వ్యాపారుల మాయాజాలం..  | Merchants Are Cheating With Electronic Weights | Sakshi
Sakshi News home page

తూకం.. మోసం 

Published Sat, Sep 12 2020 11:00 AM | Last Updated on Sat, Sep 12 2020 11:00 AM

Merchants Are Cheating With Electronic Weights - Sakshi

వ్యాపారం ఓ నమ్మకం.. వినియోగదారుడే దేవుడు. ఈ సూత్రాన్ని కొందరు వ్యాపారులు విస్మరిస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో తేడాలు అధికమయ్యాయి. కాటాలతో దగా చేస్తున్న కొందరు వ్యాపారుల చేతివాటానికి నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతం మోసపోతున్నారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర సరుకులు కొనుగోలు చేసినప్పుడు కొసరు, మెగ్గు అని గతంలో వ్యాపారులు కాస్తంత ఎక్కువ తూకం ఇచ్చేవారు. ప్రస్తుతం తక్కెడలు పోయి వాటి స్థానంలో డిటిజల్‌ ఎల్రక్టానిక్‌ కాటాలు వచ్చాయి. దీంతో పక్కాగా తూకం వేస్తున్నారు. ప్రతిదీ బంగారంలా భావిస్తున్నారు. రాళ్ల కాటాలతో హెచ్చు తగ్గులు ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ఎల్రక్టానిక్‌ కాటాల్లో కూడా వినియోగదారులను ఎక్కువగా మోసం చేయవచ్చని కొందరు వ్యాపారులు నిరూపిస్తున్నారు. 

ఎల్రక్టానిక్‌ కాటాలతో మోసం ఇలా.... 
సాధారణంగా ఘన పదార్థాలను కిలో గ్రాముల్లో, ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తుంటారు. ఘన పదార్థాల కొనుగోలుకు వెళితే.. ఎల్రక్టానిక్‌ కాటాల్లో ద్రవ పదార్థాల తూకం మోడ్‌లో ఉంచి తూకం వేస్తున్నారు. కాటా స్క్రీన్‌పై (ఎల్‌) అనే అక్షరం మాత్రం స్టిక్కర్‌ అతికిస్తున్నారు. వాస్తవానికి కిలో ఘన పదార్థం బరువు 1,000 గ్రాములు ఉండగా ద్రవ పదార్థం బరువు 850 గ్రాములు మాత్రమే వస్తుంది. దీంతో కాటాలో ఆప్షన్‌ను లీటర్‌ మోడ్‌లోకి మార్చి ఘన పదార్థాల తూకం వేస్తున్నారు. దీంతో స్క్రీన్‌పై కనిపించేది లీటర్ల తూకమైన కొనుగోలు దారులకు కిలోలుగా చూపించి మోసం చేస్తున్నారు. స్క్రీన్‌పై ఎల్‌ అనే అక్షరం కనపడకుండా స్టిక్కర్‌ వేయడమో..రంగు పూయడమో చేస్తున్నారు. దీంతో వినియోగదారుడు కిలోకు 100 నుంచి 150 గ్రాముల వరకు నష్టపోతున్నారు.  

చిల్లర దుకాణాలు, చికెన్‌ షాపులు కూరగాయల మార్కెట్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడింది. దీంతో వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు తూకాలు వేసి వినియోగదారులను దోచుకుంటున్నారు. తూకంలో తేడా ఉందని వినియోగదారులకు అనుమానం వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని దుకాణాల్లో సీల్‌ లేకుండానే ఎల్రక్టానిక్‌ కాటాలను వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల అరిగిపోయిన రాళ్లు, మొద్దు కాటాలు వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు చిల్లర దుకాణాల్లో కొద్ది మేర మాత్రమే వ్యత్యాసం వస్తుండగా చికెన్‌ దుకాణాల్లో మాత్రం భారీ తేడాలు ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు.నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

వినియోగదారుల్లో ప్రశ్నించే తత్వం రావాలి 
వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత ధోరణులు మారతాయి. ఏదేని వస్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశితంగా గమనించాలి. మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే 93981 49374 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచుతాం. మోసాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం.  
– శ్రీరాముడు, తూనికల కొలతల శాఖ కంట్రోలర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement