సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మిల్లులకు ఇచ్చిన వడ్లను సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మరాడించి ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకున్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఆరెపల్లెలో ఏఆర్‌ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.27.76కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
ఏఆర్‌ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 2021–22 యాసంగిలో 5,989 మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలంలో 5,437 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 11,426 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇప్పటివరకు 1,400 ఎంటీల ధాన్యం మరాడించి ఇవ్వగా ఇంకా 10,026 ఎంటీల ధాన్యం నిల్వ ఉండాలి. ఈ నెల 1న మిల్లులో విజిలెన్స్ దాడులు చేయగా 504 ఎంటీల ధాన్యం మాత్రమే ఉంది. యాసంగి ధాన్యం 4,135 మెట్రిక్ టన్నులు, వానాకాలం 5,387 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు.
పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఏఆర్‌ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఆనంద్‌దాస్ రాంమోహన్‌తోపాటు తిరుమల, అనురాధపై కేసు నమోదు చేశారు. యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అధికారులు డబ్బులను రికవరీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మిల్లు యజమానులు, కుటుంబసభ్యుల మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు.
జిల్లా వ్యాప్తంగా దాడులు
జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు విజిలెన్స్ దాడులు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. మరిన్ని మిల్లుల అక్రమాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2021–22 యాసంగిలో 3,61,437 మెట్రిక్ టన్నుల ధాన్యం 133 మిల్లులకు కేటాయించారు. 2,44,943 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, 1,88,151 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. ఇంకా 63 మిల్లుల నుంచి 56,792 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. క్వింటాల్ వడ్లకు రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ అయితే 68 కేజీలు సీఎంఆర్ చేసి అందించాలి.
2022–23 వానాకాలంలో 3,62,193 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 146 మిల్లులకు అప్పగించారు. సీఎంఆర్ కింద 2,42,669 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా మిల్లర్లు 8,903 టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,33,766 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు తనిఖీలకు రాకముందే రేషన్ బియ్యం కొనుగోలు చేసి తెప్పించేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో ధాన్యం మాయమవుతున్నా జిల్లా అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment