Ration stores
-
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్‌మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్‌టాపిక్‌గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్‌మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్‌లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్‌ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లు
సాక్షి, అమరావతి: రేషన్ దుకాణాల్లో తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ఈ–పాస్ యంత్రాలను వినియోగిస్తున్నట్లే ఇకపై మండల స్థాయి స్టాక్ పాయింట్లలోనూ (ఎంఎల్ఎస్) అవకతవకలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లను తప్పనిసరి చేస్తూ పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద 50 కిలోల బస్తా నుంచి 1–2 కిలోల బియ్యం తీసి, డీలర్లకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. గతంలో స్టాక్ పాయింట్లలో అక్రమాలకు అలవాటుపడ్డ కొందరు సిబ్బంది ఈ యంత్రాలను వినియోగించకుండా పక్కన పడేశారు. డీలర్ల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఇకపై స్టాక్పాయింట్లలో ఈ–వేయింగ్ యంత్రాల వినియోగాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. - శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరంలో 15, విశాఖపట్నంలో 30, తూర్పు గోదావరిలో 21, పశ్చిమ గోదావరిలో 14, కృష్ణాలో 17, గుంటూరులో 20, ప్రకాశంలో 19, నెల్లూరులో 15, చిత్తూరులో 28, వైఎస్సార్ కడపలో 19, అనంతపురంలో 24, కర్నూలు జిల్లాలో 17 మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. - 257 స్టాక్ పాయింట్ల నుంచి 29 వేల రేషన్ దుకాణాలకు ప్రతినెలా 2.60 లక్షల టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇందులో క్వింటాల్‌కు 1–2 కిలోల చొప్పున బియ్యం తగ్గుతున్నట్లు ఆరోపణలున్నాయి. - స్టాక్ పాయింట్లలో పనిచేసే కొందరు సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. - ఇకపై స్టాక్ పాయింట్లలో తప్పనిసరిగా ఈ–వేయింగ్ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేసి, డీలర్లకు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. - తూకాల్లో మోసాలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి లబ్ధిదారులకు 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. - ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. - ఏప్రిల్ నుంచి జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున ఈ విధానాన్ని అమలు చేసి, ప్రతినెలా కొన్ని చొప్పున ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
చంద్రన్న మాల్స్ స్వాహా
సాక్షి, అమరావతి: భయం గానీ, పక్షపాతం గానీ,రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు స్వప్ర యోజనాలు, స్వార్థమే పరమావధిగా భావిస్తున్నారు. పవిత్రమైన ప్రమాణానికి పాతరేస్తున్నారు. ప్రజలు ఓట్లేసి, గెలిపించి, కట్టబెట్టిన అధికారాన్ని సొంత లాభం కోసం ఎంతగానో వాడుకుంటున్నారు. తన కుటుంబ వ్యాపార సంస్థకు జనం సొమ్మును దోచిపెట్టేందుకు ప్రభుత్వ పథకాన్ని అనువుగా మార్చేసుకుంటున్నారు. ‘చంద్రన్న మాల్స్’ చంద్రబాబు కుటుంబ వ్యాపారానికి లబ్ధి చేకూర్చే దుకాణాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబ వ్యాపార సంస్థ ‘హెరిటేజ్’ దినదిన ప్రవర్థమానంగా ఎదిగిపోతోంది. గత నాలుగేళ్లలో హెరిటేజ్‌కు ఎన్నివిధాలుగా లబ్ధి జరిగిందో తెలియందేమీ కాదు. చంద్రన్న మాల్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరో దోపిడీకి తెరతీసింది. అన్ని కిరాణా, ఫ్యాన్సీ సరుకులు విక్రయించే విధంగా చౌక దుకాణాలను చంద్రన్న మాల్స్‌గా మారుస్తున్నామంటూ సీఎం చంద్రబాబు వాటి నిర్వహణ బాధ్యతలను పరోక్షంగా తన సొంత కంపెనీకి ధారాదత్తం చేస్తున్నారు. హెరిటేజ్ గ్రూపు భాగస్వామిగా ఉన్న ఫ్యూచర్ రిటైల్ గ్రూపునకు కీలకమైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో చంద్రన్న మాల్స్‌కు సరుకుల సరఫరా, నిర్వహణ బాధ్యతలను కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై ఈ మూడు జిల్లాల్లోని చౌక దుకాణాల నిర్వహణ ఫ్యూచర్ రిటైల్ అంటే హెరిటేజ్ చేతుల్లోకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల్లో 6,806 చౌక దుకాణాల పరిధిలో 37,19,206 రేషన్ కార్డులున్న కుటుంబాలు ఉన్నాయి. తొలి విడతలో భాగంగా ఈ మూడు జిల్లాల్లో 96 రేషన్ షాపులను చంద్రన్న మాల్స్‌గా మార్చనున్నారు. ఈ మాల్స్‌లో ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే సరుకులతోపాటు అన్ని రకాల కిరాణా, ఫ్యాన్సీ సరుకులను విక్రయించన్నారు. ఈ మాల్స్‌కు సరుకులను ఫ్యూచర్ గ్రూప్ పంపిణీ చేయనుంది. హెరిటేజ్‌తో బంధమిది హెరిటేజ్ గ్రూపు పలు రాష్ట్రాల్లో హెరిటేజ్ ఫ్రెష్ పేరుతో రిటైల్ వ్యాపారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 124 ఔట్లెట్లతో ఏటా రూ.583 కోట్ల వ్యాపారం చేసేది. 2016 నవంబర్‌లో ఈ రిటైల్ వ్యాపారం మొత్తాన్ని వ్యూహాత్మకంగా ఫ్యూచర్ రిటైల్‌కు హెరిటేజ్ సంస్థ విక్రయించింది. ఈ విక్రయం ద్వారా నగదు తీసుకోకుండా ఫ్యూచర్ రిటైల్‌లో భాగస్వామ్య వాటాలను మాత్రమే తీసుకుంది. ఇలా మొత్తం వ్యాపారాన్ని విలీనం చేసినందుకు గాను ఫ్యూచర్ రిటైల్‌లో 3.56 శాతానికి సమానమైన 1.78 కోట్ల విలువైన షేర్లు హెరిటేజ్ ఫుడ్స్‌కు దక్కాయి. అప్పట్లో ఈ ఒప్పందం విలువ రూ.295 కోట్లు అని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ఆ సమయంలో ఫ్యూచర్ రిటైల్ షేరు విలువ కేవలం రూ.154 ఉండగా, ఇప్పుడది ఏకంగా రూ.586.75కు ఎగబాకింది. దీంతో ఫ్యూచర్ రిటైల్‌లో హెరిటేజ్ ఫుడ్ వాటా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.1,047.19 కోట్లకు చేరింది. తన కుటుంబానికి వాటాలున్న కంపెనీకి చౌక దుకాణాల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరల బాదుడు షురూ బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే చంద్రన్న మాల్స్‌లో 40 శాతం తక్కువ ధరలకే సరుకులు విక్రయిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. గతేడాది డిసెంబర్ 12న విజయవాడలో చంద్రన్న మాల్స్‌ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో బాధ్యతలను తీసుకున్న రిలయన్స్ రిటైల్ ఇప్పటికే 56 చంద్రన్న మాల్స్‌ను ప్రారంభించింది. చంద్రన్న మాల్స్‌లో ఉన్న ధరలను చూసి వినియోగదారులు షాక్ తింటున్నారు. బయటి మార్కెటే నయమంటూ సరుకులు కొనకుండా వెనక్కి వెళ్లిపోతున్నారు. దీంతో అమ్మకాలు అనుకున్న స్థాయిలో సాగడం లేదని చంద్రన్న మాల్స్‌కు చెందిన డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రంలోని 29,995 రేషన్ షాపులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. -
రేషన్ దుకాణాల్లోనూ పింఛన్ల పంపిణీ: సీఎం చంద్రబాబు
కర్నూలు: రేషన్ల షాపుల్లోనూ పింఛన్లు పంపిణీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇంటి వద్దకే వచ్చి పంచాయతీ సిబ్బంది పింఛన్లు అందజేస్తారన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కోటేకల్లు గ్రామంలో శనివారం ఆయన నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. సభ ప్రారంభానికి ముందు మొక్కలు నాటి జేసీబీ ద్వారా చెరువుల్లో పూడికతీత కార్యక్రమం చేపట్టారు. కర్నూలు జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి మంత్రి దేవినేని ఉమ, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్, ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు బి.వి.జయనాగేశ్వరరెడ్డి, బి.సి.జనార్దన్‌రెడ్డి, కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ తదితరులు పాల్గొన్నారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదని సీఎం అన్నారు. అయితే ఈ సందర్భంగా ఆస్పరి మండలం బిలేకల్లుకు చెందిన వీరన్న అనే వ్యక్తి సభ మధ్యలో లేచి మా ఊర్లో అడుగడుగునా బెల్టు దుకాణాలు ఉన్నాయని తెలపగా...బెల్టు దుకాణాలు పగులగొట్టాలని సీఎం పిలుపునిచ్చారు. -
‘ఆహార భద్రత’పై నిఘా
ముంబై: రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం సమర్థంగా అమలుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆహార ధాన్యాల పంపిణీ, సరుకు రేషన్ దుకాణాలకు వెళుతుందా? దారి మళ్లుతుందా? తదితరలపై నిఘా వేసి ఉంచేందుకు విజిలెన్స్ కమిటీని నియమించామని ఆహార, పౌర సరఫరా విభాగ కార్యదర్శి దీపక్ కపూర్ మంగళవారం మీడియాకు తెలిపారు. క్రమం తప్పకుండా ఆహర సామగ్రిని సరఫరా చేస్తున్న రేషన్ దుకాణాల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే తహసీల్దార్లు, సబ్ డివిజినల్ అధికారులను ఆదేశించామని ఆయన వివరించారు. ఇప్పటివరకైతే విజిలెన్స్ కమిటీ కాగితాలపైనే ఉందన్నారు. అయితే బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడంలో వీటి పాత్ర కీలకమవుతుందని తెలిపారు. పోలీసు పటేల్‌లు, సర్పంచ్‌లు, మహిళలు, యువత సభ్యులుగా ఉన్న విజిలెన్స్ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ విషయాన్ని తహసీల్దార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళతారని చెప్పారు. ఆహార భద్రత పథకం కింద రాష్ట్రానికి ప్రతియేటా 44 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల అవసరముందన్నారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలు, ఆంత్యోదయ లాంటి వివిధ వర్గాలకు చెందిన ఏడు కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని వివరించారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలుచేసేందుకు మరో ఆరువేల రేషన్ దుకాణాలు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇప్పటికే 300 దుకాణాలు కేటాయించామన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 235 గోదాంలను నిర్మించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయిచిందన్నారు. ఇప్పటికే 32 గోదాంల నిర్మాణం పూర్తయిందని, ఈ ఏడాది ఆఖరువరకు మరో 143 గోదాంలు అందుబాటులోకి వస్తాయని కపూర్ వెల్లడించారు. మిగిలన వాటిని వచ్చే ఏడాదిలో నిర్మిస్తారని వివరించారు. కాగా, మోసపూరిత చర్యలకు పాల్పడిన రేషన్ దుకాణ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం సెక్షన్ 3, సెక్షన్ 7ల కింద జరిమానా విధిస్తామని చెప్పారు. సాధ్యమైనంత మేర ఆహార భద్రత పథకం లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.