ముంబై: రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం సమర్థంగా అమలుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆహార ధాన్యాల పంపిణీ, సరుకు రేషన్ దుకాణాలకు వెళుతుందా? దారి మళ్లుతుందా? తదితరలపై నిఘా వేసి ఉంచేందుకు విజిలెన్స్ కమిటీని నియమించామని ఆహార, పౌర సరఫరా విభాగ కార్యదర్శి దీపక్ కపూర్ మంగళవారం మీడియాకు తెలిపారు.
క్రమం తప్పకుండా ఆహర సామగ్రిని సరఫరా చేస్తున్న రేషన్ దుకాణాల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే తహసీల్దార్‌లు, సబ్ డివిజినల్ అధికారులను ఆదేశించామని ఆయన వివరించారు. ఇప్పటివరకైతే విజిలెన్స్ కమిటీ కాగితాలపైనే ఉందన్నారు. అయితే బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడంలో వీటి పాత్ర కీలకమవుతుందని తెలిపారు.
పోలీసు పటేల్‌లు, సర్పంచ్‌లు, మహిళలు, యువత సభ్యులుగా ఉన్న విజిలెన్స్ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ విషయాన్ని తహసీల్దార్‌లు కలెక్టర్‌ల దృష్టికి తీసుకెళతారని చెప్పారు. ఆహార భద్రత పథకం కింద రాష్ట్రానికి ప్రతియేటా 44 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల అవసరముందన్నారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలు, ఆంత్యోదయ లాంటి వివిధ వర్గాలకు చెందిన ఏడు కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని వివరించారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలుచేసేందుకు మరో ఆరువేల రేషన్ దుకాణాలు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇప్పటికే 300 దుకాణాలు కేటాయించామన్నారు.
ఈ పథకం కింద రాష్ట్రంలో 235 గోదాంలను నిర్మించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయిచిందన్నారు. ఇప్పటికే 32 గోదాంల నిర్మాణం పూర్తయిందని, ఈ ఏడాది ఆఖరువరకు మరో 143 గోదాంలు అందుబాటులోకి వస్తాయని కపూర్ వెల్లడించారు. మిగిలన వాటిని వచ్చే ఏడాదిలో నిర్మిస్తారని వివరించారు. కాగా, మోసపూరిత చర్యలకు పాల్పడిన రేషన్ దుకాణ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం సెక్షన్ 3, సెక్షన్ 7ల కింద జరిమానా విధిస్తామని చెప్పారు. సాధ్యమైనంత మేర ఆహార భద్రత పథకం లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
‘ఆహార భద్రత’పై నిఘా
Published Tue, Feb 11 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement