టీడీపీ హయాంలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడేలు
గంటలు, రోజుల తరబడి రైతులకు, పరిశ్రమలకు కోతలు
అప్పుడు కళ్లు మూసుకుని ఎన్నికల వేళ కుళ్లు రాతలేలా..?
ఈదురు గాలులు, సాంకేతిక సమస్యల వల్ల ఎక్కడో అంతరాయం
నిరంతర విద్యుత్తు సరఫరా ఇస్తున్నా ఈనాడు ‘చీకటి’ కథనం
సాక్షి, అమరావతి : ‘‘పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తున్నాం. వారంతపు సెలవుతో కలిపి వారంలో మూడు రోజులు పరిశ్రమలకు విద్యుత్ ఉండదు.’’ ‘‘గ్రామాల్లో ఎనిమిది గంటలు..పట్టణాల్లో ఆరు గంటలు..నగరాల్లో నాలుగు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నాం.’’‘‘వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వడం కష్టం..నాలుగు గంటలు రెండు విడతల్లో ఇస్తాం..క్రాప్ హాలిడే తీసుకుంటే ఇంకా మంచిది.’’ ...ఇదీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి..బాబు హయాంలో రాష్ట్రాన్ని చీకటి మయం చేశారు.
రైతులు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లోనే పడిగాపులు కాసేవారు. ఆ సమయంలో పాముల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు. గ్రామాల్లో పగలూ రాత్రీ గంటల తరబడి కోతలు విధించేవారు. కొన్ని సీజన్ల పంటలకు విద్యుత్ సరఫరా లేక రైతులు క్రాప్ హాలిడే పేరుతో పంటలు వేయకుండా చేలను బీడు భూములుగా వదిలేసేలా అప్పటి పాలకులు ప్రోత్సహించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది.
రైతులకు ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్‌ను అందిస్తోంది. భారీ విద్యుత్ డిమాండ్, తీవ్ర విద్యుత్ కొరత ఉండే వేసవిలోనూ ఎలాంటి కోతలు లేకుండా, లోడ్ రిలీఫ్ అవసరం రాకుండా, క్రాప్ హాలిడే విధించకుండా, పవర్ హాలిడే పెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తోంది. కానీ దీనిని చూసి బాబు తోక పత్రికైన ఈనాడు కుళ్లుకుంటోంది.
ఇలాంటి పాలనకు ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టనున్నారని గ్రహించి, తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించాలని చూస్తోంది. అందులో భాగంగానే ‘కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్?’ అంటూ ఈనాడు మంగళవారం ఓ అబద్దాన్ని అచ్చేసింది. రామోజీ రాస్తున్న రాతల్లో అన్నీ కోతలేనని, వాస్తవాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది.
♦ శ్రీకాకుళం జిల్లా గార మండలం జల్లువలస, జఫ్రా బాద్, రాఘవాపురం, వాదాడ, తోనంగి శాలి హుండం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం 05:34 నుండి సాయంత్రం 04:15 గంటల వరకు కరెంటు లేదు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ రోజు బలమైన ఈదురు గాలులు వచ్చిన కారణంగా కళింగపట్నం, చల్లపేట, అతులుగు సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ ఫీడర్స్‌పై చెట్టు కొమ్మలు పడి ట్రిప్ అయి కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
♦ రాజమహేంద్రవరం జిల్లా గండేపల్లి మండలం, కె. సూరపాలెం గ్రామీణ ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 07:15 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరం తాడితోట సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8.55 నుంచి సాయంత్రం 04:15 గంటల వరకు సరఫరా నిలిచింది అన్నది కూడా వాస్తవం కాదు. ఈదురు గాలుల వల్ల 33/11 కేవీ గండేపల్లి సబ్ స్టేషన్‌లో 11కేవీ సూరంపాలెం ఇండస్ట్రియల్ పరిధిలో చెట్లు కొమ్మలు, వెదురు చెట్లు లైన్ మీద పడి బ్రేక్ డౌన్ అయ్యింది.
కొమ్మలు, చెట్లు తొలగించి మధ్యాహ్నం 1 గంటకు సరఫరా పునరుద్ధరించారు. అలాగే 33/11కేవీ తాడితోట సబ్ స్టేషన్ పరిధిలోగల 11కేవీ ఇన్నిస్ పేట ఫీడర్ పైన నక్కలగూడెం వద్ద గల వీటి కాలేజ్ దగ్గర చెట్టు కొమ్మలు పడటంతో సరఫరాలో అంతరాయం కలిగింది. తెగిన విద్యుత్ లైన్ పున
రుద్ధరించి 09:59 గంటలకు సరఫరా ఇచ్చారు.
♦పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, అలవద్ద, కురుపాం, మండలం భర్తంగి గ్రామాల పరిధిలో ఉదయం 09:24 గంటలకు 33/11కేవీ గుమ్మలక్ష్మీపురంలోని 11కేవీ గుమ్మలక్ష్మీపురం–ఆర్కే బాయ్ ఫీడర్ పరిధిలో అల్లవరం గ్రామం వద్ద చెట్లు కొమ్మలు లైను మీద పడి విద్యుత్ అంతరాయం కలిగింది. వాటిని తొలగించి 09:48 గంటలకు సరఫరా యధావిధిగా కొనసాగించారు.
♦ కడపలోని 220 కెవి సబ్‌స్టేషన్‌లో బ్యాటరీల మరమ్మతుకు గురై సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు.
♦ కర్నూలు సర్కిల్ పరిధిలోని గుండ్లకొండ సబ్‌స్టేషన్, అనంతపురం సర్కిల్ పరిధిలోని రాయదుర్గం, తిరుపతి సర్కిల్ పరిధిలోని పూతలపట్టు సబ్ స్టేషన్‌లలో బ్రేక్‌డౌన్ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో లైటింగ్ సప్లైలో మాత్రం ఎటువంటి అంతరాయం లేదు.
Comments
Please login to add a commentAdd a comment