వామ్మో..!
బియ్యం మాటెత్తితేనే సామాన్యులు హడలిపోతున్నారు. రోజురోజుకూ ధరలు అమాంతం దూసుకెళుతుండటం సామాన్య, మధ్య తరగతి వర్గాలను కుంగదీస్తోంది. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కనుక కొనక తప్పని పరిస్థితి. జిల్లాలోని వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతుండటంతో ధరల పెరుగుదలకు దారితీస్తోంది. అక్రమ నిల్వలను వెలికితీయాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిద్రావస్థలో ఉన్నారనే విమర్శలు సర్వత్రా వినబడుతున్నాయి.
కడప కలెక్టరేట్: నెల రోజుల నుంచి బియ్యం ధరలు ఎండలతో పోటీపడుతూ మండిపోతున్నాయి. కడప మార్కెట్లో జిలకర మసూర కొత్తవి క్వింటాల్ రూ. 3,300గా ఉన్నాయి. పాతబియ్యం రూ. 4,300 నుంచి రూ. 4,400 పలుకుతోంది. స్కీం బియ్యం బద్వేలు రకం క్వింటాల్ రూ.3600 నుంచి రూ. 3700 వరకు పలుకుతోంది. ఇవి హోల్‌సేల్ ధరలు కాగా చిల్లర దుకాణాల్లో రిటైల్‌గా కొత్త బియ్యం కిలో రూ.46, పాత బియ్యం కిలో రూ. 56 చొప్పున విక్రయిస్తున్నారు.
బాగానే ఉన్న ధాన్యం దిగుబడి.. :
2013-14 సంవత్సరంలో జిల్లాలో ధాన్యం దిగుబడి బాగానే వచ్చింది. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 45,476 హెక్టార్లు కాగా, 51,753 హెక్టార్లలో వరిపంట సాగైంది. ఈ సీజన్‌లో 1,89,623 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి పెరిగింది. రబీలో సాధారణ విస్తీర్ణం 11,604 హెక్టార్లు కాగా, 10,417 హెక్టార్లలో వరి సాగైంది. ఈ సీజన్‌లో 39,233 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇలా మొత్తం 2,28,850 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలో పండింది.
రైతులకు దక్కింది స్వల్పమే..
ఆరుగాలం కష్టించి పండించిన రైతులకు ఈ యేడు దక్కింది స్వల్పమే. ఎకరా సాగుకు రూ.20వేలు వరకు ఖర్చవుతోంది. దిగుబడి ఎకరాపై 21 నుంచి 24 క్వింటాళ్లు సగటున వచ్చిందని రైతులు అంటున్నారు. జిలకర మసూర, ఎన్‌డీఎల్‌ఆర్-8 రకాల వరిధాన్యాన్ని క్వింటాల్ 8వేల నుంచి రూ.8,500లతో రైతులు మిల్లర్లకు విక్రయించారు. పంట మిల్లర్ల చేతికి వెళ్లిన తర్వాత నేడు అదే ధాన్యం ధర రూ. 13,500 నుంచి రూ. 14వేల వరకు పెరిగింది. అలాగే
ఎన్‌ఎల్‌ఆర్ రకం ధాన్యాన్ని రైతులు క్వింటాల్ రూ. 7,500లతో విక్రయించగా నేడు రూ. 9,500కు చేరింది.
అక్రమ నిల్వలు
అప్పులు చెల్లించడానికో లేదా కుటుంబ అవసరాల నిమిత్తమో దాదాపు రైతులంతా ఇప్పటికే తాము పండించిన ధాన్యాన్ని వ్యాపారులకు విక్రయించుకున్నారు. కొంత స్థోమత ఉన్న రైతులు మాత్రం ధర వస్తుందన్న ఆశతో ఇళ్ల వద్ద ధాన్యం నిల్వ చేసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మార్కెట్లోకి విడుదల చేయకుండా వ్యాపారులు అక్రమ నిల్వలు ఏర్పాటు చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ నిల్వలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల పేర్లతో కూడా వ్యాపారులు గోదాముల్లో నిల్వలు ఉంచినట్లు చెబుతున్నారు.
వెలికితీతకు చర్యలేవీ..
అక్రమ నిల్వల వెలికితీతకు పౌరసరఫరాల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గోడౌన్ల తనిఖీ కంటితుడుపు చర్యగా ఉంటోంది. ఎవరైనా అక్రమ నిల్వలపై సమాచారమిస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జిల్లాలోని గోదాముల్లో బుడ్డశనగలు మినహా వరి ధాన్యం లేదంటూ బుకాయిస్తున్నారు. జిల్లాలో ధాన్యం దిగుబడి తగ్గిందని, మిల్లర్లు లెవీ చెల్లించడానికి కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి బియ్యాన్ని తీసుకొస్తున్నారంటూ వారికి వంత పాడుతున్నారు. బియ్యం ధరలు పెరిగి సామాన్యులు గగ్గోలు పెట్టే సందర్భాల్లో మిల్లర్లు, ట్రేడర్ల ద్వారా బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడం పరిపాటిగా వస్తోంది.
కడప, ప్రొద్దుటూరు రైతుబజార్లలో గతంలో ఏర్పాటుచేసిన విక్రయ కేంద్రాలు చాలా రోజుల క్రితమే మూతపడ్డాయి. ప్రస్తుతం తక్కువ ధరలకు బియ్యాన్ని సరఫరా చేసేందుకు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోకుండా నియంత్రించడంలో భాగంగా అధికార యంత్రాంగం ‘ప్రైజ్ మానిటరింగ్ కమిటీ’(ధరల పర్యవేక్షణ కమిటీ) ఏర్పాటు చేసి సమీక్షలు జరపాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా కమిటీ జాడే లేకుండా పోయింది.