సాక్షి, అమరావతి: వారం రోజుల నుంచి జరుగుతున్న లారీల సమ్మె సెగ పరిశ్రమలతోపాటు సామాన్యులను తాకుతోంది. లారీల సమ్మె దీర్ఘకాలం జరిగే సూచనలు కనపడుతుండటంతో హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభిం చారు. కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకుల ధరలను పెంచేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేవాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇదే సమయంలో స్థానికంగా పండే కూరగాయల ధరలు తగ్గడం గమనార్హం. ఉల్లిపాయలు, క్యాప్సికం, టమోటా, క్యాబేజీ లాంటి కూరగాయల ధరలు పెరగ్గా.. వంకాయలు, బెండ, దొండ లాంటిస్థానికంగా పండేవాటి ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవటంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆక్వా, మామిడి రైతుల ఆక్రందన
లారీల సమ్మె ప్రభావం ఆక్వా, మామిడపండ్ల ఎగుమతిపై బాగా కనిపిస్తోంది. ధరలు బాగున్నా సమ్మె కారణంగా చెరువుల్లో చేపలు, రొయ్యల సేకరణను నిలిపివేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఆక్వా రైతు ఒకరు వాపోయారు. ప్రస్తుత సీజన్‌లో నీలం, చిత్తూరు మామిడి రకాన్ని ఎగుమతి చేస్తామని సమ్మె కారణంగా కాయలు కోయకుండా చెట్లకే వదిలేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. రేటు బాగున్నా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని, వర్షాలు పడితే చేతికి వచ్చిన పంట దక్కదని చిత్తూరు జిల్లా రైతులు వాపోతున్నారు.
బోసిపోయిన బెజవాడ వన్‌టౌన్ మార్కెట్
నిత్యం రూ. వందల కోట్ల టర్నోవర్‌తో కళకళలాడే విజయవాడ వన్‌టౌన్ హోల్‌సేల్ మార్కెట్ లారీల సమ్మె కారణంగా వెలవెలపోతోంది. సాధారణంగా ఆషాడమాసంలో వ్యాపారం తక్కువగా ఉంటుంది. సమ్మె మరో వారం రోజులపాటు జరిగితే శ్రావణమాసం వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వస్త్రలత వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లారీలు ఆగిపోవడంతో సుమారు 10,000 మంది హమాలీలు కూలీ దొరక్క పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టాక్ విక్రయిస్తున్న వాహన డీలర్లు
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాలపై మాత్రం సమ్మె ప్రభావం అంతగా కనిపించడం లేదు. జీఎస్‌టీలో చాలా వస్తువులు రేట్లు తగ్గడంతో పాత సరుకును విక్రయించాలనే ఉద్దేశంతో కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం లేదని ఎలక్ట్రానిక్ గూడ్స్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. తాము సాధారణంగా నెల రోజుల స్టాక్ నిర్వహిస్తామని, దీంతో ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఆటోమొబైల్ రంగంపై లేదని కార్లు, ద్విచక్రవాహనాల డీలర్లు తెలిపారు. సమ్మె మరో వారం రోజులు కొనసాగితే మాత్రం వాహన కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
సర్కారుకు సోమవారం వరకు గడువు
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం, టోల్ గేట్ చార్జీల తగ్గింపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే సమ్మెను ఉధృతం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు చెప్పారు. అప్పటివరకు సామాన్యులకు ఇబ్బంది లేకుండా సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు.
సోమవారం దాకా నిత్యావసర సరుకులు, పెట్రోల్ లాంటి వాటికి మినహాయింపు కొనసాగుతుందన్నారు. లారీల సమ్మెకు సంఘీభావంగా పెట్రోలియం ట్యాంకర్లు కూడా సమ్మె చేస్తున్నారని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పెట్రోలియం డీలర్ల ఫెడరేషన్ ఖండించింది. లారీల సమ్మెకు సంఘీభావం ప్రకటించే అంశంపై ఇంత వరకు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
టమాట రైతులకు రూ.20 కోట్ల నష్టం
చిత్తూరు: లారీల సమ్మె టమాటా రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో నిత్యం జరిగే రూ.2.5 కోట్ల లావాదేవీలపై ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిబెంగాల్ తదితర రాష్ట్రాలకు టమాట, క్యాబేజీ, ఇతర కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతి అవుతుంటాయి. ఇతర రాష్ట్రాలకు రోజూ 4 వేల టన్నుల టమాటాలు ఎగుమతి చేస్తారు.
సమ్మె వల్ల టమాటా రైతులకు ఇప్పటివరకూ సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు పరిసరాల్లోని బెల్లం తయారీ రైతులు కూడా రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తిలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు కడప, ఒడిశా నుంచి రావాల్సిన ముడిసరుకు ఆగిపోయింది. సమ్మెతో కృష్ణపట్నం, ఎన్నూర్ ఓడరేవుల నుంచి ఎరువుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది.
‘తూర్పు’న ఆగిన 35 వేల లారీలు
రాయవరం (తూర్పుగోదావరి జిల్లా): సమ్మె కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో 35,000 లారీలు కదలడం లేదు. బియ్యం, కోడిగుడ్లు, కొబ్బరి, అరటితోపాటు ఇటుక తదితరాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళాదుంప, క్యారెట్‌తోపాటు సిమెంట్, ఐరన్ దిగుమతులు ఆగిపోయాయి.
జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన రావులపాలెం, రాజమహేంద్రవరం, మండపేట, తుని, కాకినాడ, అనపర్తి, పిఠాపురం, కత్తిపూడి, ఏలేశ్వరం, జగ్గంపేటలో సమ్మె ప్రభావం స్పష్టంగా ఉంది. గత వారం రోజులుగా లారీలు నిలిచిపోవడంతో రూ.70 కోట్ల దాకా నష్టపోయినట్లు లారీ యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment