Services Tax
-
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
అవసరమైనప్పుడు మరిన్ని చర్యలుంటాయ్
న్యూఢిల్లీ: ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రంగాలకు మరిన్ని ప్రోత్సాహక చర్యలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. వృద్ధికి ప్రోత్సాహకంగా అవసరమైనప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగాన్ని పెంచడం ద్వారా వృద్ధికి ఊతమిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్ అధికారులతో కలసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పెంచబోతున్నట్టు తన కార్యాలయం మినహా అంతటా వదంతులు వ్యాప్తి చెందుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ నెల 18న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలపై అవగాహన ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి చెప్పారు. ఆర్థిక రంగం ఎప్పుడు పుంజుకోవచ్చంటూ ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ‘‘నేను ఎటువంటి అంచనాలు వేయను. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటాను. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది’’ అని వివరించారు. స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం పెరుగుతూ, వృద్ధి తగ్గుతుండడం)పై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ భారత్ స్టాగ్ఫ్లేషన్ దశలోకి వెళుతోందని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. ధరలు దిగొస్తున్నాయి.. ఉల్లిపాయల దిగుమతులతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ధరలు దిగొస్తున్నట్టు మంత్రి చెప్పారు. తాజా పంట దిగుబడులు కూడా మార్కెట్‌కు చేరితే ధరలు మరింత తగ్గుముఖం పడతాయన్నారు. -
దుకాణం బంద్
జీఎస్టీ ఎఫెక్ట్ వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారుల ఆందోళనబాట స్తంభించిన లావాదేవీలు తణుకు :వస్తు, సేవల పన్ను (జీఎస్టీకి) నిరసనగా వ్యాపారులు ఆందోళనబాట పట్టారు. ప్రధానంగా వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. వస్త్రవ్యాపారులు మంగళవారం నుంచి నాలుగురోజులపాటు బంద్ చేపట్టనుండగా, ఫర్నిచర్ వ్యాపారులు రెండురోజులపాటు దుకాణాలు మూయనున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే రూ.కోట్లలో లావాదేవీలు స్తంభించినట్టు సమాచారం. జీఎస్టీని తొలి నుంచి వస్త్ర, ఫర్నీచర్ వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల వ్యాపారాలు దెబ్బతిని దుకాణాలు మూతపడే దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆలిండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్, ఫర్నిచర్ వ్యాపారుల అసోసియేషన్ పిలుపు మేరకు వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు. తక్షణమే వస్త్రాలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో వస్త్ర, ఫర్నిచర్ దుకాణాలు మూత పడ్డాయి. మూడు వేల వస్త్ర దుకాణాల మూత జిల్లా వ్యాప్తంగా క్లాత్ మర్చంట్స్ అసో సియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు వేల దుకాణాలు మూతపడినట్టు సమాచారం. దీనివల్ల రూ. 400 కోట్ల లావాదేవీలు నిలిచినట్టు అంచనా. భారం పెరగడం వల్లే.. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇటీవల నూలు, రంగులు, పట్టు ధరలు పెరగడంతో వస్త్రాల అమ్మకాలు తగ్గాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నూలుపై ప్రకటించిన జీఎస్టీ చేనేత పరిశ్రమకు మరింత భారం కానుంది. ఇంతవరకు రెడీమేడ్ వస్త్రాలపై ఐదు శాతం పన్ను అమల్లో ఉంది. వస్తు సేవల పన్ను వల్ల ఇది 12 శాతానికి పెరగనుంది. ఇంతవరకు చేనేత, సాధారణ వస్త్రాలపై ఎలాంటి పన్నూ లేదు. జీఎస్టీ రాకతో ఐదు శాతం వసూలు చేయనున్నారు. ఈ విధానాల వల్ల కొనుగోలు దారులపై భారీగా భారం పడుతుందని వస్త్ర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నుంచి ఏడు శాతం వరకు ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 18 శాతానికి పెంచారు. ఈ ప్రభావంతో మార్కెట్లో వస్త్రాలపై 10 నుంచి 15 శాతం వరకు భారం పడుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జీఎస్టీకి వ్యతిరేకంగా ఈనెల 15న ఓ దఫా ఆందోళన చేసిన వస్త్రవ్యాపారులు తాజాగా నాలుగురోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఉభయులకూ భారమే జీఎస్టీ వల్ల వస్త్రవ్యాపారులకూ, వినియోగదారులకూ భారమనే వాదన వినిపిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఏలూరు, తాడేపల్లిగూడెం కేంద్రాలుగా వస్త్రవ్యాపారం సాగుతోంది. ఈ వ్యాపారంపై ఆధారపడి ఎంతో మంది చిన్నవ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులు ఎక్కువగా చితికిపోతారని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి జరిగిన వ్యాపారంపై లెక్కలు చూపించి వివరాలను అందించాలని కేంద్రం సూచించడం వీరికి మరింత భారంగా మారింది. గతంలో వ్యాట్ తొలగించాలని కోరుతూ వ్యాపారులు చేసిన ఆందోళనలతో ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారాలంటే 17 రకాల డాక్యుమెంట్లు జత చేయాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి నెలా బిల్లులు జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లో ఆన్లైన్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాల్సి ఉంటుందని, ఇదంతా పెద్దస్థాయి షాపింగ్‌మాల్స్‌కు మాత్రమే సాధ్యమవుతుందే తప్ప చిన్న వ్యాపారులకు సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ అమలుతో వస్త్ర దుకాణాలపై 12 శాతం వరకు పన్ను పడనుంది. ఈ భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. రూ.వెయ్యిలోపు ఐదు శాతం, ఆ మొత్తం దాటితే 12 శాతం వరకు పన్ను విధించనున్నారు. ఇవి కాకుండా మేకింగ్, వర్కింగ్, డైయింగ్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయనున్నారు. ఇది వినియోగదారులకు భారంగా మారనుంది. ఫర్నిచర్ షాపుల బంద్ ఇదిలా ఉంటే ఫర్నిచర్ వ్యాపారులూ రెండురోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1500 షాపులు ఉంటాయని అంచనా. ఈ దుకాణాలన్నీ బుధవారం కూడా మూతపడనున్నాయి. తదుపరి కేంద్రం స్పందనను బట్టి ఆందోళన తీవ్రతరం చేయాలనే యోచనలో ఫర్నిచర్ వ్యాపారులు ఉన్నారు. -
ఎరువు.. జీఎస్టీ బరువు
⇒పెరగనున్న ఎరువుల ధరలు ⇒జిల్లా రైతులపై రూ.36 కోట్లకు పైగా భారం ⇒పురుగు మందులు మరింత ప్రియం చేజర్ల (ఆత్మకూరు): వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్ర«భావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలొస్తున్నాయి. జూలై 1నుంచి కొత్త పన్నుల విధానం అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యూరియా సహా రసాయన ఎరువుల ధరలు ఎంత పెరగవచ్చనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఎరువుల ధరలు కొన్ని నెలల క్రితమే కొంతమేర తగ్గాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని రకాల ఎరువులపై వ్యాట్ 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్టీ అమలైతే ఈ పన్ను 12 శాతానికి పెరుగుతుంది. అంటే పన్నుభారం అన్నదాతపై అదనంగా 7 శాతం పడనుంది. యూరియా బస్తాపై దాదాపు రూ.18, మిగిలిన ఎరువులపై బస్తాకు రూ.60 నుంచి రూ.100 వరకు పెరిగే అవకాశం ఉంది. యూరియా భారం రూ.4.10 కోట్లు ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 3,40,077 టన్నుల రసాయన ఎరువులు అవసరమవుతాయి. అన్నిరకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా ఇప్పటివరకు యూరియా ధర మాత్రం పెరగలేదు. ఇది రైతులకు కాస్త ఊరట కలిగిచింది. ప్రస్తుతం యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీ కారణంగా రూ.316కు పెరగనుంది. అంటే బస్తాపై రూ.18 అదనపు భారం పడనుంది. జిల్లాకు 1,13,312 టన్నుల యూరియా ప్రతి ఏడాది అవసరమవుతోంది. టన్నుపై రూ.360 పెరగనుంది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో రైతులపై రూ.4.10 కోట్ల పైగా భారం పడే అవకాశం ఉంది. ఇతర ఎరువుల ధరలు సైతం.. జిల్లాకు డీఏపీ 65,600 టన్నులు, ఎంఓపీ 16,432 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,42,733 టన్నులు అవసరమవుతున్నాయి. 50 కిలోల బస్తాపై గరిష్టంగా రూ.70 వరకు ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఎరువుల కంపెనీల ప్రతినిధులు జిల్లాలోని డీలర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తే రైతులపై జీఎస్టీ భారం ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువుల్లో డైఅమోనియా సల్ఫేట్ (డీఏపీ) ముఖ్యమైనది. ప్రస్తుతం దీనిధర గరిష్టంగా బస్తా రూ.1,155 వరకు ఉంది. భవిష్యత్‌లో రూ.1,221కి చేరే అవకాశం ఉంది. జిల్లాకు డీఏపీ 66,600 టన్నులు అవసరమవుతుండగా, రైతులపై రూ.8.50 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 28.28.0 రకం ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.1,134 ఉంది. ఇది రూ.1,200 దాటే అవకాశం ఉంది. 10.26.26, 14.35.14 ఇలా అన్ని రకాల ఎరువుల ధరలు పెరగనున్నాయి. భారం కానున్న పురుగుమందుల ధరలు రైతులకు పురుగు మందులు సైతం రానున్న రోజుల్లో భారం కానున్నాయి. జిల్లాలో ఏటా దాదాపు 52 వేల టన్నుల పురుగు మందులు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిపై భవిష్యత్‌లో 18 శాతం వరకు జీఎస్టీ వర్తించే అవకాశం ఉంది. వీటితో వివిధ కంపెనీలు బయో ఉత్పత్తులను పెంచే అవకాశం ఉంది. ఓ వైపు పండిన పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కేంద్రం అమల్లోకి తెస్తున్న జీఎస్టీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అవుతుంది. -
మరిన్ని సేవలపై పన్ను పోటు...
న్యూఢిల్లీ: కొన్ని సర్వీసులకు ఇప్పటిదాకా ఇస్తున్న పన్ను మినహాయింపులను ఉపసంహరించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. మరికొన్నింటికి మాత్రం మినహాయింపులను ఇచ్చారు. సీనియర్ అడ్వకేట్లు.. ఇతర అడ్వొకేట్లకు అందించే సర్వీసులపై 14 శాతం పన్ను విధించనున్నట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే ప్రజా రవాణా సేవలు అందించే స్టేజ్ క్యారియర్లను నెగటివ్ లిస్టు నుంచి తొలగించారు. ఈ సర్వీసులపై జూన్ 1 నుంచి 5.6% సర్వీస్ ట్యాక్స్ విధించనున్నట్లు జైట్లీ తెలిపారు. మరోవైపు, సేవా పన్నుల ఎగవేతల్లో ప్రాసిక్యూషన్‌కు సంబంధించి బడ్జెట్లో కొన్ని మార్పులు ప్రతిపాదించారు. వీటి ప్రకారం పన్నులు వసూలు చేసి, వాటిని ఖజానాకు జమ చేయని పక్షంలోనే పన్ను చెల్లింపుదారుపై చర్యలకు అవకాశం ఉంటుంది. ప్రాసిక్యూషన్‌కు అర్హమయ్యే ఎగవేత పరిమాణాన్ని రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లకు పెంచారు. టెలికాం స్పెక్ట్రమ్‌ను బదలాయించడం సర్వీసు పరిధిలోకి వస్తుందని, దీనికి సేవాపన్ను వర్తిస్తుందని జైట్లీ స్పష్టంచేశారు. మినహాయింపులూ ఉన్నాయ్.. అందరికీ ఇళ్లు (హెచ్ఎఫ్ఏ), ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) తదితర పథకాల కింద చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టులపై 5.6% సర్వీస్ ట్యాక్స్‌ను ఎత్తివేస్తున్నట్లు జైట్లీ తెలిపారు. పీఎంఏవైలో భాగంగా 60 చ.మీ. కన్నా తక్కువ కార్పెట్ ఏరియా ఉండే హౌసింగ్ ప్రాజెక్టులకు కూడా మార్చి 1 నుంచి ఇది వర్తిస్తుంది. అటు, సెబీ, ఐఏఆర్‌డీఏఐ, పీఎఫ్ఆర్డీఏ తదితర నియంత్రణ సంస్థల సర్వీసులపైనా ఏప్రిల్ 1 నుంచి 14% సర్వీస్ ట్యాక్స్‌ను కూడా ఉపసంహరిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ వంటి వాటితో బాధపడే వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘నిరామయా’ ఆరోగ్య బీమా పథకంలో భాగమైన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల సర్వీసులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సేవా పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం వీటిపై 14% సర్వీస్ ట్యాక్స్ ఉంటోంది. మరిన్ని విశేషాలు .. ♦ నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చెయిన్ డెవలప్మెంట్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్య యోజన భాగస్వామ్య సంస్థలు అందించే సేవలపై ట్యాక్స్‌ను ఉపసంహరించారు. ఇది ప్రస్తుతం 14 శాతంగా ఉంది. ♦ దేశీ షిప్పింగ్ సంస్థలకు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలోని కొన్ని కోర్సులకు సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. ♦ నిర్దిష్ట పరిమితికి మించి సెంట్రల్ ఎక్సైజ్ చెల్లించాల్సిన వారు దాఖలు చేయాల్సిన రిటర్నుల సంఖ్యను ఏకంగా 27 నుంచి 13కి తగ్గించారు. ఇకపై నెలకొకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు, వార్షికంగా ఒకటి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే నెలవారీ రిటర్నులకు ఈ-ఫైలింగ్ విధానం ఉండగా.. త్వరలో వార్షిక రిటర్నులకు కూడా దీన్ని అందుబాటులోకి తేనున్నారు. అటు సర్వీస్ ట్యాక్స్ అసెసీలు వార్షికంగా మూడు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
పార్లమెంటు సమావేశాలు ప్రొరోగ్
జీఎస్టీపై ప్రత్యేక భేటీ లేదు: కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మళ్లీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ (ముగిసినట్లు ప్రకటన) చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ(సీసీపీఏ) భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వాస్తవ రాజకీయ పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత నెలలో నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలను జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మళ్లీ సమావేశపరచేందుకు వీలుగా ప్రొరోగ్ చేయని విషయం తెలిసిందే. లలిత్‌మోదీ, వ్యాపమ్ తదితర వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వర్షాకాల సమావేశాలు ఆద్యంతం పార్లమెంటును స్తంభింపచేసిన కాంగ్రెస్.. ఆ నేతలపై చర్యలు చేపట్టకుండా.. ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ బిల్లులో తాము కోరిన మూడు సవరణలు చేయకుండా.. పార్లమెంటును తిరిగి ప్రత్యేకంగా సమావేశపరచినా ఎటువంటి ఉపయోగం ఉండబోదని మంగళవారం తేల్చిచెప్పింది. దీంతో ప్రత్యేక సమావేశాల ఆలోచనను కేంద్రం విరమించుకుంది. భారీ ఆర్థిక సంస్కరణల్లో ఒకటిగా పరిగణిస్తున్న ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో దీనిపై చర్చలు ఫలించకపోవటంతో.. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నామని జైట్లీ చెప్పారు. ‘ప్రయత్నాలు కొనసాగిస్తాం. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. కాంగ్రెస్ మినహా దాదాపు మిగతా పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. పార్లమెంటు తదుపరి సమావేశాలు మళ్లీ నవంబర్‌లో జరుగుతాయి. రాజ్యాంగ సవరణ అవసరమైన జీఎస్టీ బిల్లును ఇప్పుడు ఆమోదించని పక్షంలో 2016 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలులోకి తేవాలన్న లక్ష్యం సాధించగలరా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘మీరు ఎంత ఊహించగలరో నేనూ అంతే ఊహించగలను’ అని ఆయన బదులిచ్చారు. అంతకుముందు ద ఎకానమిస్ట్ మేగజీన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సృష్టిస్తున్న అవాంతరాల కారణంగా జీఎస్టీ అమలు జాప్యమవుతుందని వ్యాఖ్యానించారు. -
ఏసీ రెస్టారెంట్లలోనే ఇక సేవల పన్ను
ఆర్థిక మంత్రిత్వశాఖ వివరణ ► బిల్లులో 60 శాతాన్ని మినహాయించి మిగిలిన 40 శాతంపై ట్యాక్స్ ► దీని ప్రకారం ‘ఎఫెక్టివ్ రేట్’ 5.6% న్యూఢిల్లీ: సేవల పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఒక కీలక వివరణ ఇచ్చింది. ఎయిర్ కండీషనింగ్ (ఏసీ) లేదా సెంట్రల్ హీటింగ్ (సీహెచ్) సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే సేవల పన్ను వర్తిస్తుంది. అటువంటి సదుపాయం లేని రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి సేవల పన్ను వసూలు చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు... ఎయిర్ కండీషనింగ్ లేదా సెంట్రల్ హీటింగ్ లేని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి సేవల పన్ను నూ వసూలు చేయవు. ఏసీలేని హోటళ్లు, మెస్సులు. ఫుడ్ కోర్టులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు. ♦ ఒకవేళ అలాంటి సదుపాయం ఉంటే మొత్తం బిల్లు సొమ్ములో 60 శాతాన్ని మినహాయించి మిగిలిన 40 శాతానికి మాత్రమే సేవల పన్ను ఉంటుంది. ఈ విధంగా చూస్తే మొత్తంగా సేవల పన్ను (ఎఫెక్టివ్ రేట్) 5.6 శాతంగా ఉంటుంది. ♦ సేవల పన్ను వర్తించకూడదంటే... రెస్టారెంట్‌లోని ఏ భాగంలోనూ ఏసీ లేదా సీహెచ్‌లు ఉండకూడదు. ♦ జూన్ 1 నుంచీ సేవల పన్నును 14 శాతానికి (విద్యా సుంకాన్ని కలుపుకుని) పెంచారు. దీని ప్రకారం, చార్జ్ చేసిన మొత్తంపై ఎఫెక్టివ్ రేటు 5.6 శాతం ఉంటుంది. ♦ జూన్ 1కి ముందు 12.36 శాతం సేవల పన్ను ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రేట్ 4.94 శాతం. ♦ జూన్ 1 నుంచీ సేవల పన్ను పెంపు వల్ల హోటల్లో, రెస్టారెంట్లో భోజనం మాత్రమే కాదు. మొబైల్, ఇంటర్నెట్, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్లో తీసుకునే రైలు టికెట్లు, కేబుల్ సర్వీసులు, బ్యూటీ పార్లర్స్, హెల్త్ క్లబ్స్, వినోదం... ఇలా దాదాపు అన్ని సేవలూ ప్రియమయ్యాయి. పర్యాటకం, ఆతిథ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, రవాణా, రియల్టీ, ఆటో రంగాలపై ప్రధానంగా ఈ భారం పడుతోంది.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకంగా సేవల పన్ను పెంపు భారం అయ్యింది. ♦ దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థ 2016 ఏప్రిల్ 1 నుంచీ ‘వస్తువులు, సేవల పన్ను’గా (జీఎస్టీ) మారుతోంది. ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా సేవల పన్ను రేట్లను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు. ప్రభుత్వానికి లాభమెంత? సేవల పన్ను ద్వారా కేంద్రానికి వచ్చిన మొత్తం గత ఆర్థిక సంవత్సరం రూ.1.68 లక్షల కోట్లు. తాజా పెంపు వల్ల ఈ మొత్తం 25 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే... దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయలు జనం జేబుల్లోంచి ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయన్న మాట. -
సేవల పన్ను 2.15 లక్షల కోట్లు
తొలిసారిగా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల్ని దాటిన సేవల వసూళ్లు న్యూఢిల్లీ: సేవల పన్ను. 1994లో నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ పన్ను... తొలిసారిగా 2014-15లో ఏకంగా కస్టమ్స్, ఎక్సయిజ్ సుంకాలను కూడా దాటేయబోతోంది. దీన్ని బట్టి తెలియట్లేదూ... మన దేశంలో సేవలకున్న ప్రాధాన్యం. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే ఖజానాకు సర్వీస్ ట్యాక్స్ కన్నా ఎక్కువ వసూళ్లనిస్తున్నవిపుడు రెండే..! ఒకటి కార్పొరేట్ ట్యాక్స్. రెండు ఆదాయపు పన్ను. సర్వీస్ ట్యాక్స్ అంటే: ఫైనాన్స్ చట్టం పరిధిలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని సేవలపై వసూలు చేసే పన్ను ఇది. సేవలందించేవారు ప్రభుత్వానికి ఈ మొత్తం చెల్లించి... దాన్ని సేవలందుకున్న వారి దగ్గర వసూలు చేస్తారు. ఇది కూడా ఎక్సయిజు, సేల్స్ ట్యాక్స్ మాదిరిగా పరోక్ష పన్నే. ప్రస్తుతం ఈ పన్ను 12 శాతం. దీనిపై ఎడ్యుకేషన్ సెస్ 2%, ఉన్నత విద్య సెస్ 1% కలిపితే మొత్తం 12.36 శాతమవుతోంది.