సరుకులపై ‘సమ్మె’ట | Prices of essential commodities may rise | Sakshi
Sakshi News home page

సరుకులపై ‘సమ్మె’ట

Published Thu, Jul 26 2018 4:28 AM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM

Prices of essential commodities may rise - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిత్యావసర వస్తువుల ధరలపై లారీల సమ్మె పోటు పడింది. దేశవ్యాప్తంగా లారీల బంద్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధర లు 15 శాతం వరకు పెరిగాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. లారీ సమ్మెను సాకుగా చూపుతూ రాజధానిలోని పలువురు వ్యాపారులు బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి, ఆలు, కర్నూలు నుంచి సరఫరా అయ్యే బియ్యం, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చే టమోట ధరలు పెరిగాయి. భవన నిర్మాణ రంగంపైనా సమ్మె ప్రభావం  కనిపిం చింది. సిమెంట్, స్టీల్‌ రవాణాకు ఆటంకం కలగడం తో నిర్మాణ రంగం స్తంభించింది. రాజధానికి రోజూ సరఫరా అయ్యే సుమారు 5 వేల లారీలకు పైగా ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో నిల్వల ధర లు అనూహ్యంగా పెరిగాయి. సిమెంట్, ఐరన్, కంకర వంటి వస్తువుల సరఫరా ఆగిపోయింది.  

మరింత ఉధృతం చేస్తాం..
మరోవైపు సమ్మె విరమణ దిశగా బుధవారం రవాణా శాఖ అధికారులు లారీ సంఘాలతో సమావేశమైనప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి లేకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సమ్మె విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తా మని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అవసర మైతే అత్యవసర వస్తువులను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. లారీ బంద్‌లో భాగంగా ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు కూడా ఒక రోజు బంద్‌ పాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు కూడా నిరవధిక బంద్‌కు దిగుతారని స్పష్టం చేశారు.

ధరలకు రెక్కలు
హైదరాబాద్‌లోని బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్, కొత్తపేట్, బోయిన్‌పల్లి, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, తదితర మార్కెట్లలోని అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కొంత మేర పెరిగాయి. సమ్మెకు ముందుతో పోలిస్తే రిటేల్‌ మార్కెట్‌లో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంపు ఉంది. వస్తువుల నిల్వలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు సమ్మెను సొమ్ము చేసుకొనేందుకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే కంది పప్పు ధర రూ.60 నుంచి రూ.66కు పెరిగింది. ఎర్ర పప్పు ధర రూ.50 నుంచి రూ.55కు, పెసర పప్పు కిలో రూ.60 నుంచి రూ.67కు పెరిగింది. పంజాబ్‌ నుంచి దిగుమతి అయ్యే మినప పప్పు రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. వంట నూనెల ధరలు లీటర్‌ రూ.86 నుంచి రూ.96కు పెరిగాయి. మదనపల్లి నుంచి నగరానికి వచ్చే టమోటా కిలో రూ.30 నుంచి రూ.40కి చేరింది. చిక్‌బల్లాపూర్‌ నుంచి వచ్చే బిన్నీస్‌ కిలో రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. పచ్చి మిర్చి కిలో ధర రూ.50 నుంచి రూ.60కి పెరిగింది.

భారీగా పడిపోయిన అమ్మకాలు
లారీల సమ్మె వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.2,500 కోట్ల మేర వ్యాపార కార్యకలాపాలు స్తంభించినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. నగరవ్యాప్తంగా వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు పడిపోయింది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల లారీలు సరుకు రవాణా చేస్తుండగా ఒక్క హైదరా బాద్‌ నుంచే 50 వేలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఈ లారీలన్నీ సమ్మెలో పాల్గొనడంతో డీసీఎంలు, ఇతర మినీ వాహనాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్‌కు దిగుమతులు నిలిచిపోయాయి. సమ్మె ఇలాగే కొనసాగితే నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అవుతాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభావం స్వల్పమే
ఇప్పటి వరకైతే సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు డీసీఎంలలో వస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలను తెచ్చేందుకు రైతులు ఆటోలు, చిన్న ట్రాలీలను వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో సమ్మె ప్రభావం తక్కువగానే ఉంది.
– కె.శ్రీధర్, స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రెటరీ, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌

ధరలు పెరిగాయి
హోల్‌సేల్‌ మార్కెట్‌లో కూరగాయల ధరలు కొంతమేరకు పెరిగాయి. దీంతో మేం కూడా ఆ మేరకు ధరలు పెంచి అమ్మాల్సి వస్తోంది. ఈ సీజన్‌లో ఎక్కువగా పండని వాటిపైనా ధరల ప్రభావం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ వచ్చే కూరగాయల విషయంలో లారీల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.  
– జంగయ్య, కూరగాయల వ్యాపారి, మీరాలంమండి

ధరలు భగ్గుమంటున్నాయి
రెండ్రోజుల నుంచి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఇటీవల వరకు వంకాయ, ఆలు, గొకరకాయ ధరలు కిలో రూ.30 వరకు ఉండేవి. ఇప్పుడు రూ.50 వరకు పలుకుతున్నాయి. ఇదేంటని అడిగితే సమ్మె ప్రభావమని చెబుతున్నారు.  
– సయ్యద్‌ ముక్తార్, వినియోగదారుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement