కావలి : ఒక ఎరువు బస్తా కావాలంటే మరో రెండు రకాల ఎరువులు బస్తాలు కొనుగోలు చేయాలంటూ వ్యాపారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. పలు దుకాణాల యజమానులు రైతులను లింకు ఎరువుల పేరిట పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ విషయం వ్యవసాయ శాఖ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాదారుల వద్ద నెలనెలా ముడుపు తీసుకుంటూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేక ఏ రైతు లిఖిత పూర్వంగా ఫి ర్యాదు చేయలేదంటూ సాకు చూపుతున్నారని రైతులు మండిపడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో సుమారు 1.12 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి అత్యధిక స్థాయిలో సాగవుతోంది. నియోజకవర్గంలో 76 వరకు ఎరువుల దుకాణాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఎప్పుడూ ఎమ్మార్పీకి అమ్మలేదు..
యూరియా బస్తాను ఎమ్మార్పీకి అమ్మడాన్ని వ్యాపారులు ఎప్పుడో మరచి పోయారు. ఎరువుల కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రతి రకం ఎరువుకు సుమారు రూ.వంద అధిక ధరకు విక్రయిస్తున్నారు.
యూరియా ఎమ్మార్పీ రూ. 285 ఉండగా రూ.370 నుంచి రూ.400 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. యూరియాతో పాటు రూ.1250 పెట్టి డీఏపీ, రూ.950లకు 20-20 ఎరువులను తప్పనిసరిగా కొనుగోలు చేయక తప్పడం లేదు. లేకుంటే వ్యాపారులు యరియాను విక్రయించడం లేదు. యూరియా లేకుంటే బయో ఫెర్టిలైజర్‌ను అయినా అంత ధర పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇలా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దుకాణదారులు లాభార్జన ధ్యేయంగా వ్యాపారం సాగిస్తున్నారు.
తుమ్మలపెంటకు చెందిన ఓ రైతు కావలిలోని ఓ ఎరువుల దుకాణానికి వచ్చి యూరియా బస్తాను అడిగారు. దాని ఎమ్మార్పీ రూ.285. స్టాక్ లేదు..అయితే రూ.370లకే ఇస్తాం, కానీ దానితో పాటు డీఏపీ, 20-20 బస్తాలను కొనుగోలు చేయాలని వ్యాపారి చెప్పాడు. గత్యంతరం లేక రైతు ఎమ్మార్పీ కన్నా అధిక ధర పెట్టి యూరియాతో పాటు ఆ బస్తాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది.
గౌరవరానికి చెందిన ఓ రైతు యూరియా కోసం కావలిలోని ఓ దుకాణానికి వెళ్లాడు. ఆ యూరియాతో పాటు మరో రెండు కంపెనీల ఎరువుల బస్తాలు కొనుగోలు చేయాలని దుకాణదారుడు చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో రైతు వాటిని కొనుగోలు చేశాడు.
ఒక ఎరువును కొనాలంటే మరొక దానిని కొనుగోలు చేయాలి :
యూరియా కొనాలంటూ మరో రెండు ఎరువులను కొనాల్సి వస్తోంది. మా అవసరం దృష్ట్యా వారు చెప్పిన ధరకు చెప్పిన విధంగా మేము కొనుగోలు చేయాల్సి వస్తుంది.
- ఈశ్వర్‌రెడ్డి, రైతు, గౌరవరం
లింక్ ఎరువులు అమ్మితే
దుకాణాలపై చర్యలు :
లింక్ ఎరువుల నిబంధనలు పెట్టిన దుకాణదారులపై చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి రైతులు నోటి మాటగా చెబుతున్నారే తప్ప లిఖిత పూర్వకంగా ఫిర్యాదును చేయాలి. అప్పుడే వారిపై చర్యలు తీసుకునే వీలుంటుంది. దీనిపై రైతులు స్పందించాలి.
-బాలాజీనాయక్, ఏడీఏ, కావలి
యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే
Published Thu, Dec 11 2014 3:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement