దుకాణం బంద్
జీఎస్టీ ఎఫెక్ట్
వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళనబాట
స్తంభించిన లావాదేవీలు
తణుకు :వస్తు, సేవల పన్ను (జీఎస్టీకి) నిరసనగా వ్యాపారులు ఆందోళనబాట పట్టారు. ప్రధానంగా వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. వస్త్రవ్యాపారులు మంగళవారం నుంచి నాలుగురోజులపాటు బంద్ చేపట్టనుండగా, ఫర్నిచర్ వ్యాపారులు రెండురోజులపాటు దుకాణాలు మూయనున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే రూ.కోట్లలో లావాదేవీలు స్తంభించినట్టు సమాచారం.
జీఎస్టీని తొలి నుంచి వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల వ్యాపారాలు దెబ్బతిని దుకాణాలు మూతపడే దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆలిండియా టెక్స్‌టైల్స్ ఫెడరేషన్, ఫర్నిచర్ వ్యాపారుల అసోసియేషన్ పిలుపు మేరకు వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. తక్షణమే వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో వస్త్ర, ఫర్నిచర్ దుకాణాలు మూత పడ్డాయి.
మూడు వేల వస్త్ర దుకాణాల మూత
జిల్లా వ్యాప్తంగా క్లాత్ మర్చంట్స్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు వేల దుకాణాలు మూతపడినట్టు సమాచారం. దీనివల్ల రూ. 400 కోట్ల లావాదేవీలు నిలిచినట్టు అంచనా.
భారం పెరగడం వల్లే..
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇటీవల నూలు, రంగులు, పట్టు ధరలు పెరగడంతో వస్త్రాల అమ్మకాలు తగ్గాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూలుపై ప్రకటించిన జీఎస్టీ చేనేత పరిశ్రమకు మరింత భారం కానుంది. ఇంతవరకు రెడీమేడ్ వస్త్రాలపై ఐదు శాతం పన్ను అమల్లో ఉంది. వస్తు సేవల పన్ను వల్ల ఇది 12 శాతానికి పెరగనుంది. ఇంతవరకు చేనేత, సాధారణ వస్త్రాలపై ఎలాంటి పన్నూ లేదు. జీఎస్టీ రాకతో ఐదు శాతం వసూలు చేయనున్నారు. ఈ విధానాల వల్ల కొనుగోలు దారులపై భారీగా భారం పడుతుందని వస్త్ర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నుంచి ఏడు శాతం వరకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 18 శాతానికి పెంచారు. ఈ ప్రభావంతో మార్కెట్‌లో వస్త్రాలపై 10 నుంచి 15 శాతం వరకు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీఎస్టీకి వ్యతిరేకంగా ఈనెల 15న ఓ దఫా ఆందోళన చేసిన వస్త్రవ్యాపారులు తాజాగా నాలుగురోజుల బంద్‌కు పిలుపునిచ్చారు.
ఉభయులకూ భారమే
జీఎస్టీ వల్ల వస్త్రవ్యాపారులకూ, వినియోగదారులకూ భారమనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం కేంద్రాలుగా వస్త్రవ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారంపై ఆధారపడి ఎంతో మంది చిన్నవ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువగా చితికిపోతారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి జరిగిన వ్యాపారంపై లెక్కలు చూపించి వివరాలను అందించాలని కేంద్రం సూచించడం వీరికి మరింత భారంగా మారింది. గతంలో వ్యాట్ తొలగించాలని కోరుతూ వ్యాపారులు చేసిన ఆందోళనలతో ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారాలంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి నెలా బిల్లులు జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లో ఆన్‌లైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాల్సి ఉంటుందని, ఇదంతా పెద్దస్థాయి షాపింగ్‌మాల్స్‌కు మాత్రమే సాధ్యమవుతుందే తప్ప చిన్న వ్యాపారులకు సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో వస్త్ర దుకాణాలపై 12 శాతం వరకు పన్ను పడనుంది. ఈ భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. రూ.వెయ్యిలోపు ఐదు శాతం, ఆ మొత్తం దాటితే 12 శాతం వరకు పన్ను విధించనున్నారు. ఇవి కాకుండా మేకింగ్, వర్కింగ్, డైయింగ్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయనున్నారు. ఇది వినియోగదారులకు భారంగా మారనుంది.
ఫర్నిచర్ షాపుల బంద్
ఇదిలా ఉంటే ఫర్నిచర్ వ్యాపారులూ రెండురోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1500 షాపులు ఉంటాయని అంచనా. ఈ దుకాణాలన్నీ బుధవారం కూడా మూతపడనున్నాయి. తదుపరి కేంద్రం స్పందనను బట్టి ఆందోళన తీవ్రతరం చేయాలనే యోచనలో ఫర్నిచర్ వ్యాపారులు ఉన్నారు.