
ఎరువు.. కరువు
నెల్లూరు(అగ్రికల్చర్): రైతన్నకు ఎరువు కరువైంది. ఆందోళన అవసరం లేదు.. అవసరానికి తగ్గట్లు ఎరువులు సిద్ధమంటూ పాలకులు చేసిన ప్రకటనలు నెలకే గాల్లో కలిసిపోయాయి. పర్యవేక్షణ లేకపోవడటంతో అన్నదాతలకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను కొందరు వ్యాపారులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఈ అక్రమ దందాను అడ్డుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులకే వంత పాడుతున్నారు.
సహకార పరపతి సంఘాల (సొసైటీల) ద్వారా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను కొందరు అక్రమార్కులు బినామీల పేరుతో తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటీవల నాయుడుపేట, సంగంలోని సొసైటీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి ఆరుకాణాలను సీజ్ చేయడమే ఇందుకు నిదర్శనం.
జిల్లాలో పలుచోట్ల యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తూ వ్యాపారులకే సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆలస్యంగా వర్షాలు పడటంతో సాగు అలస్యమైందని ఆవేదన చెందుతున్న రైతులపై ఎరువుల ధరలు మరింతభారంగా మారాయి.
బినామీ పాసుపుస్తకాలతో..
కోరమాండల్, ఇఫ్‌కో, క్రిబ్‌కో కంపెనీలు యూరియాను సొసైటీలు, ఆథరైజ్డ్ దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాయి. మార్కె ట్ ధర కంటే తక్కువగా రైతులకు అందిస్తున్నాయి. ఒక్కో రైతుకు పాస్ పుస్తకం ఆధారంగా మూడు బస్తాలు చొప్పున అంది స్తారు. ఇదే అదునుగా వ్యాపారులు బినామీ పాసు పుస్తకాలతో ప్రతి రోజు 100 నుంచి 200 బస్తాలు బ్లాక్‌కు తరలిస్తున్నారు.
అక్రమదందా సాగుతోంది ఇలా....
జిల్లాకు రబీ సీజన్‌కు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 41,000 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. ఇందులో 50 శాతం జిల్లాలోని 95 సొసైటీలకు, మిగిలిన 50 శాతం ప్రైవేటు డీలర్లకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే అధికారులు అందుకు భిన్నంగా ప్రైవేటు డీలర్లకే అధిక మొత్తంలో యూరియాను కేటాయించారని డీసీసీబీ డెరైక్టర్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో వేల సంఖ్యలో ఫెర్టిలైజర్స్ దుకాణాలు ఉన్నాయి.
ఆయా మండలకేంద్రాల్లో ఉన్న ఎరువుల దుకాణాల యజమానులు కొంతమంది రైతుల పాస్ పుస్తకాలను సేకరించి బినామీ పేర్లతో రోజుకు 50 నుంచి 100 బస్తాల యూరియాను తీసుకెళ్తున్నారు. వీరికి ఆయా సొసైటీ డెరైక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారుల అండ ఉండటంతో వీరి దందాకు అడ్డు, అదుపులేకుండా పోయింది. పదిరోజుల క్రితం నాయుడుపేటలోని ఒక ప్రైవేటు దుకాణంలో సొసైటీ ఎరువులు విక్రయిస్తుండగా అధికారులు దాడులు నిర్వహించి ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. జిల్లాలో రబీ సీజన్‌లో 2.76,425 హెక్టార్లలో వరి, మినుము, వేరుశనగ, చెరకు, పత్తి పంటలను ఈ రబీ సీజన్‌లో సాగుచేస్తారని అధికారులు తేల్చారు.
పెరిగిన ఎరువుల ధరలు
ప్రధానంగా దుక్కిలో హెక్టార్‌కు రెండున్నర బస్తాల డీఏపీని కచ్చితంగా వేయాలి. డీఏపీ బస్తా రూ.1,181 ఉండగా, ఈ ధర ప్రస్తుతం రూ.1,249కు చేరింది. డీఏపీ బస్తాపై రూ.68 పెరిగింది. 14:35:14 ధర రూ.1,120 నుంచి రూ.1,207కు చేరింది. బస్తాపై రూ.127 పెరిగింది. అదేవిధంగా 10: 26: 26 ధర రూ.1,083 ఉండగా, రూ.1,139 అయింది. 20:20:0:13 ధర రూ.919 నుంచి రూ.956 పెరిగింది. ఒక్కో హెక్టారుకు రైతుపై రూ.200 నుంచి 300 అదనపు భారం పడింది. యూరియా బస్తా కు రూ.284లకు విక్రయించాల్సి ఉండగా రూ.380 వరకు విక్రయిస్తున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు :
బహిరంగ మార్కెట్‌లో యూరియా బస్తాపై వ్యాపారులు రూ.80 నుంచి 100 పెంచి అమ్ముతున్నా అధికారులు పట్టించు కోవడం లేదు. కట్టడి చేయాల్సిన వారు వ్యాపారుల ప్రలోభాలకు లొంగి రైతులకు తీవ్ర అన్యా యం చేస్తున్నారు. అధిక రేట్లకు విక్రయించే దుకాణాలపై జిల్లా అధికారులైనా దాడులు చేసి చర్యలు తీసుకోవాలి.
- అల్లంపాటి హజరత్‌రెడ్డి, రైతు, నరసాపురం
బ్లాక్‌మార్కెట్‌లో సొసైటీ ఎరువులు :
సొసైటీలకు సరఫరా చేసిన యూరియా ను అధికారులు వారి బంధువులకు, బినామీ రైతుల పేరుతో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. వ్యవసాయాధికారులు చిత్తశుద్ధితో దుకాణాల్లో స్టాకు రిజిష్టరును పరిశీలిస్తే వ్యాపారుల దందా బయటపడుతుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఈ అక్రమదందాను అరికట్టాలి.
- కొప్పోలు వెంకటేశ్వర్లు, రైతు, ఆత్మకూరు
అధిక ధరకు విక్రయిస్తే చర్యలు :
కృత్రిమ కొరత సృష్టించి ఎరువుల బస్తా ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించి సీజ్ చేశాం. సొసెటీలకు కేటాయించిన ఎరువులు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. రబీ సీజన్‌కు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం.
- కేవీ.సుబ్బారావు, జేడీ, వ్యవసాయశాఖ