టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014–15లో రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లించింది. ఇక్కడ సగటున ఒక రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు.
చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా కొనుగోలు చేశారన్నది ఎవరికైనా కలిగే సందేహం. అంటే ఇక్కడ దళారులు, మిల్లర్లు కొందరు రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం.
2015–16లో సగటున ఒక రైతు నుంచి 24 టన్నుల ధాన్యం సేకరించినట్టు చూపారు. ఇక్కడ కూడా మద్దతు ధర మధ్యవర్తులే కాజేశారని తెలుస్తోంది కదా... దీనిని బట్టి టీడీపీ హయాంలో ధాన్యం దోపిడీ ఎంతగా సాగిందో అర్థమవుతోంది. కానీ నాడు కళ్లకు గంతలు కట్టుకున్న ఈనాడుకు ఇవేవీ కనిపించలేదు. ఇప్పుడు పారదర్శకంగా సేకరణ జరుగుతున్నా... లేనిపోని ఏడుపుగొట్టు రాతలు.
సాక్షి, అమరావతి: రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టడం తెలుగుదేశం సంస్కృతి. వారి హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరించేది. కొనేదంతా మిల్లర్లు, దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200ల వరకు తగ్గించి ఇచ్చేవారు.
ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. కానీ, సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రతి సీజన్‌లోనూ ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట కొనుగోలు చేపట్టడంతో వాస్తవ రైతుకు పూర్తి మద్దతు ధర దక్కుతోంది. దీంతో తమ దళారుల దోపిడీ వ్యవస్థను నాశనం చేశారన్న ఆక్రోశం రామోజీ రాతల్లో నిలువెల్లా కనిపిస్తోంది.
వాస్తవానికి రైతుకు మద్దతు ధరతో పాటు గన్నీ, లేబర్, రవాణా చార్జీలను సొంతంగా పెట్టుకున్న రైతుకు టన్నుకు రూ.2,523ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంట విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బయట మార్కెట్‌లోని వ్యాపారుల్లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. చేసేదేమీ లేక వారు సైతం ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మించి చెల్లిస్తూ కల్లాల్లోంచే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది.
అందువల్ల రైతులు మంచి రేటు వస్తున్న చోటే ధాన్యం అమ్ముకుంటున్నారు. అంత మాత్రాన ప్రభుత్వ సేకరణ తగ్గిందనడం ఎంతవరకు సమంజసం. ఈ వాస్తవాన్ని మరుగునపెట్టి రామోజీ రైతులపై కపట ప్రేమను ఒలకబోయడం చూస్తే జాలేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువలైన 2.65 కోట్ల టన్నులను ధాన్యాన్ని మాత్రమే సేకరించింది.
కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచింది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 20లక్షల మంది అదనంగా రైతులు సంపూర్ణ మద్దతు ధరను అందుకున్నారు.
ఆశాజనకంగా దిగుబడులు
గత ఖరీఫ్‌లో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది చివరల్లో మిచాంగ్ తుఫాన్ కొంత ఇబ్బంది పెట్టినా ఎకరాకు అత్యధికంగా 40–42 బస్తాల దిగుబడి వచ్చింది. జనవరి పండుగ సీజన్ కావడం, పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు బియ్యం అవసరం పెరగడంతో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు మించి(సాధారణ రకానికి రూ.100కు పైగా ఫైన్ వెరైటీలకు రూ.200–500లకు పైగా) చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం.
ఇదే క్రమంలో ఆర్బీకే ద్వారా 29.58లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ లెక్కన 44.58 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి బయటకు వెళ్లిపోయింది. అంటే దాదాపు ఈఖరీఫ్‌లో పంట మొత్తం విజయవంతంగా కొనుగోలు చేశారు. ఇంతటి ఫలితాన్ని రామోజీ కలలోకూడా ఊహించి ఉండరు. కానీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు అడ్డగోలు అభాండాలు వేశారు.
కేంద్ర నిబంధనలు రామోజీకి తెలియవా...
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కట్లేదని గుండెలు బాదుకున్న రామోజీకి.. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు విధిస్తుందన్న విషయం తెలీదా? ఆ ప్రకారం తేమ 17శాతం మించితే కొనుగోలుకు ఎక్కడైనా అభ్యంతరం చెబుతారు కదా? ఇదే ఆసరాగా చేసుకుని టీడీపీ హయాంలో బస్తాలకు బస్తాలు అదనంగా రైతు నుంచి దోచేసినప్పుడు ఈనాడు గొంతెందుకు మూగబోయిందన్నది ఇక్కడి ప్రశ్న.
అధికారంలో మనవాడు లేకుంటే దుమ్మెత్తి పోయడమే వారికి తెలిసిన న్యాయం. కానీ, సీఎం జగన్ రైతుకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేసి డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. ప్రకృతి వైప రీత్యాల సమయంలోనూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు.
♦ ఇక దుడ్డు రకాలు(జయ రకం ధాన్యం) కేరళకు ఎగుమతి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకుంది. అందువల్ల గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపారు. గతేడాది తుఫాన్ కంటే ముందే అక్కడ కోతలు పూర్తవడం, ప్రభుత్వం కంటే ముందుగా బయట వ్యాపారులు వచ్చి మంచి రేటు ఇచ్చి పంట కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి సేకరించే అవకాశం రాలేదు. దీనిని కూడా ఈనాడు వక్రీకరించింది.
♦ ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వమే కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తోంది. అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని బఫర్ గొడౌన్లు, మండల నిల్వ కేంద్రాలకు తరలించాలి. వీటిన్నింటికీ ప్రతి స్టేజీలో వేర్వేరు రవాణా వ్యవస్థలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంతాల్లో సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించింది. దానిపై దీనిని ఈనాడు ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగిస్తున్నారంటూ అబద్దపు ప్రచారం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment