మళ్లీ నేనే! | Traditional Independence Day Speech From Red Fort Turned To Election Battle Cry Over The Years | Sakshi
Sakshi News home page

మళ్లీ నేనే!

Published Wed, Aug 16 2023 1:40 AM | Last Updated on Wed, Aug 16 2023 1:41 AM

Traditional Independence Day Speech From Red Fort Turned To Election Battle Cry Over The Years - Sakshi

ఎర్రకోట పై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ 

2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్‌ అనే కలను సాకారం చేసుకునే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలో భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రజలకు ఇది ‘మోదీ కీ గ్యారంటీ’. 

దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్‌ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ ఏర్పాటు చేశాం. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. –ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తానని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గి, మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్‌’ అనే కలను సాకారం చేసుకొనే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి 90 నిమిషాలపాటు ప్రసంగించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రెండోసారి ప్రధానిగా మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కావడం విశేషం. ఎర్రకోటపై ప్రసంగించడం ఇది వరుసగా పదోసారి. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...   
 


దుష్ట రాజకీయాలపై యుద్ధమే  

వారసత్వ పార్టీలను ప్రజలంతా వ్యతిరేకించాలి. బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి చాలా హాని కలిగించాయి. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయాయి. దుష్ట రాజకీయాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసే పనులు మరో 1,000 సంవత్సరాలపాటు ప్రభావం చూపుతాయి.

 మనకు సమర్థవంతమైన యువ జనాభా ఉంది, గొప్ప ప్రజాస్వామ్యం ఉంది, వైవిధ్యం ఉంది. మన ప్రతి కల నెరవేరడానికి ఈ మూడు అంశాలు(త్రివేణి) చాలు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవినీతి పార్టీలతో నిండిపోయింది. బుజ్జగింపు రాజకీయాలకు, కుటుంబ పాలనకు పెద్దపీట వేసే పార్టీలు ‘ఇండియా’ పేరిట ఒక్కటయ్యాయి. ఎన్డీయే పాలనలో ‘న్యూ ఇండియా’ ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తోంది.   

‘బంగారు పక్షి’గా భారత్‌  
మనం గత 1,000 సంవత్సరాల బానిసత్వం, 1,000 సంవత్సరాల భవ్యమైన భవిష్యత్తు మధ్య మైలురాయి వద్ద ఉన్నాం. పరుగు ఆపొద్దు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రాబోయే వెయ్యేళ్ల దిశగా మన అడుగులను నిర్దేశించుకోవాలి. 2047 నాటికి మనదేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, 140 కోట్ల మంది సంకల్పం. మనలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర నిరూపించింది. ‘బంగారు పక్షి’గా మన దేశం మళ్లీ మారడం ఖాయం. మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది.  

ధరల నియంత్రణకు మరిన్ని  చర్యలు  
ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది.   

6జీ టెక్నాలజీకి దేశం సన్నద్ధం  
దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్‌ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్‌్కఫోర్స్‌ ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్‌ చేరుకుంది. క్వాంటమ్‌ కంపూటర్ల రాక కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికత ప్రభావితం చేస్తోంది.

‘డిజిటల్‌ ఇండియా’ విజయగాథలను తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మన దేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం. గతంతో పోలిస్తే డేటా చార్జీలు భారీగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతోంది. శక్తివంతమైన జి–20 కూటమికి ఈసారి మనమే సారథ్యం వహిస్తున్నాం.  

స్వయం సహాయక సంఘాలకు అగ్రి–డ్రోన్లు  
వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కొత్త పథకం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల వాడకంలో, మరమ్మతుల్లో శిక్షణ ఇస్తాం. తొలుత 15,000 స్వయం సహాయక సంఘాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. వారికి అగ్రి–డ్రోన్లు అందజేస్తాం. మహిళల సారథ్యంలోనే దేశాభివృద్ది జరగాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా కృషి చేస్తున్నాం.

2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే నా లక్ష్యం. రైతాంగ ప్రయోజనం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.2.5 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేశాం. ఎరువులపై భారీగా రాయితీలు ఇస్తున్నాం. అలాగే చౌక ధరలకే ఔషధాలు విక్రయించే ‘జన ఔషధి కేంద్రాల’ సంఖ్యను 25,000కు పెంచుతాం. నగరాల్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలని భావించే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాల వడ్డీల నుంచి ఉపశమనం కలిగించడానికి పథకం ప్రారంభిస్తాం. 


9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం
గత తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేశాం. పారదర్శకత తీసుకొచ్చాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం. అవినీతిపరుల ఆస్తుల స్వాదీనం తొమ్మిదేళ్లలో 20 రెట్లు పెరిగింది. అవినీతిపరులకు కోర్టుల నుంచి బెయిల్‌ దొరకడం కష్టంగా మారింది. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. పునాదిరాళ్లు వేశాం. వాటిని నేనే ప్రారంభిస్తానన్న విశ్వాసం ఉంది. పార్లమెంట్‌ నూతన భవన నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తిచేశాం.

2014లో మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 140 కోట్ల మంది శ్రమతో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం. ఇదంతా సులభంగా జరగలేదు. అవినీతిని అరికట్టాం. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం. గ్లోబల్‌ సప్లై చైన్‌లో భారత్‌ ఇప్పుడు ముఖ్యమైన భాగస్వామి. మన దేశం సాధించిన విజయాలు ప్రపంచ స్థిరత్వానికి ఒక హామీగా నిలుస్తాయి. భారత్‌కు ఇక తిరుగులేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. శషభిషలకు ఇక తావులేదు. మన పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగింది. బంతి మన కోర్టులోనే ఉంది. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు.  

మన స్టార్టప్‌లు భేష్‌   
ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. మన యువత కృషితోపాటు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే ఇందుకు కారణం. యువ శక్తిపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి 98,119 స్టార్టప్‌లను ప్రభుత్వం గుర్తించింది. వాటికి నిధులతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం.

నిర్దేశిత హరిత లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మన సైనిక దళాలను ఆధునీకరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. గతంలో బాంబుపేలుళ్ల గురించి వినేవాళ్లం. ఇప్పుడు దేశం భద్రంగా ఉంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతాం. స్పేస్‌ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్నాం. వందే భారత్‌ రైళ్లు ప్రారంభించుకుంటున్నాం. బుల్లెట్‌ రైళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.  

నా ప్రతి కల జనం కోసమే  
ప్రజలంతా నా వాళ్లే. నేను ప్రజల నుంచే వచ్చా. ప్రజల కోసమే జీవిస్తా. నేను ఏదైనా కల కన్నానంటే అది జనం కోసమే. వారి కోసం కష్టపడి పని చేస్తున్నా. ఇదంతా కేవలం ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి చేయట్లేదు, ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఆ ప్రజల బాధలను, కష్టాలను సహించలేను. ప్రజల కలలు విచ్ఛిన్నమైపోవడాన్ని అనుమతించను. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జనం కోసం పని చేస్తున్నా.   

 విశ్వకర్మ యోజన  
రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లతో విశ్వకర్మ యోజన అమలు చేస్తాం. వడ్రంగులు, స్వర్ణకారుల వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం లక్ష్యం. దీంతో ప్రధానంగా ఓబీసీలు ప్రయోజనం పొందుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్‌ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పేదరికం తగ్గితే మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది. దేశంలో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఇంకేమీ ఉండదు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement