Weights & Measures Department
-
వ్యాపారుల మాయాజాలం..
వ్యాపారం ఓ నమ్మకం.. వినియోగదారుడే దేవుడు. ఈ సూత్రాన్ని కొందరు వ్యాపారులు విస్మరిస్తున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా మోసాలకు పాల్పడుతున్నారు. తూకాల్లో తేడాలు అధికమయ్యాయి. కాటాలతో దగా చేస్తున్న కొందరు వ్యాపారుల చేతివాటానికి నిరక్షరాస్యులతో పాటు విద్యావంతులు సైతం మోసపోతున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆహార పదార్థాలు, కూరగాయలు ఇతర సరుకులు కొనుగోలు చేసినప్పుడు కొసరు, మెగ్గు అని గతంలో వ్యాపారులు కాస్తంత ఎక్కువ తూకం ఇచ్చేవారు. ప్రస్తుతం తక్కెడలు పోయి వాటి స్థానంలో డిటిజల్ ఎల్రక్టానిక్ కాటాలు వచ్చాయి. దీంతో పక్కాగా తూకం వేస్తున్నారు. ప్రతిదీ బంగారంలా భావిస్తున్నారు. రాళ్ల కాటాలతో హెచ్చు తగ్గులు ఉంటాయని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ఎల్రక్టానిక్ కాటాల్లో కూడా వినియోగదారులను ఎక్కువగా మోసం చేయవచ్చని కొందరు వ్యాపారులు నిరూపిస్తున్నారు. ఎల్రక్టానిక్ కాటాలతో మోసం ఇలా.... సాధారణంగా ఘన పదార్థాలను కిలో గ్రాముల్లో, ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తుంటారు. ఘన పదార్థాల కొనుగోలుకు వెళితే.. ఎల్రక్టానిక్ కాటాల్లో ద్రవ పదార్థాల తూకం మోడ్‌లో ఉంచి తూకం వేస్తున్నారు. కాటా స్క్రీన్‌పై (ఎల్) అనే అక్షరం మాత్రం స్టిక్కర్ అతికిస్తున్నారు. వాస్తవానికి కిలో ఘన పదార్థం బరువు 1,000 గ్రాములు ఉండగా ద్రవ పదార్థం బరువు 850 గ్రాములు మాత్రమే వస్తుంది. దీంతో కాటాలో ఆప్షన్‌ను లీటర్ మోడ్‌లోకి మార్చి ఘన పదార్థాల తూకం వేస్తున్నారు. దీంతో స్క్రీన్‌పై కనిపించేది లీటర్ల తూకమైన కొనుగోలు దారులకు కిలోలుగా చూపించి మోసం చేస్తున్నారు. స్క్రీన్‌పై ఎల్ అనే అక్షరం కనపడకుండా స్టిక్కర్ వేయడమో..రంగు పూయడమో చేస్తున్నారు. దీంతో వినియోగదారుడు కిలోకు 100 నుంచి 150 గ్రాముల వరకు నష్టపోతున్నారు. చిల్లర దుకాణాలు, చికెన్ షాపులు కూరగాయల మార్కెట్లపై తూనికలు కొలతల శాఖ అధికారులు పర్యవేక్షణ కొరవడింది. దీంతో వ్యాపారులు ఇష్టం వచ్చినట్టు తూకాలు వేసి వినియోగదారులను దోచుకుంటున్నారు. తూకంలో తేడా ఉందని వినియోగదారులకు అనుమానం వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని దుకాణాల్లో సీల్ లేకుండానే ఎల్రక్టానిక్ కాటాలను వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల అరిగిపోయిన రాళ్లు, మొద్దు కాటాలు వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు చిల్లర దుకాణాల్లో కొద్ది మేర మాత్రమే వ్యత్యాసం వస్తుండగా చికెన్ దుకాణాల్లో మాత్రం భారీ తేడాలు ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడంలేదు.నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వినియోగదారుల్లో ప్రశ్నించే తత్వం రావాలి వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి. అప్పుడే వ్యాపారుల్లో మోసపూరిత ధోరణులు మారతాయి. ఏదేని వస్తువు కొనుగోలు చేసే సమయంలో తూకాలను నిశితంగా గమనించాలి. మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానం వస్తే 93981 49374 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచుతాం. మోసాలకు పాల్పడే వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం. – శ్రీరాముడు, తూనికల కొలతల శాఖ కంట్రోలర్ -
తూనికలు, కొలతల శాఖలో ఆన్లైన్ సేవలు
సాక్షి, హైదరాబాద్: తూనికలు, కొలతల శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేస్తోంది. పలు రకాల సేవలను ఆన్లైన్ పద్ధతిలోకి మారుస్తోంది. నగదు రహిత లావాదేవీలు చేపట్టే దిశగా చర్యలు వేగిరం చేసింది. ప్రస్తుతం తయారీ లైసెన్స్, ప్యాకర్ లైసెన్స్, రిపేరింగ్ లైసెన్స్, లైసెన్స్‌ల రెన్యువల్ వంటి ఇతర సేవలు ఆన్లైన్ పరిధిలోకి వచ్చాయి. ఇందుకు అనుగుణంగా శాఖా ధికారులకు ల్యాప్‌టాప్‌లు సైతం అందిస్తోంది. ఆన్లైన్ సేవల నేపథ్యంలో పలు రకాల ఫీజుల చెల్లింపులు ఇకపై ఆన్లైన్ కానున్నాయి. దీంతో నగదు చెల్లింపులకు అవకాశం లేకుండా, పారదర్శకంగా సేవలందించడం కోసం నగదురహిత లావాదేవీలు చేపట్టబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి నగదు రహిత లావాదేవీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులకు స్వైపింగ్ మిషన్లు ఇవ్వనుంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో అధికారులు స్టాంపింగ్ ఫీ, పెనాల్టీలను నగదు రూపంలో తీసుకొని మాన్యువల్‌గా రసీదులు ఇచ్చేవారు. ఇక నుంచి ఈ లావాదేవీలన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు. శాఖలోని ఉన్నతస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఈ లావాదేవీలను పర్యవేక్షించనున్నారు. తూనికలు, కొలతల శాఖకు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో తనిఖీలను ముమ్మరం చేసింది. గత 4 నెలల్లో 1,400 కేసులను నమోదు చేసింది. ఈ కేసుల పరిష్కారానికి నూతన విధా నం ఎంతగానో ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్లో యాప్ సహాయంతో డి.డి, ఆన్లైన్ పేమెంట్, ఈ వాలెట్స్ ద్వారా కాంపౌండ్ ఫీజును వసూలు చేయవచ్చు. -
‘కాంటా’ తంటాలు
- ఎలక్ట్రానిక్ త్రాసులతో వ్యాపారుల మోసం - దుకాణాల్లో, వ్యవసాయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి - నిమ్మకునీరెత్తిన తూనికలు, కొలతల శాఖ అధికారులు పరిగి: పట్టణంలోని కొందరు వ్యాపారులు హైటె(క్ని)క్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలతో వినియోగదారులను నట్టేటా ముంచుతున్నారు. వ్యాపారులు ప్రస్తుతం తూనికలు, కొలతల శాఖ అధికారుల అదేశాలతో దుకాణాలు, అడ్తీల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుడు ఎలక్ట్రానిక్ కాంటాలను చూడగానే కొండంత భరోసాతో గండెమీద చేయి వేసుకుని కొనుగోళ్లు జరుపుతుంటాడు. కారణం.. యంత్రాలు మోసం చేయవని. కాని కొందరు వ్యాపారులు నిపుణులైన వారితో యంత్రాలకు ఉన్న స్క్రూలను తిప్పి సెట్టింగ్ మార్చి వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఇటీవల కొందరు వినియోగదారులు తాము కొనుగోలు చేసిన కేక్‌లు, స్వీట్లు, స్టీల్ పరిమాణం తక్కువగా ఉందని అనుమానించి మరో చోట తూకాలు వేయించగా మోసపోయినట్లు తేలింది. భారీ స్థాయిలో మోసం... కొందరు స్టీల్ వ్యాపారులు భారీ మోసానికి పాల్పడుతున్నారని పలువురు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులు దాదాపు 20 శాతానికి పైగా మోసపోతున్నారని చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు నిలువుగా దగాకు గురవుతున్నారు. పత్తి, కందులు, పెసలు, వేరుశనగ తదితరాలు కొనుగోలు చేసే వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలతో మోసం చేస్తున్నార నే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిగిలోని కూరగాయల మార్కెట్లో ఇప్పటికీ తూకాలకు బండరాళ్లనే వినియోగిస్తున్నారు. వెలుగుచూసిన మోసాలు ఇవి.. పరిగి పట్టణంలో ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో భయానక మోసాలు వెలుగుచూశాయి. ఓ స్టీల్, సిమెంట్ దుకాణాల్లో తూనికల్లో తీవ్రస్థాయిలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఓ దుకాణంలో పత్తి తదితర రైతు ఉత్పత్తులకు క్వింటాలుకు 3-5 కిలోలు తనకు ఎక్కువగా వచ్చేలా వ్యాపారి ఎలక్ట్రానిక్ కాంటాను సెట్ చేసుకున్నట్లు బయటపడింది. మరో స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడర్స్‌లో 15-20 శాతం స్టీల్ వినియోగదారులకు తక్కువగా ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నాలుగు బేకరీలపై దాడులు నిర్వహించి వినియోగదారులు మోసపోతున్నట్లు గుర్తించారు. ఓ బేకరీలో 2 కిలోల కేక్ కొనుగోలు చేయగా 950 గ్రాముల బరువు తక్కువగా ఉంది. మరో బేకరీలో 2 కిలోలకు 500 గ్రాములు తక్కువ వచ్చేలా ఎలక్ట్రానిక్ కాంటాలో సెట్టింగ్ ఉంది. ఈవిషయాలు తూనికలు, కొలతల విభాగం ఇన్స్పెక్టర్ ప్ర భాకర్‌రెడ్డి వెల్లడించారు. దీనిని బట్టి పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. పట్టించుకోని అధికారులు.. తూనికలు, కొలతల శాఖ అధికారుల మొద్దు నిద్రతోనే వ్యాపారులు దర్జాగా వినియోగదారులను మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎప్పుడో ఆరు నెలలకోసారి తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాట.. అన్న విధంగా తయారైంది. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, ఈనేపథ్యంలోనే పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది.