నో స్టాక్
- రైతులను వేధిస్తున్న యూరియా కొరత
- కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
- వరినాట్లు వేసే తరుణంలో స్టాకు లేదంటూ ప్రచారం
- జిల్లాకు 35.500 టన్నుల యూరియా అవసరం
మచిలీపట్నం : ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎరువుల వ్యాపారుల లాభాపేక్ష రైతులకు మరో కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టాయి. వర్షాభావం, సాగునీటి విడుదలలో జాప్యం వల్ల ఆలస్యంగా అయినా వరినాట్లు పూర్తి చేస్తున్న రైతులను యూరియా కొరత రూపంలో మరో సమస్య వేధిస్తోంది. వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో గ్రామాల్లోని పీఏసీఎస్, పట్టణ ప్రాంతాల్లోని ఎరువుల దుకాణాల వద్దకు యూరియా కోసం వెళితే స్టాకు లేదనే సమాధానం ఎదురవుతోంది.
దీంతో రైతులు కంగుతింటున్నారు. అసలే వరినాట్లు ఆలస్యంగా వేస్తున్నామని, నాటు వేసే సమయంలో ఎకరానికి కనీసం 25 కిలోల యూరియా తప్పనిసరిగా అవసరమని రైతులు చెబుతున్నారు. మొక్కల ఎదుగుదలకు యూరియా కచ్చితంగా అవసరమని, ఈ తరుణంలో అందుబాటులో లేకపోతే నష్టాలు తప్పవని పలువురు వాపోతున్నారు.
వ్యాపారుల మాయాజాలం!
యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని, అధిక ధరకు విక్రయించేందుకు పావులు కదుపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరినాట్లు నెల రోజుల పాటు ఆలస్యం కావడంతో మొక్కల ఎదుగుదల కోసం యూరియాను అధికంగా వినియోగిస్తామని, కాబట్టి కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు కోరుతున్నారు.
35,500 టన్నులు అవసరం
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారుల అంచనా. సాగునీటి విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబరు నెలలోనూ వరి నాట్లు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4.40 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. మరో రెండు లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని మండలాల్లో వరి నాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. ఒక్కసారిగా అన్ని ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకోవడంతో యూరియా వాడకం పెరిగింది.
ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తమ వద్ద యూరియా స్టాకు లేదని రైతులను తిప్పి పంపుతున్నారు. ఒకటి, రెండు రోజుల తర్వాత అధిక ధరకు యూరియా విక్రయాలు జరిపేందుకే వ్యాపారులు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించకుండా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
18వేల టన్నుల సరఫరా
ఇప్పటి వరకు జిల్లాలోని పీఎసీఎస్‌లకు, హోల్‌సేల్ వ్యాపారులకు, రిటైల్‌వ్యారులకు 18వేల టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ నరసింహులు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి 35,500 టన్నుల యూరియా దిగుమతి కావాల్సి ఉందని ఆయన చెప్పారు. కొద్ది రోజుల్లో యూరియా వస్తుందని వివరించారు.