న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా’ దళారులు, మధ్యవర్తులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమమని... ఇది నల్లధనాన్ని, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించడంతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సాయపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా చర్యలతో లబ్ధి పొందిన పలువురితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించారు. దేశీయతకు చిహ్నమైన రూపే కార్డును డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగించుకోవాలని దేశ ప్రజల్ని కోరారు.
జనానికి నేరుగా సేవలు...
‘‘డబ్బుల్ని దిండ్ల కింద పెట్టుకునే వారున్న ఈ దేశంలో... దళారులు లేకుండా రేషన్ పొందలేని ఈ దేశంలో... డిజిటల్ చెల్లింపుల గురించి చెప్పినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. కానీ, దీనివల్ల సేవలు నేరుగా అందుతున్నాయని లబ్ధిదారులు చెప్పడమే విమర్శకులకు గట్టి సమాధానం. రేషన్ కోసం ఇప్పుడు దళారులు అవసరం లేదు.
ప్రజలు తాము కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోనే పొందుతున్నారు. గ్రామాల్లోని పేద రైతులు డీజిటల్ చెల్లింపుల బాట పడుతుండటంతో దళారులు వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు సురక్షితం కాదని అబద్ధాలు చెబుతున్నారు.
లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు పంపుతుండటంతో వారి వ్యాపారం తగ్గింది’’ అని ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియాతో దళారులకు కమీషన్ కరువైందన్నారు. నల్లధనానికి, బ్లాక్ మార్కెట్‌కు (అక్రమమార్గంలోకి మళ్లించడం), మధ్యవర్తులకు డిజిటల్ ఇండియా అడ్డుకట్ట వేసిందని చెప్పారాయన. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ కర్తవ్యంగా పేర్కొన్నారు.
దేశీ కార్డులను వాడండి
‘‘ప్రభుత్వం తెచ్చిన చెల్లింపుల యాప్ భీమ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 10,983 కోట్ల విలువైన 91.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2016–17లో భీమ్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.695 కోట్లే’’ అని వివరించారు. భీమ్ ద్వారా చెల్లించేందుకు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా వర్తకులను, దుకాణదారులపై వినియోగదారులు ఒత్తిడి తేవాలని కోరారు.
దేశీయంగా రూపొందించిన రూపే క్రెడిట్/ డెబిట్ కార్డులను వినియోగించాలని లేదంటే ప్రాసెసింగ్ ఫీజులు విదేశీ కంపెనీలకు వెళతాయని చెప్పారాయన. దేశంలో 50 కోట్ల రూపే కార్డులు ఉన్నాయంటూ... ఈ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు రూ.2,347 కోట్లకు పెరిగాయన్నారు. దేశ భక్తి గురించి మాట్లాడేవారు రూపే కార్డును వినియోగించడం వల్ల కూడా దేశానికి ఒక విధంగా సేవ చేయవచ్చని సూచించారు.
వెనుకబడిన వర్గాల పురోగతి
డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 1.25 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 70 శాతం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులవారే ఉన్నారని మోదీ చెప్పారు. ఇన్నాళ్లూ వెనుకబడి ఉన్న ఓ పెద్ద సమూహం డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల పురోగతి చెందుతున్నట్టు తెలుస్తోందన్నారు.
ఎలక్ట్రానిక్స్ తయారీతో భారీగా ఉద్యోగాలు
‘‘ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 23 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో 2014లో మొబైల్ హ్యాండ్‌సెట్లు, వాటి కాంపోనెంట్ల తయారీ కేంద్రాలు 2 మాత్రమే ఉండగా, అవిప్పుడు 120కి పెరిగాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి’’ అని వివరించారు.
రూ.550 కోట్లతో చేపట్టిన బీపీవో ప్రోత్సాహ పథకం వల్ల 2 లక్షల ఉద్యోగాలు సమకూరాయన్నారు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు డిజిటల్ సేవలందించే ప్రాథమిక కేంద్రాలుగా పనిచేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment