రైతులు తాము మొదటిసారి తెంపిన పత్తిని జమ్మికుంట మార్కెట్‌కు బుధవారం నుంచి తీసుకొస్తున్నారు. అయితే వ్యాపారులు చేతులతో తేమ పరీక్షలు చేస్తూ రైతులను బురిడీ కొట్టిస్తున్నారు.
జమ్మికుంట, న్యూస్‌లైన్ : రైతులు తాము మొదటిసారి తెంపిన పత్తిని జమ్మికుంట మార్కెట్‌కు బుధవారం నుంచి తీసుకొస్తున్నారు. అయితే వ్యాపారులు చేతులతో తేమ పరీక్షలు చేస్తూ రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. ‘తక్కువ తేమ ఉంది.. నీ పత్తికి ఇంతే ధర’ అంటూ తమకు తోచింది ఇస్తున్నారు. చేసేదేమీ లేక రైతులు సరే అనాల్సి వస్తోంది. దీంతో క్వింటాలుకు రూ.500 నుంచి రూ.1000 వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఇదంతా తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
మద్దతు ధర ఇయ్యలే
క్వింటాలు పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.4 వేలు ఉంది. జమ్మికుంట వ్యవసా య మార్కెట్‌కు గురువారం మూడు వే ల క్వింటాళ్ల పత్తి వచ్చింది. ఈ మొత్తాన్ని వ్యాపారులు కొనుగోలు చేశారు. కనిష్టం గా ఒక్కో క్వింటాలుకు రూ.3500లు పలికిం ది. వ్యాపారులు చేతులతో తేమ పరీక్షలు చేస్తూ కొనుగోళ్లు చేశారు. ధర మాత్రం చెప్పలేదు. ఆ తర్వాత వారి గుమస్తాలు రైతుల చేతిలో చీటీలు ఉంచారు. దానిలో చూసిన రైతులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. మద్దతు ధర కంటే రూ.400 నుంచి రూ.500 వరకు తగ్గించి ఇచ్చారు.
అక్కడ డిమాండ్... ఇక్కడ తగ్గింపు
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి క్యాండీకి ప్రస్తుతం రూ.42 వేల నెంచి రూ.45వేలు పలుకుతోంది. జమ్మికుంట మార్కెట్లో మాత్రం క్వింటాలుకు రూ.3000 నుంచి రూ.3700 మాత్రమే ఇస్తున్నారు. వ్యాపారులు, అధికారులు ఒక్కటవడంతోనే తాము నష్టపోతున్నట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పరికరాలేవి ?
పత్తిని కొనేటప్పుడు పరికరాలతో తేమను పరీక్షించాలి. గ్రేడింగ్ కోసం మార్కెట్‌లోని ల్యాబ్‌కు పంపించాలి. కానీ ల్యాబ్‌లో ఉద్యోగి లేకపోవడంతో అది మూతపడింది. ఇదే అదనుగా వ్యాపారులు చేతులతో తాకి నాణ్యతను నిర్ధారిస్తున్నారు. తేమ ఉందని మెలికపెడుతూ ధరల్లో కోత విధిస్తున్నారు. ఈ తతంగం అంతా మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ మార్కెట్ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లుంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు వేడుకుంటున్నారు.