క్వింటాల్‌కు రూ.5,350 నాలుగేళ్ల గరిష్ట ధరకు చేరువ
పక్క రాష్ట్రాల్లో ధరను చూసి.. పెంచుతున్న జిల్లా వ్యాపారులు
ఇప్పటికే 60 శాతం అమ్ముకున్న రైతులు
మంచిర్యాల అగ్రికల్చర్ : పత్తి ధరలు రైతులను మరోసారి ఆందోళనలో పడేశాయి. అదునుదాటాక.. ఉన్నది అమ్ముకున్నాక వ్యాపారులు పెద్దఎత్తున ధరలు పెంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్లు, గింజలకు డిమాండు పెరగడంతోపాటు పక్క మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం జిల్లాపై చూపుతోంది. దీంతో తప్పని పరిస్థితిలో వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. బుధవారం జిల్లాలోని జిన్నింగ్ వ్యాపారులు క్వింటాలకు రూ.5,350 ధరతో కొనుగోలు చేశారు. జిల్లాలో నాలుగేళ్ల క్రితం గరిష్టంగా రూ.5,500 చేరుకున్న ధరలు ఇప్పుడు చేరువులో ఉన్నాయి. జిల్లాలోని రైతులు ఇప్పటికే 60 శాతం పత్తిని అమ్ముకున్నారు. పెరుగుతున్న ధరలు రైతుల కన్న వ్యాపారులకే ఎక్కువగా మేలు చేస్తున్నాయి.
ఈసారి 47 వేల హెక్టార్లలో సాగు..
జిల్లాలో ఈ ఏడాది 47 వేల హెక్టార్లలో పత్తి సాగైంది. ఈ ఏడాది ఆశించిన వర్షాలు కురవడంతో మంచి దిగుబడి వచ్చింది. సెప్టెంబర్ నుంచి దిగుబడి వస్తున్న పంటను ఇప్పటికే రైతులు 60 శాతం అమ్ముకున్నారు. రెండేళ్లు అప్పుల పాలైన రైతులు ఈ ఏడాది కురిసిన వర్షాలు కొంత ఊరటనిచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో ధరలు పెరుగుతుండటంతో రెండు నెలలుగా దళారులు గ్రామాల్లో తి రుగుతూ మద్దతు ధర రూ.4,160 కంటే ఎక్కువగా రూ. 4,600 నుంచి రూ.4,900 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. రెండేళ్లు నష్టాలు ఎదుర్కొన్న రైతులు ప్రభుత్వ మద్దతు ధర కంటే రూ.450 నుంచి రూ.800 అధికంగా వస్తుండటంతో దళారులకే పత్తిని ముట్టజెప్పారు.
పెరుగుతున్న డిమాండ్..
రెండేళ్ల కాలంలో పత్తి క్వింటాల్‌కు కనిష్టంగా రూ. 3,600, గరిష్టంగా రూ.4,500 ధరలు పలుకాయి. ఈ ఏ డాది ఆరంభంలో వ్యాపారులు గరిష్ట ధర రూ.4,450తో కొనుగోలు ప్రారంభించారు. రెండు నెలల్లో వంద రెండు వందలు పెంచుతూ తగ్గిస్తూ వస్తున్నారు. దీనికి కారణం గత సీజన్ «అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర పెరుగుతుండడమే. అందుకే.. ఇతర రాష్ట్రాల వ్యాపారులు జిల్లాలోకి ప్రవేశించి గ్రామాల్లో జీరో కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిసింది. డిసెంబర్ 2 నుంచి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5 వేలకు పైగా చెల్లిస్తున్నారు. అమ్మిన రైతులు ఆవేదనకు గురువుతుంటే ఇన్ని రోజులు నిల్వచేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సీసీఐ కొనుగోళ్లు సున్నా..
రైతులు పండించిన పంటలు నష్టపోకుండా ఉండేందు కు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెల్లబోతోంది. ఒక్కరంటే ఒక్క పత్తి రైతు కూడా ఈ ఏడాది సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లలేదు. జిల్లాలో ఆరు సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు ఒక్క క్వింటాల్ పత్తిని కూడా అమ్మలేదు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,160 నిర్ణయించడం, తేమ, పింజ పొడువు, తదితర నిబంధనలు దగ్గరకు రానివ్వకుండ చేశాయి. దీంతో రైతులంతా ప్రైవేటుగానే విక్రయించా రు. గతేడాది ఇదే సమయానికి లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ.. ఈసారి మాత్రం ఒక్క క్వింటా పత్తిని కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ‘పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతోం ది. దీంతో జిల్లాలో జిన్నింగ్ వ్యాపారులు ధరలు పెంచుతున్నారు. సీసీఐ ఒక్క క్వింటాల్ కూడా కొనలేదు’ అని మార్కెటింగ్ శాఖ అధికారి గజానంద్ తెలిపారు.
పత్తి ధర పైపైకి
Published Thu, Jan 5 2017 10:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement