
న్యూఢిల్లీ: ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రంగాలకు మరిన్ని ప్రోత్సాహక చర్యలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. వృద్ధికి ప్రోత్సాహకంగా అవసరమైనప్పుడు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు వినియోగాన్ని పెంచడం ద్వారా వృద్ధికి ఊతమిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్ అధికారులతో కలసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పెంచబోతున్నట్టు తన కార్యాలయం మినహా అంతటా వదంతులు వ్యాప్తి చెందుతున్నట్టు వ్యాఖ్యానించారు.
ఈ నెల 18న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌టీ పరిహార బకాయిలపై అవగాహన ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి చెప్పారు. ఆర్థిక రంగం ఎప్పుడు పుంజుకోవచ్చంటూ ఈ సందర్భంగా ఎదురైన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ‘‘నేను ఎటువంటి అంచనాలు వేయను. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అవసరమైనప్పుడు జోక్యం చేసుకుంటాను. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది’’ అని వివరించారు. స్టాగ్‌ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం పెరుగుతూ, వృద్ధి తగ్గుతుండడం)పై తానేమీ వ్యాఖ్యానించబోనన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రాజన్ భారత్ స్టాగ్‌ఫ్లేషన్ దశలోకి వెళుతోందని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.
ధరలు దిగొస్తున్నాయి..
ఉల్లిపాయల దిగుమతులతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ధరలు దిగొస్తున్నట్టు మంత్రి చెప్పారు. తాజా పంట దిగుబడులు కూడా మార్కెట్‌కు చేరితే ధరలు మరింత తగ్గుముఖం పడతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment