Merchants
-
'గూగుల్ పే' సౌండ్పాడ్ వచ్చేస్తోంది..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో గూగుల్ సంస్థ గత ఏడాది కాలం నుంచి 'గూగుల్ పే' సౌండ్పాడ్ తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది ఎట్టకేలకు పూర్తి కావొస్తోంది. త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు టెక్ దిగ్గజం ప్రకటించింది. వ్యాపారులు చెక్అవుట్ సమయాన్ని తగ్గించడానికి గూగుల్ పే సెప్టెంబరు 2017లోనే భారత్‌లో ఆవిష్కరించింది. ఇది సురక్షితమైన డిజిటల్ చెల్లింపులను జరుపుకోడానికి అనుమతిస్తుందని గూగుల్ పే వైస్ ప్రెసిడెంట్ 'అంబరీష్ కెంఘే' ఫిబ్రవరి 22న ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు. గూగుల్ పే సౌండ్పాడ్ ఎలా పనిచేస్తుందంటే.. సౌండ్పాడ్ అనేది ఆడియో పరికరం, ఇది చెల్లింపు స్వీకరించబడినప్పుడు ఆడియో ద్వారా వెల్లడిస్తుంది. దీంతో వ్యాపారాలు ప్రత్యేకంగా అమౌంట్ వచ్చిందా? లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపు చేసే కస్టమర్ తప్పకుండా.. వ్యాపారికి సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. అమౌంట్ పంపిన వెంటనే సౌండ్పాడ్ సౌండ్ చేస్తుంది. ఇప్పటికే మనదేశంలో పేటీఎం, ఫోన్ పే వంటివి అందించే బాక్సులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పేటీఎం సంక్షోభంలో ఉన్న కారణంగా కస్టమర్లు గూగుల్ పే దిశగా అడుగులు వేస్తున్నారు. -
రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ కంపెనీలకు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ: పేమెంట్ గేట్‌వే సేవలు అందిస్తున్న రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. పేమెంట్ ప్రాసెసింగ్ వ్యాపారంలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ‘పేమెంట్ అగ్రిగేటర్, పేమెంట్ గేట్‌వే లైసెన్స్ కోసం ఆర్బీఐ నుంచి జూలైలో సూత్రప్రాయ ఆమోదం లభించింది. తుది లైసెన్స్ కోసం ఆర్బీఐకి కంపెనీ అదనపు సమాచారం అందించాల్సి ఉంది. అంత వరకు కొత్త ఆన్లైన్ వ్యాపారులను చేర్చుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ కోరింది’ అని రేజర్‌పే తెలిపింది. తాజా ఉత్తర్వుల ప్రభావం ప్రస్తుత వ్యాపారాలపై ఉండబోదని కంపెనీ వెల్లడించింది. చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
‘చకచకా చేయి’..యూరప్‌లోనూ యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: యూరప్‌కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్‌కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్‌లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. యూరప్ లో భారతీయులు.. వరల్డ్లైన్కు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత మర్చంట్స్ పీవోఎస్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేయడానికి వీలవుతుంది. అలాగే, రూపే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతోనూ యూరోప్‌లో చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతీయులు అంతర్జాతీయ కార్డ్ నెట్‌వర్క్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకోనున్నట్టు ఎన్ఐపీఎల్ తెలిపింది. వరల్డ్‌లైన్ క్యూఆర్ ద్వారా యూరప్‌లోని మరిన్ని దేశాల్లోకి యూపీఐని విస్తరించనున్నట్టు తెలిపింది. జీ20 దేశాలకు యూపీఐ, ఆధార్! కాగా, ప్రపంచవ్యాప్తంగా అందరికీ డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా.. జీ 20 దేశాలు యూపీఐ, ఆధార్ వంటి ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసి, అమలు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్ జైన్ అభిప్రాయపడ్డారు. విజ్ఞానం, ఆవిష్కరణ, స్థిరత్వం అన్నవి నూతనతరం ఆర్థిక వృద్ధి చోదకాలుగా పేర్కొన్నారు. భారత్ ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫామ్‌లు అయిన కోవిన్, ఆధార్, యూపీఐ ఇంటర్ఫేస్ తదితర వాటిని సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో జైన్ మాట్లాడుతూ. ఈ తరహా ఓపెన్ సోర్స్ (మార్పులకు వీలైన), పలు వ్యవస్థల మధ్య పనిచేసే ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడంపై జీ20 దేశాలు దృష్టి సారించాలని సూచించారు. -
బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!
ప్రముఖ మర్చంట్స్ పేమెంట్స్ ఫ్లాట్ ఫారం భారత్ పే తమ మర్చంట్ భాగస్వాములకు శుభవార్త చెప్పింది. తమ మర్చంట్ భాగస్వాములకు బంగారు రుణాలను అందించనున్నట్లు పేర్కొంది. కంపెనీ ఇంతకు ముందు అసురక్షిత రుణాల కేటగిరీలోని కొలాటరల్ ఫ్రీ రుణాలను అందజేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సుహైల్ సమీర్ నేతృత్వంలోని ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆమోదం గల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ)తో చేసుకున్న భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా రూ.20 లక్షల వరకు బంగారు రుణాలను అందించనున్నట్లు తెలిపింది. భారత్ పే కంపెనీ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో వ్యాపారులకు బంగారు రుణాలను అందిస్తున్నట్లు ప్రారంభించింది. 2022 చివరి నాటికి 20 నగరాలకు విస్తరించాలని భావిస్తుంది. 2022 చివరి నాటికి ₹500 కోట్ల రుణాలను నెలకు 0.39% వడ్డీరేటుతో అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని, అసెస్ మెంట్ ప్రక్రియ పూర్తయిన 30 నిమిషాల్లోనే రుణం మంజూరు చేయనున్నట్లు భారత్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ పే యాప్‌లో సులభంగా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ భాగస్వామ్యంతో సంస్థ డోర్ స్టెప్, బ్రాంచ్ కలెక్షన్ సేవలు రెండింటినీ అందిస్తోంది. వ్యాపారులు ఆరు, తొమ్మిది, 12 నెలల పాటు రుణాలు తీసుకోవచ్చు. ఈజీ డైలీ ఇన్స్టాల్ మెంట్(ఈడిఐ) ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే ఆప్షన్ కూడా వారికి ఉంది. కంపెనీ త్వరలో ఈక్వేటెడ్ నెలవారీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) చెల్లింపును ప్రారంభించనుంది. భారత్ పేను 2018లో షష్వత్ నక్రానీ, భావిక్ కొలదియా కలిసి స్థాపించారు. (చదవండి: ఎయిర్ ఇండియా నూతన చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం..!) -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యాపారుల మాయాజాలం
-
‘చాయ్ తాగి పో’, ‘ఊకో కాక’.. ఇవన్నీ షాపుల పేర్లండి బాబోయ్!
సాక్షి, కరీంనగర్: ‘అరేయ్.. ఎక్కడున్నవ్’.. ‘చాయ్ తాగి పో’.. ‘ఊకో కాక’.. ‘కమాన్ ఫ్రెండ్’.. రాకేన్ రోల్.. ‘చాయ్ వాలా’.. ఇవీ మనం రోజువారీ సంభాషణలో మాట్లాడుకునే పదాలు. ఇప్పుడు ఇవే పదాలు కరీంనగర్‌లోని వ్యాపార కూడళ్లలో హోర్డింగ్‌లపై దర్శనమిస్తున్నాయి. మారిన ట్రెండ్‌కు అనుగుణంగా వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకునేలా సరికొత్తగా ఆలోచిస్తున్నారు. వాడుక భాష పదాలనే పేర్లుగా పెడుతున్నారు. గతంలో వ్యాపారాలకు దేవుళ్ల పేర్లు, ఇంటిలోనిపిల్లల పేర్లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు పెట్టేవారు. ఇంకొందరు పేరు బలం చూసి, సంఖ్య, శాస్త్రప్రకారంగా పేర్లు పెట్టేవారు. ఇప్పుడు మన మాటలు.. వాడే ఊత పదాలు, వంటకాల పేర్లు, కూరగాయలు, పిండి వంటల పేర్లు హోర్డింగ్‌లకు ఎక్కుతున్నాయి. వెరైటీ పేర్లు ఇటు కస్టమర్లనూ ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ యాసలో.. తెలంగాణ యాసలో చాయ్ బాబు చాయ్, మిర్చి, చాయ్, అమ్మ కర్రిపాయింట్, జస్ట్ ఫర్ యూ వంటి క్యాచీ పేర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వ్యాపారాలు నిర్వహించే వారు వాడుకభాషలో పేర్లు పెడుతున్నారు. అందరి నోళ్లలో నానిన పదాలతో పేర్లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఫ్రీ పబ్లిసిటీ.. కరీంనగర్లో ఏదైన షాప్ ప్రజల్లోకి వెళ్లాలాంటే పబ్లిసిటి తప్పని సరి. షాపులు, హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలి. వీఐపీలు, సెలబ్రెటీలతో ప్రారంభోత్సవాలు చేయించాలి. వ్యాపారం జోరుగా సాగాలంటే కూడా అదే స్థాయిలో ప్రచారం ఉండాలి. అవేవి లేకుండా కొత్త ట్రెండ్‌లో పేర్లు పెడుతూ రెట్టింపు పబ్లిసిటీ పొందుతున్నారు. జనం వాడుక భాషనే ప్రధానంగా చేసుకుని పేర్లు పెడుతున్నారు. పుల్గా ఉండాలని.. పెద్ద పెద్ద పేర్లు, నోరు తిరగని పేర్లు ఉండడం వల్ల జనానికి ఎక్కువగా గుర్తు ఉండదు. అందుకే సింపుల్‌గా అందరికీ అనువుగా గుర్తుండేలా కాస్త కొత్తగా ఉండేలా ‘తారక’ అనే పేరుపెట్టాం. పలకడానికి, వినడానికి కూడా బాగుండడంతో అందరి నుంచి స్పందన బాగుంది. – తోట కోటేశ్వర్, తారక రెస్టారెంట్, బస్టాండ్ రోడ్, కరీంనగర్ ఫ్రెండ్లీగా ఉండాలని.. అందరికీ సన్నితంగా, ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో చాయ్ తాగి పో.. పేరుతో వివిధ ఫ్లెవర్లలో టీ, స్నాక్స్ అందించే సెంటర్‌ను రెండు నెలల క్రితం ప్రారంభించా. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. పేరు కొత్తగా ఉండడంతో ప్రతిఒక్కరూ ఆసక్తిగా వస్తూ ఆదరిస్తున్నారు. – తాటికొండ రాజు, శివ థియేటర్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ ఆంధ్రాలో చూసి.. 12 ఏళ్ల కిత్రం కరీంనగర్లో రెడ్డి గారి వంటిల్లు పేరున మెస్ ప్రారంభించాం. ప్రజల ఆదరణ లభించింది. ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాంటి పేర్లు ఉండడం గమనించా. ఇక్కడ మెస్ ప్రారంభించే సమయంలో అదే ఆలోచనతో రెడ్డి గారి వంటిల్లు అని పేరు పెట్టా. అందరి ఆదరణ లభించి వ్యాపారం సాఫీగా సాగుతోంది. – బారాజు రామిరెడ్డి, డీఐజీ బిల్డింగ్ దగ్గర, జ్యోతినగర్, కరీంనగర్ -
వ్యాపారులకు పేటిఎమ్ బంపర్ ఆఫర్.. ఉచితంగా సౌండ్‌బాక్స్
భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటిఎమ్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు ఉచితంగా పేటిఎమ్ సౌండ్‌బాక్స్ సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. పేటీఎం ఫర్ బిజినెస్(పీ4బి) యాప్‌ను ద్వారా 40% తగ్గింపుతో రూ.299కు లభిస్తున్న పేటీఎం సౌండ్‌బాక్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారులు పేటిఎమ్ ద్వారా ఒక నెలలో 50 కంటే ఎక్కువ లావాదేవీల చేస్తే వ్యాపారులు ప్రతి నెలా 60 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇలా మీరు గనుక ఐదు నెలల పాటు 50 కంటే ఎక్కువ లావాదేవీలు పేటీఎం ద్వారా చేస్తే మీకు 300 రూపాయలు క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. ఇలా మీరు దీనిని ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు చేసే విధంగా ప్రోత్సహించినట్లు అవుతుందని కంపెనీ అభిప్రాయపడింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు అందుబాటులో ఉంది. వ్యాపారులలో పేటిఎమ్ సౌండ్‌బాక్స్ అన్ని లావాదేవీలను ట్రాక్ చేయడంలో వారికి సహాయపడుతుంది. నకిలీ స్క్రీన్లు, తప్పుడు నిర్ధారణలను చూపించే కస్టమర్లచే మోసపోకుండా వారిని కాపాడుతుంది. ఈ పరికరం అనేక ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది. ఇది వారి మాతృభాషలో లావాదేవీ నిర్ధారణను పొందడానికి సహాయపడుతుంది. -
కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం
సాక్షి, కర్ణాటక : కోళ్లఫారం యజమానులు, కోళ్ల కంపెనీల మధ్య గొడవల్లో కోడిపిల్లలు అడవుల పాలయ్యాయి. చిక్క తాలూకా పరిధిలోని రంగస్థళ, కణితహళ్లి అటవీ ప్రాంతాలలో ఫారం కోడిపిల్లలను వేలాదిగా వదిలి వెళ్లగా పట్టుకోవడానికి ప్రజలు పరుగులు తీశారు. వివరాలు.. చిక్క పరిసరాల్లోని కోళ్ల ఫారాలకు బడా కంపెనీలు కోడి పిల్లలను అందజేస్తాయి. అవి పెద్దయ్యాక వచ్చి తీసుకెళ్తారు. ఇందుకుగాను ఫారం యజమానులకు కోడికి ఇంత అని డబ్బు చెల్లిస్తాయి. అయితే ఇటీవల కంపెనీ సిబ్బంది లేనిపోని కిరికిరి చేయడం షురూ చేశారు. సరైన తూకం లేవని పెద్దసంఖ్యలో కోళ్లను, కోడిగుడ్లను తీసుకోకుండా మొండికేస్తున్నారు. దీంతో పెంపకందారులు కంపెనీల మాట వినేది లేదంటూ వారు ఇచ్చిన పిల్లలను శుక్ర, శనివారాల్లో సమీప అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. ఇది తెలిసిన ప్రజలు బ్యాగులు, పెట్టెలు తీసుకెళ్లి కోడిపిల్లలను పట్టుకెళ్లారు. -
నష్టపోయిన పరిశ్రమలకు సీఎం రిలీఫ్ ఫండ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధిని నగరంలో నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా అందిస్తామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని, హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయన బుధవారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని మారియెట్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ‘హుషార్ హైదరాబాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కోవిడ్ ప్రభావం అన్ని రంగలమీద పడిందని, నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చదవండి: (హైదరాబాద్‌నూ అమ్మేస్తారు : కేటీఆర్) కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ పధకం కింద ఎంత మందిని ఆదుకుందో తెలియదని ఎద్దేవా చేశారు. డీమానిటైజేషన్ వల్ల చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. గతంలో పవర్ లేక చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారని, కరెంట్ కోసం ధర్నాలు కూడా చేశారని కానీ ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా మార్చామన్నారు. తెలంగాణ వచ్చాక 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సిటీలో తన చిన్నతనంలో నెలకోసారి అల్లర్లు జరిగేవని, స్కూల్స్, పరిశ్రమలు బంద్ చేయించేవారన్నారు. దాని వల్ల విద్యార్థులతో పాటు వ్యాపారులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఇప్పుడు సిటీలో అల్లర్లు చెలరేగకుండా చూస్తున్నామని, శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్‌ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నామని, సిటీ శివారుల్లో కొత్తగా వస్తున్న టౌన్షిప్లకు రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీ ని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నగరంలో అందుతున్న వైద్యం, విద్య, ఉద్యోగోవకాశాలను జిల్లాల్లోనూ కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లోనూ ఇన్వెస్ట్ చెయ్యాలని వ్యాపారవేత్తలను కోరుతున్నామని, ఆగ్రో ప్రొస్సేసింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉందన్నారు. పాడీ పరిశ్రమల్లో మనం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, వరి, పప్పు ధాన్యాలు బాగా పండుతున్నాయన్నారు. వివిధ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను నెలకొల్పేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంపత్ కుమార్ గుప్తా, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. -
వ్యాపారుల కోసం భారత్‌పే డిజిటల్ గోల్డ్
న్యూఢిల్లీ: మర్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ భారత్‌పే వ్యాపారుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ బంగారం అమ్మకాన్ని ప్రారంభించింది.ఇందుకోసం సేఫ్‌గోల్డ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సేఫ్గోల్డ్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వినియోగదారులు అతి తక్కువ పరిణామంలో 24 గంటలూ బంగారాన్ని కొనేందుకు, అమ్మేందుకు, డెలివరీ చేసేందుకు అవకాశం లభిస్తుంది. భారత్‌పేలో డిజిటల్ బంగారాన్ని ప్రారంభించడం ద్వారా వ్యాపారులకు అన్ని రకాల ఆర్థిక ఉత్పత్తులు పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లు భారత్‌పే గ్రూప్ ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ చెప్పారు. డిజిటల్ బంగారాన్ని ప్రారంభించాల్సిందిగా వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారని, ప్రారంభించిన తొలిరోజే 200 గ్రాముల బంగారం విక్రయం జరిగిందని తెలిపారు.ముందు ముందు డిజిటల్ బంగారానికి డిమాండ్ పెరుగుతుందని ఈ ఆర్థిక సంవత్సరం 30 కిలోల బంగారం విక్రయించాలని, దీపావళి నాటికి కనీసం 6 కిలోలు బంగారం అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాపారులు భారత్‌పే యాప్‌ను ఉపయోగించడం ద్వారా 99.5 శాతం స్వచ్ఛత, 24 క్యారెట్ల బంగారాన్ని రోజులో ఏ సమయంలోనైనా, ఎక్కడి నుండైనా రూపాయి లేదా గ్రాములలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. వ్యాపారులు కొనుగోలు చేసిన బంగారం రక్షణకు సేఫ్గోల్డ్ ఐడిబిఐ ట్రస్టీషిప్ సేవలను వినియోగించుకుంటోంది.కొనుగోలు చేసిన బంగారాన్ని నూరు శాతం బీమాతో లాకర్లలో సురక్షితంగా ఉంచుతుంది.అంతర్జాతీయ మార్కెట్‌తో ముడిపడి ఉన్న బంగారం ధరల గురించి వ్యాపారులకు రియల్‌టైం వ్యూ అందుతుందని వారు కొనుగోలు చేసే బంగారానికి జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ కూడా లభిస్తుందని సమీర్ వివరించారు. -
వ్యాపారుల మాయాజాలం..
వ్యాపారం ఓ నమ్మకం.. వినియోగదారుడే దేవుడు. ఈ సూత్రాన్ని కొందరు వ్యాపారులు విస్మరిస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో తేడాలు అధికమయ్యాయి. కాటాలతో దగా చేస్తున్న కొందరు వ్యాపారుల చేతివాటానికి నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతం మోసపోతున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర సరుకులు కొనుగోలు చేసినప్పుడు కొసరు, మెగ్గు అని గతంలో వ్యాపారులు కాస్తంత ఎక్కువ తూకం ఇచ్చేవారు. ప్రస్తుతం తక్కెడలు పోయి వాటి స్థానంలో డిటిజల్ ఎల్రక్టానిక్ కాటాలు వచ్చాయి. దీంతో పక్కాగా తూకం వేస్తున్నారు. ప్రతిదీ బంగారంలా భావిస్తున్నారు. రాళ్ల కాటాలతో హెచ్చు తగ్గులు ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ఎల్రక్టానిక్ కాటాల్లో కూడా వినియోగదారులను ఎక్కువగా మోసం చేయవచ్చని కొందరు వ్యాపారులు నిరూపిస్తున్నారు. ఎల్రక్టానిక్ కాటాలతో మోసం ఇలా.... సాధారణంగా ఘన పదార్థాలను కిలో గ్రాముల్లో, ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తుంటారు. ఘన పదార్థాల కొనుగోలుకు వెళితే.. ఎల్రక్టానిక్ కాటాల్లో ద్రవ పదార్థాల తూకం మోడ్‌లో ఉంచి తూకం వేస్తున్నారు. కాటా స్క్రీన్‌పై (ఎల్) అనే అక్షరం మాత్రం స్టిక్కర్ అతికిస్తున్నారు. వాస్తవానికి కిలో ఘన పదార్థం బరువు 1,000 గ్రాములు ఉండగా ద్రవ పదార్థం బరువు 850 గ్రాములు మాత్రమే వస్తుంది. దీంతో కాటాలో ఆప్షన్‌ను లీటర్ మోడ్‌లోకి మార్చి ఘన పదార్థాల తూకం వేస్తున్నారు. దీంతో స్క్రీన్‌పై కనిపించేది లీటర్ల తూకమైన కొనుగోలు దారులకు కిలోలుగా చూపించి మోసం చేస్తున్నారు. స్క్రీన్‌పై ఎల్ అనే అక్షరం కనపడకుండా స్టిక్కర్ వేయడమో..రంగు పూయడమో చేస్తున్నారు. దీంతో వినియోగదారుడు కిలోకు 100 నుంచి 150 గ్రాముల వరకు నష్టపోతున్నారు. చిల్లర దుకాణాలు, చికెన్ షాపులు కూరగాయల మార్కెట్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడింది. దీంతో వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు తూకాలు వేసి వినియోగదారులను దోచుకుంటున్నారు. తూకంలో తేడా ఉందని వినియోగదారులకు అనుమానం వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని దుకాణాల్లో సీల్ లేకుండానే ఎల్రక్టానిక్ కాటాలను వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల అరిగిపోయిన రాళ్లు, మొద్దు కాటాలు వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు చిల్లర దుకాణాల్లో కొద్ది మేర మాత్రమే వ్యత్యాసం వస్తుండగా చికెన్ దుకాణాల్లో మాత్రం భారీ తేడాలు ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు.నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారుల్లో ప్రశ్నించే తత్వం రావాలి వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత ధోరణులు మారతాయి. ఏదేని వస్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశితంగా గమనించాలి. మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే 93981 49374 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచుతాం. మోసాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీరాముడు, తూనికల కొలతల శాఖ కంట్రోలర్ -
లోగ్రేడ్.. లో రేట్
కందుకూరు: అసలే ప్రకృతి వైపరీత్యాలతో పొగాకు నాణ్యత తగ్గింది. దానికి తోడు కరోనా వైరస్ పుణ్యమా అంటూ 50 రోజులకు పైగా వేలం నిలిచిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న నాణ్యత కాస్త వేలం విరామంతో మరికాస్త దిగజారింది. రంగు మారి బ్రైట్‌గ్రేడ్ రకం కూడా లోగ్రేడ్ రకంలోకి మారిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఈ ఏడాది రైతుల వద్ద లోగ్రేడ్ ఉత్పత్తులే అధికంగా ఉన్నాయి. కానీ వీటిని అమ్ముకోవాలంటే రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన లోగ్రేడ్ పొగాకు బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేయరు. ఒకవేళ కొనుగోలు చేసినా ధర రాదు. ఇదీ ప్రస్తుతం పొగాకు రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి. జిల్లాలో ఈ ఏడాది మొత్తం 91.78 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయింది. దాంట్లో ఇప్పటి వరకు 31.5 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. లోగ్రేడ్ రకం కొనుగోలు చేయని వ్యాపారులు: ఈ ఏడాది వేలం ప్రారంభంలోనే పొగాకు నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. బ్రైట్‌గ్రేడ్ కేవలం 40 శాతం మాత్రమే వచ్చిందనేది బోర్డు అధికారుల అంచనా. డిసెంబర్, జనవరి నెలల్లో కురిసిన అకాల వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతిని క్యూరింగ్‌లో మీడియం, లోగ్రేడ్ రకం ఉత్పత్తులు అధికంగా వచ్చాయి. దాదాపు 50 శాతం వరకు లోగ్రేడ్ ఉత్పత్తులు వచ్చాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేలంలో లోగ్రేడ్ రకం ఉత్పత్తులకు సరైన ధర దక్కితేనే రైతులు నష్టాల నుంచి బయటపడగలరు. కానీ పొగాకు వేలంలో పరిస్థితి పూర్తి భిన్నంగా నడుస్తోంది. బ్రైట్‌గ్రేడ్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారే తప్పా లోగ్రేడ్ రకం పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి వేలం కేంద్రంలో రోజూ వందల సంఖ్యలో లోగ్రేడ్ బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. ఉదాహరణకు కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో శనివారం 784 బేళ్లను వేలానికి ఉంచితే 634 కొనుగోలు చేయగా 150 బేళ్లను తిరస్కరించారు. అలాగే రెండవ వేలం కేంద్రంలో 719 బేళ్లను గాను 609 కొనుగోలు చేయగా 110 బేళ్లను తిరస్కరించారు. ప్రతి రోజు ఇదే తీరుగా వందల సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతున్నాయి. దీని వల్ల రైతులకు అదనపు భారంగా మారుతోంది. వేలానికి తీసుకొచ్చిన బేళ్లను తిరిగి ఇంటికి తీసుకెళ్లడం ఒకెత్తు అయితే తిరిగి తమ క్లస్టర్ వంతు వచ్చే వరకు వేచిచూడాల్సిన వస్తోంది. ఒక క్లస్టర్ వంతు తిరిగి వేలానికి రావాలంటే కనీసం నెల రోజులకుపైగానే పడుతోంది. ఇలా బేళ్లను ఇంటిలోనే ఉంచుకోవడం వల్ల ఆ ఉత్పత్తుల నాణ్యత మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ధర విషయం మరీ దారుణంగా ఉంది. లోగ్రేడ్ ఉత్పత్తుల విషయంలో సిండికేట్‌గా మారి న వ్యాపారులు గిరిగీసినట్లు ఒక రేటును దాటడం లేదు. కేవలం రూ.80 మాత్రమే చెల్లిస్తున్నారు. గత నెల రోజుల వేలం ప్రక్రియలో లోగ్రేడ్ రకం పొగాకుకు ఇదే ధర లభిస్తోంది. ఒక్క రూపాయి పెరగడం లేదు, తగ్గడం లేదు. అదీ లేకపోతే వేలంలో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీంతో ఈ ఏడాది అధికంగా ఉన్న లోగ్రేడ్ ఉత్పత్తులను అమ్ముకోవడం రైతులకు గగనంగా మారుతోంది. అమ్ముకున్నా వ్యాపారులు చెప్పిన రేటుకు ఇచ్చేయాల్సిందే. వేలం ఆలస్యంతో మరింత నష్టం: కరోనా వైరస్ లేకుంటే ఇప్పటికే వేలం ప్రక్రియ చివరి దశలో ఉండేది. కానీ ఈ ఏడాది ఇంకా మరో రెండు నెలలకు వేలం ముగిసినా ముగిసినట్టే. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఇంకా మిగిలిన ఉత్పత్తులే ఇందుకు నిదర్శనం. కందుకూరు ఒకటో వేలం కేంద్రంలో 8.4 మిలియన్లు, రెండవ వేలం కేంద్రంలో 7.2 మిలియన్ల వరకు అధికారిక కొనుగోళ్లు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు దాదాపు 3 మిలియన్ల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేశారు. ఇవిపోను అనధికారిక ఉత్పత్తులు కూడా ఉంటాయి. అంటే ఇంకెంత సమయం పడుతుందో ఊహించవచ్చు. దీని వల్ల ఉత్పత్తుల రంగు మారి అంతిమంగా రైతులకు నష్టం చేకూరుతుంది. అసలే లోగ్రేడ్ కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇష్టపడడం లేదు. ఈ పరిణామం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం బ్రైట్ గ్రేడ్ రూ.200లకు కొనుగోలు చేస్తున్నా, లోగ్రేడ్ రూ.80లు దాటడం లేదు. దీంతో సరాసరి రేట్లు కూడా రూ.140లు మించి రావడం లేదు. ప్రత్యక్ష వేలంలోకి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు వేలంలో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 1వ తేదీ నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ప్రధానంగా వ్యాపారులు కూటమిగా మారి ధరలు పెంచకపోవడం, లోగ్రేడ్ ఉత్పత్తులను తిరస్కరిస్తుండడంతో ప్రభుత్వం వేలంలోకి అడుగు పెడుతోంది. రేట్లు రాని ఉత్పత్తులను రైతులకు మద్దతు ధర వచ్చేలా వేలంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది. అంటే లోగ్రేడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల వ్యాపారులు కూడా కచ్చితంగా లోగ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బోర్డు పరిధిలో రిజిస్టర్ అయి వేలంలో పాల్గొనని వ్యాపారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో వేలంలో పాల్గొనే వ్యాపారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా మొత్తం మీద ప్రభుత్వమే స్వయంగా పొగాకు వేలంలోకి రావడం వల్ల ధరలు పెరుతాయనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఒకవేళ వ్యాపారులు ధరలు పెంచేందుకు ముందుకు రాకపోయినా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. దీని వల్ల ఇక రైతులు నష్టపోయే అవకాశం లేకుండా ఉంటుంది. అన్ని రకాల ఉత్పత్తులను మద్దతు ధరలకు వేలం కేంద్రాల్లోనే నేరుగా అమ్ముకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పొగాకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ : అసియాలోనే అతిపెద్ద మార్కెట్ అయినా ఢిల్లీలోని అజాద్‌పూర్ మండిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మండి వ్యాపారి కరోనాతో మరణించడంతో మార్కెట్ వ్యాపారులంతా భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండిలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు తేలడంతో మార్కెట్‌ను వెంటనే మూసివేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా అజాద్‌పూర్ మండికి చెందిన బోలా దత్త్ (57) అనే బఠానీ వ్యాపారి జ్వరం కారణంగా ఏప్రిల్ 19న ఆసుపత్రిలో చేరారు. పరీక్షల అనంతరం ఆదివారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వగా.. మంగళవారం ఆ వ్యక్తి మరణించాడు. అజాద్‌పూర్ మార్కెట్లో తొలి మరణం చోటుచేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.గత కొంత కాలంగా వ్యాపారిని సంప్రందించిన వారి వివరాలను సేకరిస్తన్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ షిండే తెలిపారు. (క్యారెట్ కేక్ చేసిన జాన్వీ; ఖుషీ ఊహించని రిప్లై ) ఈ క్రమంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ.. క్వారంటైన్‌కి పంపించాల్సిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదని, మృతుడితో సంప్రదింపులు జరిపిన మండి వ్యాపారులు, అతని కుటుంబానికి చెందిన వ్యక్తుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. మృతుడికి వ్యాపారంలో భాగస్వామి ఉన్నట్లు తెలిసిందని, అతనిని కూడా సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మండిలో ఇది తొలి కేసు కాదని ఇంతకముందు షాలిమార్ బాగ్‌కు చెందిన ఓ వ్యక్తితోపాటు మరో వ్యాపారికి కరోనా పాజిటివ్ తేలిందని ఓ ఉన్నతాధికారి పేర్నొనడం గమనార్హం. (జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్: ఆ పోలీసును అరెస్టు చేయండి ) అజాద్‌పూర్ మండి వ్యాపారి బోలా దత్ మృతి చెందడదంతో వ్యాపారి దుకాణం ఉన్న బ్లాక్‌ను అధికారులు సీజ్ చేశారు. అయితే మార్కెట్‌ను పూర్తిగా మూసేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ -19 వ్యాప్తిపై మార్కెట్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రస్తుతానికి మార్కెట్‌ను మూసివేయాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని వ్యాపారులు తెలిపారు. జపనీస్ పార్క్ లేదా ఇతర విశాల ప్రదేశాలలో సామాజిక దూరం పాటిస్తూ నిబంధనలకు కట్టుబడి వ్యాపారం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని వ్యాపారులు వెల్లడించారు. (మానవ తప్పిదాల వల్లే కరోనా వైరస్! ) కాగా అజాద్‌పూర్ మార్కెట్లో నిత్యం కూరగాయాలు, పండ్లు అమ్మకం జరుపుతుంటారు. 78 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ మార్కెట్లో లాక్డౌన్ కాలంలోనూ క్రయ విక్రయాలు కొనసాగుతున్నాయి. సాధారణ రోజుల్లో దాదాపు రెండు లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తారు. అయితే మార్కెట్‌లోవ్యాపారులు, కార్మికులు, సిబ్బంది అంతా కలిపి ఇంచుమించు 50 వేల మంది ఉన్నట్లు తేలింది. (ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన వ్యక్తికి పాజిటివ్ ) -
అసహాయులకు ఆపన్న హస్తం
వారంతా చిరువ్యాపారులు.. టీ కొట్టు, పానీపూరి, బజ్జీలు, కూరగాయలు, వాచ్ రిపేర్, మెడికల్ ల్యాబ్ వంటి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటు న్నారు. తమకు ఉన్నంతలో ఇతరులకు సేవ చేయాలన్న సత్సంకల్పంతో ప్రతి నెలా రెండువందల రూపాయల చొప్పున జమ చేసుకుని పేదలకు ‘ఆపన్నహస్తం అంది స్తుంటారు. కిడ్నీబాధితులు, కేన్సర్ పేషెంట్లు, ఇళ్లు లేని నిస్సహాయులు, అనా«థలు ఇలా ఎవరైనా కష్టాలతో బాధపడుతుంటే మేమున్నామంటూ ముందుకు వచ్చి వారికి అండగా నిలుస్తారు ఈ ‘ఆపన్నహస్త మిత్ర బృందం’. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన బాలస్వామి, శ్రీనివాస్, శ్యాంప్రసాద్, రాజు, స్వామిలు చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే నిస్సహాయుల కథనాలు చదివి చలించిపోయేవారు. వారి ఆలోచనలు ఉన్నతమైనవే కానీ, ఆదుకోడానికి వారి దగ్గర ఆర్థికంగా అంత స్థోమత లేదు. అందుకే వారంతా కలిసి 2017 నుంచి బృందంగా ఏర్పడి నిస్సహాయులకు ‘ఆపన్న హస్తం’ అందిస్తున్నారు. ఐదుగురితో మొదలైన ఆ బృందంలో ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు చెందిన 112 సభ్యులు ఉన్నారు. ఇందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరారు. వీరు మొట్టమొదటిగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అంధుల పాఠశాలలో బోరు మోటార్ లేక అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కథనాన్ని పత్రికల్లో చదివి అక్కడికి వెళ్లి వారికి మోటార్ ఇప్పించారు. అప్పుడు వారు అనుకున్న దానికంటే ఎక్కువగా నగదు అవసరం కావడంతో అప్పటినుంచి వారు మరికొంత మంది సభ్యులతో కలిసి ఆపన్నహస్తం మిత్ర బృందం ప్రారంభించి ప్రతీనెలా రెండువందల చొప్పున నగదు జమచేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. సేవా కార్యక్రమాల్లో కొన్ని.. ►జనగామ జిల్లాలోని కళ్లెం గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని సుకన్య ఉన్నత చదువుల కోసం రూ.22,000 సాయం ►సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన తల్లీతండ్రిలేని ఒక పాప పేరుతో బ్యాంకులో రూ. 10,000లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ►వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కిడ్నీ బాధితురాలికి రూ.10,000 వైద్యసాయం కోసం అందించారు ►సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారి వర్ష కేన్సర్‌తో బాధపడుతుండటంతో రూ. 20,000 లు ఆర్థిక సాయం అందించారు. ►గజ్వేల్ పట్టణంలో మతిస్థిమితం లేక రోడ్లపై సంచరిస్తున్న ముగ్గురిని చేరదీసి వారిని యాదాద్రి జిల్లాలోని అమ్మనాన్న ఆశ్రమంలో చేర్పించి వారి ఖర్చుల నిమిత్తం 26,800 అందించారు. ►నల్గొండ జిల్లాకు చెందిన శివప్రసాద్ కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యసేవలకోసం వారికి రూ.20,000 లు అందించారు. ►కేరళలోని వరద బాధితుల సాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15,200 – తాటికొండ రవి, సాక్షి మెదక్ డెస్క్ సేవతో సంతృíప్తి నేను వాచ్ రిపేర్ సెంటర్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. మేము చేసేది చిరువ్యాపారం.. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అయినా ఉన్నంతలో ఇతరులకు సేవ చేస్తూ తృప్తి చెందుతున్నాం. ప్రతి నెలా ఒక్కో సభ్యుడి దగ్గర రూ. 200 చొప్పున వసూలు చేసి జమ చేసుకుంటాం. మా బృందంలో రాజకీయ నాయకులను చేర్చుకోము. – బాలచంద్రం, అధ్యక్షుడు చలించిపోయాను నేను గజ్వేల్‌లో మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తుంటాను. పత్రికల్లో వచ్చే కథనాలు చూసి చలించిపోయాను. మా వంతుగా ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మమ్మల్ని చూసి చాలామంది సేవా బృందాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. – కటుకం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆపన్నహస్తం ►జనగామ జిల్లా కు చెందిన యువతి నిహారిక కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఈ విషయం చెప్పకుండానే ఆమెకు పెళ్లి చేశారు. కొద్ది రోజుల తరువాత విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. ఈ కథనం సాక్షి పత్రికలో రావడంతో ఆమె వైద్యానికి రూ.10,000 బ్యాంకులో డిపాజిట్ చేశాము. తరువాత సాక్షి పత్రికలో మనసున్న మహారాజులు అంటూ కథనం రావడంతో అది చూసి చాలా మంది స్పందించి ఆ యువతికి సాయం చేశారు. -
మద్యం వ్యాపారుల తర్జన భర్జన!
సాక్షి, కడప : టీడీపీ ప్రభుత్వం పాలసీలతో ఏర్పాటు కాబడిన మద్యంషాపుల గడువు ఈనెలాఖరుతో ముగియనున్నది. కొత్త మద్యం పాలసీ అమలుకావడానికి ఆలస్యం కానుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మద్యంషాపును సెప్టెంబరు 30 వరకు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే మళ్లీ షాపులను కొనసాగించడానికి లైసెన్స్ రెన్యూవల్ చేసుకునే విషయంలో వ్యాపారులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయంలో ముందుకు వెళ్లడమా? వ్యాపారం విరమించుకోవడమా అనే అంశంపై మద్యం వ్యాపారులు తలమునకలవుతున్నారు. షాపులు తగ్గుముఖం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా 20శా తం మద్యం దుకాణాలు తగ్గిస్తామని సీఏం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మ ద్యంషాపులు తగ్గుముఖం పట్టనున్నాయి. మద్యం షాపుల తగ్గింపుపై సీఎం వైఎస్ జగన్ ప్రకటనను ప్రజా, మహిళాసంఘాలు అభినందిస్తున్నాయి. దశలవారీ మద్యనిషేధం దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నది. ఈమేరకు కసరత్తు చేస్తోంది. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా ఏటా మద్యంషాపులు తగ్గించడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విధితమే. అక్టోబరు1 నుంచి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా రిటైల్ మద్యంషాపులు నిర్వహిస్తామని ఆశాఖ ప్రత్యేక కార్యదర్శి సాంబశివరావు మంగళవారం వెల్లడించారు. లైసెన్స్ రెన్యూవల్ అదనంగా మూడునెలలు మద్యం విక్రయాలు నిర్వహించడానికి మద్యం దుకాణాల యజమానులు లైసెన్స్ ఫీజుతోపాటు, పర్మిట్రూం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మూడు శ్లాబుల్లో మద్యం దుకాణాల నుంచి లైసెన్స్, పర్మిట్ రూమ్ ఫీజులు వసూలు చేయనున్నది. రెన్యూవల్‌కు వెనుకడుగు.. జిల్లాలో 210కిపైగా మద్యంషాపులు, 20బార్లు ఉన్నాయి. మద్యం సరఫరా చేసే డిపోలు రెండు ఉన్నాయి. నెలకు రూ.10 నుంచి రూ.15కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ అమ్మకాల వల్ల ప్రభుత్వానికి 50శాతం ఆదాయం వస్తోంది. షాపుల కొనసాగింపు చేపట్టిన క్రమంలో మద్యంషాపుల నిర్వాహకులు ఎమ్మార్పీ ఉల్లంఘించినా, నిర్ణీతవేళకు మించి మద్యం విక్రయించినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోనున్నది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నిబంధనలు అతిక్రమించి ధనార్జనకు అలవాటుపడిన మద్యంషాపుల నిర్వహకులపై ప్రస్తుత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడునెలల రెన్యూవల్‌కు అవకాశం కల్పించినా నిర్వాహకులు ముందుకు రావడానికి జంకుతున్నారు. ససేమిరా ప్రభుత్వం బెల్టుషాపుల నిర్వహణకు ససేమిరా అంటుండడంతో అనధికార ఆదాయానికి అలవాటుపడిన వారు లైసెన్స్ రెన్యూవల్స్ చేయిం చుకుంటే తమ ఆటలు సాగవనే అభిప్రాయంలో ఉన్నారు. కాగా దశలవారీ మద్యనిషేధంలో భాగంగా బెల్టుషాపుల సమూల నిర్మూలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బెల్టుషాపులకు మద్యం రవాణా చేసే షాపుల లైసెన్స్‌లను సైతం రద్దు చేసి కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ బెల్టుషాపుల నిర్మూలనకు నడుంబిగించింది. అక్టోబరునెలకంతా బెల్టుషాపుల వాసన ఉండకూడదని కలెక్టర్లు, ఎస్పీలకు సైతం సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సౌకర్యాలకు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: జిల్లాలో దూసుకువస్తున్న స్థిరాస్తి వెంచర్లలో వ్యాపారులు ఆధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరుకు రహదారులు, కాలుష్యం, ఇతర అసౌక్యాలకు నిలయంగా ఉన్న నగర జీవితాన్ని మరిచిపోయేలా మదిని మైమరిపించే అనేక అత్యాధునిక సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందమైన ప్రకృతిని వెంచర్లలో నెలకొల్పి కలల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. 40 అడుగుల రోడ్లు, ఫైవ్ స్టార్ సౌకర్యాలు, అందమైన ఆర్కిటెక్చర్ డిజైన్లకు ప్రాధాన్యం ఇచ్చేలా వెలుస్తున్న ఈ వెంచర్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. స్థలం ఎంపిక నుంచి లే అవుట్ డిజైన్, మౌలిక వసతుల రూపకల్పన, పర్యావరణానికి నేడు అందరూ ప్రాధాన్యం ఇస్తుండటంతో స్థిరాస్తి వ్యాపారులు కూడా ఆ మేరకు కొనుగోలుదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త వెంచర్లను వేస్తున్నారు. ఖర్చు చేసే ప్రతి రూపాయికి అధిక విలువ తెచ్చేందుకు ప్రాధాన్యమిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పచ్చని మొక్కలతో.. నగర జీవితమంటే ప్రధానంగా కాలుష్యం చెంతనే అనేది నానుడి. జగమెరిగిన ఈ సత్యాన్ని కలలో సైతం రానీయకుండా నగర శివారు ప్రాంతాల్లో కాలుష్యానికి చెక్ పెడుతూ సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. విశాలమైన రోడ్లపై ఇరువైపులా పచ్చని మొక్కలు పెంచటమే కాకుండా వాటి పర్యవేక్షణకు సంస్థలే ప్రాధాన్యం ఇస్తున్నాయి. పచ్చని పార్కులు ఆపై అందమైన డిజైన్లతో కొనుగోలుదారులకు సౌకర్యాల కల్పనలో పోటీపడుతున్నాయి. అతి తక్కువ ధరలో వాయిదాల పద్ధతిలో సైతం ఇళ్ల స్థలాలు లభ్యం కావటంతో మధ్య తరగతి కుటుంబాలు సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు.. వెంచర్ల ఏర్పాటులో రక్షణకు కూడా సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆకర్షణీయమైన ముఖ ద్వారంతో స్వాగతం పలుకుతూ 60, 40, 40 ఫీట్ల రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ ఇబ్బంది లేకుండా భూగర్భ కేబుల్స్ వేయటంతో పాటూ కొన్ని సంస్థలు ప్రహారీ గోడ మీద సౌర విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నాయి. 24 గంటల పాటు సెక్యూరిటీ ఏర్పాటుతో కొనుగోలుదారులు ప్రశంసలు పొందుతున్నారు. స్టార్ హోటల్ వసతులు.. నేటి యువత అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇంటి నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగ ఒత్తిడి నుంచి సాంత్వన పొందే ఇంటి నిర్మాణాలపై ఆసక్తి చూపిస్తోంది నేటి యువత. దీనికి తగ్గట్టుగానే కొంత మంది వ్యక్తిగత గృహాలు ఇష్టపడుతుంటే, మరికొంత మంది అపార్ట్మెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు తగ్గ ట్టుగానే వ్యాపారులు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. త్రిబుల్ బెడ్‌కు డిమాండ్ వ్యక్తిగత గృహాలైనా సరే త్రిబుల్ బెడ్రూమ్ నిర్మాణం వైపు నేటి యువత ఆసక్తి చూపిస్తుంది. పార్కింగ్, పచ్చని ఆవరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు 300–500 చదరపు గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను వేస్తున్నారు. అందమైన డిజైన్లతో విల్లాలతో పోటీ పడే ఇటువంటి నిర్మాణాలు నేటి యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఉడెన్ ఫ్లోరింగ్ అందానికి, హోదాకి చిహ్నం ఉడెన్ ఫ్లోరింగ్. దీని నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదు. దుమ్ము, ధూళి, ఇసుక, మట్టి వంటివి ఉడెన్ ఫ్లోర్‌కు శత్రువులు. ఇవి గీతలను సృష్టించడమే కాకుండా కాంతి విహీనం చేస్తాయి. అందుకే అవి దరిచేరకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచుగా మెత్తటి గుడ్డతో శుభ్రం చేస్తుండాలి. ఫ్లోర్‌ను వ్యాక్స్, వార్నిష్, పాలియుథరిన్తో ఫినిషింగ్ చేయించుకుంటే.. ఆ నేల మీద ఆహారపదార్థాలు, ద్రవాలు పడకుండా జాగ్రత్త వహించాలి. లేదంటే గచ్చు కాంతి మాయం అవుతుంది. పొరపాటున సిరా లేదా నీళ్లు ఒలికితే ముందుగా ఉడెన్ ఫ్లోర్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. తర్వాత వెనిగర్ కలిపిన నీటిలో ముంచిన మెత్తటి గుడ్డతో తుడిచేయాలి. అనంతరం పొడి బట్టతో తుడిస్తే సరిపోతుంది. -
అడుగు జాడలు
బాలానగర్ పోలీసు స్టేషన్.మధ్యాహ్నం రెండు గంటలు కావస్తోంది. అప్పుడే స్టేషన్లో అడుగు పెడ్తున్న ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్‌కు తన టేబుల్ మీదున్న ఫోన్ రింగవడం వినబడింది. గబగబా వెళ్ళి ఫోన్ ఎత్తాడు. ‘‘హల్లో.. అయాం ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్’’ అన్నాడు కుర్చీలో కూర్చుంటూ..‘‘హల్లో సార్.. నేను పంకజ్ సేఠ్‌గారి వంట మనిషిని మాట్లాడుతున్నాను. మా అయ్యగారు నేల మీద పడి ఉన్నారు సార్. పిలిస్తే పలకడం లేదు. చనిపోయినట్టు అనుమానంగా ఉంది సార్’’ అంటూ భయం భయంగా చెప్పాడు అవతలి వ్యక్తి.పంకజ్ సేఠ్ అంటే బాలానగర్ పరిసరాల్లో తెలియని వారు అరుదు. అతడు లైసెన్స్ కలిగిన వడ్డీ వ్యాపారి. నగలు తాకట్టు పెట్టుకుని డబ్బులు వడ్డీకిస్తూ ఉంటాడు. ‘‘నీ పేరు’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘మస్తాన్ సార్..’’ ‘‘పదినిముషాల్లో అక్కడ ఉంటాను. ఎవరూ శవాన్ని గాని, అక్కడి వస్తువులు గాని ముట్టుకోవద్దు..’’ అంటూ హెచ్చరికలు చేస్తూ.. ఫోన్ పెట్టేశాడు.వెంటనే తనవాళ్లతో హుటాహుటిన పంకజ్ సేఠ్ ఇంటికి పోలీసు వ్యానులో బయలుదేరాడు. క్లూస్ టీమ్ తమకు కావలసిన ఫోటోలు వేలిముద్రలు సేకరించసాగింది. ఇంతలో ప్రైవేటు డిటెక్టివ్ శ్రీకర్ తన అసిస్టెంట్ హరితో ‘పిలవని పేరంటానికి వచ్చినట్టు’ రావడం చూసి కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు ముఖం పెట్టాడు రంజిత్‌కుమార్. బహుశః మస్తానే ఫోన్ చేసి ఉంటాడనుకున్నాడు. ‘‘హల్లో .. గుడీవినింగ్ రంజిత్..’’ అంటూ శ్రీకర్ కరచాలనం చేశాడు. శ్రీకర్ వెనకాలే నిలబడ్డ హరి కూడా అభివాదం చేశాడు. ఎవరి సాయం లేకుండా కేసు పరిశోధించి నేరస్తుణ్ణి పట్టుకోవాలనుకున్న రంజిత్‌కుమార్... స్పందించక తప్పలేదు.పంకజ్ సేఠ్ శవాన్ని పరిశీలనగా చూడసాగాడు శ్రీకర్. లాకర్ పక్కనే వెల్లకిలా పడి ఉంది శవం.. తల కింద రక్తపు మడుగు. లాకర్ కీస్ దానికే ఉన్నాయి. క్లూస్ టీమ్‌కు మరికొన్ని సూచనలిచ్చి వారిని మేడ పైకి పంపాడు. రంజిత్కుమార్తో కాసేపు చర్చించాడు. ఇంట్లో మస్తాన్ తప్ప ఎవరూ లేనట్లుగా వుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ.. హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుంటూ.. మస్తాన్‌ను పిలిచారు.మస్తాన్ రెండు చేతులా దండం పెట్టుకుంటూ.. వచ్చి వారి ముందు నిలబడ్డాడు. ‘‘ఇంట్లో ఎవరెవరుంటారు’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘సేఠ్‌గారితో బాటు చిన్నమ్మగారు శైలజ, చిన్న సేఠ్ ప్రవీణ్, వాచ్‌మన్ శీను, నేను...’’ ‘‘చిన్నమ్మ అంటున్నావు.. పెద్దమ్మ లేదా..? ’’‘‘లేదు సార్. ఆమె కొడుకే ప్రవీణ్ చిన్న సేఠ్. ప్రవీణ్ తల్లి గారు చనిపోతే సేఠ్ గారు శైలజమ్మ గారిని రెండవ పెండ్లి చేసుకున్నాడు’’ ‘‘ప్రవీణ్ సేఠ్ ఎక్కడికెళ్లాడు?’’ అడిగాడు శ్రీకర్. ‘‘డబ్బులు కలెక్ట్ చెయ్యడానికై ఊర్లు తిరుగుతూ ఉంటాడు సార్. ఏ ఊరెళ్ళాడో తెలీదు. అతని సెల్లుకు ఫోన్ చేసి చెప్పాను. వస్తున్నా..’’ అన్నాడు. ‘‘మరి చిన్నమ్మగారు’’ ‘‘అమ్మగారు పుట్టింటికి ఉప్పల్ వెళ్లారు సార్. వాళ్ళు కూడా కారులో బయల్దేరామన్నారు’’ ‘‘మరి శీను..!’’ అడిగాడు రంజిత్‌కుమార్. ‘‘నేను కూరగాయలకని వెళ్ళాను సార్. వచ్చేసరికి అయ్యగారు అలా పడి ఉన్నారు. శీను కనిపించడం లేదు సార్’’ ‘‘అయితే వాడే హత్య చేసి ఉంటాడు’’ ఠక్కున అన్నాడు అసిస్టెంట్ హరి తన బాస్‌ను చూసుకుంటూ.. నోరు మూసుకో అన్నట్టు కళ్ళు పెద్దవిగా చేసుకొని హరి వంక ఉరిమి చూశాడు శ్రీకర్. హరి తల వంచుకుని నేల చూపులు చూడసాగాడు.‘‘ఇంటిగుట్టు తెలిసినవాని పనే ఇది’’ అన్నాడు రంజిత్‌కుమార్. కావచ్చు అన్నట్టుగా తలాడించాడు శ్రీకర్. మరో గంటలో.. అంతా వచ్చారు.శైలజ, వాళ్ల తమ్ముడు అమ్మానాన్నలతో కారు దిగుతూనే.. గుండెలు బాదుకుంటూ.. పరుగెత్తుకొచ్చింది. శవమున్న గదికి రెడ్ టేప్ వేసి ఎవరూ దగ్గరికి వెళ్ళకుండా పోలీసు కాపలా ఉండే సరికి గది బయటనే నిలబడి తల కొట్టుకోసాగింది.‘ఎంత ఘోరం జరిగిపోయిందీ’ అన్నట్టుగా ఆమె వెంట వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. ఆమె తమ్ముడు నిశ్చేష్టులై కంట నీరు పెట్టుకుంటూ శైలజను ఊరడించసాగారు.. ప్రవీణ్ తన తండ్రి శవాన్ని చూస్తూనే రెండు చేతులా తల పట్టుకుని కుప్పలా కూలిపోయాడు.. ‘‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సాధ్యమైనంత త్వరలో హంతకుణ్ణి పట్టుకుంటాను’’ అంటూ రంజిత్‌కుమార్ ఉపశమన వాక్యాలు పలుకుతూ.. శవాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించే ప్రయత్నాలలో మునిగాడు. శ్రీకర్, హరి సహకరించసాగారు. శ్రీకర్‌ను చూడగానే ప్రవీణ్‌కు భరోసా కలిగింది. ఆయనకు పోలీసుల మీద కంటే ప్రైవేటు డిటెక్టివ్‌ల మీద నమ్మకం ఎక్కువ. మర్నాడు హాల్లో అందరినీ సమావేశ పర్చాడు శ్రీకర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు. తలకు బలమైన గాయంతో బాటు విషవాయువు పీల్చడం మూలాన పంకజ్ సేఠ్ ప్రాణాలు పోయాయని వివరించాడు. అంతా ఒక్క సారిగా కొయ్యబారి పోయారు.‘‘మీనాన్నకు శత్రువులెవరైనా ఉన్నారా?’’ అంటూ ముందుగా ప్రవీణ్‌ను అడిగాడు శ్రీకర్.‘‘నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు సార్ ’’ ‘‘శీను మీద ఏమైనా అనుమానముందా.. ?’’ ‘‘శీను చాలా మంచివాడు సార్.. సున్నితపు మనస్తత్వం కూడానూ..’’ శైలజ గారితో ఏకాంతంగా మాట్లాడుతానని శ్రీకర్ అనగానే.. అంతా హాలు ఖాళీ చేశారు. ‘‘శైలజ గారూ.. మీరంతా నాకు సహకరిస్తేనే నేను హంతకుణ్ణి పట్టుకోగలను. నాకు కొన్ని నిజాలు తెలియాలి’’ అంటూ శైలజ ముఖ కవళికలు చదవసాగాడు. శైలజ నిజమే అన్నట్లుగా తలూపింది. ‘‘పంకజ్ సేఠ్ గారితో వివాహం మీ ఇష్టప్రకారమే జరిగిందా?’’ ‘‘మా పేదరికం నా తల వంచుకుని తాళి కట్టించుకునేలా చేసింది సార్’’ అటుంటే ఆమె కళ్లలో నీళ్లు సుళ్లు తిరగాయి. కడకొంగుతో కన్నీరు ఒత్తుకుంటూ.. ‘‘మా నాన్న ప్రభుత్వ సంస్థలో గుమాస్తా.. చాలీ చాలని జీతం. మా అక్కయ్య పెళ్లితో మా నాన్న సంపాదనంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇంటి మీద అప్పులు మిగిలాయి. నాకొక తమ్ముడు.. వాడికి చదువు అబ్బలేదు. పదో తరగతి తప్పాడు.మాకందరికీ అండగా ఉంటానని భరోసా కలిగించి సేఠ్ నన్ను పెళ్ళి చేసుకున్నాడు’’ అంటూ మౌనంగా ఉండిపోయింది.ఇంతలో శ్రీకర్ అసిస్టెంటు హరి వచ్చాడు. చెప్పిన పని ఏమైంది?.. అన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీకర్. ‘‘సర్.. శీను భువనగిరిలో తన అక్కయ్య వద్ద వున్నాడని తెలిసింది. ఎస్సై రంజిత్‌కుమార్ గారికి చెప్పాను. వెంటనే పోలీసులను పంపారు. పోలీసులకు శీను దొరికాడట, నేరుగా పోలీసు స్టేషన్‌కు తీసుకు వస్తున్నారట. మనల్ని కూడా అక్కడికే రమ్మన్నారు’’ చెప్పాడు హరి. ‘‘వెరీ గుడ్..’’ అంటూ హరిని మెచ్చుకున్నాడు శ్రీకర్. హరి ముఖం వెలిగిపోయింది.ఆ ముఖాన్ని మరింత వెలిగించాలని.. హరికి మరో పని అప్పగించాడు శ్రీకర్. బాసుకు తన మీద నమ్మకం పెరుగుతూండటంతో తబ్బిబ్బయ్యాడు హరి. వెటనే శ్రీకర్ పురమాయించిన పనిని చక్కబెట్టాలని సెలవు తీసుకున్నాడు. శ్రీకర్ పోలీసు స్టేషన్‌కు బయలుదేరాడు.అప్పుడే రంజిత్‌కుమార్ శీనుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు.శీను చెప్పసాగాడు.‘‘సార్! ఆరోజు మా అబ్బాయికి ఫీజు కట్టడానికని.. నేను అయ్యగారిని పదివేల రూపాయలు అడిగి తీసుకుంటూండగా.. రమేష్ అనే అతను వచ్చాడు. తాను గోల్డ్ మెడలిస్టునని, తనకు ఉద్యోగం వచ్చిందని వాళ్ళు డిపాజిట్ కింద పాతికవేలు కావాలంటున్నారని, అందువల్ల తన మెడల్‌ను తాకట్టు పెడుతున్నానని అన్నాడు. అయ్యగారు దానిని చూసి పరీక్షించి పదిహేనువేల కంటే ఎక్కువ రాదన్నారు. రమేష్ కాళ్లా వేళ్లా పడ్డాడు తన జీవితానికి సంబంధించిన సమస్య అని, మొదటి జీతంతోనే మొత్తం బాకీ తీరుస్తానని కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతలో నన్ను వెళ్లిపొమ్మన్నట్లుగా అయ్యగారు చేతితో సైగ జేశారు. నేను మా ఊరికి వెళ్ళి పోయాను. ఆ తరువాత ఏమైందో.. నాకు తెలియదు సార్..’’ అంటూ బిక్కమొహం వేశాడు శీను.‘‘రంజిత్.. నేను వస్తూ.. వస్తూ.. రమేష్‌ను తీసుకొని వచ్చాను’’ అన్నాడు శ్రీకర్. ఎలా.. అన్నట్టుగా చూశాడు రంజిత్‌కుమార్. ఆశ్చర్యపోతూ..‘‘ఇంతకుముందు పంకజ్ సేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు.. తాకట్టు పెట్టుకునే రిజిస్టర్ నుండి రమేష్ చిరునామా తీసుకున్నాను. చివరిసారిగా డబ్బు తీసుకున్నది అతనే..’’ అంటూ రమేష్‌ను లోనికి రమ్మని పిలిచాడు.‘‘రమేష్.. పంకజ్ సేఠ్‌ను చివరిసారిగా కలుసుకున్నది నువ్వే.. ఆ రోజు ఏం జరిగింది?’’ అంటూ ప్రశ్నించాడు శ్రీకర్. ‘‘సార్ నాకు డబ్బు చాలా అవసరం. సేఠ్ బీరువాలోంచి డబ్బుకట్ట తీసి, పదిహేనువేలిచ్చి, మిగతాది లోపల పెట్టబోతుంటే.. సేఠ్ చేతిలోంచి డబ్బు లాక్కొని పోయాను. సేఠ్ వెల్లకిలా పడిపోవడం గమనించాను. నేను వెనకా ముందు ఆలోచించకుండా బయటకు పరుగెత్తాను. ఆ తరువాత ఏమైందో నాకు తెలియదు సార్..’’ అంటూ కన్నీరు పెట్టుకోసాగాడు. ‘‘ఆ.. అన్నట్టు గుర్తొచ్చింది సార్.. ఎవరో ఒకతను నాకెదురయ్యాడు.. సార్ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. నా మీద కేసు లేకుండా చూడండి’’ అంటూ రంజిత్‌కుమార్ కాళ్లు పట్టుకున్నాడు రమేశ్.. ‘‘సరే.. సరే.. గాని అతన్ని చూస్తే గుర్తుపట్టగలవా..’’ అంటూ అడిగాడు రంజిత్‌కుమార్. రమేష్ తల అడ్డంగా ఊపాడు గుర్తుపట్టలేను అన్నట్లుగా..‘‘రంజిత్... శీనును, రమేష్‌ను మీ కస్టడీలోనే ఉంచండి.. సాయంత్రానికల్లా మరింత సమాచారం లభిస్తుంది.. రేపటికల్లా కేసు తేలిపోతుంది’’ అంటూ భరోసా ఇచ్చి వెళ్ళిపోయాడు శ్రీకర్. రంజిత్‌కుమార్ దీర్ఘాలోచనలో పడ్డాడు.మరుసటి రోజు శ్రీకర్, రంజిత్‌కుమార్‌ల సూచనల మేరకు హరి మీడియాను ఆహ్వానించాడు. అంతా పంకజ్ సేఠ్ ఇంట్లో సమావేశమయ్యారు. శ్రీకర్ తన అసిస్టెంటు హరి సాయంతో కేసు పరిశోధనాంశాలని వివరించసాగాడు. ప్రతి మనిషికీ డబ్బు అవసరమే.. కాని కొందరు దొడ్డి దారిలో మానవత్వాన్ని మరిచి డబ్బు సంపాదిస్తూంటారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడరు. ఆ రోజు అదే జరిగింది. రమేష్ ఒక నిరుద్యోగి. డబ్బు అవసరం. కాని అనుకున్నంత డబ్బు తన వస్తువుకు రాలేదు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలని.. ఆవేశంగా డబ్బు లాక్కొని పారిపోయాడు. అప్పుడు అతనికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనొక వీడియో గ్రాఫర్‌గా ఒక షాపులో పార్ట్ టైంజాబ్ చేస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిస. తన బావ బలహీనతను ఆసరాగా తీసుకొని, అతని ప్రైవేట్ ఫోటోలు మార్ఫింగ్ చేసి చూపిస్తూ.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఆరోజు కూడా అతను అలాగే వచ్చాడు. పంకజ్ సేఠ్ పడిపోవడం చూశాడు. అప్పటికి సేఠ్ స్పృహ మాత్రమే కోల్పోయాడు. ఇప్పుడు తనేం చేసినా ఆ నేరం అప్పుడు పరుగెత్తే రమేష్ పైన పడుతుందని దుర్భుధ్ధి పుట్టింది. వెంటనే పక్కన వున్న దోమలమందును పంకజ్ సేఠ్ ముక్కులో స్ప్రే చేశాడు. పంకజ్ సేఠ్ ప్రాణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోయాయి. నిందితుడు చేతి ముద్రలు పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంత ఆరితేరిన నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికి పోతుంటాడు. ఇక్కడా అదే జరిగింది. అనే సరికి అంతా శ్వాస బిగబట్టి వినసాగారు. శ్రీకర్ తిరిగి చెప్పసాగాడు. ‘‘డబ్బు తీసుకొని పరుగెత్త బోయిన నిందితునికి గేటు తీసిన చప్పుడు వినబడింది. ఎవరో వస్తున్నారని గబగబా మెట్లెక్కి మొదటి అంతస్తుకు వెళ్ళాడు. అప్పుడు వచ్చిన వ్యక్తి మస్తాన్.ఈ ఇంటికి మరో మార్గం మేడపై నుంచి వుంది. ఇంటి వాళ్ళ రాక పోకల కోసం. గేటు చప్పుడు కాగానే ఆగంతకుడు శబ్దం రాకుండా ఉండాలని చెప్పులు విప్పి మేడ పైకి వెళ్ళాడు. అతనికి తెలిసిన మార్గమే కాబట్టి మెల్లగా జారుకున్నాడు. అతని అడుగు జాడలే అతణ్ణి పట్టించాయి. ‘‘ఇంతకూ ఆగంతకుడెవరు సార్..’’ అంటూ మీడియా ఆతృతగా అడిగింది. ‘‘అతను మన మధ్యలోనూ ఉన్నాడు’’ అనగానే అంతా అవాక్కయ్యారు. ఇంతలో శైలజ తమ్ముడు కిశోర్ లేచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే రంజిత్‌కుమార్ వెళ్ళి అదుపులోకి తీసుకున్నాడు. ‘‘కిశోర్ అని ఎలా తెలిసింది సార్’’ అంటూ మరింత ఆశ్చర్యంగా అడిగాడు రంజిత్‌కుమార్ కిశోర్ చేతికి బేడీలు వేయిస్తూ..‘‘రంజిత్.. మనం ముందే అనుకున్నాం. ఇది తెలిసిన వారి పనే అని. నేను రాగానే ఇంటికి రెండుదారులు ఉండడం.. అనుమానించాను. క్లూస్ టీమ్‌ను మేడ మీది పాద ముద్రలను కూడా ఫోటో తీయాలని కోరాను. ఇక హరిని ఉప్పల్ పంపించాను. కిశోర్ ప్రవర్తన అతని స్నేహితులతో.. తెలుసుకున్నాను. దాంతో సగం నమ్మకం కలిగింది. కిశోర్ అడుగులు.. మేడ మీది అడుగు జాడలతో సరిపోయే సరికి నిర్థారించుకున్నాను. ఏమంటావ్ కిశోర్..?’’ అంటూ తీక్షణంగా చూశాడు శ్రీకర్. కిశోర్ తల దించుకున్నాడు. ఇంత సులువుగా హత్య కేసు పరిష్కారమైనందుకు.. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు రంజిత్‌కుమార్. శ్రీకర్‌ను, హరిని అభినందించాడు. యు.విజయశేఖర రెడ్డి -
పాదుషా ప్రశ్నలు
ఒక పాదుషా గారుండేవారు. ఆయనకు అబద్ధాలంటే గిట్టదు. ఎవరైనా తన రాజ్యంలో అబద్దం చెబుతూ పట్టుబడితే, ఐదు దీనార్ల జరిమానా విధిస్తానని దండోరా వేయించాడు. దాంతో ఆ రాజ్యంలోని ప్రజలంతా అబద్ధాలాడేందుకు జంకేవారు. ఒకరోజు పాదుషా గారు మారువేషంలో గస్తీ తిరుగుతుండగా భోరున వర్షం కురిసింది. తలదాచుకునేందుకు ఒక వ్యాపారి దగ్గర ఆగారు. ఆ వ్యాపారి పాదుషా గారికి సపర్యలు చేశాడు. మాటల మధ్యలో వ్యాపారిని ‘‘నీ వయస్సెంత?’’ అని అడిగాడు. ‘‘ఇరవై సంవత్సరాలు?’’ అని చెప్పాడు వ్యాపారి. ‘‘నీ దగ్గర ఎంత డబ్బుంది?’’ అన్నాడు. ‘‘70వేల దిర్హములున్నాయి’’ అన్నాడు. ‘‘ఎంతమంది సంతానం?’’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాచ్చాడు. వర్షం తెరపిచ్చాక పాదుషా వెళ్లిపోయాడు. వ్యాపారి చెప్పినవి నిజాలో కావోనని తెలుసుకోవడానికి దస్తావేజులను తెప్పించారు. వ్యాపారి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పాదుషా గారికి చిర్రెత్తుకొచ్చింది. పాదుషా ఆజ్ఞతో వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. పాదుషా గారు తిరిగి అవే మూడు ప్రశ్నలు అడిగారు. వాటికి వ్యాపారి కూడా తిరిగి అవే జవాబులిచ్చాడు. వ్యాపారి మళ్లీ అబద్ధాలాడుతున్నాడని 15 దీనార్ల జరిమానా వసూలు చేసి ధనాగారంలో జమ చేయాలని మంత్రిని ఆదేశించారు. ప్రభుత్వ దస్తావేజుల్లో అతని వయస్సు 35 ఏళ్లని, అతని వద్ద 70వేల దీనార్లకంటే ఎక్కువ రొక్కముందని, ఐదుగురు సంతానమని ఉంది. అప్పుడు వ్యాపారి ‘‘నా జీవిత ఆయుష్షులోని 20 ఏళ్లు మాత్రమే సత్కార్యాల్లో, నిజాయితీగా గడిపాను కనుక ఆ ఇరవై ఏళ్లనే నా వయస్సుగా పరిగణిస్తాను. జీవితంలో 70 వేల దీనార్లను ఒక అనాథాశ్రమం నిర్మించేందుకు ఖర్చుపెట్టాను కనుక అదే నా ఆస్తిగా భావిస్తాను. నలుగురు పిల్లలు చెడు సావాసాలతో, వ్యసనపరులుగా మారారు. ఒక్కడు మాత్రమే సన్మార్గంలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు కనుక ఆ ఒక్కడే నా సంతానంగా చెప్పుకుంటాను.’’ అని వివరణ ఇచ్చాడు. పాదుషా గారు సంతోషించి జరిమానాను ఉపసంహరించారు. జీవితంలో మంచిపనుల్లో గడిపిన కాలం, వ్యయపర్చిన సొమ్ము, ఉత్తమ సంతానమే పరలోక జీవితానికి సోపానాలని చెప్తోంది ఈ కథ. – ముహమ్మద్ ముజాహిద్ -
విస్మయపరుస్తున్న ఎంపీ ఎస్పీవై వ్యవహారం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మార్కెట్లో షాపుల నిర్వాహకులెవరూ పైసా చెల్లించాల్సిన అవసరం లేదని, అంతా తామే చెల్లిస్తామని గంభీరపు ప్రకటనలిచ్చి.. నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏడాది దాటినప్పటికీ వేలం సొమ్ము మాత్రం మునిసిపాలిటీ ఖజానాకు చేరలేదు. పైగా మార్కెట్ వేలం మొత్తం సొమ్ము చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తే.. చెల్లని చెక్కులు ఇచ్చిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వ్యవహారం ఆశ్చర్యం గొలుపుతోంది. వేలంపాట రూ.76.12 లక్షలతో పాటు అగ్రిమెంట్, వడ్డీ రూ.15 లక్షలు, సర్వీస్ చార్జీ రూ.13.70 లక్షలతో కలిపి.. మొత్తం రూ.కోటి నాలుగులక్షల 82వేలు చెల్లించాల్సి ఉండగా.. టెండరు వేసే సమయంలో డిపాజిట్ కింద రూ.16 లక్షలు చెల్లించారు. డిపాజిట్ తీసివేస్తే రూ.88.82 లక్షలు చెల్లించాలి. అయితే, రూ.60 లక్షల విలువ చేసే చెక్కులు కాస్తా బౌన్స్ అయినప్పటికీ కేసులు పెట్టకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికల ముందు వ్యాపారస్తులపై ప్రేమ కురిపించిన అధికారపార్టీ నేతలు తర్వాత మొహం చాటేశారు. ఇదే తరుణంలో మార్కెట్ వ్యాపారస్తుల నుంచి అద్దెల వసూలుకు మునిసిపల్ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏమి జరిగిందంటే.. నంద్యాలలోని గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్, నూనెపల్లె, మూలసాగరం మార్కెట్లో ఉన్న షాపులను అద్దెకు ఇవ్వడంతో పాటు వాహనాల రాకపోకలు, పార్కింగ్ ఫీజు వసూలు మొదలైన వాటి కోసం 2017–18 ఆర్థిక సంవత్సరానికి నంద్యాల మునిసిపాలిటీ టెండర్లను ఆహ్వానించింది. అయితే, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలారెడ్డి పేరు మీద టెండర్లు దాఖలు చేశారు. వ్యాపారస్తుల నుంచి వసూలు చేయవద్దని, ఈ మొత్తాన్ని తామే చెల్లిస్తామంటూ టెండర్ దక్కించుకున్నారు. టెండర్లో పాల్గొనేందుకు చెల్లించిన రూ.16 లక్షల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ (ఈఎండీ) మినహా ఇంత వరకు పైసా కూడా మునిసిపాలిటీకి చెల్లించలేదు. వాస్తవానికి టెండర్ గడువు కూడా ఈ ఏడాది మార్చితో ముగిసింది. అయినప్పటికీ పైసా ఇవ్వలేదు. ఇంతటితో కథ ఆగిపోలేదు. టెండర్ సొమ్ము చెల్లించాలంటూ మునిసిపల్ అధికారులు గత ఏడాదిలోనే నోటీసులు జారీచేశారు. ఆ నోటీసుల నేపథ్యంలో రూ.60 లక్షల విలువ చేసే ఐదు చెక్కులను మునిసిపాలిటీకి ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె అందజేశారు. అయితే.. సదరు చెక్కులు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో సొమ్ములే లేవని, దీంతో చెక్కులు చెల్లవని బ్యాంకు అధికారులు తేల్చిచెప్పారు.ఏకంగా రూ.60 లక్షల మొత్తానికి చెల్లని చెక్కులు ఇచ్చిన వారిపై కనీసం కేసు పెట్టేందుకు కూడా అప్పట్లో మునిసిపాలిటీ అధికారులు ప్రయత్నించలేదు. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలోనే అధికారులు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు సాహసించలేదని తెలుస్తోంది. వ్యాపారస్తుల మెడపై కత్తి! టెండర్లో పాల్గొని సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు కాస్తా వ్యాపారస్తుల నుంచి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలోనే తమను చెల్లించమంటే చెల్లించేవారమని, ఈ విధంగా చేతులెత్తేయడం ఏమిటని కొందరు మండిపడుతున్నారు. పైగా అధికారులు ఎప్పుడు తమపై పడతారోనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీ నేతల వ్యవహారం ‘ఏరుదాటే వరకు ఏటి మల్లన్న.. దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న చందంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
లారీల సమ్మెతో దళారీల దందా!
సాక్షి, అమరావతి: వారం రోజుల నుంచి జరుగుతున్న లారీల సమ్మె సెగ పరిశ్రమలతోపాటు సామాన్యులను తాకుతోంది. లారీల సమ్మె దీర్ఘకాలం జరిగే సూచనలు కనపడుతుండటంతో హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం ప్రారంభిం చారు. కూరగాయలు, పండ్లు, కిరాణా సరుకుల ధరలను పెంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యేవాటి ధరలు ఎగబాకుతున్నాయి. ఇదే సమయంలో స్థానికంగా పండే కూరగాయల ధరలు తగ్గడం గమనార్హం. ఉల్లిపాయలు, క్యాప్సికం, టమోటా, క్యాబేజీ లాంటి కూరగాయల ధరలు పెరగ్గా.. వంకాయలు, బెండ, దొండ లాంటిస్థానికంగా పండేవాటి ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవటంతో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆక్వా, మామిడి రైతుల ఆక్రందన లారీల సమ్మె ప్రభావం ఆక్వా, మామిడపండ్ల ఎగుమతిపై బాగా కనిపిస్తోంది. ధరలు బాగున్నా సమ్మె కారణంగా చెరువుల్లో చేపలు, రొయ్యల సేకరణను నిలిపివేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన ఆక్వా రైతు ఒకరు వాపోయారు. ప్రస్తుత సీజన్లో నీలం, చిత్తూరు మామిడి రకాన్ని ఎగుమతి చేస్తామని సమ్మె కారణంగా కాయలు కోయకుండా చెట్లకే వదిలేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. రేటు బాగున్నా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని, వర్షాలు పడితే చేతికి వచ్చిన పంట దక్కదని చిత్తూరు జిల్లా రైతులు వాపోతున్నారు. బోసిపోయిన బెజవాడ వన్‌టౌన్ మార్కెట్ నిత్యం రూ. వందల కోట్ల టర్నోవర్‌తో కళకళలాడే విజయవాడ వన్‌టౌన్ హోల్‌సేల్ మార్కెట్ లారీల సమ్మె కారణంగా వెలవెలపోతోంది. సాధారణంగా ఆషాడమాసంలో వ్యాపారం తక్కువగా ఉంటుంది. సమ్మె మరో వారం రోజులపాటు జరిగితే శ్రావణమాసం వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వస్త్రలత వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. లారీలు ఆగిపోవడంతో సుమారు 10,000 మంది హమాలీలు కూలీ దొరక్క పస్తులు ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ విక్రయిస్తున్న వాహన డీలర్లు ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అమ్మకాలపై మాత్రం సమ్మె ప్రభావం అంతగా కనిపించడం లేదు. జీఎస్టీలో చాలా వస్తువులు రేట్లు తగ్గడంతో పాత సరుకును విక్రయించాలనే ఉద్దేశంతో కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం లేదని ఎలక్ట్రానిక్ గూడ్స్ రిటైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. తాము సాధారణంగా నెల రోజుల స్టాక్ నిర్వహిస్తామని, దీంతో ప్రస్తుతానికి సమ్మె ప్రభావం ఆటోమొబైల్ రంగంపై లేదని కార్లు, ద్విచక్రవాహనాల డీలర్లు తెలిపారు. సమ్మె మరో వారం రోజులు కొనసాగితే మాత్రం వాహన కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సర్కారుకు సోమవారం వరకు గడువు పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, టోల్ గేట్ చార్జీల తగ్గింపు తదితర డిమాండ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చినట్లు లారీ యజమానుల సంఘం తెలిపింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే సమ్మెను ఉధృతం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని ఏపీ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.ఈశ్వరరావు చెప్పారు. అప్పటివరకు సామాన్యులకు ఇబ్బంది లేకుండా సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. సోమవారం దాకా నిత్యావసర సరుకులు, పెట్రోల్ లాంటి వాటికి మినహాయింపు కొనసాగుతుందన్నారు. లారీల సమ్మెకు సంఘీభావంగా పెట్రోలియం ట్యాంకర్లు కూడా సమ్మె చేస్తున్నారని, రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పెట్రోలియం డీలర్ల ఫెడరేషన్ ఖండించింది. లారీల సమ్మెకు సంఘీభావం ప్రకటించే అంశంపై ఇంత వరకు తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఫెడరేషన్ స్పష్టం చేసింది. టమాట రైతులకు రూ.20 కోట్ల నష్టం చిత్తూరు: లారీల సమ్మె టమాటా రైతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఐదు వేల లారీలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో నిత్యం జరిగే రూ.2.5 కోట్ల లావాదేవీలపై ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిబెంగాల్ తదితర రాష్ట్రాలకు టమాట, క్యాబేజీ, ఇతర కూరగాయలు, పండ్లు, పూలు ఎగుమతి అవుతుంటాయి. ఇతర రాష్ట్రాలకు రోజూ 4 వేల టన్నుల టమాటాలు ఎగుమతి చేస్తారు. సమ్మె వల్ల టమాటా రైతులకు ఇప్పటివరకూ సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. చిత్తూరు పరిసరాల్లోని బెల్లం తయారీ రైతులు కూడా రవాణా సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాళహస్తిలోని ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమకు కడప, ఒడిశా నుంచి రావాల్సిన ముడిసరుకు ఆగిపోయింది. సమ్మెతో కృష్ణపట్నం, ఎన్నూర్ ఓడరేవుల నుంచి ఎరువుల రవాణా పూర్తిగా నిలిచిపోయింది. సిమెంట్, ఇతర నిర్మాణ సామగ్రి సరఫరా ఆగిపోవడంతో నిర్మాణ రంగం ఇబ్బందుల్లో పడింది. ‘తూర్పు’న ఆగిన 35 వేల లారీలు రాయవరం (తూర్పుగోదావరి జిల్లా): సమ్మె కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో 35,000 లారీలు కదలడం లేదు. బియ్యం, కోడిగుడ్లు, కొబ్బరి, అరటితోపాటు ఇటుక తదితరాల ఎగుమతులు నిలిచిపోయాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బంగాళాదుంప, క్యారెట్‌తోపాటు సిమెంట్, ఐరన్ దిగుమతులు ఆగిపోయాయి. జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రాలైన రావులపాలెం, రాజమహేంద్రవరం, మండపేట, తుని, కాకినాడ, అనపర్తి, పిఠాపురం, కత్తిపూడి, ఏలేశ్వరం, జగ్గంపేటలో సమ్మె ప్రభావం స్పష్టంగా ఉంది. గత వారం రోజులుగా లారీలు నిలిచిపోవడంతో రూ.70 కోట్ల దాకా నష్టపోయినట్లు లారీ యజమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి తెలిపారు. -
వేరే కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండేలా అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత క్రియాశీలకంగా లేవంటూ దేశంలోని పలు కంపెనీలను రద్దు చేస్తూ కేంద్ర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వాటిల్లోని డైరెక్టర్లు ఐదేళ్ల పాటు మరే ఇతర కంపెనీలో నూ డైరెక్టర్లుగా ఉండేందుకు వీల్లేదంటూ వారి డైరెక్టర్ గుర్తిం పు సంఖ్య(డిన్)ను సైతం డీయాక్టివ్ చేశారని పిటిషన్లో తెలి పారు. డీయాక్టివేట్ చేసిన తమ డిన్‌లను క్రియాశీలకం చేసే లా ఆదేశాలివ్వాలని యోహాన్ దూంజీ మిస్త్రీ, దనేశ్ దూంజీ మిస్త్రీ, దూంజీ జహంఘీర్ మిస్త్రీ, రచ్నా దూంజీ మిస్త్రీలు కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది దూళిపాళ్ల వీఏఎస్ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు యోధన్ ఇన్ ఫ్రా, ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారని, ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేదన్నారు. వాదనలు విన్న ధర్మాసరం వారి డిన్, సిన్ను యాక్టివ్ చేయాలని కేంద్రా న్ని ఆదేశించింది. పిటిషనర్లను వేరే కంపెనీల్లో డైరెక్టర్లుగా కొనసాగేందుకు అనుమతివ్వాలని తెలిపింది. డిన్ను క్రియాశీలకం చేశాక వార్షిక రిటర్న్స్‌ను సమర్పించాలని పిటిషనర్ల ను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ సీతారామమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయా లని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖను ఆదేశించారు. -
నాడు ఇటుకల వ్యాపారి..నేడు అంతర్ రాష్ట్ర స్మగ్లర్
కడప అర్బన్ : అతను ఒకప్పుడు ఇటుకల వ్యాపారి.. ఆ తర్వాత రూటు మార్చి ఎర్రచందనం స్మగ్లర్ అవతారమెత్తాడు. అంతర్రాష్ట్ర స్మగ్లర్‌గా పేరుమోసి చివరకు పోలీసుల చేత చిక్కి కటకటాలపాలయ్యాడు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా ఆరణి పట్టణానికి చెందిన సత్యనారాయణ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సునీల్ అలియాస్ ఆర్కాట్భాయ్కి ప్రధాన అనుచరుడిగా చలామణి అయ్యాడు. జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లె ప్రాంతాల్లో స్మగ్లర్ల ద్వారా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను చాకచక్యంగా తీసుకెళ్లడంలో ఘనాపాటి. తమిళనాడులోని ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని ఉడ్ కట్టర్లను రాయలసీమ జిల్లాల్లోని శేషాచలం, లంకమల్ల, నల్లమల అటవీ ప్రాంతాల్లోకి పంపించి వారి ద్వారా ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాకు ప్పాడినట్లు విచారణలో తేలింది. నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు సత్యనారాయణ దాదాపు 500 టన్నుల ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేసినట్లు తెలిసింది. జిల్లాలో ఇప్పటివరకు ఇతనిపై 25 కేసులు నమోదయ్యాయి. ఇతనికి దుబాయికి చెందిన పేరుమోసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అలీభాయ్, షాజిలతో సంబంధాలు ఉన్నాయి. నిందితుడు పట్టుబడిన వైనం ఇటీవల ఆర్కాట్భాయ్ని రైల్వేకోడూరు పోలీసులు అరెస్టు చేసి విచారించగా, ప్రస్తుతం పట్టుబడిన నిందితుడు సత్యనారాయణ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు వ్యూహాత్మకంగా రెండు స్పెషల్ పార్టీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అతని కదలికలపై నిఘా ఉంచి ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలోని అరణి పట్టణంలో వలపన్ని అరెస్టు చేశారు. అతని వాంగ్మూలం మేరకు రైల్వేకోడూరు పోలీసుస్టేషన్ పరిధిలో వాగేటికోన సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో గతంలో దాచి ఉంచిన టన్ను (1035 కిలోలు) బరువుగల 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కృషి చేసిన జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) అద్నాన్ నయీం అస్మి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు, రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ పద్మనాభన్, ఎస్ఐలు బి.హేమకుమార్, కొండారెడ్డి, కానిస్టేబుళ్లు ఎస్.శివరామనాయుడు, జి.వెంకట రమణ, సి.కొండయ్య, బి.గోపినాయక్, ఎస్.ప్రసాద్‌బాబు, కిరణ్‌కుమార్, సుబ్రమణ్యం, పి.రాకేష్‌లను ఎస్పీ బాబూజీ అట్టాడ అభినందించారు.అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ (ఇన్సెట్)అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సత్యనారాయణ -
అమ్మో ...రూ.10 నాణెమా..!
టేక్మాల్(మెదక్): పది రూపాయాల కాయిన్ దీనికోసం బ్యాంకుల చుట్టూ జనం తిరుగుతారు. కష్టం మీద ఎదోలా సంపాదించి భద్రంగా ఇంట్లో దాచుకుంటున్నారు. ఇదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పదిరూపాయల బిల్ల పట్టుకోవడానికి భయపడుతున్నారు. వ్యాపారులైతే తీసుకోవడానికి వణుకుతున్నారు. దీనికి ప్రధాన కారణం చెల్లవని పుకార్లు రావడమే. గత కొన్ని నెలల రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది. పది రూపాయల కాయిన్ చెల్లుతుందని ఎలాంటి భయం అనుమానం అవసరం లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పది రూపాయల కాయిన్లు వచ్చిన కొత్తలో ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదిరూపాయాల కాయిన్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. ఇన్నాళ్లు దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నా రు. అయితే చాలా మంది వ్యాపారులు తీసుకోవడానికి ఇష్టత చూపడంలేదు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న వాటిని ప్రజలకు అంటకట్టడానికి చూస్తున్నారు. దీంతో చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లె వారికి కండక్టర్ చిల్లర రూ.10 కాయిన్ ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. చివరికి బ్యాంకుల్లో కూడా తీసుకోవడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోహలు వదలండి.. ఆర్బీఐ నిబందనల ప్రకారం రూ.10 కాయిన్ చెల్లుబాటు అవుతుంది. పదిరూపాయాల బిల్ల రద్దు కాలేదు. రూ.10కాయిన్ చెల్లుబాటుపై ప్రజలు వ్యాపారులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వ్యాపారులు, ప్రజలు ఇచ్చుపుచ్చుకోవడం చేయాలి. -
అరచేతిలో జీఎస్టీ!
సాక్షి, వరంగల్ రూరల్: జీఎస్టీ (వస్తు సేవల పన్ను) వచ్చిన తర్వాత ఏ వస్తువుకు ఎంత పన్ను పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యాపారి ఎంత అంటే అంత జీఎస్టీని చెల్లించేవారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా జీఎస్టీ వేయడంతో వినియోగదారులు మోసపోతుండటంతో కేంద్రం జీఎస్టీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారులు ఇష్టారా జ్యంగా చెప్పే జీఎస్టీలకు వినియోగదారులు ఈ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. రాష్ట్రంలో 12 వాణిజ్య పన్నుల డివిజన్లు ఉండగా.. అందులో జీఎస్టీ డీలర్లు 1,63,059 ఉన్నారు. ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తూ ప్రతి వస్తువు పన్నుపైనా స్పష్టత వచ్చేలా ఈ యాప్‌ను రూపొందించారు. పన్ను పరిధిలోకి వచ్చే వస్తువు ధర, పన్నుల వివరాలు ఇందులో తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఇంగ్లిష్, హిందీలలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోని వస్తువుల ఐచ్ఛికాన్ని ఎంచుకున్న వెంటనే తెరపై 0,3,5,12, 18,25,28 శాతం తదితర పన్నుల జాబితా కనిపిస్తుంది. దీని ద్వారా ఏయే వస్తువులకు ఎంత శాతం పన్ను విధించారో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వస్తుసేవలు 5% అంశంపై నొక్కగానే ఆ పన్ను చెల్లించాల్సిన సరుకుల వివరాలు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. సేవల వివరాలు.. ప్రభుత్వం కల్పించే సేవలకు విధించిన పన్ను వివరాలను ఐచ్ఛికం ద్వారా తెలుసుకునే అవకాశముంటుంది. మొబైల్లో అంశాన్ని ఎంచుకుంటే తెరపై సమగ్ర వివరాలు ప్రత్యక్షమవుతాయి. యాప్‌లో సమాచారం అనే అంశం ప్రెస్ చేయగానే జీఎస్టీకి సంబంధించిన వివరాలు లభిస్తాయి. జీఎస్టీ ఎందుకు అమలులోకి తెచ్చారు, దీనివల్ల కలిగే ప్రభావం, ప్రయోజనాలు, పర్యవసనాలు తదితర వివరాలు అందుబాటులోకి వస్తాయి. డౌన్లోడ్ చేసుకోండిలా... గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి మొదట జీఎస్టీ రేట్ ఫైండర్ అని టైప్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. వెంటనే మొబైల్ తెరపై పలు యాప్‌లు కనిపిస్తాయి. వీటిలో జీఎస్టీ రేట్ ఫైండర్ ఇంగ్లిష్, హిందీ ఎంచుకుని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ అవగానే స్క్రీన్‌పై వస్తువులు, పన్నులు, సేవలు, సమాచారం తదితర వివరాలతో నాలుగు ఆప్షన్లు కన్పిస్తాయి. అందులో అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకుంటే తగిన సమాచారాన్ని పొందవచ్చు. -
ధర గుట్టు రట్టు..
ఖమ్మం వ్యవసాయం : మిర్చి కొనుగోళ్లలో మాయ జరుగుతోంది. పంటకు ఉన్న డిమాండ్‌నుబట్టి ధర పెట్టకుండా వ్యాపారులు దగాకు పాల్పడుతున్న వ్యవహారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం బట్టబయలైంది. జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు మిర్చికి ధర అధికంగా పెట్టడంతో ఈ విషయం బయటపడింది. పొరుగు రాష్ట్రాలకు చెందిన మిర్చి వ్యాపారులు ఖమ్మం మార్కెట్‌కు వచ్చి మిర్చి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వటంతో నిత్యం మార్కెట్లో జరుగుతున్న ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నిత్యం 12 నుంచి 15 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వస్తుంది. మార్కెట్‌కు వచ్చే మిర్చిని స్థానిక వ్యాపారులు, అంతర్జాతీయంగా ఎగుమతు లు చేసే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకాలం వీరు సిండికేటుగా ఉంటూ నిర్ణయించుకున్న ధరకు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పంటకు డిమాండ్ పెరగటం, ఎగుమతిదారులకు సరుకు అవసరం కావటంతో అసలు వ్యవహారం బయటపడింది. రోజు మాదిరిగా నే మార్కెట్ ఉద్యోగులు గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో మిర్చికి జెండా పాట నిర్వహించారు. ఇందులో గరిష్టంగా ఓ వ్యాపారి క్వింటాకు రూ.9,230 పాడాడు. ఈ ధరకు కొంత అటు ఇటుగా(నాణ్యతనుబట్టి) అమ్మకానికి వచ్చిన మిర్చిని మిగతా వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ఇద్దరు వ్యాపారులు ఎగుమతిదారుల సలహాతో కొందరు రైతుల వద్ద క్వింటాకు రూ. రూ.9,400 నుంచి రూ.9,500 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో మిర్చికి మరికొంత ధర ఉన్నట్లు బయటపడటంతో విషయం తెలిసిన రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి యార్డు గేటు వద్ద కొందరు రైతులు మార్కెట్ ఉద్యోగులు, వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. సరుకు రవాణా చేసే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులు పసిగట్టడంతో.. జెండా పాటకన్నా ఇద్దరు వ్యాపారులు ధర అధికంగా పెట్టి కొనుగోలు చేయటాన్ని కొందరు రైతులు పసిగట్టారు. తమ పంట నాణ్యంగా ఉన్నా.. తక్కువ ధర పట్టడం ఏమిటని రైతులు కమీషన్ వ్యాపారులను నిలదీశారు. దీంతో మిర్చికి డిమాండ్ ఉన్న విషయం బయటపడింది. ఇది మార్కెట్ అంతా పొక్కడంతో రైతులు తాము పంట విక్రయించమని, తమ పంటకు కూడా ధర పెట్టాలని డిమాండ్ చేశారు. రెండోసారి జెండాపాట మొదటి జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు రైతుల నుంచి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారని, మరోసారి జెండాపాట నిర్వహిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ప్రకటించారు. పాటలో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.700 అదనంగా ధర పెట్టారు. క్వింటాల్‌కు రూ.9,900 ధర పెట్టారు. రైతులందరూ తమ పంటకు ధర పెంచాలని కమీషన్ వ్యాపారులపై వత్తిడి తెచ్చారు. దీంతో మళ్లీ వ్యాపారులను పిలిచి.. పంటను పరిశీలించి నాణ్యత మేరకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో ధర పెట్టాలని కోరారు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు ధర పెంచి కొనుగోలు చేశారు. ‘సిండికేటు’గా దోపిడీ.. వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి మిర్చిలో ధర దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర నిర్ణయించకపోవటంతో పంటకు ధర ఎంత పలుకుతుందనే విషయం రైతులకు తెలియటం లేదు. దీంతో వ్యాపారులు కూడపలుక్కొని ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే తగ ఏడాది మిర్చి సీజన్లో ధర దోపిడీకి పాల్పడ్డారు. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ గురువారం ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలో వచ్చిన తేడాను పరిశీలిస్తే.. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మార్కెట్‌కు 15వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. ఇది దాదాపు 7వేల క్వింటాళ్ల వరకు ఉంటుంది. పంట కొనుగోళ్ల ధరలో వచ్చిన తేడా వ్యవహారం బయటపడకపోతే రైతులు రూ.15లక్షల మేర దగాకు గురయ్యేవారు. ఈ లెక్కన నిత్యం మిర్చి ధరలో రైతులు రూ.లక్షల్లో దోపిడీకి గురవుతున్నట్లు విదితమవుతోంది. మరీ ఇంత దగానా.. మిర్చికి ధర ఉన్నా తక్కువ ధర పెట్టారు. 22 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్‌కు రూ.9,230 చొప్పున కొనుగోలు చేశారు. తరువాత ధర పెరిగిందని తెలిసింది. మొదటి ధరకు ఒప్పుకోలేదు. దీంతో మరో రూ.200 ధర పెంచారు. ఇంత దగా చేస్తారనుకోలేదు. – మాలోత్ సామ్యా, రైతు, సాతానిగూడెం, కామేపల్లి మండలం క్వింటాల్‌కు రూ.300 పెంచారు.. 21 బస్తాల మిర్చి అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్‌కు రూ.9,200 ధర పెట్టారు. ధర పెరిగిందని అంతా చెప్పటంతో కమీషన్ వ్యాపారిని ప్రశ్నించా. దీంతో మరో రూ.300 పెంచి క్వింటాల్‌కు రూ.9,500 చొప్పున ధర పెట్టాంచారు. మిర్చికి ధర ఉన్నా అన్యాయం చేస్తున్నారు. – నంద్యాల వెంకన్న, గట్టుసింగారం, కూసుమంచి మండలం ధర ఘటనపై విచారిస్తాం.. మిర్చికి ధర ఉన్న విషయం తెలిసి మరోసారి జెండాపాట నిర్వహించాం. జెండాపాటలో ఖరీదుదారులంతా పాల్గొనలేదు. వ్యాపారులు జెండాపాటలో పాల్గొనకుండా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం. – రత్నం సంతోష్‌కుమార్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి