వారంతా చిరువ్యాపారులు.. టీ కొట్టు, పానీపూరి, బజ్జీలు, కూరగాయలు, వాచ్ రిపేర్, మెడికల్ ల్యాబ్ వంటి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటు న్నారు. తమకు ఉన్నంతలో ఇతరులకు సేవ చేయాలన్న సత్సంకల్పంతో ప్రతి నెలా రెండువందల రూపాయల చొప్పున జమ చేసుకుని పేదలకు ‘ఆపన్నహస్తం అంది స్తుంటారు. కిడ్నీబాధితులు, కేన్సర్ పేషెంట్లు, ఇళ్లు లేని నిస్సహాయులు, అనా«థలు ఇలా ఎవరైనా కష్టాలతో బాధపడుతుంటే మేమున్నామంటూ ముందుకు వచ్చి వారికి అండగా నిలుస్తారు ఈ ‘ఆపన్నహస్త మిత్ర బృందం’.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన బాలస్వామి, శ్రీనివాస్, శ్యాంప్రసాద్, రాజు, స్వామిలు చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పత్రికల్లో వచ్చే నిస్సహాయుల కథనాలు చదివి చలించిపోయేవారు. వారి ఆలోచనలు ఉన్నతమైనవే కానీ, ఆదుకోడానికి వారి దగ్గర ఆర్థికంగా అంత స్థోమత లేదు. అందుకే వారంతా కలిసి 2017 నుంచి బృందంగా ఏర్పడి నిస్సహాయులకు ‘ఆపన్న హస్తం’ అందిస్తున్నారు. ఐదుగురితో మొదలైన ఆ బృందంలో ఇప్పుడు సిద్దిపేట జిల్లాకు చెందిన 112 సభ్యులు ఉన్నారు.
ఇందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరారు. వీరు మొట్టమొదటిగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని అంధుల పాఠశాలలో బోరు మోటార్ లేక అక్కడి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కథనాన్ని పత్రికల్లో చదివి అక్కడికి వెళ్లి వారికి మోటార్ ఇప్పించారు. అప్పుడు వారు అనుకున్న దానికంటే ఎక్కువగా నగదు అవసరం కావడంతో అప్పటినుంచి వారు మరికొంత మంది సభ్యులతో కలిసి ఆపన్నహస్తం మిత్ర బృందం ప్రారంభించి ప్రతీనెలా రెండువందల చొప్పున నగదు జమచేసుకుంటూ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు.
సేవా కార్యక్రమాల్లో కొన్ని..
►జనగామ జిల్లాలోని కళ్లెం గ్రామానికి చెందిన అంధ విద్యార్థిని సుకన్య ఉన్నత చదువుల కోసం రూ.22,000 సాయం
►సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన తల్లీతండ్రిలేని ఒక పాప పేరుతో బ్యాంకులో రూ. 10,000లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
►వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన కిడ్నీ బాధితురాలికి రూ.10,000 వైద్యసాయం కోసం అందించారు
►సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారి వర్ష కేన్సర్‌తో బాధపడుతుండటంతో రూ. 20,000 లు ఆర్థిక సాయం అందించారు.
►గజ్వేల్ పట్టణంలో మతిస్థిమితం లేక రోడ్లపై సంచరిస్తున్న ముగ్గురిని చేరదీసి వారిని యాదాద్రి జిల్లాలోని అమ్మనాన్న ఆశ్రమంలో చేర్పించి వారి ఖర్చుల నిమిత్తం 26,800 అందించారు.
►నల్గొండ జిల్లాకు చెందిన శివప్రసాద్ కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యసేవలకోసం వారికి రూ.20,000 లు అందించారు.
►కేరళలోని వరద బాధితుల సాయం నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.15,200
– తాటికొండ రవి, సాక్షి మెదక్ డెస్క్
సేవతో సంతృíప్తి
నేను వాచ్ రిపేర్ సెంటర్ నడిపిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాము. మేము చేసేది చిరువ్యాపారం.. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అయినా ఉన్నంతలో ఇతరులకు సేవ చేస్తూ తృప్తి చెందుతున్నాం. ప్రతి నెలా ఒక్కో సభ్యుడి దగ్గర రూ. 200 చొప్పున వసూలు చేసి జమ చేసుకుంటాం. మా బృందంలో రాజకీయ నాయకులను చేర్చుకోము.
– బాలచంద్రం, అధ్యక్షుడు
చలించిపోయాను
నేను గజ్వేల్‌లో మెడికల్ ల్యాబ్ నిర్వహిస్తుంటాను. పత్రికల్లో వచ్చే కథనాలు చూసి చలించిపోయాను. మా వంతుగా ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మమ్మల్ని చూసి చాలామంది సేవా బృందాలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.
– కటుకం శ్రీనివాస్,
ప్రధాన కార్యదర్శి ఆపన్నహస్తం
►జనగామ జిల్లా కు చెందిన యువతి నిహారిక కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఈ విషయం చెప్పకుండానే ఆమెకు పెళ్లి చేశారు. కొద్ది రోజుల తరువాత విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చారు. ఈ కథనం సాక్షి పత్రికలో రావడంతో ఆమె వైద్యానికి రూ.10,000 బ్యాంకులో డిపాజిట్ చేశాము. తరువాత సాక్షి పత్రికలో మనసున్న మహారాజులు అంటూ కథనం రావడంతో అది చూసి చాలా మంది స్పందించి ఆ యువతికి సాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment