Black Marketing
-
నిర్మాణ రంగం కుప్పకూలింది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం కుప్పకూలిపోయిందని, ఇందుకు ప్రధాన కారణం బ్లాక్ మార్కెటింగ్, నిర్వహణ లోపాలు, అక్రమ కార్యకలాపాలే కారణమని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. ఇసుక ఉచితం ప్రకటనలకే పరిమితమని, ధరలు మాత్రం భారీగా పెరిగాయని పేర్కొంది. ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలి వెళ్లడం, అక్రమ విక్రయాల కారణంగా డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయలేకపోతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సుమారు 40 లక్షల మంది కార్మికులకు జీవనోపాధి కల్పించే నిర్మాణ రంగం కుప్పకూలిపోవడానికి ఇసుక ధరలు భారీగా పెరగడంతో పాటు లభ్యత లేకపోవడమేనని కారణమని తేల్చారు. ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి నిర్మాణ రంగంలో జీఎస్టీ ద్వారా రూ.1,260 కోట్ల మేర ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.955 కోట్లు మా త్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదించారు. రూ.300 కోట్లకుపైగా ఆదాయం పడిపోవడానికి కారణం నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోవడమేనని, ఇసుక లభ్యత లేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. గత ఆర్నెళ్లలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకకు డిమాండ్ ఉండగా కే వలం 32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి నట్లు తెలిపారు. ఇసుక రీచ్‌లను దక్కించుకునేందుకు తక్కువ ధరకు కోట్ చేసిన ప్రైవేట్ ఏజెన్సీలు అక్రమాలకు తెరతీశాయన్నారు. గత 30 రోజుల్లో సగటున రోజుకు 26, 000 మెట్రిక్ టన్నుల చొప్పున 5.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇసుక సరఫరా చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి రోజుకు 80,000 నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉండగా ఇసుక కొరతకు గత సర్కారు విధానాలే కారణమంటూ ప్రభుత్వ పెద్దలు నిందలు మోపడంపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం పెరుగుదల ఇసుక కొరతతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతిందని, నిర్మాణ రంగం కార్యకలాపాలు తగ్గిపోయాయని ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని అధికారుల నివేదికలు, గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2019–20లో జీఎస్టీ రూపంలో రూ.974 కోట్లు ఆదాయం రాగా 2023–24 నాటికి రూ.2,083 కోట్లకు పెరిగిందని, అంటే సగటు వార్షిక వృద్ధి రేటు 21 శాతం మేర పెరిగిందని అధికారులు తెలిపారు. -
ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఎగబాకడం, రైతుల నుండి పెరిగిన డిమాండ్, తగ్గిన సరఫరా కారణంగా దేశంలో ఎక్కువైన ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కేంద్రం దృష్టిసారించింది. రానున్న ఖరీఫ్ సీజన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు దిగింది. బ్లాక్‌మార్కెటింగ్ అరికట్టేందుకు కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 370 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. తెలంగాణలో నాలుగు యూరియా డైవర్షన్ యూనిట్లలో, ఆంధ్రప్రదేశ్‌లో ఒక మిశ్రమ యూనిట్లో తనిఖీలు చేశాయి. మరో వారం పాటు ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయి. తనిఖీల సందర్భంగా గుజరాత్, కేరళ, హరియాణా, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏకంగా 70,000 బస్తాల నకిలీ యూరియాను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా 30 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా, 112 మిశ్రమ తయారీదారులను డీఆథరైజ్ చేసినట్లు వెల్లడించింది. దాదాపు రూ. 2,500 ఖరీదు చేసే 45 కిలోల యూరియా బస్తాను రైతులకు వ్యవసాయ అవసరాలకు రాయితీపై రూ.266కే కేంద్రం అందిస్తోంది. అయితే డిమాండ్‌కు సరిపడా యూరియా సరఫరా లేకపోవడంతో సబ్సిడీ ధరకు యూరియాను పొందలేకపోతున్న రైతన్నలు మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
రెండో రోజూ విజిలెన్స్ దాడులు
సాక్షి, అమరావతి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నెపంతో వంటనూనెలు, నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజూ కొరడా ఝుళిపించింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 126 చోట్ల తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫో ర్స్మెంట్ సోమవారం మరో 142 చోట్ల తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో పరిమితికి మించి నిల్వలు కలిగి ఉన్న నలుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రెండు రోజుల్లో ఈ చట్టం కింద మొత్తం 20 కేసులు నమోదు చేసినట్లయ్యింది. అదే విధంగా తూనికలు కొలతల చట్టానికి విరుద్ధంగా గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై 73 కేసులు నమోదు చేశారు. ఈ చట్టం కింద రెండు రోజుల్లో 127 కేసులు నమోదు చేశారు. ఆహార భద్రతా చట్టం కింద నాణ్యత సరిగాలేకపోవడంతో 15 కేసులు నమోదు చేశారు. దీంతో రెండు రోజుల్లో ఈ కేసుల సఖ్య 27కి చేరింది. మొత్తం మీద రెండు రోజుల్లో వంట నూనెలు, పప్పుధాన్యాల నిల్వలపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో మొత్తం 174 కేసులను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసింది. ధరలు పెంచి విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
కరోనాను క్యాష్ చేసుకుంటున్న మెడికల్ మాఫియా!
సాక్షి, అమరావతిబ్యూరో: ఒకవైపు కరోనా మహమ్మారి కృష్ణా,గుంటూరు జిల్లాలను గడగడలాడిస్తుంటే.. మరోవైపు బాధితుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా పేరుతో రూ.వేలల్లో దండుకుంటున్నారు. ఆయా మాత్రలు, సూది మందులను తయారీ కంపెనీల నుంచి మెడికల్ ఏజెన్సీల పేర్లతో తీసుకుని మందుల దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇటీవల ఈ అక్రమ దందాల వ్యవహారాలు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని ముఠాలు కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగానే సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ నుంచి దిగుమతి.. ♦ రసాయన సంస్థలు, కొన్ని కార్పొరేటు ఆస్పత్రులు మహారాష్ట్ర, గుజరాత్‌లోని భావనగర్, జునాగఢ్ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించుకుంటున్నాయి. ♦ అక్కడి కిందిస్థాయిఉద్యోగుల అత్యాశ కారణంగా అవి అక్రమార్కులకు చేరుతున్నాయి. ♦ 10 కిలోల ఆక్సిజన్ సిలిండర్ రూ.4,500 అసలు ధర కాగా.. కిందిస్థాయి ఉద్యోగులు రూ.5,500 నుంచి రూ.6,500 వరకూ విక్రయిస్తున్నారు. ♦ వీటిని తీసుకున్న అక్రమార్కులు రూ.10 వేల నుంచి రూ.11 వేలకు అమ్మేస్తున్నారు. ♦ రోజూ ఒక్కో కంపెనీకి నాలుగైదు లారీల ఆక్సిజన్ సిలిండర్ల లోడ్లు వస్తుండటం, వాటి లెక్కలు చూసేవారు కిందిస్థాయి ఉద్యోగులకు బాధ్యత అప్పగించడంతో ఇదంతా జరుగుతోందని సమాచారం. ♦ అయితే ఇలా చేస్తున్న వారికి ఒక్కరికి కూడా ఆక్సిజన్ సిలిండర్లు విక్రయించేందుకు ప్రభుత్వ అనుమతి లేదని తెలుస్తోంది. ఆస్పత్రుల వద్ద గుట్టుచప్పుడు కాకుండా.. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెమ్డిసివెర్ తదితర మందులు తక్షణం అందజేస్తామంటూ కొందరు దుకాణాల నిర్వాహకులు, ఏజెన్సీల ప్రతినిధులు ప్రభుత్వ, కార్పొరేట్ కోవిడ్ ఆస్పత్రుల సమీపంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఢిల్లీ, ముంబైల నుంచి తెప్పించామని.. అందుకే బిల్లులు ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. ఒక్కో డోసు అమ్మినందుకు వీరికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు వరకూ లాభం వçస్తుంది. ఫ్యాబిఫ్లూ మందుల్లో మాత్రం రూ.వందల్లో గిట్టుబాటు అవుతుందని ఔషధ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా మందులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు.. టొసిలీజుమాబ్ ఇంజెక్షన్ అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులకు వినియోగిస్తుంటారు. వీటి ఖరీదెక్కువు. విదేశాల నుంచి ముంబైకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వీటిని దిగుమతి చేసుకుంటారు. ప్రతి ఇంజెక్షన్ వివరాలు మా శాఖ వద్ద ఉంటాయి. మెడికల్ ఏజెన్సీలకు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఎనెన్ని ఇంజక్షన్లు సరఫరా చేశారు.. ఎన్నింటిని వినియోగించారు అన్న దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఎవరైనా వీటిని అధిక ధరకు విక్రయిస్తుంటే ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం ఇస్తే అక్రమార్కుల ఆట కట్టిస్తాం. – రాజాభాను, అసిస్టెంట్ డైరెక్టర్,ఔషధ నియంత్రణ శాఖ, కృష్ణా జిల్లా బ్లాక్ మార్కెట్లో ఇలా.. ♦ విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. అయితే అతనికి వైరస్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో బంధువులు అతన్ని గుంటూరు జిల్లాలో ఓ ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రిలో చేర్పించారు. ♦ చికిత్సలో భాగంగా వైద్యులు ఆ రోగికి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే టొసిలీజుమాబ్ 400 మిల్లీగ్రాముల ఇంజెక్షన్‌ను రాసిస్తూ.. అది తమ వద్ద లేదని, బయట నుంచి తీసుకురావాలని సూచించారు. ♦ రోగి బంధువులు గుంటూరు నగరంలోని ఒక దుకాణంలో ఈ మందును తీసుకొచ్చారు. ♦ అయితే దీని ఎంఆర్పీ ధర రూ.35 వేలుగా ఉండగా ఆ దుకాణంలో రూ.90 వేలకు కొనుగోలు చేశారని తెలిసింది. ♦ అయితే సాధారణంగా ఈ మందు ప్రభుత్వ అనుమతలు పొందిన డ్రగ్ డీలర్లు.. స్పెషలిస్ట్ వైద్యుల ప్రిస్కిప్షన్ ఉంటేనే రోగులకు విక్రయిస్తారు. అయితే రోగుల అవసరాన్ని బట్టి వీటిని అధిక ధరలకు మాత్రం విక్రయించరాదు. -
ఇదో రకం దందా!
సంస్థాన్‌నారాయణపురం మండలం పల్లగట్టుతండా పంచాయతీకి చెందిన మేగావత్ దేవా చౌటుప్పల్‌లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ లబ్ధిదారుడు. గ్యాస్ అయిపోవడంతో బుకింగ్ చేశాడు. తండాకు రోడ్డు బాగున్నా గ్యాస్ బండి వెళ్లడం లేదు. దీంతో దేవా తన తండా సమీపంలోని జనగాంలో ఓ దళారికి ఖాళీ సిలిండర్, గ్యాస్‌బుక్ ఇచ్చి వెళ్లాడు. సదరు దళారి అదనంగా కొంత మొత్తం తీసుకొని దేవాకు సిలిండర్ సమకూర్చాడు. ఈ పరిస్థితి దేవా ఒక్కడిదే కాదు.. మారుమూల గ్రామాలు, తండాలకు గ్యాస్ వాహనాలు వెళ్లపోవడంతో ఎంతోమంది లబ్ధిదారులపై అదనపు భారం పడుతుంది. సంస్థాన్ నారాయణపురం : జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాలకు వివిధ కారణాలతో వంట గ్యాస్ వాహనాలు వెళ్లడం లేదు. దళారులు ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని దందాకు తెరలేపుతున్నారు. ఏజెన్సీకి వెళ్లి గ్యాస్ తెచ్చుకోలేని లబ్ధిదారులకు తామే బుకింగ్ జేసి అందజేస్తున్నారు. అందుకు గాను ఒక్కో సిలిండర్‌పై రూ.100నుంచి రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారు. దందా సాగుతుందిలా.. తండాలు, మారుమూల గ్రామాలకు రోడ్లు లేవని, ఉన్న చోట అధ్వానంగా ఉన్నాయని తదితర కారణాలు సాకుగా చూపి గ్యాస్ సరఫరా చేయడం లేదు. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెన్సీకి వెళ్లి తెచ్చుకోవాలంటే రోజంతా పడుతుండడం, అంతా వ్యవసాయ కూలీలు కావడంతోపనులు వదులుకొని పట్టణం పోలేని పరిస్థితి ఉంది. దీన్ని సమీప గ్రామాల్లోని దళారులు అవకాశంగా మల్చుకుంటున్నారు. తామే రీఫిల్ సిలిండర్లు సమకూరుస్తామని లబ్ధిదారుల నుంచి గ్యాస్ బుక్‌లు సేకరిస్తారు.వారి సెల్ఫోన్ల నుంచే బుకింగ్ చేస్తారు. గ్యాస్ ఏజెన్సీ వాహనం సిబ్బందితో కుమ్మక్కై వారికి ప్రతి నెలా కొంత ముట్టజెబుతారు. దీంతో సదరు వాహన సిబ్బంది రీఫిల్ గ్యాస్ సిలిండర్లను దళారి ఇంటి వద్ద వేసి వెళ్తారు. బుకింగ్ చేసి ఏజెన్సీ నుంచి తెప్పించి ఇచ్చినందుకు గాను దళారి ఒక్కో సిలిండర్‌పై రూ.100నుంచి రూ.200 వరకు అదనంగా తీసుకుంటాడు. ఇక గ్యాస్ కనెక్షన్ లేని వారికి దళారులు తమ వద్ద అక్రమంగా ఉన్న సిలిండర్‌ను రీఫిల్ చేయించి రూ.200 నుంచి రూ.250 వరకు అదనంగా వసూలు చేస్తారు. కొంతమంది దళారులు అమాయక లబ్ధిదారులు ఉంటే వారి ఏటీఎం కార్డులను తీసుకొని సిలిండర్‌పై వచ్చే సబ్సిడీని నొక్కేస్తున్నారు. చిన్నచిన్న హోటళ్ల నిర్వాహకులు కూడా కమర్షియల్ దళారుల వద్దనే కొనుగోలు చేస్తారు. ఈ విధంగా ఒక్కో దళారి నెలకు నెలకు 60నుంచి 70 వరకు సిలిండర్లు రీఫిల్ చేయిస్తూ రూ.15వేల వరకు సంపాదిస్తున్నారు. వానాకాలం, చలికాలం సంపాదన ఎక్కువగా ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు. నిబంధనలు గాలికి జిల్లాలో వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన 19 ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉనాయి. ఏజెన్సీలు నింబంధనల ప్రకారం గ్యాస్ బుకింగ్ చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లకు సిలిండర్ తీసుకెళ్లి ఇవ్వాలి. రవాణా ఖర్చులు తీసుకుంటున్నా అందించడం లేదు. గ్యాస్ ఏజెన్సీలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల తండాలు, మారుమూల ప్రాంతాల్లో లబ్ధిదారులకు అదనపు బారం తప్పడం లేదు.గ్యాస్ కనెక్షన్లు ఇలా.. జిల్లాలో వివిధ గ్యాస్ కంపెనీలకు చెందిన 19 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 2,31,283 కనెక్షన్లు ఉన్నా యి. ఇందులో సీఎస్ఆర్ 23,566, డొమస్టిక్ 1,43,645, కమర్షియల్ 2288, దీపం 48,950, ఉజ్వల పథకం కనెక్ష న్లు 12,384 ఉన్నాయి. -
బ్లాక్ మార్కెట్లో ‘ కోవిడ్’ డ్రగ్స్.. అన్నదమ్ముల అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ బారినపడిన రోగుల చికిత్సకు ఉపకరించే యాంటీ వైరల్ ఔషధాలను బ్లాక్ మార్కెట్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. అన్నదమ్ములైన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, వారి నుంచి రెమిడెసివీర్ ఇంజెక్షన్లు, ఫాబి ఫ్లూ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి నగర శివార్లలో తయారయ్యే రెమిడెసివీర్, అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఫాబి ఫ్లూ వంటి యాంటీ వైరల్ ఔషధాలకు భారీగా డిమాండ్ వచ్చింది. కోవిడ్ రోగుల చికిత్సలో వీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా వీటి ప్రాధాన్యం పెరిగింది. రెమిడెసివీర్ డ్రగ్ సంగారెడ్డిలో ఉన్న హెటిరో సంస్థలో తయారవుతోంది. ఈ అత్యవసర యాంటీ వైరల్ మందుల్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి, ఈ విపత్కర పరిస్థితుల్ని క్యాష్ చేసుకోవడానికి మందుల దుకాణాలు నిర్వహించే అన్నదమ్ములు రంగంలోకి దిగారు. చిలకలగూడలో సోను మెడికల్ దుకాణం నిర్వహిస్తున్న సునీల్ అగర్వాల్, రామ్‌గోపాల్‌పేటలో సోను ఫార్మసీ నిర్వహించే సోను అగర్వాల్‌లు తమ షాపుల పేరుతో డిస్టిబ్యూటర్ల నుంచి రెమిడెసివీర్ ఇంజెక్షన్లు, ఫాబి ఫ్లూ ట్యాబ్లెట్లు ఖరీదు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఔషధాలను నేరుగా ఆసుపత్రులకే విక్రయించాల్సి ఉన్నా... తమ వద్ద దాచుకొని కోవిడ్ రోగులకు రెమిడెసివీర్ ఇంజెక్షన్‌ను రూ.35 వేలు, ఫాబి ఫ్లూ ట్యాబ్లెట్స్ను రూ.6 వేలకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందడంతో శుక్రవారం తమ బృందాలతో దాడి చేశారు. ఇద్దరినీ పట్టుకుని రూ.5.6 లక్షల విలువైన యాంటీ వైరల్ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసులను స్థానిక పోలీసులకు అప్పగించారు. -
ఆసుపత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం కష్టతరంగా మారుతోంది. సరిపడినన్ని బెడ్స్ లేక చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అవకాశంగా మలుచుకుంటున్నాయి. బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికి లేవంటూ బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడున్నాయి. ఈ విషయం పై ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాజధానిలో ఆసుపత్రులేవైన ఇలాంటి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడి, బెడ్ల అందుబాటు విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. (‘వారి కోసం 5 వేల పడకలు సిద్ధం’) బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ఒక మొబైల్ యాప్‌ను లాంచ్ చేసిందని వెల్లడించారు. దీనిలో ఎప్పటికప్పడు ఆసుపత్రిలో ఉన్న బెడ్ల వివరాలను ఆసుపత్రులు నమోదు చేయాలని చెప్పారు. వాటి ఆధారంగా ప్రజలకు ఏ ఏ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉండి అందుబాటులో ఉన్నాయో తెలుస్తుందన్నారు. ఈ యాప్‌లో అందుబాటులో ఉన్న బెడ్ వివరాల గురించి తప్పుడు సమాచారం ఇస్తే ఆ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. యాప్‌లో బెడ్లు ఖాళీగా ఉన్నాయని చూపించి, ఆసుపత్రికి వెళ్లగా సిబ్బంది బెడ్ ఇవ్వడానికి నిరాకరిస్తే 1031 నంబర్‌కు ఫిర్యాదు చెయ్యొచ్చని తెలియజేశారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు ఒకసారి సాయంత్రం 6 గంటలకు మరోసారి రోజుకు రెండుసార్లు యాప్‌ను అప్డేట్ చేస్తామని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పేషెంట్ల కోసం బెడ్లు, వెంటీలేటర్లు, ఐసీయూ సౌకర్యాలను అందుబాటులో ఉంచినట్లు కేజ్రీవాల్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. (కరోనా: ప్రైవేటులో చార్జీలపై సుప్రీం విచారణ) -
ఇంటి నుంచే ఇసుక బుకింగ్
ఇసుక కావాలంటే ఇక ఎక్కడికో పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటే చాలు కాలు కదపకుండా ఎక్కడ నుంచైనా ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కంప్యూటర్‌పై స్వల్ప పరిజ్ఞానం ఉన్న వారు కూడా సులభంగా ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. – సాక్షి, అమరావతి సాక్షి, అమరావతి: ఇసుక అక్రమార్కులకు కఠిన శిక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమంగా ఇసుక నిల్వ, బ్లాక్ మార్కెటింగ్, ఇసుకతో వ్యాపారం చేసిన వారికి రూ. 2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ రాయితీల నిబంధనలను సవరిస్తూ భూగర్భ గనుల శాఖ కార్యదర్శి రాంగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించిన విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇసుకను అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారని, అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కొందరు ఏపీఎండీసీ వెబ్సైట్ నుంచి నకిలీ ఐడీలతో మోసపూరితంగా ఇసుక బుక్ చేసుకుని బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించేలా నిబంధనావళిని సవరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. పరిమితికి మించి ఇసుక నిల్వ చేస్తే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తారు. అపరాధ రుసుముతోపాటు చట్ట ప్రకారం రెండేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఇసుక బుకింగ్ ఇలా.. - ఆన్లైన్లో sand.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లగానే ‘వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ శాండ్’ అని ఉంటుంది. దాని కిందే జనరల్ బుకింగ్ / బల్క్ కన్జూమర్ లాగిన్ అని ఉంటుంది. - సాధారణ వినియోగదారులు ‘జనరల్’ అనే కాలమ్ కింద, అధిక పరిమాణంలో ఇసుక కావాల్సిన వారు ‘బల్క్ కన్జూమర్ లాగిన్’ కింద రిజిస్ట్రేషన్ అనే చోట్ల క్లిక్ చేయగానే మొబైల్ నంబరు అనే కాలమ్ ఉంటుంది. - అందులో మొబైల్ నంబరు టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆరు అంకెల వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ నంబరును పాస్వర్డ్ అనే చోట టైప్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆధార్ నంబరు, జిల్లా, పట్టణం/ గ్రామం, చిరునామా తదితర కాలాలు కనిపిస్తాయి. - అన్ని కాలాలను సక్రమంగా భర్తీ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు సమాచారం వస్తుంది. వెంటనే మొబైల్ నంబరు అనే కాలమ్‌లో ఫోన్ నంబరు టైప్ చేసి దాని కింద సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తే మొబైల్‌కు ఆరు అంకెల నంబరు వస్తుంది. - దీన్ని టైప్ చేసి సెండ్ ఓటీపీ అని నొక్కితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైనట్లు మెసేజ్ వస్తుంది. వెంటనే యూజర్ ఐడీ, ఐపీ నంబరు కనిపిస్తాయి. ఎంత కావాలంటే అంత.. - శాండ్ ఆర్డర్‌లోకి వెళ్లి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అక్కడ ఎన్ని టన్నులు, ఎక్కడి (స్టాక్ యార్డు) నుంచి ఎక్కడకు డెలివరీ చేయాలి? వివరాలు నమోదు చేయాలి. - టన్ను రూ.375 చొప్పున ఎంత డబ్బు చెల్లించాలో కూడా వెబ్సైట్లో కనిపిస్తుంది. అన్నీ నమోదు చేసిన తర్వాత చెక్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తే ‘పేమెంట్ గేట్‌వే’ అని కనిపిస్తుంది. నచ్చిన విధానంలో ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలి. - ఈ రసీదు సంబంధిత స్టాక్ యార్డులో అందచేసి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్టాక్ యార్డుల దగ్గరే వాహనాలు కూడా ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే ప్రస్తుతం ఇసుక బుకింగ్ అందుబాటులో ఉంది. ఇలా ఇసుక బుక్ చేసుకున్న వారు మరుసటి రోజు ఇసుకను స్టాక్‌యార్డుల నుంచి వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. -
మాఫియా గుండెల్లో మందుపాతర ముగ్ధ సిన్హా
‘వెల్డన్.. డన్ ఎ గ్రేడ్ జాబ్’ అనేవారు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసేవారు. ప్రతిసారీ అంతే. ప్రతిచోటా అంతే. ముగ్ధ బెదర్లేదు. బ్యాక్ స్టెప్ వెయ్యలేదు.ఎందుకోసమైతే ఆమె ఐఏఎస్ అయ్యారో అందుకోసమే పనిచేస్తున్నారు.ఆమె సామాన్యుల పక్షం. వాళ్ల కోసం ఎంతటివాళ్లతోనైనా పోరాడేందుకు సిద్ధం అయ్యే.. ఏరోజుకారోజు ఆమె డ్యూటీకి బయల్దేరుతుంటారు. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ముగ్ధ ప్రస్తుతం రాజస్థాన్–ఢిల్లీమధ్య పాలనా వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా. 2010. ఆ జిల్లాలోని పల్లెల్లో.. చట్టబద్ధమైన ఎలాంటి అనుమతి, అంగీకారం లేకుండా యథేచ్ఛగా మైనింగ్ జరుగుతోంది. అగ్రకులాల వాళ్లు ఏది చెబితే అదే చట్టం. ఏం చేస్తే అదే న్యాయం. మైనింగ్ మాఫియా, బోర్‌వెల్స్, గ్యాస్ సిలెండర్స్, బ్లాక్ మార్కెటింగ్.. ఒకటేమిటి అన్నీ! అలా ఒకసారి.. ఓ గ్రామంలో మైనింగ్ కోసం పేలుడు పదార్థాలు పెట్టారు. ధనార్జనే ధ్యేయం కాబట్టి పనిచేస్తున్న కూలీల, చుట్టుపక్కల ప్రజల భద్రతను గాలికొదిలేశారు. దాంతో ఆ పేలుడికి కొంతమంది ఎగిరిపడ్డారు. ప్రాణాలు గాల్లో కలిశాయి. తర్వాత చూస్తే దగ్గర్లో ఉన్న పొదల్లో తెగిపడ్డ తలలు కనిపించాయి. ఊరంతా వణికిపోయింది. దానికి బాధ్యులమంటూ స్థానిక మైనింగ్ కంపెనీలేవీ ముందుకు రాలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్నిచ్చే బాధ్యతా తీసుకోలేదు. చివరకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. ఆ మైనింగ్ వ్యవస్థా మూతపడింది. ఇదంతా ఇక్కడ రాసినంత తేలిగ్గా, అలవోకగా జరగలేదు. కొన్ని నెలల పోరాటం, బెదిరింపులు, బదిలీలు.. అన్నీ జరిగాకే న్యాయం గెలిచింది. అది ఓ వ్యక్తి సాధించిన విజయం. ఆమె ఆ జిల్లా కలెక్టర్. పేరు ముగ్ధా సిన్హా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ జిల్లాకు కలెక్టర్‌గిరీ చేయడానికి పురుష ఐఏఎస్ అధికారులే భయపడ్తుంటే మహిళా ఐఏఎస్‌లు చార్జ్ తీసుకోవడం ఊహించలేని విషయం. కాని ఆ సవాల్‌ను స్వీకరించారు ముగ్ధా సిన్హా. ఝున్‌ఝునుకు వచ్చిన మొదటి మహిళా కలెక్టర్‌గానే కాదు.. ఆ జిల్లాను ఓ దారిలో పెట్టిన ఐఏఎస్గానూ చరిత్రలో నిలిచారు. నిజానికి నలభై లక్షల జనాభా ఉన్న పెద్ద జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన ముగ్ధా.. ఝున్‌ఝునుకు ట్రాన్స్ఫర్ అవగానే.. చిన్న జిల్లా, హాయిగా పనిచేసుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నారట. తీరా వచ్చాక తెలిసింది.. పరిమాణంలో చిన్నదే అయినా ఎదుర్కోవాల్సిన చాలెంజెస్ పెద్దవని. భయపడలేదు ఆమె. ‘‘బ్యూరోక్రాట్స్‌లో నాలుగు రకాలుంటారు. ఒకటి.. నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసేవారు. రెండు.. నిజాయితీగా ఉన్నా సామర్థ్యంలేని వాళ్లు. మూడు.. సామర్థ్యం ఉన్నా నిజాయితీలేని వాళ్లు. నాలుగు.. అవినీతి, అసమర్థులైన ఆఫీసర్లు. నాకు తెలిసింది.. నేను ప్రయత్నించేది.. ఒక్కటే.. నిజాయితీగా ఉండాలి.. సమర్థవంతంగా పనిచేయాలి. ఆ సూత్రాన్ని నమ్మాను కాబట్టే ఝన్‌ఝునులో పరిస్థితులకు వెరవలేదు’’ అంటున్నారు ముగ్ధ. మాఫియా నుంచి ఫోన్ కాల్స్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాక ముగ్ధాకు చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయి.. ‘‘మళ్లీ మా మైన్స్ ఎప్పుడు తెరుస్తున్నారు’’ అంటూ! అలా ఫోన్ చేసిన వాళ్లెవరూ నిజమైన యజమానులు కారు. యజమానులు ఫోన్ చేయించిన మధ్యవర్తులు. అలాంటి ఏ ఒత్తిళ్లకూ తలొగ్గలేదు ముగ్ధ. అదొక్కటే కాదు.. ఝున్‌ఝునులో జరుగుతున్న ఇతర అరాచకాలకూ ఆమె అడ్డుకట్ట వేశారు. మైనింగ్ తర్వాత ఆ రేంజ్‌లోనే ఉన్న వంట గ్యాస్ సిలెండర్ల బ్లాక్ మార్కెటింగ్‌నూ బ్లాక్ చేసేశారు. అలాగే పర్మిషన్ లేకుండా వేస్తున్న బోర్‌వెల్స్‌నూ పూడ్చేయించారు. హర్యానా నుంచి బోర్వెల్ మెషీన్స్ వచ్చేవి. వాటన్నిటినీ సీజ్ చేయించారు. ఝున్ఝునూను పట్టి పీడిస్తున్న ఇంకో పెద్ద రుగ్మత.. అగ్రకుల అహంకారం. సామాన్యులు తమ గోడు వెళ్లబుచ్చుకోవడానికి కలెక్టర్ ఆఫీస్ ముందు వరుస కడితే.. వాళ్ల ముందు అగ్ర కులస్థుల సమూహం ఉండేది. అగ్రకులస్థులు కలెక్టర్‌ను కలిసి మాట్లాడాకే నిమ్న కులస్థులు కలవాలి. ఇది అక్కడి ఆనవాయితీ. ఆ ‘సంప్రదాయాన్ని’ తుంగలో తొక్కారు ముగ్ధ. అసలు ఎవరూ తన ఆఫీస్ ముందు క్యూ కట్టకముందే గ్రామాల్లోకి వెళ్లిపోయి ప్రత్యక్షంగా సామాన్య ప్రజలను ఆమె కలిసేవారు. వాళ్ల అర్జీలు, దరఖాస్తులు తీసుకునేవారు. సత్వర పరిష్కారం కోసమూ అంతే శ్రమించేవారు. ఆఫీస్ పనివేళలు అయిపోయి, పని మిగిలిపోతే ఆ ఫైల్స్ పట్టుకుని ఇంటికి వెళ్లేవారు. రాత్రంతా కూర్చొని ఫైల్స్ చెక్ చేసేవారు. ఆమె నిజాయితీ, సామాన్యులకు అండగా ఉన్న తీరు, మైనింగ్ మాఫియా, బ్లాక్ మార్కెటింగ్‌పై ఆమె ఉక్కుపాదం మోపడం.. ఇవన్నీ గిట్టని పెద్దలు ఆర్నెల్లలో ముగ్ధకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించారు. ఆ ఆర్డర్ తీసుకునే ముందు.. ఆరావళి పర్వత సాణువుల్లోని మైన్స్‌లో ఇల్లీగల్ మైనింగ్ కోసం పేలుడు పదార్థాల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కులన్నిటినీ ముగ్ధ సీజ్ చేయించారు. ఇది జరిగి దాదాపు తొమ్మిదేళ్లవుతోంది. ఇప్పటి వరకు ఆ మైన్స్ తెరుచుకోలేదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కాదనే ధైర్యం ఎవరూ చేయట్లేదు. అడ్మినిస్ట్రేషన్‌లో ముగ్ధ వేసిన ముద్ర అది! అమ్మ కోరికపై ఐఎఎస్ ముగ్ధా తండ్రి గురు స్వరూప్ సిన్హా. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా పనిచేసేవారు. చైనాతో, ఆ తర్వాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. 1978లో విమాన ప్రమాదంలో మరణించారు.. విధి నిర్వహణలోనే. అప్పటికి ముగ్ధ వయసు నాలుగేళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. తల్లి కమలా సిన్హా పిల్లల్ని పెంచి పెద్దచేసింది. సమాజాన్ని సంస్కరించడం కోసం ముగ్ధాకు ఐఏఎస్ లక్ష్యాన్ని నిర్దేశించిందీ ఆమెనే. భర్త చనిపోయాక పిల్లలను తీసుకుని ఆగ్రా వెళ్లిపోయారు కమల. పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేశారు ముగ్ధ. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో హిస్టరీ హానర్స్ చదివారు. కాలేజ్ ఫస్ట్. యూనివర్సిటీలో థర్డ్ ర్యాంకర్. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎమ్మే చేశారు. సెకండ్ అటెంప్ట్‌లో ఐఏఎస్ సాధించారు. సివిల్స్‌లో ఆమెది ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్. జైపూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ముగ్ధానే. రెండేళ్లు సీఎమ్ (రాజస్థాన్) ఆఫీస్‌లోనూ పని చేశారు. జిల్లా కలెక్టర్‌గా 2005లో మొదటి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ‘‘సివిల్ సర్వీస్.. జాబ్ కాదు. నిజంగా సర్వీసే. సామాన్యుల సంక్షేమం కోసం చేసే సేవ. మనం చేసిన పనే తర్వాతి తరాల వాళ్లకు అందే వారసత్వం. మన పనే ప్రజల హృదయాల్లో మనకు సుస్థిరస్థానం కల్పిస్తుంది’’ అని అంటారు ముగ్ధా సిన్హా. పదేళ్లలో పదమూడు బదిలీలు! ఆర్నెల్లలోనే అరవై ఏళ్ల పాలనా సంస్కరణలు తెచ్చారు ముగ్ధ. అందుకే ఆమె ట్రాన్స్ఫరై పోతుంటే ఆ జిల్లాలోని ప్రజలు సరే.. లాయర్లు, టీచర్లు, ఇంజనీర్లు అందరూ ముగ్ధా బదిలీని ఆపమంటూ ధర్నా నిర్వహించారు. బంద్‌కు పిలుపిచ్చారు. ఆమెలోని సిన్సియారిటీ, సమర్థత తన పదిహేనేళ్ల సర్వీస్‌లో పదమూడు ట్రాన్స్ఫర్స్లను గిఫ్ట్‌గా ఇచ్చింది. అయినా అలుపెరగక ప్రయాణిస్తూనే ఉన్నారామె తను నమ్మిన దారిలో. -
సరుకులపై ‘సమ్మె’ట
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలపై లారీల సమ్మె పోటు పడింది. దేశవ్యాప్తంగా లారీల బంద్ నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధర లు 15 శాతం వరకు పెరిగాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. లారీ సమ్మెను సాకుగా చూపుతూ రాజధానిలోని పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి, ఆలు, కర్నూలు నుంచి సరఫరా అయ్యే బియ్యం, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చే టమోట ధరలు పెరిగాయి. భవన నిర్మాణ రంగంపైనా సమ్మె ప్రభావం కనిపిం చింది. సిమెంట్, స్టీల్ రవాణాకు ఆటంకం కలగడం తో నిర్మాణ రంగం స్తంభించింది. రాజధానికి రోజూ సరఫరా అయ్యే సుమారు 5 వేల లారీలకు పైగా ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో నిల్వల ధర లు అనూహ్యంగా పెరిగాయి. సిమెంట్, ఐరన్, కంకర వంటి వస్తువుల సరఫరా ఆగిపోయింది. మరింత ఉధృతం చేస్తాం.. మరోవైపు సమ్మె విరమణ దిశగా బుధవారం రవాణా శాఖ అధికారులు లారీ సంఘాలతో సమావేశమైనప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి లేకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సమ్మె విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తా మని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అవసర మైతే అత్యవసర వస్తువులను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. లారీ బంద్‌లో భాగంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా ఒక రోజు బంద్ పాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా నిరవధిక బంద్‌కు దిగుతారని స్పష్టం చేశారు. ధరలకు రెక్కలు హైదరాబాద్‌లోని బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్, కొత్తపేట్, బోయిన్పల్లి, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, తదితర మార్కెట్లలోని అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కొంత మేర పెరిగాయి. సమ్మెకు ముందుతో పోలిస్తే రిటేల్ మార్కెట్లో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంపు ఉంది. వస్తువుల నిల్వలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు సమ్మెను సొమ్ము చేసుకొనేందుకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే కంది పప్పు ధర రూ.60 నుంచి రూ.66కు పెరిగింది. ఎర్ర పప్పు ధర రూ.50 నుంచి రూ.55కు, పెసర పప్పు కిలో రూ.60 నుంచి రూ.67కు పెరిగింది. పంజాబ్ నుంచి దిగుమతి అయ్యే మినప పప్పు రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. వంట నూనెల ధరలు లీటర్ రూ.86 నుంచి రూ.96కు పెరిగాయి. మదనపల్లి నుంచి నగరానికి వచ్చే టమోటా కిలో రూ.30 నుంచి రూ.40కి చేరింది. చిక్బల్లాపూర్ నుంచి వచ్చే బిన్నీస్ కిలో రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. పచ్చి మిర్చి కిలో ధర రూ.50 నుంచి రూ.60కి పెరిగింది. భారీగా పడిపోయిన అమ్మకాలు లారీల సమ్మె వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.2,500 కోట్ల మేర వ్యాపార కార్యకలాపాలు స్తంభించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరవ్యాప్తంగా వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు పడిపోయింది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల లారీలు సరుకు రవాణా చేస్తుండగా ఒక్క హైదరా బాద్ నుంచే 50 వేలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఈ లారీలన్నీ సమ్మెలో పాల్గొనడంతో డీసీఎంలు, ఇతర మినీ వాహనాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్‌కు దిగుమతులు నిలిచిపోయాయి. సమ్మె ఇలాగే కొనసాగితే నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభావం స్వల్పమే ఇప్పటి వరకైతే సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు డీసీఎంలలో వస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలను తెచ్చేందుకు రైతులు ఆటోలు, చిన్న ట్రాలీలను వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో సమ్మె ప్రభావం తక్కువగానే ఉంది. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ ధరలు పెరిగాయి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయల ధరలు కొంతమేరకు పెరిగాయి. దీంతో మేం కూడా ఆ మేరకు ధరలు పెంచి అమ్మాల్సి వస్తోంది. ఈ సీజన్లో ఎక్కువగా పండని వాటిపైనా ధరల ప్రభావం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే కూరగాయల విషయంలో లారీల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. – జంగయ్య, కూరగాయల వ్యాపారి, మీరాలంమండి ధరలు భగ్గుమంటున్నాయి రెండ్రోజుల నుంచి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఇటీవల వరకు వంకాయ, ఆలు, గొకరకాయ ధరలు కిలో రూ.30 వరకు ఉండేవి. ఇప్పుడు రూ.50 వరకు పలుకుతున్నాయి. ఇదేంటని అడిగితే సమ్మె ప్రభావమని చెబుతున్నారు. – సయ్యద్ ముక్తార్, వినియోగదారుడు -
డిజిటల్‌తో దళారులకు బ్రేకులు
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా’ దళారులు, మధ్యవర్తులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమమని... ఇది నల్లధనాన్ని, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సాయపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా చర్యలతో లబ్ధి పొందిన పలువురితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించారు. దేశీయతకు చిహ్నమైన రూపే కార్డును డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగించుకోవాలని దేశ ప్రజల్ని కోరారు. జనానికి నేరుగా సేవలు... ‘‘డబ్బుల్ని దిండ్ల కింద పెట్టుకునే వారున్న ఈ దేశంలో... దళారులు లేకుండా రేషన్ పొందలేని ఈ దేశంలో... డిజిటల్ చెల్లింపుల గురించి చెప్పినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. కానీ, దీనివల్ల సేవలు నేరుగా అందుతున్నాయని లబ్ధిదారులు చెప్పడమే విమర్శకులకు గట్టి సమాధానం. రేషన్ కోసం ఇప్పుడు దళారులు అవసరం లేదు. ప్రజలు తాము కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోనే పొందుతున్నారు. గ్రామాల్లోని పేద రైతులు డీజిటల్ చెల్లింపుల బాట పడుతుండటంతో దళారులు వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు సురక్షితం కాదని అబద్ధాలు చెబుతున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు పంపుతుండటంతో వారి వ్యాపారం తగ్గింది’’ అని ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియాతో దళారులకు కమీషన్ కరువైందన్నారు. నల్లధనానికి, బ్లాక్ మార్కెట్‌కు (అక్రమమార్గంలోకి మళ్లించడం), మధ్యవర్తులకు డిజిటల్ ఇండియా అడ్డుకట్ట వేసిందని చెప్పారాయన. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ కర్తవ్యంగా పేర్కొన్నారు. దేశీ కార్డులను వాడండి ‘‘ప్రభుత్వం తెచ్చిన చెల్లింపుల యాప్ భీమ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 10,983 కోట్ల విలువైన 91.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2016–17లో భీమ్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.695 కోట్లే’’ అని వివరించారు. భీమ్ ద్వారా చెల్లించేందుకు యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా వర్తకులను, దుకాణదారులపై వినియోగదారులు ఒత్తిడి తేవాలని కోరారు. దేశీయంగా రూపొందించిన రూపే క్రెడిట్/ డెబిట్ కార్డులను వినియోగించాలని లేదంటే ప్రాసెసింగ్ ఫీజులు విదేశీ కంపెనీలకు వెళతాయని చెప్పారాయన. దేశంలో 50 కోట్ల రూపే కార్డులు ఉన్నాయంటూ... ఈ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు రూ.2,347 కోట్లకు పెరిగాయన్నారు. దేశ భక్తి గురించి మాట్లాడేవారు రూపే కార్డును వినియోగించడం వల్ల కూడా దేశానికి ఒక విధంగా సేవ చేయవచ్చని సూచించారు. వెనుకబడిన వర్గాల పురోగతి డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 1.25 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 70 శాతం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులవారే ఉన్నారని మోదీ చెప్పారు. ఇన్నాళ్లూ వెనుకబడి ఉన్న ఓ పెద్ద సమూహం డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల పురోగతి చెందుతున్నట్టు తెలుస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీతో భారీగా ఉద్యోగాలు ‘‘ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 23 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో 2014లో మొబైల్ హ్యాండ్సెట్లు, వాటి కాంపోనెంట్ల తయారీ కేంద్రాలు 2 మాత్రమే ఉండగా, అవిప్పుడు 120కి పెరిగాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి’’ అని వివరించారు. రూ.550 కోట్లతో చేపట్టిన బీపీవో ప్రోత్సాహ పథకం వల్ల 2 లక్షల ఉద్యోగాలు సమకూరాయన్నారు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు డిజిటల్ సేవలందించే ప్రాథమిక కేంద్రాలుగా పనిచేస్తున్నట్టు తెలిపారు. -
అక్రమాలకు ‘గ్యాసో’హం
వైరా : పేదలకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే ‘డొమెస్టిక్’ సిలిండర్లను యథేచ్ఛగా కొందరు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనిని ఓ దందాగా మార్చేసి దండుకుంటున్నారు. పేదల సిలిండర్ల మార్పిడి తంతును నిర్వహిస్తున్నారు. కొన్ని గ్యాస్ ఏజెన్సీల్లో ఒక్కో సిలిండర్‌పై అదనంగా వసూలు చేస్తూ.. సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తూ అక్రమ దందా సాగిస్తున్నాయి. దమ్ముంటే కాసుకోండి.. పట్టుకోండి అన్నట్లు అధికారులకు సవాల్ విసురుతున్నట్లుగా మారుతోంది ఈ గ్యాస్ దందా పరిస్థితి. జిల్లాలో ‘డొమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా ‘కమర్షియల్’గా సాగుతోంది. ఈ వ్యాపారం ప్రధానంగా మండల కేంద్రాల్లో జోరుగా నడుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో ఇంటి సిలిండర్లను దొంగచాటున వినియోగిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతోపాటు కొందరు ఏజెన్సీదారులకు తెరచాటున ఇదొక వ్యాపారంగా మారింది. అధికంగా సిలిండర్లు వినియోగించే ప్రధాన పట్టణాల్లో తనిఖీల ఊసే లేదు. అయితే హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వినియోగించాలని ప్రభుత్వ నిబంధనలులున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో పాటించట్లేదు. 19 కిలోలు గల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,460. అదే గృహావసరాలకు వినియోగించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ 14.6 కిలోలు ఉండి.. దాని విలువ రూ.750 నుంచి రూ.800 వరకు ఉంటుంది. ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్‌కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. పైగా గ్యాస్ కూడా ఎక్కువ వస్తుంది. దీంతో అనేక హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల నిర్వాహకులు డొమెస్టిక్ గ్యాస్‌ను వినియోగించడానికి మచ్చిక చేసుకుని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు కూడా ఒక్కో సిలిండర్‌పై రూ.200 వరకు అదనంగా వసూలు చేస్తూ.. దందాను జోరుగా నడిపిస్తున్నారు. తనిఖీలు కరువు.. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సింగిల్ కనెక్షన్ 2.80 లక్షలు, డబుల్ కనెక్షన్ 1.75 లక్షలు, దీపం కనెక్షన్లు 1.10 లక్షలు, సీఎస్ఆర్ కనెక్షన్లు 1.75 లక్షలు ఉన్నాయి. సిలిండర్లను సరఫరా చేయడానికి ఇండియన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కంపెనీలు కలిపి గ్యాస్ ఏజెన్సీలు 350 ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లు మాత్రం 3వేల వరకు మాత్రమే ఉన్నాయి. పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపారాలు వేలల్లో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల వినియోగం అధికం. హోటల్‌ను బట్టి కొన్నింటికి వారంలో ఒకటి నుంచి రెండు సిలిండర్లు పడతాయి. మరికొన్నింట్లో నెలకు ఐదు వరకు వినియోగిస్తున్నారు. ఒక కమర్షియల్ సిలిండర్‌పై వెళ్లదీయడం సాధ్యం కాని పని. గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉండడంతో కమర్షియల్ సిలిండర్లు కాకుండా కాకుండా డొమెస్టిస్ సిలిండర్లను దొంగచాటున వినియోగి స్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డీడీలు కూడా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లపై పూర్తిస్థాయిలో తనిఖీలు చేయట్లేదని, సబ్సిడీ గ్యాస్‌ను పక్కదారి పట్టిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీల బాధ్యులపై చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారమిస్తే సీజ్ చేస్తాం.. నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లలో వినియోగించడం నేరం. పట్టణాల్లో నిబంధనలను మరిచి వ్యాపారాలకు వినియోగిస్తే మాకు సమాచారం అందించండి. మేం వెంటనే సీజ్ చేస్తాం. వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్లే వాడాలి. – కోటా రవికుమార్, తహసీల్దార్, వైరా -
కబాలి క్రేజ్
జిల్లాలో 32 థియేటర్లలో సినిమా విడుదల వెయ్యి రూపాయలు పలుకుతున్న ఒక్క టికెట్టు నెల్లూరు (సిటీ) : కబాలి ఫీవర్ నెల్లూరు జిల్లాను కూడా ఊపేస్తోంది. శుక్రవారం జిల్లాలోని 32 థియేటర్లో ఈ చిత్రం విడుదలవుతోంది. అభిమానుల క్రేజ్‌ను థియేటర్ల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. నెల్లూరు నగరంలోని రెండు థియేటర్లలో మాత్రమే కబాలి సినిమా ప్రదర్శితమవుతుంది. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ సదుపాయం పెట్టకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. థియేటర్ యాజమాన్యం బ్లాక్ విక్రయాలను ప్రోత్సహిస్తోందని ఆగ్రహిస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతోందని తెలుస్తోంది. అన్ని శాఖల అధికారులకు టిక్కెట్లు నెల్లూరు నగర పాలక సంస్ధ, ఆర్డీఓ, కలెక్టరేట్, పోలీస్, ఫైర్‌స్టేషన్ తదితర శాఖలకు ఒక్కో షోకు పది నుంచి 50 టిక్కెట్ల వరకు థియేటర్ యాజమాన్యం అందచేస్తున్నట్లు సమాచారం. దీంతో సామాన్య ప్రజలకు టిక్కెట్లు అందడమే కష్టతరమవుతుంది. అధికారులు, రాజకీయనాయకుల అండదండలుంటేనే టికెట్లు అందే పరిస్థితి ప్రస్తుతం నెల్లూరులో చోటుచేసుకుంది. దీంతో సామాన్యుడు సినిమాను మొదటి రోజు చూడటం కలగా మారింది. ముఖ్యంగా పోలీస్‌శాఖవారు దాదాపు 100 టిక్కెట్లు వరకు తీసుకెళ్లారని సమాచారం. ఈ విధంగా అధికారులకు టికెట్లు ఇస్తుంటే తాము సామాన్యులకు టికెట్లు ఏ విధంగా అందచేయగలమని థియేటర్ల యజమానులు వాపోతున్నారు. బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం లేదని, సీటింగ్ కెపాసిటీ మేరకు అందరికీ టిక్కెట్లు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంటున్నారు. -
బియ్యం తరలిస్తే.. జైల్లో పెడతాం!
హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే సన్న బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే జైళ్లలో పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం పంపిణి ప్రారంభిస్తున్నామన్నారు. కరీంనగర్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ధానోపాద్యాయులు- గుణాత్మక విద్య అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఈటెల సన్మానించారు. -
నెల్లూరు జిల్లాలో ఆర్ధరాత్రి కలకలం
-
బీహార్ సీఎం వివాదస్పద వ్యాఖ్యలు
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజ్హీ- బ్లాక్ మార్కెటింగ్ ను సమర్థిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్నవ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ చేయడం నేరం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అటువంటి వారిపై చర్యలేమీ తీసుకోబోమని కూడా చెప్పారు. తమ జీవనం కోసం, పిల్లలను బాగా చదివించుకోవడం కోసం చిన్న వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడతారని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి వారిపై తమ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోబోదని అన్నారు. మంజ్హీ వ్యాఖ్యలతో అక్కడే ఉన్న కేంద్ర వ్యవసాయ శాఖ రాధా మోహన్ సింగ్ అవాక్కయ్యారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ధాన్యాన్ని అక్రమంగా నిల్వచేయడం, బ్లాక్ మార్కెటింగ్‌లకు పాల్పడే మిల్లర్లపై, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. గురువారం పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మిల్లర్లు ధాన్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచుకొని, కృత్రిమ కొరత సృష్టించకుండా ముందుగానే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 5.5లక్షల బోగస్ కార్డులు సరెండర్ అయ్యాయని, ఆధార్‌ను పీడీఎస్‌కు అనుసంధానించడం ద్వారా మరో 34 లక్షల మంది బోగస్ లబ్ధిదారులను ఏరివేశామని మంత్రి వివరించారు. నాణ్యమైన విద్య అందించటమే లక్ష్యం అందరికి నాణ్యమైన విద్యను అందించటమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీయూటీఎఫ్) నాల్గవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘మన తెలంగాణ - మన విద్యా విధానం’పై సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖకు అందించే నిధులను పెట్టుబడి అని అనాలి అంతేకానీ ఖర్చు చేశాం అనకూడదని, పిల్లలు ప్రపంచంలో పోటీపడే నైపుణ్యాన్ని సంపాదించుకుంటే సమాజానికి ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా మంత్రి జగదీశ్‌రెడ్డి, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆటవీ మంత్రి జోగు రామన్న, టీయూటీఎఫ్ అధ్యక్షులు స్వామిరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీయూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి డి.మల్లారెడ్డి తదిరతులు పాల్గొన్నారు. -
వామ్మో..!
బియ్యం మాటెత్తితేనే సామాన్యులు హడలిపోతున్నారు. రోజురోజుకూ ధరలు అమాంతం దూసుకెళుతుండటం సామాన్య, మధ్య తరగతి వర్గాలను కుంగదీస్తోంది. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కనుక కొనక తప్పని పరిస్థితి. జిల్లాలోని వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతుండటంతో ధరల పెరుగుదలకు దారితీస్తోంది. అక్రమ నిల్వలను వెలికితీయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిద్రావస్థలో ఉన్నారనే విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి. కడప కలెక్టరేట్: నెల రోజుల నుంచి బియ్యం ధరలు ఎండలతో పోటీపడుతూ మండిపోతున్నాయి. కడప మార్కెట్లో జిలకర మసూర కొత్తవి క్వింటాల్ రూ. 3,300గా ఉన్నాయి. పాతబియ్యం రూ. 4,300 నుంచి రూ. 4,400 పలుకుతోంది. స్కీం బియ్యం బద్వేలు రకం క్వింటాల్ రూ.3600 నుంచి రూ. 3700 వరకు పలుకుతోంది. ఇవి హోల్‌సేల్ ధరలు కాగా చిల్లర దుకాణాల్లో రిటైల్‌గా కొత్త బియ్యం కిలో రూ.46, పాత బియ్యం కిలో రూ. 56 చొప్పున విక్రయిస్తున్నారు. బాగానే ఉన్న ధాన్యం దిగుబడి.. : 2013-14 సంవత్సరంలో జిల్లాలో ధాన్యం దిగుబడి బాగానే వచ్చింది. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 45,476 హెక్టార్లు కాగా, 51,753 హెక్టార్లలో వరిపంట సాగైంది. ఈ సీజన్లో 1,89,623 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి పెరిగింది. రబీలో సాధారణ విస్తీర్ణం 11,604 హెక్టార్లు కాగా, 10,417 హెక్టార్లలో వరి సాగైంది. ఈ సీజన్లో 39,233 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇలా మొత్తం 2,28,850 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో పండింది. రైతులకు దక్కింది స్వల్పమే.. ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు ఈ యేడు దక్కింది స్వల్పమే. ఎకరా సాగుకు రూ.20వేలు వరకు ఖర్చవుతోంది. దిగుబడి ఎకరాపై 21 నుంచి 24 క్వింటాళ్లు సగటున వచ్చిందని రైతులు అంటున్నారు. జిలకర మసూర, ఎన్‌డీఎల్‌ఆర్-8 రకాల వరిధాన్యాన్ని క్వింటాల్ 8వేల నుంచి రూ.8,500లతో రైతులు మిల్లర్లకు విక్రయించారు. పంట మిల్లర్ల చేతికి వెళ్లిన తర్వాత నేడు అదే ధాన్యం ధర రూ. 13,500 నుంచి రూ. 14వేల వరకు పెరిగింది. అలాగే ఎన్‌ఎల్‌ఆర్ రకం ధాన్యాన్ని రైతులు క్వింటాల్ రూ. 7,500లతో విక్రయించగా నేడు రూ. 9,500కు చేరింది. అక్రమ నిల్వలు అప్పులు చెల్లించడానికో లేదా కుటుంబ అవసరాల నిమిత్తమో దాదాపు రైతులంతా ఇప్పటికే తాము పండించిన ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించుకున్నారు. కొంత స్థోమత ఉన్న రైతులు మాత్రం ధర వస్తుందన్న ఆశతో ఇళ్ల వద్ద ధాన్యం నిల్వ చేసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మార్కెట్లోకి విడుదల చేయకుండా వ్యాపారులు అక్రమ నిల్వలు ఏర్పాటు చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ నిల్వలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల పేర్లతో కూడా వ్యాపారులు గోదాముల్లో నిల్వలు ఉంచినట్లు చెబుతున్నారు. వెలికితీతకు చర్యలేవీ.. అక్రమ నిల్వల వెలికితీతకు పౌరసరఫరాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గోడౌన్ల తనిఖీ కంటితుడుపు చర్యగా ఉంటోంది. ఎవరైనా అక్రమ నిల్వలపై సమాచారమిస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జిల్లాలోని గోదాముల్లో బుడ్డశనగలు మినహా వరి ధాన్యం లేదంటూ బుకాయిస్తున్నారు. జిల్లాలో ధాన్యం దిగుబడి తగ్గిందని, మిల్లర్లు లెవీ చెల్లించడానికి కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి బియ్యాన్ని తీసుకొస్తున్నారంటూ వారికి వంత పాడుతున్నారు. బియ్యం ధరలు పెరిగి సామాన్యులు గగ్గోలు పెట్టే సందర్భాల్లో మిల్లర్లు, ట్రేడర్ల ద్వారా బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తోంది. కడప, ప్రొద్దుటూరు రైతుబజార్లలో గతంలో ఏర్పాటుచేసిన విక్రయ కేంద్రాలు చాలా రోజుల క్రితమే మూతపడ్డాయి. ప్రస్తుతం తక్కువ ధరలకు బియ్యాన్ని సరఫరా చేసేందుకు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోకుండా నియంత్రించడంలో భాగంగా అధికార యంత్రాంగం ‘ప్రైజ్ మానిటరింగ్ కమిటీ’(ధరల పర్యవేక్షణ కమిటీ) ఏర్పాటు చేసి సమీక్షలు జరపాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా కమిటీ జాడే లేకుండా పోయింది. -
ధరల కట్టడికి కట్టుబడి ఉన్నాం
అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల విషవలయాన్ని ఛేదిస్తాం దేశ వృద్ధికి తోడ్పాటు అందించండి రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రి-బడ్జెట్ భేటీలో అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: అధిక ధరలు, అధిక వడ్డీ రేట్ల విషవలయాన్ని ఛేదించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌ని, అక్రమంగా నిల్వలు ఉంచడాన్ని నిరోధించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అలాగే కమోడిటీ చట్టాలను కూడా పునఃసమీక్షించాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం జరిగిన ప్రీ-బడ్జెట్ సమావేశంలో జైట్లీ ఈ విషయాలు తెలిపారు. అధిక ద్రవ్యోల్బణం సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల సామాన్యుల ఆహార, పౌష్టికాహార భద్రతకు నష్టం వాటిల్లుతోందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు వృద్ధి మందగించడం, మరోవైపు అధిక ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు .. దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుసవాళ్లుగా మారాయన్నారు. కొన్ని రాష్ట్రాలు.. దేశాన్ని మించి వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో యావత్‌దేశాన్నీ మరింత వృద్ధి సాధించే దిశగా నడిపించాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. ఆర్థిక వృద్ధి సాధనలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడకూడదనే ప్రజలు కూడా ఎన్నికల్లో స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. వృద్ధిలో సమాన భాగస్వాములు కావాలి.. ధరల్లో తాత్కాలిక హెచ్చుతగ్గుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో రాష్ట్రాలు కూడా తోడ్పాటు అందించాలని జైట్లీ కోరారు. సరఫరాపరమైన ఆటంకాలను తొలగించే వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిత్యావసరాల చట్టాన్ని పునఃసమీక్షించడంతో పాటు బ్లాక్‌మార్కెటింగ్‌పై కొరడా ఝుళిపించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలు నెలకొల్పడాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ధరల సమాచారాన్ని రియల్ టైమ్‌లో ఇటు రైతులకు, అటు కొనుగోలుదారులకు చేరవేయగలిగే అవకాశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానం వృద్ధి సాధనకు దోహదపడగలదని, త్వరలో దీనికి అడ్డంకులను తొలగించి అమల్లోకి తేగలమని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీమిండియా అంటే కేవలం ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్కటే కాదని, రాష్ట్రాలు కూడా వృద్ధి సాధనలో సమాన భాగస్వాములుగా ఉండాలన్నదే తమ విధానమని జైట్లీ చెప్పారు. ఈ దిశగా రాష్ట్రాలకు కావాల్సిన సహాయ, సహకారాలు పూర్తిగా అందిస్తామన్నారు. రాష్ట్రాలతో సమావేశంలో చర్చించిన అంశాలు, సూచనలు బడ్జెట్ రూపకల్పనలో గణనీయంగా తోడ్పడతాయని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను భారీగా పెంచడం ద్వారా అధిక వృద్ధి సాధించేందుకు ఆస్కారం ఉంటుం దన్నారు. దీని వల్ల సిమెంటు, ఉక్కు, విద్యుత్ తదితర రంగాలు కూడా మందగమనం నుంచి బయటపడగలవని, భారీగా ఉపాధి అవకాశాలు కూడా లభించగలవని జైట్లీ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయాలి.. ధరల పెరుగుదల నుంచి పేదలకు ఉపశమనం కలిగించాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని, అలాగే జాతీయ ఆహార భద్రత చట్టాన్ని సమర్థంగా అమలు చేయాల్సి ఉందని జైట్లీ చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వడం కోసం రాష్ట్రాల ప్రభుత్వాల ద్వారా నిధులను మళ్లించాలని యోచిస్తున్నట్లు ఆయన వివరించారు. జీఎస్టీ పై మెజారిటీ రాష్ట్రాల సుముఖత.. స్వల్ప అభ్యంతరాలు మినహా చాలా మటుకు రాష్ట్రాలు జీఎస్టీ అమలుపై సుముఖత వ్యక్తం చేశాయి. అయితే, తమ ఆర్థిక స్వయం ప్రతిపత్తికి రక్షణ కల్పించాలని, దశలవారీగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్(సీఎస్టీ) ఉపసంహరణ వల్ల వాటిల్లే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయాలని కేంద్రాన్ని కోరాయి. ప్రస్తుత జీఎస్టీ విధానంపై తమిళనాడు అభ్యంతరంచెప్పగా, పెట్రోలియం ఉత్పత్తులను దీన్నుంచి మినహాయించాలని అసోం సూచించింది. -
‘ఆహార భద్రత’పై నిఘా
ముంబై: రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం సమర్థంగా అమలుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆహార ధాన్యాల పంపిణీ, సరుకు రేషన్ దుకాణాలకు వెళుతుందా? దారి మళ్లుతుందా? తదితరలపై నిఘా వేసి ఉంచేందుకు విజిలెన్స్ కమిటీని నియమించామని ఆహార, పౌర సరఫరా విభాగ కార్యదర్శి దీపక్ కపూర్ మంగళవారం మీడియాకు తెలిపారు. క్రమం తప్పకుండా ఆహర సామగ్రిని సరఫరా చేస్తున్న రేషన్ దుకాణాల్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే తహసీల్దార్లు, సబ్ డివిజినల్ అధికారులను ఆదేశించామని ఆయన వివరించారు. ఇప్పటివరకైతే విజిలెన్స్ కమిటీ కాగితాలపైనే ఉందన్నారు. అయితే బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడంలో వీటి పాత్ర కీలకమవుతుందని తెలిపారు. పోలీసు పటేల్‌లు, సర్పంచ్‌లు, మహిళలు, యువత సభ్యులుగా ఉన్న విజిలెన్స్ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ విషయాన్ని తహసీల్దార్లు కలెక్టర్ల దృష్టికి తీసుకెళతారని చెప్పారు. ఆహార భద్రత పథకం కింద రాష్ట్రానికి ప్రతియేటా 44 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాల అవసరముందన్నారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలు, ఆంత్యోదయ లాంటి వివిధ వర్గాలకు చెందిన ఏడు కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని వివరించారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలుచేసేందుకు మరో ఆరువేల రేషన్ దుకాణాలు నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇప్పటికే 300 దుకాణాలు కేటాయించామన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 235 గోదాంలను నిర్మించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయిచిందన్నారు. ఇప్పటికే 32 గోదాంల నిర్మాణం పూర్తయిందని, ఈ ఏడాది ఆఖరువరకు మరో 143 గోదాంలు అందుబాటులోకి వస్తాయని కపూర్ వెల్లడించారు. మిగిలన వాటిని వచ్చే ఏడాదిలో నిర్మిస్తారని వివరించారు. కాగా, మోసపూరిత చర్యలకు పాల్పడిన రేషన్ దుకాణ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం సెక్షన్ 3, సెక్షన్ 7ల కింద జరిమానా విధిస్తామని చెప్పారు. సాధ్యమైనంత మేర ఆహార భద్రత పథకం లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. -
గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్ ముఠా పట్టివేత
రాజమండ్రి, న్యూస్‌లైన్:గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాజమండ్రిలోని లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ వైపు వెళ్లే రోడ్డులో వేంకటేశ్వరస్వామి గుడి వద్ద ఓ స్థావరంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో త్రీటౌన్ సీఐ లక్ష్మీనారాయణ తన సిబ్బందితో దాడి చేశారు. అక్రమ వ్యాపారం చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. సిలిండర్లతో ఉన్న లారీ, మూడు కార్లు, రెండు మోటారు సైకిళ్లతో పాటు 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హిందుస్థాన్ పెట్రోలియం సంస్థకు చెందిన సిలిండర్లతో అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు గుర్తించారు. ప్రధాన నిందితుడైన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందిన గుడిమెట్ల వెంకటరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానిక లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ రోడ్డులో తుప్పల మాటున ఉన్న ఖాళీ స్థలంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని అక్రమ వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు. ఈ స్థావరంపై రాజమండ్రి ఆర్డీవో ఎం.వేణుగోపాలరెడ్డి, విజిలెన్స్ ఎస్పీ బి.నర సింహులు, సెంట్రల్ జోన్ డీఎస్పీ నామగిరి బాబ్జి, తహసిల్దార్ శ్రీనివాస్ తదితర అధికారులు దాడి చేసి, నిల్వ చేసిన సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో రాజమండ్రికి చెందిన కప్పల రాంబాబు, బెల్లాపు సత్యనారాయణ, శ్రీరెడ్డి సూర్యచంద్రరావు, గుడివాడ రమేష్‌కుమార్, వడ్డాది ఆదెమ్మ, షేక్ రబ్బానీ, గుబ్బల శ్రీనివాసరావు, నల్లా శ్రీను, ఇల్లా కోటేశ్వరరావు, కోడూరి గుబ్బయ్య ఉన్నారు. వారి వివరాల ప్రకారం.. గుడిమెట్ల వెంకటరెడ్డి అక్రమంగా గోడౌన్ నిర్వహిస్తూ, అవసరమైన వారికి అధిక ధరకు సిలిండర్లను విక్రయిస్తున్నాడు. కోరుకొండ రోడ్డులోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో గ్యాస్ కంపెనీ గోడౌన్లో లోడైన లారీని క్వారీ సెంటర్ నుంచి లాలా చెరువు రోడ్డులో తమ స్థావరానికి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఇక్కడ ఫుల్ సిలిండర్లు దించి, ఖాళీ సిలిండర్లను పెడుతున్నారు. సీట్లు తొలగించిన మూడు కార్లు, ఇతర వాహనాల ద్వారా తమ స్థావరంలో నిల్వ చేసి, రాజమండ్రిలో అవసరమైన వారికి బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లకు తరలింపు రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు ఇతర వ్యాపారులకు అధిక ధరలకు ఈ సిలిండర్లను విక్రయిస్తున్నారు. దీనిపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో సోమవారం నుంచి ఈ స్థావరంపై నిఘా పెట్టారు. లారీలు రావడం, రీ లోడింగ్ చేస్తున్న సమయంలో అధికారులు దాడులు చేసి ముఠా గుట్టురట్టు చేశారు. ఈ బాగోతంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దాడుల్లో పౌర సరఫరాల ఏఎస్వో సత్యనారాయణ రాజు, విజిలెన్స్ సీఐలు శ్రీనివాస్, ఫణిశ్రీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ఏజెన్సీ కార్యకలాపాలు నిలిపివేత అత్తిలి : అత్తిలి హెచ్‌పీ గ్యాస్ ఏజన్సీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ ఎం.వీరారెడ్డి ఆధ్వర్యంలో రికార్డులను తనిఖీ చేశారు. డిఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అత్తిలి హెచ్‌పీ గ్యాస్ ఏజన్సీకి సోమవారం సాయంత్రం లారీపై 450 గ్యాస్ సిలిండర్లు దిగుమతి అయ్యాయి. అదే లారీపై 450 ఖాళీ బండలను లోడ్ చేసుకుని తిరిగి వెళుతుండగా రాజమండ్రి త్రీటౌన్‌లో సోమవారం రాత్రి పోలీసులు తనిఖీ చేయగా, అందులో 100 సిలిండర్లు గ్యాస్‌తో నిండి ఉన్నాయి. దీంతో అక్కడ పోలీసులు లారీని సీజ్ చేశారు. గ్యాస్‌తో ఉన్న వంద సిలిండర్లకు సంబంధించిన వివరాలు లభించలేదని, రికార్డులు నిర్వహణ సక్రమంగా లేదన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీ చట్టం ప్రకారం ఏజెన్సీపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ ఎం.వీరారెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి గ్యాస్ ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపివేసినట్లు చెప్పారు. తనిఖీల్లో అసిస్టెంట్ సివిల్ సప్లైస్ అధికారి ప్రసాద్, కొవ్వూరు సీఎస్‌డీటీ ఎంఎం అలీ, తణుకు డీటీ అశోక్‌వర్మ, విజిలెన్స్ తహసిల్దార్ శైలజ, అత్తిలి ఆర్ఐ మాలతి, వీఆర్వో ఎ.ప్రసాద్ పాల్గొన్నారు.