ఒక పాదుషా గారుండేవారు. ఆయనకు అబద్ధాలంటే గిట్టదు. ఎవరైనా తన రాజ్యంలో అబద్దం చెబుతూ పట్టుబడితే, ఐదు దీనార్ల జరిమానా విధిస్తానని దండోరా వేయించాడు. దాంతో ఆ రాజ్యంలోని ప్రజలంతా అబద్ధాలాడేందుకు జంకేవారు. ఒకరోజు పాదుషా గారు మారువేషంలో గస్తీ తిరుగుతుండగా భోరున వర్షం కురిసింది. తలదాచుకునేందుకు ఒక వ్యాపారి దగ్గర ఆగారు. ఆ వ్యాపారి పాదుషా గారికి సపర్యలు చేశాడు. మాటల మధ్యలో వ్యాపారిని ‘‘నీ వయస్సెంత?’’ అని అడిగాడు. ‘‘ఇరవై సంవత్సరాలు?’’ అని చెప్పాడు వ్యాపారి. ‘‘నీ దగ్గర ఎంత డబ్బుంది?’’ అన్నాడు. ‘‘70వేల దిర్హములున్నాయి’’ అన్నాడు. ‘‘ఎంతమంది సంతానం?’’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాచ్చాడు.
వర్షం తెరపిచ్చాక పాదుషా వెళ్లిపోయాడు. వ్యాపారి చెప్పినవి నిజాలో కావోనని తెలుసుకోవడానికి దస్తావేజులను తెప్పించారు. వ్యాపారి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పాదుషా గారికి చిర్రెత్తుకొచ్చింది. పాదుషా ఆజ్ఞతో వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. పాదుషా గారు తిరిగి అవే మూడు ప్రశ్నలు అడిగారు. వాటికి వ్యాపారి కూడా తిరిగి అవే జవాబులిచ్చాడు. వ్యాపారి మళ్లీ అబద్ధాలాడుతున్నాడని 15 దీనార్ల జరిమానా వసూలు చేసి ధనాగారంలో జమ చేయాలని మంత్రిని ఆదేశించారు. ప్రభుత్వ దస్తావేజుల్లో అతని వయస్సు 35 ఏళ్లని, అతని వద్ద 70వేల దీనార్లకంటే ఎక్కువ రొక్కముందని, ఐదుగురు సంతానమని ఉంది.
అప్పుడు వ్యాపారి ‘‘నా జీవిత ఆయుష్షులోని 20 ఏళ్లు మాత్రమే సత్కార్యాల్లో, నిజాయితీగా గడిపాను కనుక ఆ ఇరవై ఏళ్లనే నా వయస్సుగా పరిగణిస్తాను. జీవితంలో 70 వేల దీనార్లను ఒక అనాథాశ్రమం నిర్మించేందుకు ఖర్చుపెట్టాను కనుక అదే నా ఆస్తిగా భావిస్తాను. నలుగురు పిల్లలు చెడు సావాసాలతో, వ్యసనపరులుగా మారారు. ఒక్కడు మాత్రమే సన్మార్గంలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు కనుక ఆ ఒక్కడే నా సంతానంగా చెప్పుకుంటాను.’’ అని వివరణ ఇచ్చాడు. పాదుషా గారు సంతోషించి జరిమానాను ఉపసంహరించారు. జీవితంలో మంచిపనుల్లో గడిపిన కాలం, వ్యయపర్చిన సొమ్ము, ఉత్తమ సంతానమే పరలోక జీవితానికి సోపానాలని చెప్తోంది ఈ కథ.
– ముహమ్మద్ ముజాహిద్
Comments
Please login to add a commentAdd a comment