తనిఖీలు చాలు.. వచ్చేయండి!
అధికారులకు బాస్‌ల ఫోన్?
రైస్‌మిల్లుల్లో ఆగిన తనిఖీలు
మధ్యలోనే వెళ్లిపోయిన వైనం
ఇక నోటీసులిచ్చి ఏం ప్రయోజనం?
జమ్మికుంట :ధాన్యం రైతులకు మద్దతు ధర చెల్లించని మిల్లర్లకు నోటీసులిచ్చి.. తనిఖీలు మొదలుపెట్టిన విజిలెన్స్ అధికారులకు ఏమైందో ఏమో గానీ... కాసేపటికే ఆపేశారు. అధికారుల నోటీసులతో తమకు మద్దతు ధర దక్కుతుందని ఆశించిన రైతన్నలకు దీంతో నిరాశే మిగిలింది. ఉన్నతాధికారుల ఫోన్‌తో అధికారులు ఆగమేఘాలమీద వెనుదిరగగా నోటీసులు ఇక చెత్తబుట్టలకే పరిమితం కానున్నాయి. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మిల్లర్లు కూడా కొనుగోలు చేశారు. మద్దతు ధర గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,345 ఉండగా వ్యాపారులు రూ.1,150 నుంచి రూ.1,200 దాకా, మగ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,310 ఉండగా మిల్లర్లు రూ.850 నుంచి రూ.950 మాత్రమే చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్లో సివిల్ సప్లయ్స్, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టగా... తమకు మద్దతు ధర దక్కడం లేదని చాలా మంది రైతులు వెల్లడించారు. రైతులు చెప్పిన వివరాల మేరకు రూపొందించిన నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు జమ్మికుంటలోని ఏడు మిల్లులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జిల్లా విజిలెన్స్ అధికారులు మూడు మిల్లుల్లో సోదాలు మొదలుపెట్టారు. ఒక్కో మిల్లులో వేలాది క్వింటాళ్ల నిల్వలుండగా తనిఖీ చేసేందుకు ఒక రోజు సమయం పట్టే అవకాశముంది. కానీ, అధికారులు కేవలం రెండు గంటల్లోనే మూడు మిల్లులు తనిఖీ చేసి అర్ధంతరంగా వెనుదిరిగారు.
తనిఖీలు మొదలుపెట్టగానే మిల్లుల్లో ఉన్న అక్రమ నిల్వలు, నేరుగా కొనుగోళ్లు చేపట్టిన వివరాలు, రికార్డుల్లోకి ఎక్కని ధాన్యం, రైతుల వద్ద తక్కువ ధరతో సేకరించిన ధాన్యం గుట్టు బయటపడుతుందనే భయంతో కొందరు వ్యాపారులు ఓ ముఖ్యనాయకుడితో తనిఖీలు ఆపేలా ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సదరు నాయకుడినుంచి ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లగా.. మిల్లుల్లో అన్నీ సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు తయారు చేయాలని వారు తనిఖీ అధికారులకు ఫోన్‌లోనే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం మూడు మిల్లుల్లోనే రెండు గంటల్లో తనిఖీలు చేపట్టి వెనుదిరిగారనే ప్రచారం జరుగుతోంది. అధికారుల తనిఖీలతో తమకు మద్దతు ధర చెల్లిస్తారని ఆశించిన రైతులు తీవ్ర నిరాశ చెందారు. అసలు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మిల్లర్లకు నోటీసులు ఎందుకు జారీ చేశారు? వీటి వెనుక మర్మమేమిటి? తనిఖీలు లేకుండా అక్రమ నిల్వలను ఎలా గుర్తిస్తారు? తనిఖీలు అర్ధంతరంగా నిలిపేసి ఎందుకు వెనుదిరిగినట్లు? అనేది అంతుచిక్కడం లేదు.
మిల్లర్లతో మిలాఖత్?
Published Fri, Jun 20 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM
Advertisement
Advertisement