చర్చలు వాయిదా!
Published Sun, Jan 19 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
సాక్షి, చెన్నై : కడలిలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ విరుచుకు పడుతూ వస్తున్న విషయం తెలిసిం దే. దాడులకు దిగడంతోపాటుగా దొరికిన జాలర్లను పట్టుకెళ్లి కారాగారాల్లో ఉంచుతున్నారు. పడవల్ని స్వాధీనం చేసుకుని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని జాలర్లలో ఆందోళన, ఆగ్రహావేశాల్ని రగుల్చుతోంది. ఆమరణ దీక్షకు దిగినా, సమ్మె బాట పట్టినా ప్రయోజనం శూన్యం. దీంతో రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చలకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం, డీఎంకే వర్గాలు ఒత్తిడి పెంచాయి. ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఈనెల 20న చెన్నై వేదికగా చర్చలు జరగనున్నట్టు ప్రకటిం చింది. దీనిని రాష్ట్ర జాలర్లు ఆహ్వానించారు. ఈ చర్చల ద్వారా రెండు దేశాల మధ్య సఖ్యత కుదరడం ఖాయం అన్న అభిప్రాయూనికి వచ్చారు.
వాయిదా: శ్రీలంక చెరలో ఉన్న తమిళ జాలర్లను, తమిళనాడు చెరలో ఉన్న శ్రీలంక జాలర్లను విడిచి పెట్టడమే లక్ష్యంగా తొలి అడుగును కేంద్రం వేసింది. శ్రీలంకలో ఉన్న 200 మందికి పైగా తమిళ జాలర్ల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. బృందాలుగా ఇక్కడికి తమిళ జాలర్లు వస్తున్నారు. అలాగే, ఇక్కడున్న శ్రీలంక జాలర్లు గుంపులుగా స్వదేశానికి పయనం అవుతున్నారు. విడుదల పర్వం ఆరంభం కావడంతో ఇక చర్చలతో వివాదాలకు ముగింపు పలకొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో శ్రీలంక మత్స్యశాఖ మంత్రి రజిత సేన రత్న మాత్రం చర్చల గురించి ఇంకా తేదీ ఖరారు కాలేదని ప్రకటించడం జాలర్లను డైలమాలో పడేసింది. చర్చలు సాగేనా అన్న ఉత్కంఠ నెలకొన్న సమయంలో చర్చలకు తొలుత పెట్టిన ముహూర్తం అచ్చిరానట్టుగా తేదీని మారుస్తూ ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
27న నిర్వహిస్తామని ప్రకటన
చెన్నైలో సోమవారం జరగాల్సిన జాలర్ల సంఘాల ప్రతినిధుల భేటీ ఈనెల 27కు వాయిదా పడ్డట్టుగా అందులో పేర్కొన్నారు. కేంద్రం నిర్ణయించిన మేరకు 20వ తేదీ చర్చకు తాము ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. అయితే, కొన్ని కారణాల దృష్ట్యా, తేదీని మార్చడం జరిగిందని వివరించారు. శ్రీలంక నుంచి చెన్నైకు రాబోతున్న జాలర్ల సంఘాల ప్రతినిధుల జాబితాను తమిళనాడుకు పంపుతున్నట్టు కేంద్రం ప్రకటించిందని పేర్కొన్నారు. ఆ జాబితా పరిశీలన మేరకు చర్చలకు రెడీ అవుతూ తేదీని మార్చామే గానీ, ఎలాంటి అసహనం, అసంతృప్తికి లోను కావాల్సిన అవసరం లేదని వివరించారు. తమిళ జాలర్ల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, చర్చల ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకుంద్దామని సీఎం జయలలిత భరోసా ఇచ్చినట్టు అందులో పేర్కొనడ ం విశేషం.
నాగైలో నిరసన
నాగపట్నం జాలర్లు శనివారం ఆందోళనకు దిగారు. శ్రీలంక ఆధీనంలో ఉన్న తమ పడవల్ని విడిపించే యత్నం చేయాలంటూ బాధిత కుటుంబాలు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరుగురు జాలర్లు తమ ఒంటిపై పెట్రోల్, కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశారు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన అక్కడి వారు అడ్డుకున్నారు. అయినా, జాలర్లు తగ్గలేదు. చివరకు మత్స్య శాఖ మంత్రి జయపాల్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని జాలర్లను బుజ్జగించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. పడవలు తప్పకుండా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో జాలర్లు ఆందోళన విరమించారు.
Advertisement