద రాత్రివేళ నిఘా అంతంత మాత్రంగానే ఉంటోందని.. సిబ్బంది ఒక్కో ధాన్యం లారీకి రూ.2 వేలు చొప్పున తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ఈ చెక్‌పోస్టులే గాకుండా ఇతర దారుల ద్వారా కూడా ధాన్యం లారీలు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఎన్ని లారీలు పట్టుబడ్డా.. ♦ఈ నెల 11న కర్ణాటక నుంచి హైదరాబాద్ లోని మిల్లులకు ధాన్యం తరలిస్తున్న 2 లారీల ను కాన్కుర్తిలోని చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నారు. ♦ఈ నెల 15న నారాయణపేట జిల్లా మక్తల్‌లో ధాన్యం లోడ్‌తో వస్తున్న 16 లారీలను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటకలోని సిర్పూర్, యాద్గిర్, మాన్విల నుంచి ఎలాంటి బిల్లులు లే కుండా హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లోని మి ల్లులకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ♦ఈ నెల 19న కర్ణాటకలోని మాన్వి నుంచి మిర్యాలగూడ, హైదరాబాద్‌లకు ధాన్యం లోడ్‌తో వస్తున్న నాలుగు లారీలను గద్వాల జిల్లా నందిన్నె చెక్‌పోస్టు వద్ద.. మరో రెండు లారీలను ఎర్రవెల్లి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. -
దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఇంకా ప్రారంభమే కాలేదు. అయినప్పటికీ 5జీ స్మార్ట్ఫోన్ల షిప్ మెంట్లు 2021 మూడవ త్రైమాసికంలో ఊపందుకున్నాయి. సీఎమ్ఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్ ప్రకారం మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 5జీ స్మార్ట్ఫోన్లు 22 శాతం ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్ లభించడమే అని సీఎమ్ఆర్ తెలిపింది. వన్ ప్లస్, ఒప్పో, రియల్ మీ, శామ్ సంగ్, వివో వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల 5జీ ఎక్కువగా అమ్ముడయ్యాయి అని పేర్కొంది. "ఈ ఐదు బ్రాండ్లు కలిసి క్యూ3 2021 సమయంలో 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,227 కోట్ల)కు పైగా 5జీ స్మార్ట్ఫోన్లను రవాణా చేశాయి" అని సీఎమ్ఆర్ లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు షిప్రా సిన్హా చెప్పారు. 5జీ స్మార్ట్ఫోన్లు కాకుండా ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా భారీగా డిమాండ్ ఉంది. అందుకే, భారతదేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్ పరంగా 47 శాతం త్రైమాసీకంలో(క్యూవోక్యూ) వృద్ధి చెందింది. ఉదాహరణకు.. షియోమీ 23 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానాన్ని నిలుపుకుంది. శామ్ సంగ్ 18 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంటే, ఆ తర్వాత వివో, రియల్ మీ ఒక్కొక్కటి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొదటి ఐదు స్థానాల్లో లేనప్పటికీ, యాపిల్ షిప్ మెంట్ పరంగా 32 శాతం వృద్ధి నమోదు చేసింది. సూపర్ ప్రీమియం(రూ.50,000- 1,00,000) విభాగంలో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 11తో సహా ఇతర ఐఫోన్లు భారీగా అమ్ముడయ్యాయి. (చదవండి: మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్!) -
సీఎంఆర్‌లో సిరిసిల్లకు ప్రత్యేకం!
ధాన్యం కేటాయింపుల్లో అవకతవకలు.. రీసైక్లింగ్ దందాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిరునామా నిలుస్తోంది..! ఓ వైపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక కార్యాచరణతో శాఖను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. పైరవీలు, అవినీతి వ్యవహారాలతో అక్రమ దందాకు అడ్డుకట్టపడడం లేదు. ఖరీఫ్ ధాన్యాన్ని అలాట్ చేయడంలోనే మిల్లర్లతో కమిట్మెంట్ జరిగింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా రైస్‌మిల్లులున్న కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి పోను ప్రత్యేకంగా రాజన్నసిరిసిల్ల జిల్లాలో ధాన్యం కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది..! సాక్షిప్రతినిధి కరీంనగర్/కరీంనగర్‌సిటీ: కాలం కలిసొచ్చి ఖరీఫ్ సీజన్లో రైతులకు ఆశించిన మేర దిగుబడి వచ్చింది. రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో ఉమ్మడి జిల్లా ధాన్యం కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం సాధించింది. అయితే.. కొనుగోలు చేసిన «వడ్లను మరాడించి తిరిగి ప్రభుత్వానికి బియ్యంగా ఇవ్వడానికి ఆయా జిల్లాలో నిబంధనల ప్రకారం రైస్‌మిల్లులకు కేటాయించాల్సి ఉంటుంది. పౌరసరఫరాల శాఖ నుంచి జీవో 21 ప్రకారం రా రైస్ 2 టన్నుల కెపాసిటీ మిల్లుకు 100 లారీలు, బాయిల్డ్ రైస్ 4 టన్ను కెపాసిటీ మిల్లుకు 300 లారీల చొప్పున మిల్లు కెపాసిటీని బట్టి కేటాయించాలి. కరీంనగర్ జిల్లాలో 140 రైస్ మిల్లులున్నాయి. అందులో 80 బాయిల్డ్, 60 రారైస్ మిల్లులున్నాయి. పెద్దపల్లి జిల్లాలో 140 బాయిల్డ్ రైస్‌మిల్లులున్నాయి. అయితే.. మిగిలిన జిల్లాలకు పోల్చుకుంటే ఈ రెండు జిల్లాలోనే మొత్తంగా 280 రైస్‌మిల్లులు అధికంగా ఉన్నాయి. కానీ.. వరిధాన్యం మాత్రం తక్కువగా వచ్చింది. కరీంనగర్లో 1.40 లక్షల టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 60 వేల టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయగా ఈ రెండు జిల్లాలోని 280 మిల్లులకు నిబంధనల ప్రకారం కేటాయించారు. ఇందులో 220 బాయిల్డ్ మిల్లులు కావడంతో 300 లారీల చొప్పున కేటాయించాల్సి ఉన్నా 150 నుంచి 200 లారీలే కేటాయించారని తెలిసింది. మిల్లులు ఎక్కువగా ఉండి వరిధాన్యం తక్కువగా ఉండడంతో సీఎంఆర్ సకాలంలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ శాఖ కమిషనరేట్ ఆదేశాల మేరకు జిల్లాల పరిధిలో కేటాయింపుల కన్నా అధికంగా ఉన్న ధాన్యాన్ని ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించాలని ఆదేశాలిచ్చారు. జగిత్యాలలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశారు. ఇక్కడి 40 మిల్లులకు కేటాయింపులకు పోను 70 వేల మెట్రిక్ టన్నులను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించారు. దీంతోపాటు భూపాలపల్లి, నిర్మల్ నుంచి కరీంనగర్, పెద్దపల్లి మిల్లులుకు వరిధాన్యం కేటాయించారు. అయితే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 40 మిల్లులకు కేటాయించారు. సిరిసిల్లలో 2 టన్నుల కెపాసిటీ మిల్లులే అధికంగా ఉన్నాయి. దీనికితోడు అక్కడ 50 వేల మెట్రిక్ టన్నులు కేటాయింపులకు సరిపోతాయని అంచనా..! అయితే.. జీవో 21 నిబంధనలు తోసిరాజని ఒక్కో మిల్లుకు రెట్టింపు స్థాయిలో వరిధాన్యం కేటాయించడంపై మిల్లర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సిరిసిల్లలోని సంఘ నేత ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల పేరుతో కొందరు అధికారులతో మిలాఖతై మిలర్లకు అధిక ధాన్యం కేటాయింపులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రారైస్ మిల్లుకు 100 లారీలకు బదులు 350 లారీల వరకు, బాయిల్డ్ రైస్ 300కు మించి 500 లారీల వరకు కేటాయించినట్లు సమాచారం. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూనే ఇతర జిల్లాలకు కేటాయింపు విషయంలో పక్షపాత వైఖరి చూపడంలో ఆంతర్యమేమిటనేది ప్రశ్నార్థకం! ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కేటాయించిన ఈ వడ్లను మరాడించి సీఎంఆర్ రూపంలో ఫిబ్రవరి చివరికల్లా తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ప్రత్యేక కేటాయింపుల జిల్లాలో మరో 5 నెలలైనా సీఎంఆర్ పెట్టే పరిస్థితులు లేవని తెలుస్తోంది. అందుకోసం మిల్లర్లు అక్రమంగా రీసైక్లింగ్ దందాను ఎంచుకుంటున్నారు. ప్రభుత్వం అప్పజెప్పిన వడ్లను అమ్ముకుంటూ.. ప్రజల వద్ద రేషన్ బియ్యాన్ని 16 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి ధాన్యంగా అప్పగిస్తున్నారు. ఇటీవల ఓ మిల్లులో రీసైక్లింగ్ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇటీవలే సిరిసిల్ల దగ్గరలోని గూడెం గోడౌన్లో 500 లారీల రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ విషయంలో స్వయంగా పౌరసరఫరాల శాఖ కమిషనర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన సంబంధిత అధికారిని, మిల్లర్లను, సంఘనేతను పిలిపించుకుని తీవ్రంగా మందలించి బ్లాక్‌లిస్టులో పెడతానని హెచ్చరించినట్లు సమాచారం. అయితే.. ఈ కేటాయింపుల విషయంలో కమిషనర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి..!! నిబంధనల ప్రకారమే... – పద్మ, డీసీఎస్వో, రాజన్న సిరిసిల్ల జిల్లా నిబంధనల ప్రకారమే ధాన్యం కేటాయింపులు జరిపాం. అధికంగా ఇవ్వడమంటూ ఏమీ లేదు. ఇతర జిల్లాల మిల్లులకు కేటాయించాలనీ లేదు. మిల్లింగ్ చేసుకోగలుగుతామనే జిల్లాలోని మిల్లులకు తగిన కేటాయింపులు చేశాం. -
రైస్మిల్లర్లపై ఒత్తిడి
► సెప్టెంబర్ 15లోగా కస్టం మిల్లింగ్ పూర్తి చేయాలి ► ఇప్పటి వరకు 60,872 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అప్పగించిన మిల్లర్లు ఇందూరు(నిజామాబాద్ అర్బన్): రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 55వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది జిల్లా యంత్రాంగం. అయితే ఈ మొత్తం ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ (సీఎంఆర్) చేసివ్వడానికి 65 రైస్ మిల్లర్లకు బాధ్యతలు అప్పగించారు. ప్రతిఏడాది ధాన్యాన్ని తీసుకున్న రైస్‌మిల్లర్లు జిల్లా యంత్రాంగం విధించిన గడువు తేదీలోగా ఇవ్వకపోవడం సర్వసాధారణంగా మారింది. ధాన్యాన్ని ఎగ్గొట్టి పక్కదారి పట్టించిన దాఖలాలు ఉండడంతో ఆ రైస్‌మిల్లర్లకు జరిమానాలు, కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అలా జరగకుండా ఉండేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 65 రైస్‌మిల్లర్లకు కలిపి ధాన్యాన్ని కస్టం మిల్లింగ్ చేసి 2 లక్షల 41,400 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సెప్టెంబర్ 15వ తేదీలోగా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. నేటి వరకు కేవలం 60,872 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (25శాతం) మాత్రమే రైస్‌మిల్లర్లు ఇచ్చారు. ఇంకా లక్షా 80వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. అయితే సీఎంఆర్ చేసివ్వడానికి విధించిన గడువుకు ఇంకా 14 వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో సీఎంఆర్‌ను వేగవంతం చేయడానికి అధికారులు రైస్మిల్లర్లపై ఒత్తిడిని తీవ్రతరం చేశారు. వారానికి ఇంత మొత్తం ధాన్యం సీఎంఆర్ చేసి ఇవ్వాలని రైస్ మిల్లర్ల వారీగా లక్ష్యాలను విధించారు. ప్రతివారం రైస్‌మిల్లర్లు ఇస్తున్న ధాన్యంపై సివిల్ సప్లయి అధికారులే కాకుండా జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి కూడా సమీక్షించనున్నారు. వారానికి ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తిచేయని రైస్ మిల్లర్లపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేయడం, లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సీఎంఆర్ ఇవ్వడంలో వెనుకబడి ఉన్న రైస్మిల్లర్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రైతులకు రూ. 536 కోట్లు చెల్లింపులు జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3 లక్షల 55వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అయితే ఈ మొత్తం ధాన్యం విలువ రూ. 536 కోట్లు కాగా నేటి వరకు రూ. 530 కోట్లు రైతులకు చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ. 6 కోట్ల వరకు రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా వీటిని కూడా రెండు మూడు రోజుల్లో చెల్లించడానికి చర్యలు చేపట్టారు. -
రూ.115 కోట్లు నొక్కేశారు !
గన్నీల పేరిట రైస్ మిల్లర్ల చిలక్కొట్టుడు 2009 నుంచి పౌరసరఫరాల శాఖకు 2.84 కోట్ల గన్నీ బ్యాగుల బాకీ మిల్లర్లకు తొత్తులుగా మారిన పౌరసరఫరాల శాఖ అధికారులు ముక్కుపిండి వసూలు చేయాలని కమిషనర్ నిర్ణయం రేపు హైదరాబాద్‌లో డీఎం, డీఎస్వోలతో సీవీ ఆనంద్ సమీక్ష సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : సకాలంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) అందించకుండా ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టిన రైస్ మిల్లర్లు గన్నీ సంచుల విషయంలోనూ కక్కుర్తి ప్రదర్శిస్తున్నారు. గన్నీ బ్యాగే కదా!...అదేం భాగ్యం అనుకుంటున్నారా?....ఒకటి, రెండు బ్యాగులు కాదు సుమా...ఏకంగా 2.84 కోట్లకుపైగా గన్నీ బ్యాగులను మిల్లర్లు నొక్కేశారు. వీటి ఖరీదెంతో తెలుసా....రూ.115 కోట్లు. అక్షరాల నూటా పదిహేను కోట్ల రూపాయలు. 2009 నుంచి నేటి వరకు దాదాపు ఏడేళ్లుగా పౌరసరఫరాల సంస్థకు గన్నీలను అప్పగించకుండా తమ జేబులో వేసుకుంటున్నారు. ప్రతి ఏటా సీజన్ అయిపోయిన వెంటనే గన్నీ బ్యాగులను స్వాధీనపర్చుకోవాల్సిన పౌరసరఫరాల సంస్థ అధికారులు ఆ విషయాన్నే మర్చిపోయారు. మిల్లర్లకు తొత్తులుగా మారారు. వాళ్లిచ్చే అమ్యామ్యాలకు కక్కుర్తి పడ్డారు. అంతిమంగా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చే పనికి ఒడిగట్టారు. అడుగడుగునా అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖను ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్న ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టికి గన్నీల వ్యవహారం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లు ఎన్నీ గన్నీ సంచులు బకాయి పడ్డారు? వాటి విలువ ఎంత? అని లెక్కలేసే పనిలో పడ్డారు. అధికారవర్గాల సమాచారం ప్రకారం...రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.45 కోట్ల గన్నీ సంచులు మిల్లర్లు పౌరసరఫరాల సంస్థకు బకాయిపడ్డట్లు తేలింది. వాటి విలువ ఏకంగా రూ.203 కోట్లుగా నిర్దారించారు. అందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.115.99 కోట్లు ఉండటం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రతి సీజన్లో రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించిన అనంతరం వాటిని కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా మార్చేందుకు మిల్లర్లకు అప్పగిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఖరీఫ్, రబీసహా ప్రతి సీజన్లో మిల్లర్లు అడిగనన్ని గన్నీ బ్యాగులను అందిస్తున్నారు. వాస్తవానికి ఏ మిల్లర్‌కు ఎంత ధాన్యం అప్పగిస్తామో...అందుకు అవసరమైన గన్నీ బ్యాగులను మాత్రమే సరఫరా చేయాలి. అందులో సగం కొత్తవి, సగం పాతవి అందజేయాలి. కానీ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు మిల్లర్లంటే వల్లమాలిన ప్రేమ. మిల్లర్లు ఎన్ని గన్నీ బ్యాగులు అడిగితే అన్ని ఇచ్చేస్తున్నారు. పైగా ఇష్టమైన మిల్లర్లు కదా! అని దాదాపు ప్రతి ఏటా ఎక్కువ శాతం కొత్త గన్నీ బ్యాగులే సరఫరా చేస్తున్నారు. 2009 నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని మిల్లర్లకు 2,84,78,892 గన్నీ బ్యాగులను సరఫరా చేసినట్లు లెక్క తేలింది. వీటిలో 1,52,79,139 గన్నీ బ్యాగులు కొత్తవే. ఒక్కో కొత్త గన్నీ బ్యాగు ధర రూ.50 లు. ఈ లెక్కన వీటి ఖరీదు రూ.76.40 కోట్లు. ఇవిపోగా మిగిలిన 1,31,99,753 గన్నీ బ్యాగులు ఒకసారి వాడినవి. వీటికి సంబంధించి ఒక్కో బ్యాగు ఖరీదు రూ.30లుగా లెక్కకట్టిన అధికారులు రూ.39.60 కోట్లుగా నిర్దారించారు. పాత, కొత్త గన్నీ బ్యాగుల ఖరీదు రూ.115.99 కోట్లుగా లెక్కించారు. ఇంత పెద్ద మొత్తంలో గన్నీ బ్యాగులు బకాయి పడినా పౌరసరఫరాల సంస్థ అధికారులు ఇప్పటి వరకు ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్ధకంగా మారింది. రైస్ మిల్లర్లంతా అంటకాగుతూ వారిచ్చే అమ్యామ్యాలకు ఆశపడి సంస్థకు రావాల్సిన బకాయిలను వసూలు చేయకుండా మిన్నుకుండిపోయారని తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పౌరసరఫరాల సంస్థ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం హైదరాబాద్‌లో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు, డీఎస్వోలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. గన్నీ బ్యాగుల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టడంతోపాటు ఆ మొత్తాన్ని ఏ విధంగా వసూలు చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. ముగిసిన సీఎమ్మార్ గడువు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైస్ మిల్లర్లకు ఇచ్చిన కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) గడువు ముగిసింది. జిల్లాలోని మిల్లర్లకు 2015–16 సంవత్సరానికి గాను 604679 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంస్థ అప్పగించింది. వాటిని మరగా ఆడించి 407297 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(67 శాతం) సంస్థకు అందించాల్సి ఉంది. అయితే సీఎవ్మూర్ అప్పగించేందుకు నెలల తరబడి మొండికేసిన మిల్లర్లు సీవీ ఆనంద్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టాక కొరడా ఝుళిపించారు. దీంతో ఇప్పటి వరకు 405350 మెట్రిక్ టన్నుల (99.52 శాతం) బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అప్పగించారు. ఇంకా 1947 మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. మిల్లర్లకు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్నందున కమిషనర్ సకాలంలో సీఎమ్మార్ అప్పగించిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
క్యూ3లో మొబైల్స్ విక్రయాలు @ 7.5 కోట్లు!
సీఎంఆర్ అంచనా న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ3) మొబైల్ హ్యాండ్సెట్స్ విక్రయాలు 7.5 కోట్ల యూనిట్లుగా ఉండొచ్చని రీసెర్చ్ సంస్థ సీఎంఆర్ అంచనా వేసింది. పండుగల సీజన్, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, సానుకూల రుతుపవనాలు, ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల అమలు వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు దోహదపడొచ్చని తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్-జూన్ క్వార్టర్ (క్యూ2)లో మొబైల్ ఫోన్ల విక్రయాలు 6.59 కోట్ల యూనిట్లుగా ఉన్నాయని తెలిపింది. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 24% వృద్ధి నమోదయ్యిందని పేర్కొంది. ఇందులో ఫీచర్ ఫోన్ల వాటా 3.73 కోట్లుగా, స్మార్ట్‌ఫోన్స్ వాటా 2.87 కోట్లుగా ఉందని తెలిపింది. శాంసంగ్ టాప్: క్యూ2లో మొబైల్ హ్యాండ్సెట్స్ మార్కెట్లో 25.5% వాటాతో శాంసంగ్ అగ్రస్థానంలో ఉంది. దీని వాటా స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో 29.7%, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 22.3% ఉందని సీఎంఆర్ పేర్కొంది. ఇక 13.6% మార్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ రెండో స్థానంలో ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్స్ విభాగంలో 14.8% వాటాను, ఫీచర్ ఫోన్స్ విభాగంలో 12.6 శాతం వాటాను ఆక్రమించింది. మైక్రోమ్యాక్స్ తర్వాతి స్థానాల్లో ఇంటెక్స్ (10.4 %), కార్బన్ (9.6 శాతం), లావా (8 శాతం) ఉన్నాయి. పీసీ విక్రయాలు 2% డౌన్ న్యూఢిల్లీ: దేశంలో పీసీ విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2.2 శాతం తగ్గుదలతో 21.4 లక్షల యూనిట్లకు క్షీణించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో పీసీ అమ్మకాలు 21.9 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదిక ప్రకారం.. జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్-జూన్ క్వార్టర్లో పీసీ విక్రయాలు 7.2 శాతంమేర ఎగశాయి. కాగా, పీసీ మార్కెట్లో హెచ్‌పీ అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 28.4 శాతంగా ఉంది. ఇక దీని తర్వాత స్థానాల్లో డెల్ (22.2 శాతం), లెనొవొ (16.1 శాతం), ఏసర్ (14 శాతం) ఉన్నాయి.