పార్లమెంటు సమావేశాలు ప్రొరోగ్
జీఎస్టీపై ప్రత్యేక భేటీ లేదు: కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మళ్లీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ (ముగిసినట్లు ప్రకటన) చేయాల్సిందిగా రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ(సీసీపీఏ) భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వాస్తవ రాజకీయ పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గత నెలలో నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలను జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మళ్లీ సమావేశపరచేందుకు వీలుగా ప్రొరోగ్ చేయని విషయం తెలిసిందే. లలిత్‌మోదీ, వ్యాపమ్ తదితర వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌చౌహాన్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌లను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వర్షాకాల సమావేశాలు ఆద్యంతం పార్లమెంటును స్తంభింపచేసిన కాంగ్రెస్.. ఆ నేతలపై చర్యలు చేపట్టకుండా.. ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ బిల్లులో తాము కోరిన మూడు సవరణలు చేయకుండా.. పార్లమెంటును తిరిగి ప్రత్యేకంగా సమావేశపరచినా ఎటువంటి ఉపయోగం ఉండబోదని మంగళవారం తేల్చిచెప్పింది.
దీంతో ప్రత్యేక సమావేశాల ఆలోచనను కేంద్రం విరమించుకుంది. భారీ ఆర్థిక సంస్కరణల్లో ఒకటిగా పరిగణిస్తున్న ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో దీనిపై చర్చలు ఫలించకపోవటంతో.. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నామని జైట్లీ చెప్పారు. ‘ప్రయత్నాలు కొనసాగిస్తాం. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. కాంగ్రెస్ మినహా దాదాపు మిగతా పార్టీలన్నీ బిల్లుకు అనుకూలంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. పార్లమెంటు తదుపరి సమావేశాలు మళ్లీ నవంబర్‌లో జరుగుతాయి. రాజ్యాంగ సవరణ అవసరమైన జీఎస్టీ బిల్లును ఇప్పుడు ఆమోదించని పక్షంలో 2016 ఏప్రిల్ 1 నుంచి దీనిని అమలులోకి తేవాలన్న లక్ష్యం సాధించగలరా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘మీరు ఎంత ఊహించగలరో నేనూ అంతే ఊహించగలను’ అని ఆయన బదులిచ్చారు. అంతకుముందు ద ఎకానమిస్ట్ మేగజీన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సృష్టిస్తున్న అవాంతరాల కారణంగా జీఎస్‌టీ అమలు జాప్యమవుతుందని వ్యాఖ్యానించారు.