పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్‌’ X ఉన్నతాధికారులు | Growing differences in the Civil Supplies organization | Sakshi
Sakshi News home page

పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్‌’ X ఉన్నతాధికారులు

Published Sat, Sep 9 2023 4:27 AM | Last Updated on Sat, Sep 9 2023 8:08 AM

Growing differences in the Civil Supplies organization - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్‌’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్‌’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్‌ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్లపై విజిలెన్స్‌ దాడులు,  రేషన్‌ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. 

మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్‌ దాడులు
రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్‌ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్‌’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు.

అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్‌’ తనిఖీలు చేశారని  సంస్థ అధికారులు కౌంటర్‌ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్‌ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు విజిలెన్స్‌ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

సీఆర్‌ఓ భవనానికి బ్రేక్‌
సికింద్రాబాద్‌లోని చీఫ్‌ రేషనింగ్‌ అధికారి (సీఆర్‌ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్‌’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు.

తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్‌ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్‌లో పనిచేసిన ఓ రిటైర్డ్‌ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్‌’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు.

11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు
కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్‌’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. 

ఔట్‌సోర్సింగ్‌ నియామకాలకు నో
రాష్ట్రంలో ఏ కార్పొరేషన్‌లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్‌’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్‌ అడ్వయిజర్‌ తరహాలో జిల్లాకో లీగల్‌ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది.

మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్‌’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

వసూళ్ల ఆరోపణలు
ఇదే సమయంలో ‘సార్‌’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్‌ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్‌ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్‌ బియ్యాన్ని సీఎంఆర్‌ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్‌ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement