lorry strike
-
లారీల సమ్మె విరమణ
అమలాపురం: దేశవ్యాప్తంగా ఎనిమిది రోజుల పాటు సాగిన లారీల సమ్మె ముగిసింది. కేంద్ర రవాణా శాఖాధికారులతో న్యూఢిల్లీలో శుక్రవారం చర్చలు ముగిసిన అనంతరం సమ్మె విరమిస్తున్నట్టు లారీ యజమాన్య సంఘాలు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఏపీ లారీ యజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్ ధ్రువీకరించారు. దీనితో ఎనిమిది రోజుల పాటు అసోసియేషన్ల ఆవరణలు, ప్రధాన రహదారులకు పరిమితమైన లారీలు శనివారం తెల్లవారు జాము నుంచి రోడ్డెక్కనున్నాయి. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలను, టోల్గేట్ వ్యవస్థను పారదర్శకం చేయాలనే పలు డిమాండ్లతో గత గురువారం అర్ధరాత్రి నుంచి లారీ యాజమాన్యాలు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎనిమిది వేల వరకు లారీలు ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను కలిపితే రోజుకు సుమారు 15 వేల లారీల ద్వారా సరుకు ఎగుమతి, దిగుమతులు జరుగుతాయని అంచనా. నిత్యావసర వస్తువులు, సిమెంట్, ఐరెన్ వంటి ఉత్పత్తుల దిగుమతి, కొబ్బరి, ఇతర వాణిజ్య, వ్యవసాయ పంటలు, కోడిగుడ్లు, ఆక్వా, ఇసుక, ఇటుకలు, కంకర వంటి ఎగుమతులు జరుగుతుంటాయి. ఎనిమిది రోజుల పాటు సమ్మె వల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 1,900 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్టు అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జిల్లా నుంచి ఉత్తర భారతదేశానికి ఎగుమతులు నిలిచిపోవడంతో ఒక్క కొబ్బరికే రూ.24 కోట్ల లావాదేవీలు నిలిచాయని అంచనా. కాకినాడ పోర్టులో రూ.400 కోట్లు, రాజమహేంద్రవరం కేంద్రంగా రూ.300 కోట్లు, కోడిగుడ్ల ఎగుమతులు నిలవడం వల్ల రూ.32 కోట్ల లావాదేవీలు నిలిచాయి. ఇక మిగిలిన రంగాలు సైతం లారీ సమ్మెల వల్ల ఒడుదొడుకులకు లోనయ్యాయి. కార్మిక, రోజు వారీ ఎగుమతి, స్థానికంగా సరుకు రవాణా కూలీలపై సమ్మె తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎనిమిది రోజుల పాటు సాగిన సమ్మె వల్ల జిల్లా వ్యాప్తంగా లారీల మీద ఆధారపడే డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్‌లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లలో పనిచేసే కార్మికులకు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా, సిమెంట్, కాకినాడ పోర్టు, రాజమహేంద్రవరం హోల్‌సేల్ మార్కెట్, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎఫ్‌సీఐ గొడౌన్లు, రైల్వే గూడ్స్ షెడ్లు వంటి ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాల్లో ఉండే కూలీలు, కార్మికులకు వారం రోజులుగా ఉపాధి లేకుండా పోయింది. సమ్మె విరమణతో రైతులు, కార్మికులు ఊరట చెందారు. -
సమ్మె సమాప్తం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ఎనిమిది రోజులపాటు దేశంలో ఎక్కడికక్కడ స్తంభించిన రవాణా ఇక కదలనుంది. సమ్మె విరమణ ప్రకటనతో అర్ధరాత్రి నుంచే లారీలు రోడ్డెక్కాయి. డిమాండ్లను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో లారీల యజమానులు సమ్మె విరమించారు. డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తో జూలై 20న ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో 93 లక్షల లారీలు రోడ్లపైనే ఆగిపోయాయి. అత్యవసర సర్వీసుల ట్రక్కులు మాత్రం సమ్మెకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం లారీల యజమానులు, ఏఐఎంటీసీ నాయకులతో కేంద్ర రహదారుల శాఖ అధికారులు చర్చలు జరిపారు. లారీ యజమానుల ప్రధాన డిమాండ్లయిన డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించడం, కేంద్ర, రాష్ట్ర పరిధిలోని పలు రకాల ట్యాక్సులను తగ్గించడం, టోల్ గేట్లను ఎత్తివేయడం వంటి వాటిని మరోసారి కేంద్రం ముందుంచారు. డిమాండ్లను పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. వీటి అధ్యయనానికి అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. సింగరేణిలో పేరుకుపోయిన నిల్వలు ఎనిమిది రోజులు జరిగిన సమ్మెతో సింగరేణిలో బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి. రోజూ 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా.. 8 రోజులుగా 3.2 లక్షల టన్నుల నిల్వలు ఉండిపోయాయి. రైలు రవాణాకు ఆటంకం లేకున్నా.. లారీల ద్వారా జరగాల్సిన బొగ్గు రవాణా స్తంభించిపోయింది. ఉత్తర తెలంగాణ నుంచి రాజధానితోపాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా కావాల్సిన ఇసుక, సిమెంటు, గ్రానైటు, కంకర, మట్టి తదితరాల రవాణా కూడా స్తంభించింది. నల్లగొండలో లారీ సమ్మె అరెస్టుల దాకా వెళ్లింది. సమ్మెలో భాగంగా రోడ్డుపై వాహనాలను అడ్డుకున్న డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని, రాత్రంతా తీవ్రంగా కొట్టారని లారీ యజమానుల సంఘం ఆరోపించింది. రాష్ట్రంలో అర్ధరాత్రిదాటాక విరమణ దేశవ్యాప్తంగా సమ్మె విరమించినప్పటికీ.. తెలంగాణలో సమ్మె కొనసాగించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం తొలుత నిర్ణయించింది. అయితే అర్ధరాత్రి దాటాక తాము కూడా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది. బత్తాయికి భారీ నష్టం పూర్వ నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధికంగా ఉత్పత్తి అయ్యే బత్తాయిపై లారీల సమ్మె ప్రభావం పడింది. సీజన్ కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, విశాఖపట్నం నుంచి కుప్పలుతెప్పలుగా వచ్చిన బత్తాయితో గడ్డిఅన్నారం మార్కెట్లో నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రంలోకి యాపిల్, దానిమ్మ, పుచ్చకాయ తదితరాలు దిగుమతి అవుతుండగా, రాష్ట్రం నుంచి ఒక్క బత్తాయి మాత్రమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచే రోజూ 100 లారీల్లో 600 టన్నుల నుంచి 700 టన్నుల బత్తాయి ఇతర ప్రాంతాలకు తరలుతోంది. ఇందులో 30 శాతం రాష్ట్ర పరిధిలోని ఇతర మార్కెట్లకు వెళ్తుండగా, మరో 60 శాతం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ముంబైలకు ఎగుమతి అవుతోంది. టన్ను ధర వేసవిలో రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండగా.. తాజాగా లారీల సమ్మె నేపథ్యంలో రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది.. -
లారీల సమ్మె ప్రభావంతో సామాన్యుల విలవిల
-
లారీల సమ్మెతో దళారీల దందా!
సాక్షి, అమరావతి: వారం రోజుల నుంచి జరుగుతున్న లారీల సమ్మె సెగ పరిశ్రమలతోపాటు సామాన్యులను తాకుతోంది. లారీల సమ్మె దీర్ఘకాలం జరిగే సూచనలు కనపడుతుండటంతో హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభిం చారు. కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకుల ధరలను పెంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేవాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇదే సమయంలో స్థానికంగా పండే కూరగాయల ధరలు తగ్గడం గమనార్హం. ఉల్లిపాయలు, క్యాప్సికం, టమోటా, క్యాబేజీ లాంటి కూరగాయల ధరలు పెరగ్గా.. వంకాయలు, బెండ, దొండ లాంటిస్థానికంగా పండేవాటి ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవటంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా, మామిడి రైతుల ఆక్రందన లారీల సమ్మె ప్రభావం ఆక్వా, మామిడపండ్ల ఎగుమతిపై బాగా కనిపిస్తోంది. ధరలు బాగున్నా సమ్మె కారణంగా చెరువుల్లో చేపలు, రొయ్యల సేకరణను నిలిపివేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఆక్వా రైతు ఒకరు వాపోయారు. ప్రస్తుత సీజన్లో నీలం, చిత్తూరు మామిడి రకాన్ని ఎగుమతి చేస్తామని సమ్మె కారణంగా కాయలు కోయకుండా చెట్లకే వదిలేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. రేటు బాగున్నా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని, వర్షాలు పడితే చేతికి వచ్చిన పంట దక్కదని చిత్తూరు జిల్లా రైతులు వాపోతున్నారు. బోసిపోయిన బెజవాడ వన్‌టౌన్ మార్కెట్ నిత్యం రూ. వందల కోట్ల టర్నోవర్‌తో కళకళలాడే విజయవాడ వన్‌టౌన్ హోల్‌సేల్ మార్కెట్ లారీల సమ్మె కారణంగా వెలవెలపోతోంది. సాధారణంగా ఆషాడమాసంలో వ్యాపారం తక్కువగా ఉంటుంది. సమ్మె మరో వారం రోజులపాటు జరిగితే శ్రావణమాసం వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వస్త్రలత వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లారీలు ఆగిపోవడంతో సుమారు 10,000 మంది హమాలీలు కూలీ దొరక్క పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ విక్రయిస్తున్న వాహన డీలర్లు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాలపై మాత్రం సమ్మె ప్రభావం అంతగా కనిపించడం లేదు. జీఎస్టీలో చాలా వస్తువులు రేట్లు తగ్గడంతో పాత సరుకును విక్రయించాలనే ఉద్దేశంతో కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం లేదని ఎలక్ట్రానిక్ గూడ్స్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. తాము సాధారణంగా నెల రోజుల స్టాక్ నిర్వహిస్తామని, దీంతో ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఆటోమొబైల్ రంగంపై లేదని కార్లు, ద్విచక్రవాహనాల డీలర్లు తెలిపారు. సమ్మె మరో వారం రోజులు కొనసాగితే మాత్రం వాహన కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సర్కారుకు సోమవారం వరకు గడువు పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, టోల్ గేట్ చార్జీల తగ్గింపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే సమ్మెను ఉధృతం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు చెప్పారు. అప్పటివరకు సామాన్యులకు ఇబ్బంది లేకుండా సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. సోమవారం దాకా నిత్యావసర సరుకులు, పెట్రోల్ లాంటి వాటికి మినహాయింపు కొనసాగుతుందన్నారు. లారీల సమ్మెకు సంఘీభావంగా పెట్రోలియం ట్యాంకర్లు కూడా సమ్మె చేస్తున్నారని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పెట్రోలియం డీలర్ల ఫెడరేషన్ ఖండించింది. లారీల సమ్మెకు సంఘీభావం ప్రకటించే అంశంపై ఇంత వరకు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. టమాట రైతులకు రూ.20 కోట్ల నష్టం చిత్తూరు: లారీల సమ్మె టమాటా రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో నిత్యం జరిగే రూ.2.5 కోట్ల లావాదేవీలపై ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిబెంగాల్ తదితర రాష్ట్రాలకు టమాట, క్యాబేజీ, ఇతర కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతి అవుతుంటాయి. ఇతర రాష్ట్రాలకు రోజూ 4 వేల టన్నుల టమాటాలు ఎగుమతి చేస్తారు. సమ్మె వల్ల టమాటా రైతులకు ఇప్పటివరకూ సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు పరిసరాల్లోని బెల్లం తయారీ రైతులు కూడా రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తిలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు కడప, ఒడిశా నుంచి రావాల్సిన ముడిసరుకు ఆగిపోయింది. సమ్మెతో కృష్ణపట్నం, ఎన్నూర్ ఓడరేవుల నుంచి ఎరువుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది. ‘తూర్పు’న ఆగిన 35 వేల లారీలు రాయవరం (తూర్పుగోదావరి జిల్లా): సమ్మె కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో 35,000 లారీలు కదలడం లేదు. బియ్యం, కోడిగుడ్లు, కొబ్బరి, అరటితోపాటు ఇటుక తదితరాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళాదుంప, క్యారెట్‌తోపాటు సిమెంట్, ఐరన్ దిగుమతులు ఆగిపోయాయి. జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన రావులపాలెం, రాజమహేంద్రవరం, మండపేట, తుని, కాకినాడ, అనపర్తి, పిఠాపురం, కత్తిపూడి, ఏలేశ్వరం, జగ్గంపేటలో సమ్మె ప్రభావం స్పష్టంగా ఉంది. గత వారం రోజులుగా లారీలు నిలిచిపోవడంతో రూ.70 కోట్ల దాకా నష్టపోయినట్లు లారీ యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. -
సెగ మొదలైంది..
సాక్షి, హైదరాబాద్ : లారీల సమ్మె సెగ మొదలైంది. ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక వర్గాలు, సామాన్యులపైనా ప్రభావం పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు క్రమంగా పెరుగుతు న్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా నిలిచి పోవడంతో పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కడికక్కడే నిలిచిపో యాయి. లారీల సమ్మె గురువారంతో వారానికి చేరింది. లారీ యజమానుల సమస్యలతో పాటు డీజిల్‌ను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తేవాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లతో సాగుతోన్న సమ్మె ప్రభావం నెమ్మదిగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె మొదలైతే సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానులను చర్చలకు ఆహ్వానించేవి. కానీ, లారీ యజమానుల డిమాండ్లన్నీ కేంద్ర పరిధిలోనివే కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ధరలు.. ప్రత్యామ్నాయ చర్యలు నిత్యావసర సరుకుల లారీలు సమ్మెలో పాల్గొనకపో వడంతో సామాన్యులకు పెద్దగా ఇబ్బంది లేకున్నా.. రవాణా మీద ఆధారపడ్డ పప్పులు, ధాన్యాలు, ఇతర నిత్యావసరాలపై దాని ప్రభావం పడుతోంది. దీంతో ధరలు పెరిగే అవకాశాలున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ పరిధిలోని గోదాముల్లో నెలరోజులకు సరిపడా ఆహారపదార్థాలున్నాయి. వ్యాపారులు కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిల్వలు తగ్గకుండా, నిత్యావసరాల రవాణాకు ఆటంకం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోందని సమాచారం. డీసీఎం వ్యానులు, త్రీవీలర్స్ ద్వారా కూరగాయలు, ధాన్యం, ఇతర నిత్యావసరాలను రవాణా చేయాలని.. ఫలితంగా ధరలు పెరగకుండా, బ్లాక్ మార్కెట్ నియంత్రణకు తన వంతు ప్రణాళికను సిద్ధం చేస్తోన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎస్కార్ట్ సాయంతో కాళేశ్వరానికి సిమెంట్ కాళేశ్వరానికి సిమెంటు కొరత ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిమెంటు లారీలు సమ్మెలో పాల్గొనడం.. ప్రాజెక్టు వద్ద నిల్వ ఉంచిన సిమెంట్ నిండుకోవడంతో పోలీసు పహారాలో సిమెంటు సరఫరా చేస్తున్నారు. పెద్దపల్లి, మహారాష్ట్ర నుంచి రావాల్సిన సిమెంట్ లారీలను భారీ బందోబస్తు మధ్య తరలిస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు కంకర కొరత తీర్చేందుకు పరకాల, రామడుగు నుంచి పోలీసు పహారాలో లారీలను తరలించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగాళాదుంపకూ కొరతే.. సమ్మె కారణంగా బంగాళాదుంపకూ కొరత ఏర్పడింది. రాష్ట్రానికి ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఆలూ సరఫరా అవుతుంది. బంగాళాదుంప నిల్వలు చాలాచోట్ల నిండుకున్నట్లు సమాచారం. త్రీవీలర్లు, డీసీఎంల్లో ఇతర కూరగాయలు తరలిస్తుండటంతో మిగిలిన కూరగాయలకు కొరత లేదని అధికారులు పేర్కొంటున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రావాల్సిన క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్ల నిల్వలు కూడా నిండుకున్నాయి. మొత్తం మీద ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన కూరగాయలకు కొరత ఏర్పడుతోంది. పేరుకుపోతోన్న ఉత్పత్తులు.. దేశవ్యాప్తంగా రవాణా స్తంభించడంతో తెలంగాణలాంటి తీర ప్రాంతం లేని రాష్ట్రాల్లో ఉత్పత్తులన్నీ పేరుకుపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నా.. రవాణా స్తంభించిపోయింది. కరీంనగర్ నుంచి జరగాల్సిన ఇసుక, గ్రానైట్ కూడా నిలిచిపోయాయి. సమ్మె కారణంగా ఎక్కువ ప్రభావితమైంది సిమెంటు రంగమే. ఉత్పత్తి జరుగుతున్నా.. లారీలు కదలకపోవడంతో సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. నిర్మాణరంగానికి కీలకమైన సిమెంటు, ఇసుక, గ్రానైటు, మట్టి, కంకర తదితర వస్తువుల రవాణా నిలిచిపోయింది. ఆఖరు అస్త్రంగా.. సమ్మె మరింత ఉదృతమైతే.. ఆయిల్, పాలు, నీళ్లు లాంటి నిత్యావసరాల ట్యాంకర్లు కూడా సమ్మెలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్ సమ్మెకు మద్దతుగా 24న తెలంగాణవ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌లో పాల్గొంది. కేంద్రం దిగిరాకపోతే తాము కూడా నిరవధిక సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేసింది. ఇదే జరిగితే.. సమ్మె ప్రభావం సామాన్యులపైనా పడుతుంది. సమ్మె నష్టం రూ.200 కోట్లు వారం రోజులుగా సమ్మె చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోఛనీయం. సమ్మె వల్ల తెలంగాణ లారీ యజమానులు రూ.200 కోట్లు నష్టపోయారు. అయినా.. న్యాయమైన డిమాండ్ల సాధనలో వెనకడుగు వేసేది లేదు. మా కోర్కెలు నెరవేరేదాకా సమ్మె కొనసాగిస్తాం. – భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం, అధ్యక్షుడు డిమాండ్లు నెరవేర్చాల్సిందే: శ్రీనివాస్‌గౌడ్ లారీ యజమానుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్‌నగర్‌లో లారీ యజమానులు రోడ్డుపై నిర్వహించిన వంటా–వార్పులో లారీ కార్మికులతో కలసి పాల్గొన్నారు. సింగిల్ పర్మిట్ విధానానికి ఏపీ సీఎం చంద్రబాబు వెంటనే అనుమతించాలని శ్రీనివాస్‌గౌడ్ కోరారు. -
లారీల సమ్మెను విరమింపజేయండి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లారీ యజమానులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే లారీ యాజమాన్యాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించాలని గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోనికి తీసుకురావాలన్న డిమాండ్ సహేతుక మేనని అభిప్రాయపడ్డారు. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ యూపీఏ హయాంలో రూ.18 వేలుంటే, ఇప్పుడు రూ.47 వేలకు పెంచారన్నారు. జాతీయ రహదారులపై టోల్ భారం అధికంగా ఉందని, టోల్ ఫ్రీ రవాణాకు అనుమతించాలన్న లారీ యజమానుల డిమాండ్‌ను పరిశీలించాలని కోరారు. తెలంగాణ, ఏపీల్లో ఎక్కడ రోడ్ టాక్స్ చెల్లించినా రెండు రాష్ట్రాల్లో వర్తించేలా చూడాలని, ఇరు రాష్ట్రాల మధ్య చెక్‌పోస్టులను తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని లారీల సమ్మెను విరమింపజేయాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. -
‘పర్మిట్’పై ప్రతిష్టంభనకు తెర ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా లారీల సమ్మె నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సింగిల్ పర్మిట్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు దాటుతున్నా ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని ఈ పర్మిట్ల గొడవతో తెలంగాణకు చెందిన లారీల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో సింగిల్ పర్మిట్ ఒప్పందంపై సంతకం పెట్టి ఫైల్‌ను ఏపీ సీఎంకు పంపినా ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు ట్రావెల్స్ ఒత్తిడితో ఈ ఫైలుపై సంతకానికి చంద్రబాబు ససేమిరా అంటున్నారని తెలంగాణ లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ లారీల నుంచి వస్తున్న ఆదాయాన్ని దండుకోవాలనే ఆలోచనతోపాటు ప్రైవేటు ట్రావెల్స్ లాబీయింగ్‌కు తలొగ్గారని విమర్శిస్తున్నారు. తాత్కాలిక పర్మిట్‌తోనే.. ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాలు విభజన అనంతరం 2015 మార్చి 31 వరకు చలానాలు లేకుండానే తిరిగాయి. కానీ ఆ తర్వాత రెండు రాష్ట్రాలు తాత్కాలిక పర్మిట్లకు తెరతీశాయి. దీని ప్రకారం తెలంగాణ నుంచి ఒక లారీ ఆంధ్రప్రదేశ్ వెళ్లి రావడానికి తాత్కాలిక పర్మిట్ కింద రూ. 1,400, ముడుపుల కింద మరో రూ. 200 కలిపి మొత్తం రూ. 1,600 చెల్లించాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లారీలు తెలంగాణకు రావాలన్నా ఈ మొత్తాన్ని కట్టాల్సిందే. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమైన పరిస్థితి ఉండటంతో ఆదాయం కోసం ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందానికి ఆసక్తి కనబరచట్లేదు. తీరప్రాంతం లేకపోవడం, రైలు మార్గాలు కూడా తక్కువగా ఉండటంతో తెలంగాణ ఎక్కువగా రోడ్డు రవాణా మీదే ఆధారపడి ఉంది. అందులో లారీల ద్వారా జరిగే రవాణా కీలకపాత్ర పోషిస్తోంది. కానీ తెలంగాణకు చెందిన లారీల్లో ఎక్కువ వాటికి నేషనల్ పర్మిట్లు లేవు. 12 ఏళ్లు పైబడిన లారీలకు నేషనల్ పర్మిట్ ఇవ్వకపోవడంతో పాత వాహనాలు తాత్కాలిక పర్మిట్లతోనే ఏపీకి వెళ్లి వస్తున్నాయి. అదే ఏపీ విషయానికి వస్తే అక్కడ ఎక్కువగా నేషనల్ పర్మిట్ ఉన్న లారీలే ఉన్నాయి. దీంతో తెలంగాణకు రావాలన్నా అదనంగా ఏమీ చెల్లించకుండానే ఏపీ లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే లారీలు ప్రతిరోజూ 120 నుంచి 400 వరకు ఉంటాయని అంచనా. ఈ లారీల ద్వారా ఏటా ఏపీకి రూ. కోట్లలో ఆదాయం వస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావట్లేదు. సింగిల్ పర్మిట్ అంటే...! దేశంలో సరుకు రవాణా చేసే ఏ లారీ అయినా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే పర్మిట్ తప్పనిసరి. ఈ పర్మిట్లు రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి నేషనల్ పర్మిట్కాగా రెండోది సింగిల్ పర్మిట్. నేషనల్ పర్మిట్ లారీలు నిర్ణీత రుసుము చెల్లించి దేశంలోని ఏ రాష్ట్రానికైనా సరుకు రవాణా చేయొచ్చు. అదే సింగిల్ పర్మిట్ మాత్రం రెండు పొరుగు రాష్ట్రాల మధ్య జరిగే ఒప్పందమన్నమాట. ఈ పర్మిట్ తీసుకున్న ఒక రాష్ట్రానికి చెందిన లారీ ఏడాదికి రూ. 5 వేలు చెల్లించి ఒప్పందం చేసుకొని పొరుగు రాష్ట్రంలో రాకపోకలు సాగించవచ్చు. దీని ప్రకారమే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో సింగిల్ పర్మిట్ విధానాన్ని తెలంగాణ కొనసాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటకలతో సింగిల్ పర్మిట్ ఒప్పందం కుదుర్చుకున్నా తెలంగాణతో మాత్రం ఒప్పందం కుదుర్చుకోలేదు. ఈసారైనా మోక్షం కలిగించండి 2015లో జరిగిన లారీల సమ్మె సందర్భంగా కూడా ఇదే అంశాన్ని ఇరు రాష్ట్రాలకు నివేదించాం. కానీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికే పలుమార్లు ఏపీకి చెందిన రవాణా మంత్రి, అధికారులను కలిశాం. కానీ ఆ ఫైలు ఆమోదానికి నోచుకోవడం లేదు. ఈ విషయంలో తెలంగాణ సర్కారు ఏపీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేయాలి. లారీల సమ్మె సందర్భంగా మేం ఇదే అంశాన్ని ప్రధానంగా పరిష్కరించాలని కోరుతున్నాం. – భాస్కర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు చంద్రబాబే కారణం తెలంగాణ ప్రభుత్వం సింగిల్ పర్మిట్ విధానానికి ఇప్పటికే ఆమోదం తెలిపింది. కానీ చంద్రబాబుతోనే పేచీ వస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాల ఒత్తిడితో ఆయన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. – వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే (తెలంగాణ లారీ యజమానుల సంఘం గౌరవాధ్యక్షుడు) -
సరుకులపై ‘సమ్మె’ట
సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలపై లారీల సమ్మె పోటు పడింది. దేశవ్యాప్తంగా లారీల బంద్ నేపథ్యంలో హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల వస్తువుల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధర లు 15 శాతం వరకు పెరిగాయి. సమ్మె ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది. లారీ సమ్మెను సాకుగా చూపుతూ రాజధానిలోని పలువురు వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లి, ఆలు, కర్నూలు నుంచి సరఫరా అయ్యే బియ్యం, చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి వచ్చే టమోట ధరలు పెరిగాయి. భవన నిర్మాణ రంగంపైనా సమ్మె ప్రభావం కనిపిం చింది. సిమెంట్, స్టీల్ రవాణాకు ఆటంకం కలగడం తో నిర్మాణ రంగం స్తంభించింది. రాజధానికి రోజూ సరఫరా అయ్యే సుమారు 5 వేల లారీలకు పైగా ఇసుక రవాణా నిలిచిపోయింది. దీంతో నిల్వల ధర లు అనూహ్యంగా పెరిగాయి. సిమెంట్, ఐరన్, కంకర వంటి వస్తువుల సరఫరా ఆగిపోయింది. మరింత ఉధృతం చేస్తాం.. మరోవైపు సమ్మె విరమణ దిశగా బుధవారం రవాణా శాఖ అధికారులు లారీ సంఘాలతో సమావేశమైనప్పటికీ మంత్రి మహేందర్‌రెడ్డి లేకపోవడంతో చర్చలు వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ సమ్మె విరమణ దిశగా ఎలాంటి పురోగతి లేదని, గురువారం నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తా మని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అవసర మైతే అత్యవసర వస్తువులను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. లారీ బంద్‌లో భాగంగా ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా ఒక రోజు బంద్ పాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఆయిల్ ట్యాంకర్ల యజమానులు కూడా నిరవధిక బంద్‌కు దిగుతారని స్పష్టం చేశారు. ధరలకు రెక్కలు హైదరాబాద్‌లోని బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్, కొత్తపేట్, బోయిన్పల్లి, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, తదితర మార్కెట్లలోని అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు కొంత మేర పెరిగాయి. సమ్మెకు ముందుతో పోలిస్తే రిటేల్ మార్కెట్లో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెంపు ఉంది. వస్తువుల నిల్వలు ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు సమ్మెను సొమ్ము చేసుకొనేందుకు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున దిగుమతి అయ్యే కంది పప్పు ధర రూ.60 నుంచి రూ.66కు పెరిగింది. ఎర్ర పప్పు ధర రూ.50 నుంచి రూ.55కు, పెసర పప్పు కిలో రూ.60 నుంచి రూ.67కు పెరిగింది. పంజాబ్ నుంచి దిగుమతి అయ్యే మినప పప్పు రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. వంట నూనెల ధరలు లీటర్ రూ.86 నుంచి రూ.96కు పెరిగాయి. మదనపల్లి నుంచి నగరానికి వచ్చే టమోటా కిలో రూ.30 నుంచి రూ.40కి చేరింది. చిక్బల్లాపూర్ నుంచి వచ్చే బిన్నీస్ కిలో రూ.60 నుంచి రూ.70కి పెరిగింది. పచ్చి మిర్చి కిలో ధర రూ.50 నుంచి రూ.60కి పెరిగింది. భారీగా పడిపోయిన అమ్మకాలు లారీల సమ్మె వల్ల ఇప్పటి వరకు సుమారు రూ.2,500 కోట్ల మేర వ్యాపార కార్యకలాపాలు స్తంభించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నగరవ్యాప్తంగా వ్యాపారం 25 నుంచి 30 శాతం వరకు పడిపోయింది. రోజూ రాష్ట్రవ్యాప్తంగా 2.3 లక్షల లారీలు సరుకు రవాణా చేస్తుండగా ఒక్క హైదరా బాద్ నుంచే 50 వేలకు పైగా లారీలు రాకపోకలు సాగిస్తాయి. ఈ లారీలన్నీ సమ్మెలో పాల్గొనడంతో డీసీఎంలు, ఇతర మినీ వాహనాల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లయిన బేగంబజార్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్‌కు దిగుమతులు నిలిచిపోయాయి. సమ్మె ఇలాగే కొనసాగితే నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభావం స్వల్పమే ఇప్పటి వరకైతే సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి కూరగాయలు డీసీఎంలలో వస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకు కూరలను తెచ్చేందుకు రైతులు ఆటోలు, చిన్న ట్రాలీలను వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో సమ్మె ప్రభావం తక్కువగానే ఉంది. – కె.శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ ధరలు పెరిగాయి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయల ధరలు కొంతమేరకు పెరిగాయి. దీంతో మేం కూడా ఆ మేరకు ధరలు పెంచి అమ్మాల్సి వస్తోంది. ఈ సీజన్లో ఎక్కువగా పండని వాటిపైనా ధరల ప్రభావం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే కూరగాయల విషయంలో లారీల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. – జంగయ్య, కూరగాయల వ్యాపారి, మీరాలంమండి ధరలు భగ్గుమంటున్నాయి రెండ్రోజుల నుంచి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఇటీవల వరకు వంకాయ, ఆలు, గొకరకాయ ధరలు కిలో రూ.30 వరకు ఉండేవి. ఇప్పుడు రూ.50 వరకు పలుకుతున్నాయి. ఇదేంటని అడిగితే సమ్మె ప్రభావమని చెబుతున్నారు. – సయ్యద్ ముక్తార్, వినియోగదారుడు -
కాళేశ్వరం ప్రాజెక్టుకు సమ్మె‘పోటు’
కాళేశ్వరం: లారీల సమ్మెతో జయశంకర్ భూపాలపల్లిలో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. సిమెంటు, డీజిల్ నిల్వలు తరిగిపోతుండటం.. సమ్మె కారణంగా వచ్చే ముడిసరుకు నిలిచిపోవడంతో మరోమూడు రోజుల్లో ఇక్కడ పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ఇంజనీర్లు, ఏజెన్సీల సంస్థల బాధ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత ఎండలు, వర్షాలను మినహాయిస్తే లారీల సమ్మె కారణంగా తొలిసారిగా ఇబ్బందులు ఎదురుకానున్నాయని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీలు, పంపుహౌస్‌ల సమాహారమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువుపట్టు మేడిగడ్డ బ్యారేజీ. ఇక్కడ పనులు పూర్తయితే ప్రాణహిత నది నీటిని ఎత్తిపోతలు, గ్రావిటీ కెనాల్ల ద్వారా తెలంగాణ అంతటికీ పారించవచ్చు. ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా ఇప్పటికే పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు బెడ్ లెవల్ వర్క్ పూర్తయి పిల్లర్ల దశలో నడుస్తున్నాయి. నిత్యం 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. దీని కోసం 2,000 టన్నుల సిమెంటు, 3,000 లీటర్ల డీజిల్ అవసరం అవుతున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చోట్ల పది రోజులకు సరిపడా మెటీరియల్‌ను సంబంధిత ఏజెన్సీలు నిల్వ ఉంచుకుంటున్నాయి. సమ్మెతో ఇప్పటికే ఏడు రోజుల పాటు రా మెటీరియల్ రాక ఆగిపో యింది. మరో మూడు రోజులకు సరిపడ మా త్రమే ఉంది. సమ్మె ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల తర్వాతæ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వరుస కష్టాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 2018 జూలై నాటికి నీటిని కొంత మేరకైనా తరలించాలని ఏడాది కాలంగా పనులు వేగంగా చేపడుతున్నారు. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పగటి వేళ పనులు నిలిపేసి రాత్రి వేళ కొనసాగించారు. దీంతో సుమారు ముప్పై రోజులపాటు పనులు మందగించాయి. ఆ తర్వాత వర్షాల కారణంగా జూలై 2 నుంచి 13 వరకు పని స్థలాల్లోకి నీరు చేరుకోవడంలో నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. మోటార్లు పెట్టి నీటిని తోడి మళ్లీ పనులు ఊపందుకున్న సమయంలో లారీల సమ్మెతో మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకేసారి అన్ని చోట్ల కీలకమైన మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్, కన్నెపల్లి –అన్నారం గ్రావిటీ కెనాల్, అన్నారం బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తోపాటు మేడారం సర్జ్‌పూల్ తదితర అన్ని పని ప్రదేశాల్లో డీజిల్, సిమెంటు స్టాకు పూర్తిగా అడుగంటడం ఇంజనీర్లు, నిర్మాణ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చోట్ల జనరేటర్లు మొదలు లారీలు, టిప్పర్లు, క్రేన్లు, పొక్లెయినర్లు, హైడ్రాలిక్ యంత్రాలు, బ్లూమ్ ప్రెసర్ ఇలా అన్ని భారీ యంత్రాలకు డీజిల్ తప్పనిసరి కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె విరమించేది లేదని లారీ యూనియన్లు వెనక్కి తగ్గడం లేదు. ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సైతం సమ్మెలోకి దిగారు. దీంతో ప్రత్యామ్నయ మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. -
ఐదో రోజుకు చేరుకున్న లారీల సమ్మె
-
కొబ్బరికి లారీల సమ్మె పోటు
పశ్చిమగోదావరి, భీమవరం : ఆలిండియా లారీ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని లారీల యజమానులు బంద్ పాటిస్తుండడంతో కొబ్బరి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. డీజిల్ ధరలు తగ్గించాలని, థర్ట్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్గేట్ తదితర సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి లారీల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం వరకు చేపలు, రొయ్యలు, నిత్యావసర వస్తువుల రవాణాకు ఎటువంటి ఆటంకం కల్పించకపోవడంతో పరిమితి సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయి. అయితే మరో రెండు రోజల్లో పూర్తిస్థాయిలో సమ్మె నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చేపలు, రొయ్యల ఎగుమతులతో పాటు నిత్యావసర వస్తువుల రవాణాను కూడా నిలువరించేందుకు లారీ యజమానుల సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. నిలిచిన కొబ్బరి ఎగుమతులు రాష్ట్ర వ్యాప్తంగా లారీల సమ్మె కారణంగా జిల్లాలో కొబ్బరి వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. రాజస్తాన్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, హర్యానా, కేరళ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వ్యాపారుల వద్ద కొబ్బరి కాయలు గుట్టలు గుట్టలుగా రాశులు పోసి నిల్వచేస్తున్నారు. అలాగే లారీ డ్రైవర్లు, క్లీనర్లు 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడమేగాక కొబ్బరి ఒలుపు, ఎగుమతి, దిగుమతి తదితర పనులు చేసి సుమారు లక్ష మంది కార్మికులకు పనులు లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి వ్యాపారంలో ఈ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1వ తేదీ కొబ్బరి వ్యాపారులు సమ్మె చేయడంతో 10 రోజుల పాటు వ్యాపారం నిలిచిపోయి కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కొబ్బరి వ్యాపారులకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వ్యాపారులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఈ నెల 15వ తేదీ నుంచి కొబ్బరి వ్యాపారం తిరిగి ప్రారంభమైంది. కొబ్బరి ఎగుమతులు జోరందుకుంటున్న సమయంలో లారీల సమ్మె కారణంగా వ్యాపారం నిలిచిపోయిందని, దీంతో కొబ్బరి కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆగస్టు నెల 26న రాఖీ పండుగ నేపథ్యంలో రాజస్థాన్‌కు కొబ్బరి ఎగుమతులు ఎక్కువగా జరుగుతాయని దీనికిగాను నెల రోజుల ముందు నుంచి ఎగుమతులు ప్రారంభం కావల్సి ఉండగా లారీల సమ్మెతో వ్యాపారం నిలిచిపోయిందని కొబ్బరి వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఈ పర్మిట్ విధానం వల్ల సమ్మె చేసిన వ్యాపారులకు లారీల సమ్మె గోరుచుట్టుపై రోకలిపోటులా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకున్న నిల్వలు ఈ నెల ఒకటో తేది నుంచి కొబ్బరి వ్యాపారుల సమ్మె కారణంగా పది రోజుల పాటు వ్యాపారం నిలిచిపోయింది. మళ్లీ లారీల సమ్మెతో ఎగుమతులు లేక మా వద్ద రాశులుగానే కొబ్బరి నిల్వ చేస్తున్నాం. పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన కొబ్బరి కాయలు ఎగమతులు లేకపోవడం పెట్టుబడి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.– కామన రాంబాబు, కొబ్బరి వర్తకుల సంఘం కార్యదర్శి, భీమవరం నిలిచిన కొనుగోళ్లు ఈ నెల ప్రారంభంలో పది రోజుల పాటు కొబ్బరి వ్యాపారులు సమ్మె కారణంగా రైతుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సార్వా సీజన్ ప్రారంభం కావడంతో కొబ్బరిపై ఆదాయం వ్యవసాయానికి ఉపయోగించుకుంటాం. అయితే లారీల బంద్‌తో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నాం.– వేగేశ్న విజయరామరాజు, కొబ్బరి రైతు, కాళ్లకూరు -
నిలిచిన రూ.10 వేల కోట్ల వ్యాపారం
సాక్షి, అమరావతి: గత 5 రోజులుగా నడుస్తున్న లారీల సమ్మె ప్రభావం క్రమంగా సామాన్యులను తాకుతోంది. సమ్మె వల్ల రాష్ట్రంలో రూ. 10 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్లు ఏపీ లారీ యజమానులు సంఘం వెల్లడించింది. కూరగాయల ధరలు రెక్కలు విచ్చుకుంటుండగా, ఇటుక, కంకర, సిమెంట్ సరఫరా తగ్గడంతో నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్ నుంచి బంగాళదుంపలు, మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయ దిగుమతులు ఆగిపోగా, రాష్ట్రం నుంచి టమాటా, ఇతర కూరగాయల ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో కూరగాయల ధరలు క్రమేపీ పెరగుతున్నాయి. తొలుత నిత్యవసర వస్తువులను సమ్మె నుంచి మినహాయించాలని చూసినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో కూరగాయల సరఫరాను ఆపేయాలని నిర్ణయించినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. సిమెంట్, ఇసుక, కంకర సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి పనులు లేక కూలీలు రోడ్డునపడ్డారు. ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఎక్కువగా లేకపోయినా ఇంకో రెండు రోజులు దాటితే మాత్రం అన్ని రంగాలపై ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ క్షణమైనా సమ్మెలోకి పెట్రోలు ట్యాంకర్లు ముఖ్యంగా బియ్యం రవాణాపై లారీల సమ్మె ప్రభావం అధికంగా కనిపిస్తోంది. బియ్యం ఎగుమతుల కోసం కాకినాడలో నాలుగు ఓడలు, పంచదార కోసం రెండు ఓడలు నిలిచి ఉండగా లారీల సమ్మె కారణంగా ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో మిల్లర్లు బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)తో నెట్టుకొస్తున్నట్లు రాష్ట్ర రైస్‌మిల్లర్ల అసోసియేషన్ కార్యదర్శి సాదినేని హన్ముంతరావు తెలిపారు. గత ఐదు రోజుల సమ్మె వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.125 కోట్లు, లారీ యజమన్యాలు రూ. 175 కోట్లు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే మొండి వైఖరి కొనసాగిస్తే నిత్యావసరాల సరఫరాను కూడా నిలిపివేసే ఆలోచన చేస్తున్నట్లు లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు తెలిపారు. ఏక్షణమైనా పెట్రోలు ట్యాంకర్లను కూడా సమ్మెలోకి తీసుకువస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మార్కెటింగ్‌పై లారీల సమ్మె పోటు లారీల సమ్మె మార్కెటింగ్ శాఖ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సమ్మె కారణంగా వాణిజ్య పంటలకు మంచి ధర రాకపోవచ్చనే ఉద్దేశంతో రైతులు మిర్చి, పసుపు, ఉల్లి, పత్తి, సుగంధ ద్రవ్యాలను మార్కెట్ కమిటీలకు దిగుమతి చేయడం లేదు. దీంతో మార్కెట్ కమిటీల ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ధాన్యం, అపరాల విక్రయాలు తగ్గిపోవడంతో దాని ప్రభావం ఆదాయంపై పడింది. సెస్ రూపంలో సాలీనా మార్కెటింగ్ శాఖకు రూ. 150 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఐదు రోజులుగా జరుగుతున్న లారీల సమ్మె కారణంగా సెస్ రూపంలో రావాల్సిన రూ.15 కోట్ల ఆదాయం నిలిచిపోయిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జరిగిన రాష్ట్ర బంద్ విజయవంతం కావడంతో మార్కెట్ కమిటీల్లో పూర్తిగా క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. -
పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు!
సాక్షి, హైదరాబాద్ : లారీల సమ్మె ప్రభావం పెట్రో ట్యాంకర్లపైనా పడింది. ఐదో రోజున మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 4,500 ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. మంగళవారం నుంచి ఆయిల్ ట్యాంకర్లను నిలిపేస్తామని లారీ ఆపరేటర్లు హెచ్చరించడంతో వాహనదారులు సోమవారం బంకుల వద్ద క్యూ కట్టారు. సమ్మె కొనసాగితే గురువారం నాటికి పెట్రోల్ బంకులు పూర్తిగా మూత పడే అవకాశం లేకపోలేదు. పెరిగిన సమ్మె ప్రభావం.. మొదటి నాలుగు రోజులూ తెలంగాణలో లారీల సమ్మె పాక్షికంగా జరిగినా మంగళవారం నుంచి దాని ప్రభావం పెరిగింది. సమ్మె కారణంగా నిత్యావసర సరుకులకు కొంత కొరత ఏర్పడింది. పండ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. సమ్మెను బూచీగా చూపించి వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దండుకుంటున్నారు. కీలకమైన వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడానికి సమ్మె అడ్డంకిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల యూరియా సరఫరాకూ అడ్డంకులు ఏర్పడ్డాయి. వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, విమానాల కోసం ఉపయోగించే ఇంధన సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆపరేటర్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. సమ్మెలో 90 లక్షల లారీలు: శ్రీనివాస్‌గౌడ్ లారీల సమ్మెకు సంఘీభావంగా హైదరాబాద్ చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్, భారత్, హెచ్‌పీ పెట్రోలియం కార్పొరేషన్ల వద్ద లారీ ఓనర్స్, ట్యాంక్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్స్ నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లారీల యజమానుల న్యాయమైన డిమాండ్లు నెరవేరేదాకా సమ్మె కొనసాగుతుందన్నారు. దేశవ్యాప్తంగా సమ్మెలో 90 లక్షల లారీలు పాల్గొంటున్నాయన్నారు. సమ్మె కారణంగా లారీలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 10 కోట్ల కుటుంబాలకు ఇబ్బందిగా మారిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమణకు కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ మధ్య లారీల రాకపోకలకు ఉద్దేశించిన సింగిల్ పర్మిట్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీకి బంద్ నుండి మినహాయింపు ఇచ్చామన్నారు. త్వరలో పెట్రోల్ బంక్‌ల యజమానులు కూడా బంద్‌కు మద్దతు తెలిపి పాల్గొంటారన్నారు. తెలంగాణ పెట్రోలియం ట్యాంకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎస్ సూచనల మేరకు అత్యవసర సర్వీసులను దృష్టిలో ఉంచుకుని ఒక్కరోజే సమ్మె చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, జనార్దన్, సయ్యద్ అరిఫ్ ఉల్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. కాగా, చర్లపల్లి, ఘట్కేసర్, రామగుండం, వరంగల్, సూర్యాపేట ఐఓసీ డిపోల్లో ఆయిల్ ట్యాంకర్ అసోసియేషన్లుసమ్మెలో పాల్గొన్నాయి. రూ.150 కోట్లు నష్టం లారీల సమ్మె కారణంగా నిత్యం దాదాపు రూ.25–30 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. 5 రోజుల సమ్మె కారణంగా లారీ యజమానులకు రూ.150 కోట్లు నష్టం వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయినా ఇప్పటివరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు ఆహ్వానం రాలేదన్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే తమకు మద్దతుగా ఆయిల్, పాలు, తాగునీటి ట్యాంకర్లు కూడా సమ్మెలో పాల్గొంటాయని ఆయన స్పష్టంచేశారు. -
నేటి నుంచి అత్యవసరాల రవాణా బంద్
సాక్షి, అమరావతి: నాలుగు రోజులుగా కొనసాగుతున్న లారీల సమ్మె రవాణా రంగంపై తీవ్రప్రభావం చూపింది. ఎక్కడ లారీలు అక్కడే ఆగిపోయాయి. ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, మందులు, ఇతర అత్యవసర సరుకుల రవాణాకు మినహాయింపు నిచ్చారు. అయితే మంగళవారం నుంచి అత్యవసర సరుకుల రవాణాను సైతం నిలిపేసే విధంగా లారీల యజమానులు చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5 లక్షలకు పైగా లారీలున్నాయి. ఏపీలో 3 లక్షల వరకు లారీలు ఉన్నాయి. 13 జిల్లాల్లో కలిపి గత నాలుగు రోజుల నుంచి 2.80 లక్షలు లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. లారీల యజమానులు నిరవధిక బంద్ కొనసాగిస్తున్నా.. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏపీ వరకు బంద్ కారణంగా ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా వేస్తున్నారు. లారీ యజమానులు రూ.30 నుంచి రూ.40 కోట్లు నష్టపోతున్నట్లు అంచనా. నాలుగు రోజుల నుంచి లారీల నిరవధిక బంద్‌తో ఏపీలో రూ.వెయ్యి కోట్ల లావాదేవీలు ఆగిపోయాయి. కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారుల యత్నాలు లారీల సమ్మెతో నిత్యావసరల సరుకులపై ప్రభావం పడింది. వ్యాపారులు ముందుగానే పక్షం రోజులకు సరిపడా సరుకు దిగుమతి చేసుకుని నిల్వ చేసుకున్నారు. అయితే కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తగ్గిపోయిన డీజిల్ విక్రయాలు మరోవైపు లారీల సమ్మెతో డీజిల్ విక్రయాలు భారీగా పడిపోయాయి. బంద్‌కు ముందు రోజుకు 8,000 లీటర్ల డీజిల్ అమ్మే వారమని, లారీల బంద్ కారణంగా అమ్మకాలు 3,000 లీటర్లకు పడిపోయాయని గుంటూరుకు చెందిన పెట్రోల్ బంక్ యజమాని ఒకరు వాపోయారు. లారీల సమ్మె కారణంగా అమ్మకాలు 70 శాతం వరకు పడిపోయినట్లు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్స్ అంచనా వేస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 1.03 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా ఈ సమ్మె కారణంగా అమ్మకాలు 30 లక్షల లీటర్లకు పడిపోయనట్లు అంచనా వేస్తున్నట్లు ఫెడరేషన్ పేర్కొంది. -
ధరాఘాతం
సాక్షి, హైదరాబాద్ : లారీ సమ్మె పేరుతో వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు ఎడాపెడా పెంచేశారు. సమ్మెను బూచీగా చూపుతూ పండ్లు, కూరగాయలను అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం లారీ ఆపరేట్లు శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పాలు, పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ రవాణాకు అయిదు రోజుల వరకు ఎలాంటి ఆటంకం కల్పించబోమని సంఘాలు ప్రకటించాయి. అయితే తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే అత్యవసర ఉత్పత్తుల రవాణాను కూడా నిలిపేస్తామని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే ఉల్లి, ఆలుగడ్డల దిగుమతులను పలుచోట్ల నిలిపేశారు. వాటిని అత్యవసరాలుగా పరిగణించకపోవడమే కారణమని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు లారీల సమ్మె పాక్షికమని వ్యాపారులు ఈ పేరుతో ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం నుంచి దాడులు నిర్వహిస్తామని ఓ అధికారి వెల్లడించారు. ఉల్లి రేటు పెరుగుతుందా? మహారాష్ట్రలో సమ్మె ఉధృతంగా సాగుతుండటంతో కొద్దిరోజుల్లో ఉల్లిగడ్డ కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అదే జరిగితే మళ్లీ ఉల్లి ధర పెరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పప్పులు, ఉప్పులు ఇతర నిత్యావసర సరుకులు ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి తెలంగాణకు వస్తాయి. తెలంగాణకు పప్పు దినుసులు రోజూ 600 లారీల ద్వారా వస్తాయని అంటున్నారు. వాటి రాక దాదాపు 60 శాతం నిలిచిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు జమ్మూకశ్మీర్ నుంచి వచ్చే యాపిల్ సరఫరా దాదాపు నిలిచిపోయింది. దీంతో వాటి ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్కో యాపిల్ ధర రూ.50 వరకు అమ్ముతున్నారు. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువకు అమ్ముతున్నారు. అరటి పండ్ల ధరలూ పెరిగాయి. మొన్నటిదాకా రూ.40 డజన్ ఉండగా.. ప్రస్తుతం రూ.60–70కి అమ్ముతున్నారు. అలాగే హైదరాబాద్‌కు విదేశాల నుంచి వచ్చే పండ్ల ధరలు కూడా పెరిగాయి. సమ్మెతో దాదాపు 75 శాతం పండ్ల దిగుమతి నిలిచిపోయిందని ఓ అంచనా. తగ్గిన కూరగాయల సరఫరా అత్యవసరాలైన కూరగాయలను లారీ సమ్మె నుంచి మినహాయించినా సమ్మె ప్రభావం కొంతమేర కనిపిస్తోందని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి. సమ్మెకుతోడు మహారాష్ట్రలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో కూరగాయల కొరత ఏర్పడింది. డీసీఎం వ్యాన్లలో కూరగాయలను తరలిస్తే ఇబ్బందుల్లేవని, కానీ లారీల్లో తరలిస్తే నిలిపివేస్తున్నారని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. మన రాష్ట్రానికి రోజూ 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా 19.54 లక్షల టన్నులు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. మిగిలిన కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. టమాట మదనపల్లి నుంచి, వంకాయ, బెండ, మిరపకాయ అనంతపురం నుంచి, మునగ గుజరాత్ నుంచి, క్యాబేజీ, క్యారెట్, బీన్స్ కర్ణాటక నుంచి వస్తాయి. మరికొన్ని నిత్యావసరాలు ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి వస్తాయి. సమ్మె కారణంగా వీటి సరఫరా తగ్గింది. ఒకవైపు వర్షాలు, మరోవైపు లారీల సమ్మెతో కూరగాయల ధరలు కిలోకు నాలుగైదు రూపాయలు అధికంగా ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లిగడ్డ సరఫరా ఆగింది మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డల సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజులుగా ఉల్లి సరఫరా లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ధర పెంచక తప్పడం లేదు. -వెంకన్న, వ్యాపారి, మెహిదీపట్నం -
లారీల సమ్మె ఉధృతం
ఖిలా వరంగల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ లారీ యనమానులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ఆలిండియా, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా, వరంగల్ లోకల్, ఓరుగల్లు లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. నిత్యావసరాల సరుకుల తప్పా సిమెంట్, ఐరన్, బొగ్గు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది. జిల్లాలో 3వేల లారీలు నిలిచిపోగా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 4 వేల లారీలు సరుకులతోనే రహదారులపై నిలిచిపోయాయి. తరచూ పన్నులను పెంచుతున్న కారణంగా వాహనాలను నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల రాస్తారోకోలు.. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్ ఆధ్వర్యంలో ఆదివారం పలు చోట్ల «రాస్తారోకోలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలు చేపట్టారు. నర్సంపేట, ములుగురోడ్డు, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ప్రధాన రహదారుల్లో జిల్లా మీదుగా వెళ్తున్న వివి«ధ రాష్ట్రాల లారీలను అడ్డుకుని ఖాళీ స్థలాలకు తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఇంతేజార్ గంజ్ పోలీసులు లారీల పార్కింగ్ స్థలానికి చేరుకుని నిలిచిపోయిన లారీలను పంపించి వేముల భూపాల్‌తోపాటు మధుసూదన్‌రావును అరెస్టు చేసి, సొంతపూచి కత్తుపై విడుదల చేశారు. కాగా ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జె. మధుసూదన్‌రావు తెలిపారు. వరంగల్ లోకల్ లారీ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు వేముల భూపాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ స్పందించి అసోసియేషన్ బాధ్యులను చర్చలకు ఆహ్వానించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ని త్యావసర సరుకులను సైతం అడ్డుకుంటామన్నారు. సమస్యలుపరిష్కరించే వరకు కొనసాగిస్తా మని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్లు మోహన్, శ్రీహరి, సతీష్, రాజు, ముంతా జ్, ఉస్సేన్, రాజీరెడ్డి పాల్గొన్నారు. -
లారీ యజమానుల ధర్నా
భూపాలపల్లి వరంగల్: దేశ వ్యాప్త లారీల బంద్‌లో భాగంగా భూపాలపల్లి లారీ ఓనర్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం లారీల యజమానులు ధర్నా నిర్వహించారు. రెండు రోజులపాటు లారీల ను నడిపించిన స్థానిక యజమానులు మూడో రోజు సమ్మెలో పాల్గొన్నారు. కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు వెళ్లుతున్న ఇసుక లారీలను ప్రధా న రహదారిపై అడ్డుకొని ధర్నా చేపట్టారు. అసోసియేషన్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షకు భుత్వ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజీల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడంతో వాహనదారులపై అధిక భా రం పడుతోందన్నారు. లారీ యజమానుల సమ్మెతో సరుకుల రవాణా నిలిచి పోయిందని వారు ఎదుర్కొం టున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్యక్షుడు కంకణాల రవీం దర్‌రెడ్డి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగి స్తామని స్ప ష్టం చేశారు. బాలచంద్నాయక్, రమేష్, రాజేష్, హరిష్‌రెడ్డి, నర్సింగరావు, రవి, తిరుపతి, సేనప తి, వేణు, అయిలయ్య, రాజయ్య పాల్గొన్నారు. -
ఎక్కడ లారీలు అక్కడే !
విజయవాడ : రవాణా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం కృష్ణా జిల్లాలో రెండో రోజు లారీల నిరవధిక సమ్మె కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో ఆటోనగర్, భవానీపురం, జిల్లాలో గుడివాడ, నందిగామ, ఇబ్రహీంపట్నం, నూజివీడు ప్రాంతాల్లో రవాణా వాహనాలు నిలిపివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు కూడా గమ్యస్థానాలకు చేరుకుని నిలిపివేశామని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు కోనేరు రామారావు, ప్రధాన కార్యదర్శి అడుసుమిలి సదాశివరావు, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. లారీ యజమానులు చేపట్టిన సమ్మెకు టాక్సీ, మినీట్రాన్స్‌పోర్టు, తదితర సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించకపోతే తాము కూడా బంద్‌లో పాల్గొంటామన్నారు. -
యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్న మాఫియా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇసుక మాఫియా మళ్లీ పేట్రేగిపోతోంది! వారం పది రోజుల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్‌లో వారం కింద రూ.40 వేలు పలికిన 25 టన్నుల ఇసుక లారీ ధర ఏకంగా రూ.87 వేలకు చేరింది. మొన్నటిదాకా టన్ను రూ.1,600–1,700 పలికిన నాణ్యమైన సన్న ఇసుక ధర రూ.3,400–3,500కు ఎగబాకింది. సిమెంట్ ఇటుకలు, శ్లాబుల నిర్మాణానికి వినియోగించే దొడ్డు ఇసుక టన్నుకు రూ.1,300–1,400 నుంచి రూ.2,500–2,600కు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేని వర్షాలతో తవ్వకాలు, రవాణా నిలిచిపోయి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇసుక కొరత ఏర్పడింది. ఇందుకు లారీల సమ్మె మరింత ఆజ్యం పోసింది. ఇదే అదనుగా మాఫియా, దళారులు రెచ్చిపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, సాగునీటి, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముందస్తుగా బుక్ చేసుకున్న ఇసుకను కాంట్రాక్టర్లు బ్లాక్‌లో విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 2014 డిసెంబర్లో ప్రకటించిన కొత్త ఇసుక విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు, ఉపనదుల ఇసుకతోపాటు జలాశయాల్లోని ఇసుక పూడికల తవ్వకాల బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)కు బదలాయించింది. ఏటా జూలై–అక్టోబర్ మధ్య వర్షాలతో ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం కలగడం, మాఫియా రంగంలోకి దిగి ధరలు పెంచేయడం గత నాలుగేళ్లుగా కొనసాగుతోంది. కొత్త విధానంలో ప్రభుత్వం.. క్వారీల్లో ఇసుక వ్యాపారులకు విక్రయించే ఇసుక ధరలను మాత్రమే నిర్ణయించింది. ప్రజలకు విక్రయించాల్సిన రిటైల్ ధరలను నిర్ణయించకపోవడంతో ఇసుక వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వర్షాలతో నిలిచిన తవ్వకాలు రాష్ట్రంలోని పాత ఏడు జిల్లాల పరిధిలోని గోదావరి తీరంలో 56 చోట్లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం గతేడాది టీఎస్ఎండీసీకి అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం 30 చోట్ల మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో 25 భారీ, మరో ఐదు చిన్న రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల నుంచి తవ్విన ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేసి ఆన్లైన్ బుకింగ్ ద్వారా టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. సాధారణంగా టీఎస్ఎండీసీ ప్రతి రోజూ 40 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను బుకింగ్ కోసం అందుబాటులో ఉంచేది అందులో 30 వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక అమ్ముడయ్యేది. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గత 10 రోజులుగా ఇసుక తవ్వకాలు, రవాణాకు ఆటంకం ఏర్పడింది. రీచ్‌లు, స్టాక్ యార్డులకు వెళ్లే దారులు దెబ్బతినడంతో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా రోజుకు 9 వేల నుంచి 12 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే టీఎస్ఎండీసీ విక్రయిస్తోంది. ఫలితంగా ఇసుక కొరత తీవ్రమైంది. ఆన్లైన్లో ఇసుక బుకింగ్ కోసం వ్యాపారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇసుక అవసరం ఉన్నవారు టీఎస్ఎండీసీ పేరిట మీ సేవా, ఆన్లైన్ కేంద్రాలకు డబ్బులు చెల్లించి రశీదు పొందితే వారి బుకింగ్ ఆర్డర్ మేరకు స్టాక్ పాయింట్ల వద్ద లారీల్లో ఇసుక నింపుతున్నారు. క్యూబిక్ మీటర్‌కు రూ.550 (టన్నుకు రూ.357.5) చొప్పున ప్రభుత్వం ఇసుకను రీచ్‌ల వద్ద విక్రయిస్తోంది. అయితే రవాణా కోసం అవసరమైన లారీలు ఇసుక వ్యాపారుల వద్దే ఉండడంతో దళారుల ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇసుకను పొందలేకపోతున్నారు. ఇసుక వ్యాపారులే ఆన్లైన్లో బుక్ చేసుకొని అవసరమైన వారికి హైదరాబాద్‌లో టన్నుకు రూ.1600–1700లు, జిల్లాల్లో రూ.1200కు చొప్పున విక్రయించేవారు. హైదరాబాద్‌లో 25 టన్నుల ఇసుక లారీ రూ.40 వేలలోపు ధర పలికేది. ప్రస్తుతం కొరత ఉండడంతో టన్ను ఇసుక ధరను అడ్డగోలుగా రూ.3,400–3,500కు పెంచేశారు. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.87 వేలకు పెంచడంతో సామాన్యులతోపాటు బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు. సర్కారీ కాంట్రాక్టర్ల బ్లాక్ దందా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నది పరిధిలోని నాలుగు రీచ్‌లలోని ఇసుకను డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, మరో ఆరు రీచ్‌లలోని ఇసుకను పూర్తిగా సాగునీటి, ఇతర ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక మొత్తాన్ని నిర్ధారిస్తూ సంబంధిత ప్రాజెక్టుల నిర్వహణ అధికారులు జారీ చేసిన అంచనా నివేదిక ఆధారంగా టీఎస్ఎండీసీ నుంచి కాంట్రాక్టర్లు నేరుగా ఇసుక కొనుగోలు చేస్తున్నారు. కానీ కాంట్రాక్టర్లు.. ఇంజనీరింగ్ శాఖల అధికారులను ప్రలోభపెట్టి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక కన్నా ఐదారు రెట్లు ఎక్కువగా అంచనాలను తెచ్చుకుంటున్నారు. వాటి ఆధారంగా టీఎస్ఎండీసీ నుంచి ఒకేసారి బల్క్‌గా ఇసుక కొనుగోలు కోసం ఆర్డర్లు పొందుతున్నారు. ఆ ఆర్డర్ల ఆధారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీఎస్ఎండీసీకి డీడీలు చెల్లించి నేరుగా మానేరు రీచ్‌ల నుంచి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇసుక కొరత నెలకొన్న సమయంలో కూడా ప్రభుత్వ పనులకు ఆటంటం కలగకూడదన్న ఉద్దేశంతో టీఎస్ఎండీసీ కాంట్రాక్టర్లు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఇసుక విక్రయిస్తోంది. కాంట్రాక్టర్లు అవసరానికి మించి బుక్ చేసుకున్న ఇసుకకు సంబంధించిన ఆర్డర్లను ఇసుక వ్యాపారులకు బ్లాకులో విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్లైన్లో 25 టన్నుల లారీ ఇసుక కోసం వ్యాపారులు టీఎస్ఎండీసీకి రూ.8,889 డీడీని చెల్లిస్తే కొనుగోలు ఆర్డర్ జారీ అవుతోంది. ప్రస్తుతం టీఎస్ఎండీసీ ద్వారా ఆన్లైన్లో ఇసుక విక్రయాలు తగ్గిపోవడంతో సర్కారీ కాంట్రాక్టర్లు 25 టన్నుల ఇసుక ఆర్డర్‌ను ఇసుక వ్యాపారులు, లారీల యజమానులకు బ్లాక్‌లో రూ.20 వేలకు అమ్ముకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. సర్కారీ పనుల కోసం కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న లారీలు నిత్యం పట్టుబడుతున్నా.. కేవలం వాటిని బ్లాక్‌లిస్టులో పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ధరకు కొనుగోలు చేయకండి: టీఎస్ఎండీసీ గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు, రహదారులు దెబ్బతినడంతో ఇసుక సరఫరాలో కొంత ఇబ్బంది కలుగుతోందని టీఎస్ఎండీసీ వైస్ చైర్మన్, ఎండీ జి.మల్సూర్ తెలిపారు. వినియోగదారులకు సరిపడ ఇసుకను రోజువారీగా సరఫరా చేయలేకపోతున్నామన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఇసుక దళారులు మార్కెట్లో అధిక ధరకు ఇసుక విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయొద్దని, కొన్ని రోజులు వేచి ఉంటే ధరలు సాధారణ స్థితికి వస్తాయని సూచించారు. వర్షాకాలంలో వినియోగదారులకు సరఫరా చేసేందుకు స్టాక్ యార్డుల్లో 50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక 25 ప్రాంతాల్లో అందుబాటులో ఉందని, ఇసుక కొరత లేదని చెప్పారు. ప్రభుత్వ పనులకు కేటాయించిన ఇసుకను దారి మళ్లించి బ్లాక్‌లో విక్రయిస్తున్న లారీలను పట్టుకుని బ్లాక్‌లిస్టులో పెడుతున్నామని వివరించారు. -
రవాణా బంద్!
పాలమూరు: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లారీలను ఎక్కడిక్కడే నిలిపివేశారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచే లారీ సమ్మె ప్రారంభం కావడంతో రోడ్లపై లారీ లు కన్పించలేదు. ప్రధానంగా జాతీయ రహదారిపై లారీలు తిరగకపోవడం వల్ల బోసిపోయి కని పించింది. నిత్యం వందల సంఖ్యలో లారీల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఒ క్కసారిగా లారీలు రాకపోకలు నిలిపివేయడం వ ల్ల రోడ్డు పూర్తిగా ఖాళీగా కన్పించింది. దీంతో పా టు నిత్యం రద్దీగా ఉండే తాండూర్ రోడ్డుకూడా లారీల రాకపోకలు లేక ఖాళీగా కన్పించింది. అలా గే, అంతరాష్ట్ర రహదారి అయిన రాయిచూర్ వైపు కూడా బోసిపోయింది. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,500 లారీలు నిలిచిపోయినట్లు అంచనా. జిల్లా కేంద్రంలో ర్యాలీ లారీల సమ్మెలో భాగంగా మొదటి రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భవనం ఎదుట దీక్ష నిర్వహించారు. దీంతోపాటు జిల్లా కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లారీ ఓనర్స్ అ సోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, కార్యదర్శి బాబు జానీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిత్యావసరాలకు సంబంధించిన లారీలను అనుమతి ఇస్తామని అప్పటికి తమ డిమాండ్లపై స్పష్టత రాకపోతే అన్ని వాహనాలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివయ్య, రషీద్‌ఖాన్, అన్వర్ పాషా, రాఘవేందర్, దస్తగిరి, సలీం, మణెం పాల్గొన్నారు. లారీల అడ్డగింత హన్వాడ మండల పరిధిలోని చిన్నదర్పల్లి గ్రామసమీపంలో ప్రభుత్వ సహకారంతో పని చేస్తున్న సీడబ్ల్యూసీ గోదాం దగ్గర లారీలు నడుపుతున్నట్లు సమాచారంతో అసోసియేషన్ సభ్యులు వెళ్లి అడ్డుకున్నారు. గూడ్స్ రైలు ద్వారా వచ్చిన బియ్యంను గోదాంకు తరలించడంతో పాటు వాటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. -
లారీల బంద్ ప్రశాంతం
ఒంగోలు: లారీల బంద్ తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు లారీ యజమానులు తమ లారీలను యూనియన్ కార్యాలయం ఆవరణలోనే పార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వేమూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో లారీ యూనియన్ కార్యాలయం ఆవరణలో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లారీకి ఐటీ స్టాండర్డ్‌ను తగ్గించాలని, డీజిల్ రేట్లను ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిం చాలని, నేషనల్ పర్మిట్ లారీలకు డబుల్ డ్రైవర్ల వ్యవహారాన్ని విరమించాలంటూ పలు డిమాండ్లను నినదించారు. సుదూరం నుంచి బయలు దేరిన లారీలు గమ్యానికి చేరుకునేంత వరకు ఆపడం లేదని, కొత్తగా ఎవరు లోడ్లు ఎత్తుకోవడం లేదన్నారు. తొలి రోజు ట్యాంకర్ యాజమాన్యాలు సంఘీభావం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. బంద్ ప్రభావం రెండో రోజు నుంచి కనిపిస్తుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ మొండిపట్టు వీడాలని కోరారు. సింగరాయకొండలో కొద్దిసేపు లారీ ఓనర్లు లారీలను ఆపేందుకు యత్నించగా పోలీసులు ఆ ప్రక్రియను భగ్నం చేశారు. రవాణాశాఖ అధికారులు మాత్రం తొలిరోజు 92 శాతం లారీలు తిరిగాయని, జన జీవనంపై ఎలాంటి ప్రభావం చూపలేదని ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. -
నేటి నుంచి లారీల బంద్
చిత్తూరు అర్బన్: సమస్యల పరిష్కారం కోరుతూ దేశ వ్యాప్తంగా శుక్రవారం నుంచి లారీల సమ్మెకు పిలుపునిచ్చారు. జిల్లాలోని లారీ యజమానులు ఈ సమ్మెకు మద్దతు పలికి బంద్‌లో పాల్గొననున్నట్లు ప్రకటించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు జిల్లా సరిహద్దు కావడంతో గురువారం సాయంత్రం నుంచే ఇతర రాష్ట్రాలకు చెందిన లారీలు జిల్లాలో ఆగిపోయాయి. డిమాండ్లు ఇవీ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువగా నష్టపోతున్నది తెలుగు రాష్ట్రాల్లోని లారీ యజమానులేనని యూనియన్ నాయకులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమల్లోకి రావడం, సరుకుల రవాణకు ఇ–వే బిల్లు తప్పనిసరి చేయడం రవాణా రంగాన్ని కుదిపేసింది. ఫలితంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగంపై కేంద్ర ప్రభుత్వం సానుభూతి చూపకపోగా సమస్యను మరిం త జఠిలం చేస్తోందని లారీ యజమానుల సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ♦ ఓ లారీ యజమానికి రెండో లారీ ఉంటే ఆదాయ పన్ను చట్టం 44వ సెక్షన్ కింద వసూ లు చేస్తున్న రూ.50 వేలను రద్దు చేయాలి. ♦ ఇప్పటివరకు థర్డ్ పార్టీ కింద లారీలకు రూ.15 వేలు చెల్లిస్తున్న బీమాను ఒక్కసారిగా రూ.50 వేలకు పెంచేశారు. దీన్ని రూ.15 వేలకే పరిమితం చేయాలి. ♦ కాలం చెల్లిన టోల్గేట్ ప్లాజాల దోపిడీని వెంటనే నిలిపేయాలి. రాజకీయ అండదండలతో జరుగుతున్న అనధికార దోపిడీని అడ్డుకోవాలి. ♦ ఇష్టానుసారం పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించడానికి వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ♦ జాతీయ పర్మిట్ ఉన్న సరుకుల రవాణా వాహనానికి ఇద్దరు డ్రైవర్లు పెట్టుకోవాలనే నిబంధనను రద్దు చేయాలి. ♦ రవాణా శాఖ, పోలీసులు, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు లంచాల కోసం చేస్తున్న దోపిడీని నిరోధించాలి. ప్రభావం ఇలా.. బంద్‌కు జిల్లాలోని మినీ లారీలు, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు మద్దతు ప్రకటించారు. ఫలితంగా ఉన్నఫళంగా కూరగాయల ధరలు పెరిగిపోనున్నాయి. పెట్రోలు, డీజిల్‌కు కృత్రిమ కొరత ఏర్పడనుంది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న మామిడి రైతులు లారీల సమ్మెతో పంటను అమ్ముకోలేని పరిస్థితి ఎదురై ధరలు మరింత పత నం కానున్నాయి. బెల్లం, గ్రానైట్, సిమెంటు, గ్యాస్, లాజిస్టిక్ సర్వీసులు (పార్శిల్) స్తంభించనున్నాయి. బంద్‌లో పాలు, నీళ్లు, నిత్యావసర వస్తువులకు మినహాయింపు ఇస్తున్నట్లు యూనియన్ నాయకులు చెబుతున్నారు. ఇక ఒక్కో లారీపై ప్ర త్యక్షంగా యజమాని, డ్రైవర్, క్లీనర్ కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. పరోక్షంగా హమాలీలు, వ్యాపారులు, తోపుడు బళ్ల వాళ్లు.. ఇలా వేలాది మంది ఉపాధి దెబ్బతినే అవకాశముంది. రోజుకు రూ.2 కోట్ల నష్టం.. జిల్లాలో లారీల బంద్ వల్ల రోజుకు రూ.2 కోట్ల నష్టం వస్తుంది. చాలామంది బతుకులు జరగవు. కానీ తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల మాతో పాటు డ్రైవర్, క్లీనర్ కుటుం బాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. మేము అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావు. న్యాయమైనవని గుర్తించండి. ఒక్కసారి బంద్‌లోకి దిగాక దాని తర్వాత ఎదురయ్యే పరి ణామాలకు మేము బాధ్యులుకామని ప్రభుత్వాలు గుర్తించుకోవాలి. – టి.చెంగల్రాయనాయుడు, జిల్లాఉపాధ్యక్షులు, లారీ యజమానుల సంఘం -
ఏడు రోజుకు చేరిన సమ్మె
అనంతపురం : రవాణా శాఖ వివిధ రుసుములు, బీమా ప్రీమియాన్ని పెంచడాన్ని నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానులు చేపట్టిన సమ్మె బుధవారం ఏడోరోజుకు చేరుకుంది. సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం లారీ సంఘం యజమానులతో చర్చించనుంది. మంత్రి, కమిషనర్ చర్చల్లో పాల్గొంటారని తెలిసింది. చర్చలు సఫలమైతే బంద్ విరమిస్తామని, లేదంటే ఉధృతం చేస్తామని జిల్లాలోని లారీ యజమానుల సంఘం నాయకులు చెబుతున్నారు. మరోవైపు బంద్ ప్రభావం నిత్యావసర సరుకులపై పడుతోందని సామాన్య ప్రజలు వాపోతున్నారు. -
నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై నిలిచిన లారీలు
నల్గొండ: లారీల సమ్మె ఉధృతమవుతోంది. దీంతో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై లారీలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతుండడంతో పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని బలవంతంగా లారీలను తరలించారు. దీంతో లారీ అసోసియేషన్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వరంగల్‌లో మార్కెట్‌కు సెలవు లారీల సమ్మె కారణంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ విషయం తెలియక ఎవరైనా రైతులు మార్కెట్‌కు ధానాన్ని తెస్తే వాటిని కొనుగోలు చేస్తామని తెలిపారు. -
రవాణా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఇచ్ఛాపురం రూరల్ : కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే దక్షిణ భారత రాష్ట్రాల్లో రవాణా రంగం నష్టాల్లో ఉందని జిల్లా లారీ యజమానుల జేఏసీ కన్వీనర్, ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల లారీల నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఇచ్ఛాపురం బోర్డర్ లారీ ఓనర్స్ అసోసియేషన్(ఐబీఎల్ఓఏ)ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు ముడియా జానకిరామ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియం తగ్గించాలని, రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నర్ ఏర్పాటును ఉపసంహరించాలని, పెంచిన ఆర్టిఎ చలానా ఫీజులు, పెనాల్టీలను రద్దు చేయాలని, టోల్ ఫీ రద్దు చేయాలని, ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా ఏసీ క్యాబిన్ ట్రక్కుల సరఫరా ఆదేశాలను ఉపసంహరించాలని, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను నిలుపుదల చేసే ఆలోచన విరమించుకోవాలని, ఆంధ్రా, తెలంగాణాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎం.అవతారం, రూరల్ ఎస్సై మీసాల చిన్నంనాయుడులు సిబ్బందితో చేరుకుని సంఘ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం పరిస్థితిని చక్కదిద్దారు. నిరసన కార్యక్రమంలో ఇచ్ఛాపురం బోర్డర్ లారీ అసోషియేషన్ లీగల్ అడ్వయిజర్ జీరు కామేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పితంబర్ మహంతి, కార్యదర్శి ఉలాసి శ్యాంకుమార్ రెడ్డి, కోశాధికారి మద్ది రాంబాబు, సభ్యులు నందిక ప్రేమ్‌కుమార్, ఉలాసి ఉమాపతి, బృందావన్ మహంతి, సునీల్ మహంతిలు పాల్గొన్నారు. వీరికి ఆటోయూనియన్ అధ్యక్షుడు ఉలాసి యర్రయ్య, ట్రాక్టర్ అసోషియేషన్ అధ్యక్షుడు గుజ్జు జగన్నాథంరెడ్డి, ఉప్పాడ చినబాబురెడ్డిలు మద్దతు పలికారు.