breaking news
talks postponed
-
సరుకులపై ‘సమ్మె’ట
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలపై లారీల సమ్మె పోటు పడింది. దేశవ్యాప్తంగా లారీల బంద్ నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధర లు 15 శాతం వరకు పెరిగాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. లారీ సమ్మెను సాకుగా చూపుతూ రాజధానిలోని పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి, ఆలు, కర్నూలు నుంచి సరఫరా అయ్యే బియ్యం, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చే టమోట ధరలు పెరిగాయి. భవన నిర్మాణ రంగంపైనా సమ్మె ప్రభావం కనిపిం చింది. సిమెంట్, స్టీల్ రవాణాకు ఆటంకం కలగడం తో నిర్మాణ రంగం స్తంభించింది. రాజధానికి రోజూ సరఫరా అయ్యే సుమారు 5 వేల లారీలకు పైగా ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో నిల్వల ధర లు అనూహ్యంగా పెరిగాయి. సిమెంట్, ఐరన్, కంకర వంటి వస్తువుల సరఫరా ఆగిపోయింది. మరింత ఉధృతం చేస్తాం.. మరోవైపు సమ్మె విరమణ దిశగా బుధవారం రవాణా శాఖ అధికారులు లారీ సంఘాలతో సమావేశమైనప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి లేకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సమ్మె విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తా మని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అవసర మైతే అత్యవసర వస్తువులను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. లారీ బంద్‌లో భాగంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా ఒక రోజు బంద్ పాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా నిరవధిక బంద్‌కు దిగుతారని స్పష్టం చేశారు. ధరలకు రెక్కలు హైదరాబాద్‌లోని బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్, కొత్తపేట్, బోయిన్పల్లి, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, తదితర మార్కెట్లలోని అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కొంత మేర పెరిగాయి. సమ్మెకు ముందుతో పోలిస్తే రిటేల్ మార్కెట్లో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంపు ఉంది. వస్తువుల నిల్వలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు సమ్మెను సొమ్ము చేసుకొనేందుకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే కంది పప్పు ధర రూ.60 నుంచి రూ.66కు పెరిగింది. ఎర్ర పప్పు ధర రూ.50 నుంచి రూ.55కు, పెసర పప్పు కిలో రూ.60 నుంచి రూ.67కు పెరిగింది. పంజాబ్ నుంచి దిగుమతి అయ్యే మినప పప్పు రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. వంట నూనెల ధరలు లీటర్ రూ.86 నుంచి రూ.96కు పెరిగాయి. మదనపల్లి నుంచి నగరానికి వచ్చే టమోటా కిలో రూ.30 నుంచి రూ.40కి చేరింది. చిక్బల్లాపూర్ నుంచి వచ్చే బిన్నీస్ కిలో రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. పచ్చి మిర్చి కిలో ధర రూ.50 నుంచి రూ.60కి పెరిగింది. భారీగా పడిపోయిన అమ్మకాలు లారీల సమ్మె వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.2,500 కోట్ల మేర వ్యాపార కార్యకలాపాలు స్తంభించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరవ్యాప్తంగా వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు పడిపోయింది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల లారీలు సరుకు రవాణా చేస్తుండగా ఒక్క హైదరా బాద్ నుంచే 50 వేలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఈ లారీలన్నీ సమ్మెలో పాల్గొనడంతో డీసీఎంలు, ఇతర మినీ వాహనాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్‌కు దిగుమతులు నిలిచిపోయాయి. సమ్మె ఇలాగే కొనసాగితే నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభావం స్వల్పమే ఇప్పటి వరకైతే సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు డీసీఎంలలో వస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలను తెచ్చేందుకు రైతులు ఆటోలు, చిన్న ట్రాలీలను వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో సమ్మె ప్రభావం తక్కువగానే ఉంది. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ ధరలు పెరిగాయి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయల ధరలు కొంతమేరకు పెరిగాయి. దీంతో మేం కూడా ఆ మేరకు ధరలు పెంచి అమ్మాల్సి వస్తోంది. ఈ సీజన్లో ఎక్కువగా పండని వాటిపైనా ధరల ప్రభావం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే కూరగాయల విషయంలో లారీల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. – జంగయ్య, కూరగాయల వ్యాపారి, మీరాలంమండి ధరలు భగ్గుమంటున్నాయి రెండ్రోజుల నుంచి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఇటీవల వరకు వంకాయ, ఆలు, గొకరకాయ ధరలు కిలో రూ.30 వరకు ఉండేవి. ఇప్పుడు రూ.50 వరకు పలుకుతున్నాయి. ఇదేంటని అడిగితే సమ్మె ప్రభావమని చెబుతున్నారు. – సయ్యద్ ముక్తార్, వినియోగదారుడు -
చర్చలు వాయిదా!
సాక్షి, చెన్నై : కడలిలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ విరుచుకు పడుతూ వస్తున్న విషయం తెలిసిం దే. దాడులకు దిగడంతోపాటుగా దొరికిన జాలర్లను పట్టుకెళ్లి కారాగారాల్లో ఉంచుతున్నారు. పడవల్ని స్వాధీనం చేసుకుని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని జాలర్లలో ఆందోళన, ఆగ్రహావేశాల్ని రగుల్చుతోంది. ఆమరణ దీక్షకు దిగినా, సమ్మె బాట పట్టినా ప్రయోజనం శూన్యం. దీంతో రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చలకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం, డీఎంకే వర్గాలు ఒత్తిడి పెంచాయి. ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈనెల 20న చెన్నై వేదికగా చర్చలు జరగనున్నట్టు ప్రకటిం చింది. దీనిని రాష్ట్ర జాలర్లు ఆహ్వానించారు. ఈ చర్చల ద్వారా రెండు దేశాల మధ్య సఖ్యత కుదరడం ఖాయం అన్న అభిప్రాయూనికి వచ్చారు. వాయిదా: శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను, తమిళనాడు చెరలో ఉన్న శ్రీలంక జాలర్లను విడిచి పెట్టడమే లక్ష్యంగా తొలి అడుగును కేంద్రం వేసింది. శ్రీలంకలో ఉన్న 200 మందికి పైగా తమిళ జాలర్ల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. బృందాలుగా ఇక్కడికి తమిళ జాలర్లు వస్తున్నారు. అలాగే, ఇక్కడున్న శ్రీలంక జాలర్లు గుంపులుగా స్వదేశానికి పయనం అవుతున్నారు. విడుదల పర్వం ఆరంభం కావడంతో ఇక చర్చలతో వివాదాలకు ముగింపు పలకొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో శ్రీలంక మత్స్యశాఖ మంత్రి రజిత సేన రత్న మాత్రం చర్చల గురించి ఇంకా తేదీ ఖరారు కాలేదని ప్రకటించడం జాలర్లను డైలమాలో పడేసింది. చర్చలు సాగేనా అన్న ఉత్కంఠ నెలకొన్న సమయంలో చర్చలకు తొలుత పెట్టిన ముహూర్తం అచ్చిరానట్టుగా తేదీని మారుస్తూ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. 27న నిర్వహిస్తామని ప్రకటన చెన్నైలో సోమవారం జరగాల్సిన జాలర్ల సంఘాల ప్రతినిధుల భేటీ ఈనెల 27కు వాయిదా పడ్డట్టుగా అందులో పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన మేరకు 20వ తేదీ చర్చకు తాము ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. అయితే, కొన్ని కారణాల దృష్ట్యా, తేదీని మార్చడం జరిగిందని వివరించారు. శ్రీలంక నుంచి చెన్నైకు రాబోతున్న జాలర్ల సంఘాల ప్రతినిధుల జాబితాను తమిళనాడుకు పంపుతున్నట్టు కేంద్రం ప్రకటించిందని పేర్కొన్నారు. ఆ జాబితా పరిశీలన మేరకు చర్చలకు రెడీ అవుతూ తేదీని మార్చామే గానీ, ఎలాంటి అసహనం, అసంతృప్తికి లోను కావాల్సిన అవసరం లేదని వివరించారు. తమిళ జాలర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, చర్చల ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంద్దామని సీఎం జయలలిత భరోసా ఇచ్చినట్టు అందులో పేర్కొనడ ం విశేషం. నాగైలో నిరసన నాగపట్నం జాలర్లు శనివారం ఆందోళనకు దిగారు. శ్రీలంక ఆధీనంలో ఉన్న తమ పడవల్ని విడిపించే యత్నం చేయాలంటూ బాధిత కుటుంబాలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరుగురు జాలర్లు తమ ఒంటిపై పెట్రోల్, కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశారు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన అక్కడి వారు అడ్డుకున్నారు. అయినా, జాలర్లు తగ్గలేదు. చివరకు మత్స్య శాఖ మంత్రి జయపాల్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్లను బుజ్జగించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. పడవలు తప్పకుండా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో జాలర్లు ఆందోళన విరమించారు.