Central GST
-
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌కు రూ. 31 కోట్ల ట్యాక్స్ నోటీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాకు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమీషనర్ కార్యాలయం రూ. 31.46 కోట్ల మేరకు నోటీసులు జారీ చేసింది. 2014–15 నుంచి 2017–18 మధ్య కాలంలో సర్వీస్ ట్యాక్స్‌ను తగ్గించి చెల్లించడం, వర్తించని సెన్వాట్ క్రెడిట్‌ను తీసుకోవడం ఆరోపణల కింద వడ్డీ, పెనాలీ్టతో సహా కట్టాలంటూ నోటీసులు వచి్చనట్లు సంస్థ తెలిపింది. అయితే, ఈ ఆర్డరుతో తాము ఏకీభవించడం లేదని పేర్కొంది. ఇది ఎయిర్పోర్ట్యేతర వ్యాపారాన్ని విడగొట్టడానికి ముందు సంవత్సరాలకు సంబంధించిన అంశమని తెలిపింది. ఒకవేళ అపీలేట్ అథారిటీ తుది ఉత్తర్వులు ఏవైనా ఇస్తే డిమాండ్ నోటీసులో గరిష్టంగా 43.40 శాతం మొత్తం మేర తమ కంపెనీపై ప్రభావం ఉండవచ్చని వివరించింది. -
2017లోనే ‘స్కిల్’ కేసు: కేంద్ర జీఎస్టీ విభాగం
సాక్షి, అమరావతి: స్కిల్ స్కామ్ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. ఈ కేసు 2020లో నమోదైందని బుకాయిస్తున్న టీడీపీ వాదనకు కేంద్ర జీఎస్టీ విభాగం లేఖ ద్వారా తెర దించింది. టీడీపీ సర్కారు హయాంలోనే స్కిల్ స్కామ్ మూలాలు వెలుగులోకి వచ్చాయని, దీనిపై 2017లోనే కేసు నమోదైందని ఆ లేఖలో స్పష్టం చేసింది. జీఎస్టీ విభాగం లేఖ వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టైంది. సాంకేతిక సాకు ఎత్తుగడ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ టీడీపీ వ్యూహాత్మకంగా ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. సీమెన్స్‌కు తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీడీపీ గానీ ఆయన న్యాయవాదులు గానీ చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. 2018 నవంబరు నుంచి అమలులోకి వచ్చిన 17 ఏ సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు రాజ్యాంగ రక్షణ లభిస్తుందని మాత్రమే అడ్డగోలుగా వాదిస్తున్నారు. 2017లోనే కేసు నమోదు.. చంద్రబాబు బృందం ఎతుగడలను కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ విభాగం చిత్తు చేసింది. ఈమేరకు కేంద్ర జీఎస్టీ డైరెక్టర్ జనరల్ (డీజీ) రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో టీడీపీ పన్నాగం బెడిసికొట్టింది. స్కిల్ స్కామ్ కేసు 2017లోనే నమోదై దర్యాప్తు కూడా అప్పుడే మొదలైనట్లు స్పష్టమైంది. కాబట్టి చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తించదని తేటతెల్లమైంది. 2017 మే నెలలో పుణెలో కొన్ని షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో జీఎస్టీ విభాగం భారీ అక్రమాలను గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్లతో జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ కంపెనీలను గుర్తించి విస్తృతంగా సోదాలు జరిపింది. వీటిలో స్కిల్లర్ అనే కంపెనీ కూడా ఉంది. దీనిపై నాడే తీగ లాగడంతో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి డొంకంతా కదిలింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు (ఏపీఎస్ఎస్డీసీ) పరికరాలను సరఫరా చేసినట్లు చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్లు తేలింది. ఆ ఇన్వాయిస్లను చూపించే ఏపీఎస్ఎస్డీసీ నుంచి నిధులు పొందినట్లు నిర్ధారణ అయింది. దీనిపై జీఎస్టీ విభాగం 2017 మే నెలలోనే కేసు నమోదు చేసింది. పూర్తి స్థాయిలో విచారించి ఆధారాలతో సహా కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. పాత కేసులకు పాత చట్టమే ఏపీఎస్ఎస్డీసీ నిధులు దారి మళ్లడంపై విచారించాలని సూచిస్తూ ఏపీ ఏసీబీ విభాగానికి 2018 ఫిబ్రవరిలోనే సమాచారం ఇచ్చింది. ఈమేరకు కేంద్ర జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ లేఖ రాశారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు ఒత్తిడితో ఏసీబీ విభాగం ఆ కేసును తొక్కిపెట్టింది. అంటే స్కిల్ స్కామ్ బయటపడిందీ... కేసు నమోదైంది 2017లోనే అని స్పష్టమవుతోంది. అప్పటికి 17ఏ సెక్షన్ అమలులోకి రాలేదు. ఆ సెక్షన్ 2018 జూలైలో చేయగా 2018 నవంబరు నుంచి అమలులోకి వచ్చింది. కాబట్టి స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు చంద్రబాబుకు 17ఏ సెక్షన్ కింద రక్షణ లభించదన్నది నిర్ధారణ అయినట్టేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పాత కేసులకు పాత చట్టమే వర్తిస్తుందని తేల్చి చెబుతున్నారు. అవినీతికి పాల్పడి ఆధారాలతోసహా అడ్డంగా దొరికిన చంద్రబాబు సాంకేతిక సాకులతో తప్పించుకునేందుకు చేస్తున్న యత్నాలు ఫలించవని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం డీజీ లేఖతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టినట్టేనని చెబుతున్నారు. -
ఆన్లైన్ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారత్‌లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
జీఎస్టీ వసూళ్లు రయ్ రయ్
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో జోష్ మరింత పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి వరసగా ఏడోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. గడిచిన సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,47,686 కోట్లుగా ఉందని శనివారం కేంద్ర ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ జీఎస్టీ రూ.25,271 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,464 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన మొత్తం రూ.41,215 కోట్లతో కలిపి), సెస్ రూ.10,137 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.856 కోట్లతో కలిపి)గా నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్ వసూళ్లు.. గత ఏడాది సెప్టెంబర్ నెల వసూళ్లతో పోలిస్తే ఏకంగా 26 శాతం ఎక్కువ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు 22 శాతం ఎక్కువయ్యాయి. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఎనిమిదవ సారి. రూ.1.4 లక్షల కోట్ల మార్క్ దాటం ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే వరుసగా ఏడోసారి. ఈ ఏడాదిలో అత్యధిక సింగిల్ డే కలెక్షన్ జూలై 20న నమోదైంది. ఆ రోజు 9.58 లక్షల చలాన్ల ద్వారా రూ.57,846 కోట్లు వచ్చాయి. రెండో అత్యధిక సింగిల్ డే కలెక్షన్లు సెప్టెంబర్ 20న నమోదయ్యాయి. ఏపీలో 21 శాతం.. తెలంగాణలో 12 శాతం జీఎస్టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు గణనీయ వృద్ధిని సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2,595 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 21 శాతం మేర పెరిగి రూ.3,132 కోట్లకు చేరిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది రూ.3,494 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 12శాతం మేర పెరిగి రూ.3,915 కోట్లకు పెరిగాయని వెల్లడించింది. -
ఏప్రిల్‌లో జీఎస్టీ రికార్డుల మోత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టిన తరువాత ఎన్నడూ లేనంత అధికంగా ఏప్రిల్ నెలలో మొత్తం రూ. 1,41,384 కోట్ల వసూళ్లు జరిగాయి. అయితే మార్చిలో 1.24 లక్షల కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఏప్రిల్ నెలకు సంబంధించిన జీఎస్టీ డేటాను కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.27,837 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.35,621 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ కింద రూ.68,481 కోట్లు వసూలు అయ్యాయి. కాగా రూ .9,445 కోట్లు సెస్ రూపంలో వసూలు చేశారు. మార్చిలో వసూలైన రూ.1.24 లక్షల కోట్లతో పోలిస్తే ఏప్రిల్‌లో జీఎస్టీ వసూలు 14% ఎక్కువగా జరిగింది. వాస్తవానికి, ఏప్రిల్‌లో పాక్షిక లాక్‌డౌన్‌తో, జీఎస్టీ తగ్గుతుందని కేంద్రం ఊహించింది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూలు 1.15 నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల మధ్య ఉండవచ్చని శుక్రవారం ఎస్బీఐ నివేదిక పేర్కొంది. దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణంగా జీఎస్టీ వసూలు ఎక్కువగా ఉంటుంది. -
డిసెంబర్లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు 2018 డిసెంబర్లో రూ.94,726 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం నెల నవంబర్‌లో నమోదైన రూ. 97,637 కోట్లతో పోలిస్తే వసూళ్లు కొంత తగ్గాయి. డిసెంబర్లో వసూలైన రూ.94,726 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) పరిమాణం రూ.16,442 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.22,459 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.47,936 కోట్లు, సెస్సు రూ. 7,888 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 9 నెలల్లో రూ.8.71 లక్షల కోట్లు.. 2018–19 బడ్జెట్లో కేంద్రం వార్షికంగా జీఎస్టీ వసూళ్లు రూ.13.48 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది. అంటే.. నెలకు సుమారు రూ. 1.12 లక్షల కోట్లు నిర్దేశించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో (ఏప్రిల్–డిసెంబర్) పరిశీలిస్తే.. జీఎస్టీ వసూళ్లు రూ.8.71 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్, అక్టోబర్‌లో మాత్రమే ఇవి రూ.1 లక్ష కోట్లు దాటాయి. కొత్త రిటర్న్ ఫారంల నోటిఫికేషన్: కాగా జీఎస్టీ విధానం కింద జూన్ 30 నాటికి వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన వార్షిక జీఎస్టీ రిటర్న్ కొత్త ఫారంలను కేంద్రం నోటిఫై చేసింది. మరోవైపు, 2017 జులై–2018 సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారిపై లేట్ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని సీబీఐసీ నిర్ణయించింది. అయితే, ఆయా సంస్థలు 2019 మార్చి 31 నాటికి మొత్తం 15 నెలల వ్యవధి రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. -
అందులో సుఖం లేదు
అక్షర తూణీరం పాపాలకు రేపు నువ్ అనుభవించబోయే శిక్షలో సగం వాటా నీ అర్థాంగి స్వీకరిస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆమె నిర్దాక్షిణ్యంగా నవ్వింది. కాపరానికి రాక ముందునించి క్రమం తప్పకుండా చూస్తున్న సీరియల్‌ని సైతం పక్కన పెట్టి, ఆబాల గోపాలం ఆసక్తిగా తిలకించే సందర్భం ఒకటుంది. అది– అవినీతి తిమింగలాలు, అక్రమాస్తుల అనకొండలు నిజరూపాలతో సహా వెలుగులోకి వచ్చినప్పుడు. మరీ పాతతరం ఇల్లాండ్రు ఎంత ఇష్టంగా చూస్తారో చెప్పలేం. క్రికెట్ చూస్తున్నంత ఉద్వేగంతో అరుపులు, కేకలు కూడా ఉంటాయి. ఆహా! ఆహా! బంగారు కంచాలండీ! ఏకంగా ఓ దొంతరండీ! అమ్మో! ఆ వఢ్రాణం చూడండి... మూడు చుట్ల వఢ్రాణమండీ! మా తాతమ్మకి ఉండేదని చెప్పుకునేవారు. ఆ ఉంగరాలేమిటండీ.. మరచెంబెడున్నాయి. అమో! అది రెండు పేటల కాసులపేరు. ఏవండీ... చూస్తున్నారా ఎంతబరువుందో! ‘‘ఔను, చాలా బరువుంది. మెళ్లో వేసుకోవాలంటే క్రేన్ కావాలి’’. ‘‘అంతేలెండి, అందని ద్రాక్షపళ్లు పుల్లన’’అంటూ ఆవిడ అసహనానికి గురి అవుతుంది. కూడబెట్టడం అందరూ చేస్తారు.కానీ మంచి అభిరుచితో నగానట్రా రూపంలో మదుపు చేయడం కొందరికే సాధ్యం. ఆనాడు భక్త రామదాసు రాములోరి ఫ్యామిలీకి వైనవైనాలుగా చేయించిన చందంగా పుట్టబోయే వారికి బంగారు ఉగ్గు గిన్నె లు సిద్ధం చేశారు దూరదృష్టి గల అవినీతి కోవిదులు. వాళ్లని చూ స్తే జాలేస్తుంది. రెండు చేతులా ఆర్జించి, తమ సుఖ సంతోషాలకు ఆట్టే వెచ్చించక కుటుంబ సంక్షేమం కోసం ధన కనక వస్తు వాహనాల రూపేణా తరు, జల, పాషాణ, నిధినిక్షేపాలతో సహా భూవసతి రూపేణా ఏర్పాటు చేసుకున్నారు. ఇదే వారికి శాపంగా మారింది. వారు సర్వత్రా వార్తలుగా వాసికెక్కారు. మొత్తం సర్వీస్ పొడుగునా ఆర్జించిన కష్టార్జితం, క్లిష్టార్జితం ఒక్కసారి వెలుగు చూస్తుంది. పాపం, ఎంతో రిస్క్ వహించి, నిత్యం ఎన్నో దుష్కర్మలకు పాల్పడతారు. జీవితమంతా నిత్య భయంతో గడచిపోతుంది. బినామీలకు రోజూ జోలాలి పాడాల్సిందే. టెక్నాలజీ పెరిగాక, ముఖ్యంగా అన్నిచోట్ల సీసీ కెమేరాలు వచ్చాక ఇబ్బందిగానే ఉంటోందని ఓ అనుభవశాలి వాపోయాడు. ఇచ్చి పుచ్చుకోవడాలు పోఖ్రాన్ ప్రయోగమంత కష్టంగా మారిందని మరొకాయన వ్యాఖ్యానించాడు. ఈ కథనాలను విన్నప్పుడల్లా ఆ పురుష లక్షణం గారి మీద జాలేస్తుంది. ‘‘నీకొచ్చే జీతానికి, నువ్ తెస్తున్న సొమ్ములకు పొంతన లేదు. ఇవన్నీ ఎక్కడివి మొగడా!’’అని ఏ ధర్మపత్నీ అడగదు. హాయిగా అనుభవించడంలో భాగస్వామి అవుతుంది. మూడొందల డ్రెస్‌లు, నాలుగొందల జతల పాదరక్షలు, బైక్‌లు, విలాసవంతమైన కార్లు సొంతం అయినప్పుడు పిల్లలు– పాపం! నాన్నారెక్కడనించి కొట్టుకొస్తున్నారోనని ఆలోచించరు. చచ్చేంత భయంతో, టెన్షన్‌తో, దినదిన గండంగా బతుకు వెళ్లదీసేది ఆ త్యాగ పురుషుడొక్కడే! ఒకనాడు అంగుళీమాలుడు దారిదొంగ. ఎందర్నో కొట్టి చంపి తన వారందరినీ పోషించేవాడు. ఓ మహాత్ముడు తారసపడి, పాపాలకు రేపు నువ్ అనుభవించబోయే శిక్షలో సగం వాటా నీ అర్థాంగి స్వీకరిస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆమె నిర్దాక్షిణ్యంగా నవ్వింది. అంగుళీమాలుడి తలతిరిగింది. అందుకని ఎవరింటి జవాబైనా ఇలాగే ఉంటుంది. ప్రశాంతంగా జీవించడం మేలు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
1 దేశం..పన్ను!
♦ జూలై 1 నుంచే జీఎస్టీ అమలు ♦ అంతా సిద్ధం చేశామంటున్న ప్రభుత్వం ♦ 17 పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను ♦ 0– 3– 5– 12– 18– 28 శాతాలతో ఆరు శ్లాబులు ♦ పన్నులేనివి ‘జీరోలోకి.. బంగారానికి మాత్రమే 3 శాతం ♦ మిగతావన్నీ ఇతర శ్లాబుల పరిధిలోకి లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ బయటే ♦ లగ్జరీ వాహనాలు, పలు ఉత్పత్తులపై గరిష్టంగా 15% సెస్సు పన్ను చెల్లింపులు, రిటర్నులన్నీ ఇక ఆన్లైన్లోనే.. ♦ పలు ఇబ్బందులున్నాయంటున్న వ్యాపార వర్గాలు పట్టుమని పది, పన్నెండు రోజులు.. వచ్చేనెల ఒకటో తారీఖు రాగానే దేశ పన్నుల ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. పన్నులకు సంబంధించి అతిపెద్ద సంస్కరణగా అభివర్ణిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) జూలై 1 నుంచి అమల్లోకి వస్తోంది. ప్రత్యక్ష పన్నులైన ఆదాయ పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లు మినహా.. కేంద్రం, రాష్ట్రాలు వసూలు చేసే పరోక్ష పన్నులన్నీ దీంతో అంతర్థానమైపోతాయి. వాటన్నిటి స్థానంలో జీఎస్టీ ఒక్కటే ఉంటుంది. ఏ వస్తువుపై అయినా రకరకాల పన్నులుండవు. జీఎస్టీ మాత్రమే ఉంటుంది. 0 నుంచి 28 శాతం మధ్య ఐదు శ్లాబుల్లో ఉండే ఈ పన్నుకు.. సెస్సులు కలిపితే గరిష్టంగా 43 శాతం వరకూ అవుతుంది. అంటే ఏ వస్తువుపై అయినా 0–43 శాతం మధ్య జీఎస్టీ అమలవుతుంది. అసలు జీఎస్టీని ఎందుకు తెస్తున్నారు? అమలయ్యేదెలా? ఇన్ని పన్నుల స్థానంలో ఒకే పన్నును అమలు చేయటం సులువేనా? వ్యాపారులంతా దానిలో చేరేదెలా? జీఎస్టీ వస్తే మనకేంటి లాభం? ధరలేమైనా తగ్గుతాయా.. లేక పెరుగుతాయా? ఏయే వస్తువుల ధరలు ఎలా ఉంటాయి? ఏయే సేవల ధరల్లో మార్పులు రాబోతున్నాయి? పన్ను రాయితీలతో కంపెనీలు పెట్టిన యాజమాన్యాలకు ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమని చెబుతాయి? జీఎస్టీ వచ్చాక కూడా పన్ను రాయితీలివ్వడం సాధ్యమేనా.. అనే ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ సమాధానమే ఈ వారం సాక్షి ‘ఫోకస్’.. ప్రస్తుతం మన దేశంలో వస్తువులపై పన్నులు విధించే విధానంలో ఎంతో వైవిధ్యం ఉంది. వస్తువు తయారయ్యే చోటు నుంచి మొదలుపెడితే దాని విక్రేతలు, చిల్లర వ్యాపారులు, వినియోగదారుల వరకూ అన్ని దశల్లోనూ పన్నులున్నాయి. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య ఈ పన్నులు మారుతుంటాయి. పన్ను మీద పన్ను విధిస్తుండటంతో వస్తువుల ధరలు పెరగటమే కాక.. కొన్నిచోట్ల తక్కువ ధరకు, మరికొన్ని చోట్ల ఎక్కువ ధరకు లభిస్తున్నాయి. ఈ పరిస్థితిని సంస్కరించి దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అమలు చేసేందుకే జీఎస్టీని 122వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తెస్తున్నారు. కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఉన్న 17 రకాల పన్నులను తొలగించి వాటి స్థానంలో జీఎస్టీని అమలు చేస్తారు. జీఎస్టీ అవసరమేంటి? ఏ వస్తువు తయారీకైనా ముడి సరుకు కావాలి. ఆ ముడి సరుకులు కొనేటపుడు తయారీదారులు వాటికి పన్నులు కడతారు. తీరా వస్తువు తయారుచేసి విక్రయించేటప్పుడు మళ్లీ పన్ను కడతారు. పైగా రాష్ట్రానికీ, రాష్ట్రానికీ పన్ను రేట్లు మారుతున్నాయి. ఇవన్నీ కలసి వినియోగదారుడికి చేరేసరికి సుమారు 28 నుంచి 30 శాతం వరకూ అవుతున్నాయి. జీఎస్టీని తెస్తే ఈ రేట్లు తగ్గటంతో పాటు ధరల్లో తేడాలు కూడా తగ్గుతాయనేది ప్రభుత్వం ఆలోచన. చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే.. ప్రస్తుతం వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్న వారంతా ఇకపై జీఎస్టీ పరిధిలోకే వస్తారు. వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు, వివిధ సేవలు అందించే వృత్తి నిపుణులు అంతా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక జీఎస్టీ డేటాబేస్ నిర్వహణ, సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటాదారులుగా జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్) ఏర్పాటైంది. దానిలో కేంద్రానికి 24.5 శాతం, ఢిల్లీ సహా రాష్ట్రాలకు 24.5 శాతం కలిపి 49 శాతం వాటా ఉంది. మిగతా 51 శాతం వాటా వివిధ ఆర్థిక సంస్థల చేతుల్లో ఉంది. జీఎస్టీఎన్లో పన్ను, రిటర్నుల వంటివన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలి. ఏదీ భౌతికంగా నిర్వహించాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎక్కడ రిటర్న్‌లో తప్పులు దొర్లినా, జీఎస్టీ నంబర్లతో రిటర్న్‌లు సరిపోలకపోయినా వెంటనే తెలిసిపోతుంది. జీఎస్టీలోనూ 3 రకాలు 1. సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) కేంద్ర పరిధిలోని సెంట్రల్ ఎక్సైజ్, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్, సర్‌చార్జీ, కౌంటర్ వీలింగ్ డ్యూటీ సీజీఎస్టీలో విలీనమవుతాయి. 2. స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రాష్ట్ర పరిధిలోని వ్యాట్, అమ్మకం పన్ను, లగ్జరీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, వినోదపు పన్ను, స్థానిక పన్ను, అంతర్రాష్ట్ర పన్ను, లాటరీ, బెట్టింగ్‌లపై విధించే పన్నులు ఎస్జీఎస్టీలో కలుస్తాయి. 3. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) ఏదైనా ఉత్పత్తులు, లావాదేవీలు రెండు రాష్ట్రాల్లోని సంస్థల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్టీ చెల్లించాలి. ఇక్కడ ఒకే రకమైన పన్ను ఉంటుంది. అది కూడా నేరుగా కేంద్రం ఖాతాలోకి వెళుతుంది. దిగుమతి చేసుకునే ఉత్పత్తులు, సేవలపై పన్ను కూడా ఐజీఎస్టీ పరిధిలోకే వస్తాయి. పెరిగేవేమిటి.. తగ్గేవేమిటి? జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల విధానం సరళమవుతుందని, ధరలు తగ్గుతాయని కేంద్రం చెబుతోంది. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే తమపై పన్ను రేట్లు భారీగా పెరుగుతున్నాయి కాబట్టి తాము మనగలగటం కష్టమని థీమ్ పార్కులు వంటి పలు రంగాల కం పెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎక్కువ వస్తువులపై పన్ను రేట్లు తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఏ వస్తువు ధరైనా తగ్గుతుందా.. పెరుగుతుందా? అనేది వాటిపై విధించే జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం జీఎస్టీలో ఐదు శ్లాబుల్ని చేర్చారు. అందులో మొదటిది జీరో కాగా... మిగతా ఐదు శ్లాబులు 3, 5, 12, 18, 28 శాతాలుగా ఉన్నాయి. ఈ లెక్కన వివిధ సేవలు, వస్తువులపై జీఎస్టీ ప్రభావాన్ని పరిశీలిద్దాం.. స్టార్ హోటల్లో తింటే బాదుడే! రెస్టారెంట్లలో ఆహారంపై ప్రస్తుతమున్న మాదిరే పన్నులుం టాయి. ఇంకా చెప్పాలంటే 0.5 శాతం తగ్గుతుంది కూడా. రూ.50 లక్షల టర్నోవర్ ఉన్న రెస్టారెంట్లలో బిల్లుపై 5 శాతం, నాన్ ఏసీ రెస్టారెంట్లలో 12 శాతం, ఏసీ–మద్యం అనుమతి ఉన్న రెస్టారెంట్లలో 18 శాతం పన్నుల్ని ఖరారు చేశారు. రూ.1,000 లోపు అద్దె ఉండే హోటళ్లు, లాడ్జిలను జీఎస్టీ నుంచి మినహాయించారు. రూ.1,000 నుంచి రూ.2,000 లోపు అద్దె ఉండే వాటిపై 12 శాతం, రూ.2,500–5,000 మధ్య అద్దె ఉండే వాటిపై 18 శాతం, రూ.5 వేలపైన అద్దె ఉండే వాటికి 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. అంటే 28 శాతం పరిధిలోకి వస్తాయి కనక స్టార్హోటల్లో ఫుడ్ బిల్లుకు కూడా అదే స్థాయి పన్ను బాదుడు ఉంటుంది. సినిమా టికెట్ల ధరలను పరిశీలిస్తే.. ప్రస్తుతం చలన చిత్రాలపై వినోద పన్ను 28 నుంచి 110 శాతం వరకూ ఉంది. జీఎస్టీలో రూ.100 లోపు సినిమా టికెట్లకు 18 శాతం, ఆపైన ధరలుండే టికెట్లకు 28 శాతం పన్నును ఖరారు చేశారు. ఫోను కొన్నా.. మాట్లాడినా చుక్కలే.. ప్రస్తుతం విదేశాల్లో పూర్తిగా తయారై మన దేశానికి దిగుమతి అవుతున్న ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై కస్టమ్స్ డ్యూటీ, వ్యాట్ కలిపి 14–13 శాతంగా ఉన్నాయి. అదే విదేశాల నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకుని మన దేశంలో అసెంబ్లింగ్ చేస్తున్న ఫోన్లపై సీవీడీ, ఎక్సైజ్ కలిపి 2 శాతంతోపాటు స్థానిక వ్యాట్ వసూలు చేస్తున్నారు. అయితే జీఎస్టీలో దిగుమతి చేసుకున్నా సరే, స్థానికంగా తయారైనా సరే 18 శాతం పన్ను వసూలు చేస్తారు. అంటే ప్రస్తుతం రూ.10 వేల ఫోన్కుగాను పన్నులు కలిపి రూ.11,280 చెల్లిస్తుంటే.. జీఎస్టీ అమలు తర్వాత అదే ఫోన్ ధర రూ.11,800 అవుతుందన్నమాట. ప్రస్తుతం టెలికం రంగానికి 15 శాతంగా ఉన్న సర్వీస్ ట్యాక్స్‌ను జీఎస్టీలో 18 శాతం పరిధిలోకి చేర్చారు. ప్రస్తుతం రూ.1,000 ఫోన్ బిల్లుపై 15 శాతం సర్వీస్ ట్యాక్స్‌తో రూ.1,150 చెల్లిస్తుంటే.. జీఎస్టీ వచ్చాక రూ.1,180 చెల్లించాల్సి వస్తుంది. రెడిమేడ్ దుస్తులు తగ్గుతాయ్.. జీఎస్టీలో బ్రాండెడ్ దుస్తులకు 5 శాతం పన్ను ఖరా రు చేశారు. వాస్తవానికి ప్రస్తుతం ఫ్యాషన్ దుస్తులపై ఎక్సైజ్, వ్యాట్ కలిపి 7.5 శాతం వరకూ పన్ను ఉంది. అంటే రూ.1,000 టీ–షర్ట్‌కు ప్రస్తుతం పన్నులు కలిపి రూ.1,075 చెల్లిస్తుం టే.. జీఎస్టీ అమలయ్యాక అదే టీ–షర్ట్ రూ.1,050కే లభిస్తుంది. రూ.1,000 లోపు ధరలుండే చీరలు, వస్త్రాలపై 5 శాతం, అంతకంటే ఖరీదైన వాటిపై 12 శాతం పన్నును విధిస్తున్నారు. టీవీలు తగ్గుతాయ్.. ఏసీలు పెరుగుతాయ్.. ప్రస్తుతం ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి గృహోపకరణాలకు 24.2 నుంచి 27 శాతం పన్నులున్నాయి. జీఎస్టీలో వీటన్నింటినీ 28 శాతం పన్ను విభాగంలో చేర్చారు. అంటే 1 శాతం ధరలు పెరుగుతాయన్నమాట. టీవీలను మాత్రం 18 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుతం రూ.20 వేలు ఉండే ఆయా ఉత్పత్తులకు పన్నులు కలిపి రూ.24,900 చెల్లిస్తుంటే.. జీఎస్టీలో 18 శాతం పన్నుతో అదే ఉత్పత్తుల ధరలు రూ.23,600లకే లభ్యమవుతాయన్నమాట. బియ్యం, పప్పులు, నిత్యావసరాలు చవక! ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ (నిత్యావసరాలు విక్రయించే) కంపెనీలకు ఎక్సైజ్, వ్యాట్, ప్రవేశపన్నులు కలిపి 24–25 శాతంగా ఉన్నాయి. జీఎస్టీలో ఎఫ్ఎంసీజీలోని చాలా వరకు ఉత్పత్తులను 18 శాతం పరిధిలోకి తెచ్చారు. పైగా జీఎస్టీలో లాభదాయక నిరోధక నిబంధన ఉంది. అంటే ఏవైనా పన్ను ప్రయోజనాలొస్తే వాటిని ఆయా కంపెనీలు వినియోగదారులకు బదిలీ చేయాలి. దీంతో జీఎస్టీ అమలయ్యాక నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం ఉంది. బియ్యం, పాలు, గుడ్లు, పెరుగు, తృణధాన్యాలు, పప్పు దినుసులపై ప్రస్తుతం 5 శాతం వరకు పన్నులున్నాయి. వీటిని జీఎస్టీ నుంచి మినహాయించారు. అయితే ఇవన్నీ ప్యాకేజింగ్ లేకుండా విడిగా అమ్మితేనే మినహాయింపు వర్తిస్తుంది. అదే ఈ ఉత్పత్తులను బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి అమ్మితే 5 శాతం పన్ను పడుతుంది. పంచదార, టీ, కాఫీ, వంటనూనెలపై ప్రస్తుతం 5 శాతం పన్నులు ఉన్నాయి. జీఎస్టీలోనూ ఇదే రేటుంటుంది. కాబట్టి ధరల్లో తేడా ఉండే అవకాశం తక్కువ. కేశ సంరక్షణ నూనెలు, సబ్బులు, టూత్‌పేస్ట్ వంటి వాటిపై ప్రస్తుతం 23–26 శాతం వరకు పన్నులున్నాయి. వీటికి జీఎస్టీలో 18 శాతం పన్నును విధించారు. వీటి ధరలు తగ్గే అవకాశముంది. శీతల, బలవర్ధక పానీయాలు, చాక్లెట్లు, చూయింగ్ గమ్స్, షాంపూల వంటి వాటిపై ప్రస్తుతం 23–25 శాతం వరకు పన్నులున్నాయి. వీటికి జీఎస్టీలో 28 శాతం పన్నును విధించినందున ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం రూ.500 లోపు ధరలుండే చెప్పులపై 9.5 శాతం వరకు పన్నులున్నాయి. దీన్ని జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. అయితే రూ.500 కన్నా ఎక్కువ ధర ఉండే చెప్పులపై 18 శాతం జీఎస్టీ విధించారు. గతంలో వీటిపై పన్నులు 23.1 నుంచి 29.58 శాతం వరకు ఉన్నాయి. అంటే వీటి ధరలూ తగ్గే అవకాశం ఉంది. పొగ పీలిస్తే జేబుకు చిల్లే.. సిగరెట్ కాల్చితేనే కాదు జీఎస్టీ తర్వాత వాటిని కొనాలన్నా జేబుకు హానికరమే. ఎందుకంటే జీఎస్టీలో సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను 28 శాతం పన్నుల శ్లాబులోకి తెచ్చారు. తునికాకుపై మాత్రం 18 శాతం పన్ను విధించారు. సిగరెట్ల మాదిరే బీడీలపై కూడా సెస్సును విధించలేదు. ప్రయాణ టికెట్ల ధరలు తగ్గుతాయి ప్రస్తుతం రైలు టికెట్లపై మినహా బస్సు, మెట్రో, సబర్బన్ వంటి ప్రజా రవాణా టికెట్లపై ఎలాంటి సర్వీస్ ట్యాక్స్ లేదు. రైల్వే టికెట్లలోనూ దూర ప్రయాణ ఏసీ కోచ్ టికెట్లపైనే సర్వీస్ ట్యాక్స్ ఉంది. జీఎస్టీలోనూ ఇదే తరహా విధానాన్ని అవలంబించారు. ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్‌లపై 6 శాతంగా ఉన్న పన్నును జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. అంటే ప్రైవేట్ క్యాబ్ సర్వీసు ధరలూ తగ్గుతాయి. విమానాల్లో ప్రస్తుతం ఎకానమీ క్లాసు టికెట్లపై 5.6–6 శాతంగా ఉన్న పన్నులను జీఎస్టీలో 5 శాతానికి తగ్గించారు. బిజినెస్ క్లాస్ విమాన టికెట్లపై పన్ను 9 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అంటే ఎకానమీ టికెట్లు కాస్త తగ్గి బిజినెస్ క్లాస్ ధరలు పెరిగే అవకాశముంది. లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి ప్రస్తుతం వాహన రంగానికి పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా కలిపి 32 నుంచి 55 శాతం వరకు పన్నులున్నాయి. అయితే జీఎస్టీలో ఎలక్ట్రిక్ కార్లు, బైకులు, ట్రాక్టర్లు మినహా అన్ని రకాల వాహనాలకూ 28 శాతం పన్ను విధించారు. ప్రస్తుతం ఆల్టో, క్విడ్, సెలెరియో, బ్యాలెనో, పోలో, ఐ20 వంటి చిన్న కార్లపై 25–27.5 శాతం వరకు పన్నులున్నాయి. జీఎస్టీలో సెస్సుతో కలిపి 29 శాతానికి చేరింది. అంటే 1.5 నుంచి 2 శాతం పెరిగింది. అంటే చిన్న కార్ల ధరలు స్వల్పంగా పెరగొచ్చు. హోండా సిటీ, క్రెటా, సియాజ్, డస్టర్ వంటి సెడాన్, ఎస్యూవీ వాహనాల పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతమున్న పరోక్ష పన్నులు, వ్యాట్, ఇతరత్రా పన్నులు కలిపి 43 శాతంగా ఉంటే.. జీఎస్టీలోనూ 28 శాతం పన్ను, అదనంగా 15 శాతం సెస్సును విధించారు. మొత్తంగా 43 శాతం పన్ను రేటే ఉండనుంది. ప్రస్తుతం లగ్జరీ కార్లకు అంటే మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్, వోల్వో వంటిì వాటికి ఎక్సైజ్, వ్యాట్, ఇన్ఫ్రా సెస్ కలిపి 55 శాతం వరకు పన్నులు ఉన్నాయి. జీఎస్టీలో వీటికి 28 శాతం+ అదనంగా 15 శాతం సెస్సు జోడించారు. అంటే 43 శాతం పన్ను ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతంతో పోలిస్తే 12 శాతం తక్కువ. దీంతో లగ్జరీ కార్ల ధరలు తగ్గుతాయి. చాలా కంపెనీలు ఇప్పటికే ధరలు తగ్గించాయి కూడా. ప్రస్తుతం ట్రాక్టర్లపై వ్యాట్ (5–5.5 శాతం), సీఎస్టీ (2 శాతం), విడిభాగాలు, పరికరాలపై సెంట్రల్ వ్యాట్ (12.5 శాతం)గా ఉంది. అయితే జీఎస్టీలో ట్రాక్టర్ల ఇంజిన్లు, ట్రాన్స్మిషన్లు, ఇరుసులు, టైర్లు, ట్యూబుల వంటి ప్రధాన విడిభాగాలకు 28 శాతం పన్ను... మిగతా విడిభాగాలకు 18 శాతం పన్ను నిర్ణయించారు. అంటే ఒక్కో ట్రాక్టర్‌పై రూ.25 వేల వరకు ధర పెరుగుతుందని అంచనా. బంగారం ధరలు స్వల్పంగా పెరగొచ్చు! దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బంగారానికి జీఎస్టీలో ప్రత్యేక పన్ను శ్లాబు కేటాయించారు. బంగారంపై జీఎస్టీని 3 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం బంగారంపై 1 శాతం వ్యాట్, 1 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలిపి 2 శాతం పన్ను ఉంది. అంటే జీఎస్టీ ఒకశాతం ఎక్కువే ఉన్నందున స్వల్పంగా ధరలు పెరగొచ్చు. మన దేశం బంగారం కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్నందున... 10 శాతం కస్టమ్స్ డ్యూటీలో ఎలాంటి మార్పూ చేయలేదు. అంటే విదేశీ మార్కెట్లతో పోలిస్తే మన దేశంలో ఆభరణాల బంగారం (916 క్యారెట్స్) గ్రాముకు రూ.280–300 వరకు ఎక్కువే ఉంటుందన్నమాట. అయితే ఆభరణాల తయారీకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే వీలు కల్పించారు. దీంతో స్వేచ్ఛాయుత రవాణాకు వీలు కలుగుతుంది. తొలిదేశం ఫ్రాన్స్ ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీని అమలు చేసిన తొలి దేశం ఫ్రాన్స్. 1954లో దానిని అమలు చేసింది. ఇప్పటివరకు 140 దేశాల్లో జీఎస్టీ పన్ను విధానమే అమల్లో ఉంది. బ్రెజిల్, కెనడా వంటి దేశాల్లో ద్వంద్వ జీఎస్టీ విధానం ఉంది. ప్రస్తుతం మన దేశం కెనడా జీఎస్టీ అంటే ద్వంద్వ జీఎస్టీ పన్ను విధానాన్నే అమలులోకి తీసుకొస్తున్నాం. జీఎస్టీలో విలీనమయ్యే పరోక్ష పన్నులివీ.. పన్ను రకం ప్రస్తుత రేటు (శాతాల్లో) అమ్మకం పన్ను/వ్యాట్ 14.5 కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ) 2–4 సేవా పన్ను 14.5 కస్టమ్స్ డ్యూటీ 11.90 ప్రవేశ పన్ను/ఆక్ట్రాయ్ 5.5–10 ఎక్సైజ్ డ్యూటీ 12.36 డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 15 వినోద పన్ను 15–20 స్వచ్ఛ భారత్ సెస్ 0.5 కృషి కల్యాణ్ సెస్ 0.5 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 2.5–4 జీఎస్టీలో కలవని పన్నులివే బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) ఎక్స్పోర్ట్ డ్యూటీ రోడ్డు మరియు పాసింజర్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ స్టాంప్/రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ లిక్కర్‌పై ఎక్సైజ్ పన్ను స్థానిక సంస్థల ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ (ఆల్కాహాల్, పెట్రోలియం ఉత్పత్తులతో పాటూ విద్యుత్‌ను జీఎస్టీ పరిధిలోకి చేర్చలేదు)