జీఎస్‌టీ మార్పులకు కేబినెట్‌ ఓకే | | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ మార్పులకు కేబినెట్‌ ఓకే

Published Thu, Aug 10 2023 6:06 AM | Last Updated on Thu, Aug 10 2023 6:12 AM

Cabinet Approves 28percent GST On Online Gaming, Casinos, Horse Race Clubs - Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి  సెంట్రల్‌ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ ), ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ    జీఎస్‌టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి.  ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్‌టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి.  రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  

అక్టోబర్‌ నుంచి అమల్లోకి
జీఎస్‌టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్‌ 1 నుండి అమలులోకి వస్తాయి.  ఆన్‌లైన్‌ గేమింగ్, ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌లతోపాటు ఆన్‌లైన్‌ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ అలాగే ఆన్‌లైన్‌ గేమింగ్‌ విషయంలో సప్లయర్‌ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్‌టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి.  

ప్రస్తుత పన్నుల తీరు  
ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌ ఫీజు/కమీషన్‌ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్‌టీని చెల్లిస్తున్నాయి.  అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి.  బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి.  క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్‌ రెవెన్యూ (జీజీఆర్‌)పై 28% జీఎస్‌టీ చెల్లిస్తున్నాయి.  ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్‌టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement