Muhammad Mujahid Islam
-
పాదుషా ప్రశ్నలు
ఒక పాదుషా గారుండేవారు. ఆయనకు అబద్ధాలంటే గిట్టదు. ఎవరైనా తన రాజ్యంలో అబద్దం చెబుతూ పట్టుబడితే, ఐదు దీనార్ల జరిమానా విధిస్తానని దండోరా వేయించాడు. దాంతో ఆ రాజ్యంలోని ప్రజలంతా అబద్ధాలాడేందుకు జంకేవారు. ఒకరోజు పాదుషా గారు మారువేషంలో గస్తీ తిరుగుతుండగా భోరున వర్షం కురిసింది. తలదాచుకునేందుకు ఒక వ్యాపారి దగ్గర ఆగారు. ఆ వ్యాపారి పాదుషా గారికి సపర్యలు చేశాడు. మాటల మధ్యలో వ్యాపారిని ‘‘నీ వయస్సెంత?’’ అని అడిగాడు. ‘‘ఇరవై సంవత్సరాలు?’’ అని చెప్పాడు వ్యాపారి. ‘‘నీ దగ్గర ఎంత డబ్బుంది?’’ అన్నాడు. ‘‘70వేల దిర్హములున్నాయి’’ అన్నాడు. ‘‘ఎంతమంది సంతానం?’’ అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాచ్చాడు. వర్షం తెరపిచ్చాక పాదుషా వెళ్లిపోయాడు. వ్యాపారి చెప్పినవి నిజాలో కావోనని తెలుసుకోవడానికి దస్తావేజులను తెప్పించారు. వ్యాపారి చెప్పినవన్నీ అబద్ధాలని తేలడంతో పాదుషా గారికి చిర్రెత్తుకొచ్చింది. పాదుషా ఆజ్ఞతో వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. పాదుషా గారు తిరిగి అవే మూడు ప్రశ్నలు అడిగారు. వాటికి వ్యాపారి కూడా తిరిగి అవే జవాబులిచ్చాడు. వ్యాపారి మళ్లీ అబద్ధాలాడుతున్నాడని 15 దీనార్ల జరిమానా వసూలు చేసి ధనాగారంలో జమ చేయాలని మంత్రిని ఆదేశించారు. ప్రభుత్వ దస్తావేజుల్లో అతని వయస్సు 35 ఏళ్లని, అతని వద్ద 70వేల దీనార్లకంటే ఎక్కువ రొక్కముందని, ఐదుగురు సంతానమని ఉంది. అప్పుడు వ్యాపారి ‘‘నా జీవిత ఆయుష్షులోని 20 ఏళ్లు మాత్రమే సత్కార్యాల్లో, నిజాయితీగా గడిపాను కనుక ఆ ఇరవై ఏళ్లనే నా వయస్సుగా పరిగణిస్తాను. జీవితంలో 70 వేల దీనార్లను ఒక అనాథాశ్రమం నిర్మించేందుకు ఖర్చుపెట్టాను కనుక అదే నా ఆస్తిగా భావిస్తాను. నలుగురు పిల్లలు చెడు సావాసాలతో, వ్యసనపరులుగా మారారు. ఒక్కడు మాత్రమే సన్మార్గంలో పవిత్రమైన జీవితాన్ని గడుపుతున్నాడు కనుక ఆ ఒక్కడే నా సంతానంగా చెప్పుకుంటాను.’’ అని వివరణ ఇచ్చాడు. పాదుషా గారు సంతోషించి జరిమానాను ఉపసంహరించారు. జీవితంలో మంచిపనుల్లో గడిపిన కాలం, వ్యయపర్చిన సొమ్ము, ఉత్తమ సంతానమే పరలోక జీవితానికి సోపానాలని చెప్తోంది ఈ కథ. – ముహమ్మద్ ముజాహిద్ -
ఆలోచన ఉన్నవారిదే భవిష్యత్తు
పూర్వం ఒకానొక దేశంలో ప్రజలు ఏడాదికోసారి తమ రాజును ఎన్నుకునేవారు. ఏడాది పాలన ముగిసిన రాజుకు అమూల్యమైన వస్త్రాభరణాలను ధరింపజేసి ఏనుగుపై ఊరేగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వస్తారు. ఈ షరతుకు లోబడిన వారినే గద్దెపై కూర్చోపెట్టేవారు. ఆ రాజ్యంలో ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగుతూ వస్తోంది. ఇలా ఒక ఏడాది తమ రాజును నిర్మానుష్య ప్రాంతంలో వదిలి వస్తుండగా వారికి సముద్రంలో మునిగిపోయిన ఓ నౌకను, అందులో నుంచి ప్రాణాలతో బయటపడ్డ యువకుడినీ చూశారు. అతన్నే తమ చక్రవర్తిగా నియమించాలనుకున్నారు. ఆ యువకుణ్ని తమ పడవలో ఎక్కించుకుని తమ రాజ్యానికి తీసుకెళ్లి, రాజును చేశారు. అక్కడి ప్రముఖులంతా ఆ యువచక్రవర్తికి అన్ని పాలనా నియమాలతోపాటు, ఏడాది తర్వాత పాలన ముగిసిపోయే విషయాన్ని కూడా వివరించారు. రాజుగా బాధ్యతలు చేపట్టిన మూడోరోజునే ఆ యువకుడు తన మంత్రిని వెంటబెట్టుకుని ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. ఆ ప్రాంతమంతా క్రూరమృగాలు, విషసర్పాలతో భయంకరంగా ఉంది. అక్కడక్కడా శవాలు, అస్తిపంజరాల గుట్టలు కూడా కనిపించాయి. అవి తనకన్నా ముందు ఆ రాజ్యాన్ని ఏలిన వారివనీ, ఏడాది తర్వాత తనకూ అదే గతి పడుతుందని ఊహించాడా యువకుడు. రాజ్యానికి వెళ్లగానే వంద మంది కూలీలను ఆ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ అడవిని మొత్తం నరికేసి, అందులో ఉన్న క్రూర మృగాలను తరిమేయాలని ఆజ్ఞాపించాడు. రాజు పర్యవేక్షణలో కొద్దికాలంలోనే ఆ అటవీ ప్రాంతమంతా పలు రకాలైన పండ్ల చెట్లు, పూల మొక్కలతో నిండిపోయింది. వాటితోపాటు పెంపుడు జంతువులు, పాడి పశువులు, పక్షులతో ఆ ప్రాంతమంతా అందమైన తోటగా, ఆదర్శమైన పట్టణంగా మారింది. చూస్తుండగానే కొత్త రాజు ప్రజానురంజకమైన పాలన ముగిసింది. పురప్రముఖులు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు కట్టబెట్టి, ఏనుగుపై ఎక్కించి ఊరేగింపునకు సిద్ధం చేశారు. రాజు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఇష్టం ఉన్న వారంతా తనతోపాటు కొత్త ప్రదేశానికి రమ్మని ఆహ్వానించాడు! అంతా సంతోషించారు. గత చక్రవర్తులంతా భోగభాగ్యాలలో మునిగి తేలుతూ భవిష్యత్తును విస్మరించారు. ఇతను మాత్రం నిత్యం భవిష్యత్తు గురించే ఆలోచించి, దానికోసం ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నాడు. ఆ నిర్మానుష్య ప్రాంతాన్ని సుందర నిలయంగా, శేష జీవితాన్ని హాయిగా గడిపేందుకు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడు. – ముహమ్మద్ ముజాహిద్ -
ధనాగారంలో దొంగ
సుల్తాన్ ముహమ్మద్ గజనీ దగ్గర అయాజ్ అనే ఒక కట్టు బానిస ఉండేవాడు. అయాజ్ అపారమైన తెలివితేటలు, నిజాయితీ, ఆకట్టుకునే వ్యవహారశైలి వల్ల సుల్తాన్ గజనీ అతన్ని తన మంత్రిగా నియమించుకోవడమేగాక పాలనా వ్యవహారాల్లో అయాజ్ సలహా సూచనలకే ప్రాధాన్యమిచ్చేవారు. దీంతో మిగతా మంత్రులు అయాజ్ పట్ల అసూయతో రగిలిపోయారు. అయాజ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించే కుట్రల్లో భాగంగా, అయాజ్‌పై అభాండాలు వేసి గజనీకి ఫిర్యాదు చేసేవారు. అయాజ్ తన సౌశీల్యంతో అన్నింట్లోనూ నెగ్గుకొచ్చేవాడు. ఒకరోజు సుల్తాన్ గజనీ తీరిగ్గా ఒక్కడే ఉండటాన్ని గమనించి ఒక మంత్రివర్గ సహచరుడు అయాజ్ పై ఫిర్యాదులు చేయడం మొదలెట్టాడు. ‘‘అయాజ్ ప్రతీ నెలా ధనాగారానికి వెళ్తున్నాడు. అక్కడ నుంచి బంగారం, డబ్బు దొంగిలిస్తున్నాడు’’ అనే అభాండాన్ని వేశాడు. ‘‘దీన్ని నిరూపించగలవా’’ అని సుల్తాన్ ప్రశ్నించాడు. ‘‘నాతో పదండి హుజూర్! ఇంతకు క్రితమే అతను ధనాగారానికి వెళ్లాడు. మనం ఉన్నపళంగా అతన్ని పట్టుకోవచ్చు’’ అని చెప్పి సుల్తాన్‌ను, మిగతా సైనికులను వెంటపెట్టుకుని ధనాగారంలోకి ప్రవేశించాడు. లోన అడుగు పెట్టగానే విరిగిపోయి ఉన్న ఒక పెట్టె పక్కన అయాజ్ కూర్చుని ఉన్నాడు. సుల్తాన్ ఎంతో ఆసక్తిగా అయాజ్ దగ్గరకెళ్లి చూశాడు. అయాజ్ ఆ పెట్టెలో ఉన్న తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన బట్టలను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. సుల్తాన్ ఆశ్చర్యంతో ‘‘అయాజ్ ఇక్కడేం చేస్తున్నావు?’’ అని అడిగాడు. ‘‘జహాపనా! నేను మొదటిసారి మీ దగ్గరికి ఈ తెగిపోయిన చెప్పులు, ఈ చిరిగిన బట్టలు, విరిగిన పెట్టెతోనే వచ్చాను. కానీ ఇప్పుడు అల్లాహ్ దయ వల్ల తమరి ఆస్థానంలో మంత్రిగా భోగాలు అనుభవిస్తున్నాను. వెండి కంచంలో తింటున్నాను. పట్టు వస్త్రాలు ధరిస్తున్నాను. వీటి మూలంగా నాలో ఏ కోశానా గర్వం రాకుండా ఇలా నెలకోసారి ఈ ధనాగారానికి వచ్చి నా ఈ చెప్పులు, బట్టలను చూసి నా పాతరోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటాను.’’ అని ఎంతో వినయంగా సమాధానమిచ్చాడు. అప్పుడు సుల్తాన్ చూసిన చూపులకు మిగతా మంత్రివర్గ సహచరులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. – ముహమ్మద్ ముజాహిద్ -
ఖలీఫా చూడకపోయినా..!
‘‘ఫలానా తల్లీ కూతుళ్లను వెంటబెట్టుకునిరండి’’ అని రాజభటులకు పురమాయించారు.ఖలీఫా గారు తమను ఎందుకు పిలిపించారో తెలియక ఆ తల్లీకూతుళ్లు భయంతో వణికిపోయారు. ఖలీఫా ఉమర్ (రజి) చక్రవర్తిగా పరిపాలన చేస్తున్న కాలం అది. ఆయన తెల్లవారుఝామున లేచి ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు గస్తీ తిరిగేవారు. ఆ రోజు గస్తీ తిరుగుతుండగా ఒక యువతి, ఒక పెద్ద వయసు మహిళ సంభాషణ ఖలీఫా చెవుల్లో పడ్డాయి. ‘‘అమ్మా ఈ రోజు మేకలు పాలు చాలా తక్కువగా ఇచ్చాయి’’ అంది కూతురు. అందుకు ఆ తల్లి నవ్వేసి, ‘‘దానికి ఇంతలా ఆలోచించాలా, పాలల్లో కాసిన్ని నీళ్లు కలుపు’’ అని తన బిడ్డకు పురమాయించింది. ‘‘అమ్మా అపచారం, మన ఖలీఫా గారు పాలల్లో నీళ్లు కలిపి అమ్మడం నిషేధించారు కదా’’ గుర్తుచేసింది కూతురు. ‘‘పిచ్చిదానా, ఖలీఫా ఏమైనా ఇక్కడకు వచ్చి చూస్తున్నారా ఏమిటీ’’ అని తల్లి నచ్చజెప్పపోయింది. ‘‘ఖలీఫా చూడకపోయినా, ఖలీఫా ఆరాధించే ప్రభువు చూస్తున్నాడు కదమ్మా’’ అంది కూతురు. ఈ మాటలు ఖలీఫాకు ఎంతగానో నచ్చాయి. మారు మాట్లాడకుండా తన రాజదర్బారుకు చేరుకున్నారు. ‘‘ఫలానా తల్లీ కూతుళ్లను వెంటబెట్టుకుని రండి’’ అని రాజభటులకు పురమాయించారు. ఖలీఫా గారు తమను ఎందుకు పిలిపించారో తెలియక ఆ తల్లీకూతుళ్లు భయంతో వణికిపోయారు. అయితే, అందుకు విరుద్ధంగా ఖలీఫా వారికి సాదర స్వాగతం పలికారు.‘‘దైవం పట్ల అచంచల నమ్మకమున్న దైవభీతి పరురాలైన మీ అమ్మాయి పెళ్లి మా అబ్బాయితో జరిపించాలనుకుంటున్నాను. మీకు అందుకు సమ్మతమేనా?’’ అంటూ ఆ మహిళను సూటిగా అడిగారు. ఆమె ఆనందంగా అంగీకరించింది. వెంటనే తన కుమారుడికి ఆ పాలమ్మాయితో పెళ్లి జరిపించారు ఖలీఫా. మేకపాలను అమ్ముకుని సాధారణ జీవనం గడిపే ఒక పేదింటి అమ్మాయి ప్రదర్శించిన దైవభీతి ఆమెను చక్రవర్తి ఇంటి కోడలిని చేసింది. జవాబుదారీతనం, దేవుడు చూస్తున్నాడనే తలంపే పాలకులనైనా, ప్రజలనైనా సత్యంపై, ధర్మంపై నిలకడగా ఉంచుతుందన్నది ఈ కథలోని నీతి. – ముహమ్మద్ ముజాహిద్ -
ఫేస్బుక్లో ఎంపీకి బెదిరింపులు!
లండన్: ఫేస్బుక్లో సందేశాలు పంపుతూ బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని యూకే పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. తమకు ప్రాణాపాయం ఉందని లేబర్ పార్టీ ఎంపీలు సిమన్ డాన్క్జుక్, నెయిల్ కోలేలు ఇటీవలే ఫిర్యాదు చేశారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి యూకేకి చెందిన పార్లమెంట్ సభ్యులకు బెదిరింపు సందేశాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని క్రేయిగ్ వాల్లేస్ అలియాస్ మమమ్మద్ ముజాహిద్ ఇస్లామ్ అని గుర్తించారు. సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో హెచ్చరింపు మెస్సేజ్‌లు చేస్తున్న నిందితుడు ముజాహిద్ ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోనికి తీసుకున్నారు. హెండన్ మేజిస్ట్రేట్ ఎదుట సోమవారం నిందితుడిని హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై యూకే చేపట్టిన దాడులను ముమ్మరం చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు ప్రకటించిన తర్వాత ఎంపీలపై బెదిరింపు చర్యలు అధికమయ్యాయి. గత గురువారం నాడు వాల్లేస్ ఫేస్బుక్ నుంచి ఎంపీకి చేసిన ఓ మెస్సేజ్ సాక్ష్యాధారంగా చేసుకుని ఆదివారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, నిందితుడు ఏ పార్లమెంట్ సభ్యుడికి సందేశాలు పంపించాడన్న వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. లండన్ నియోజకవర్గం సభ్యుడు అయితే కాదని మాత్రం స్పష్టంచేశారు.